పరిస్థితి భయానకంగా మారడంతో సిబిఐకు అప్పగించాలని పదేపదే హైకోర్టుకి వెళ్లిన దిగ్విజయ్ సింగ్ సుప్రీం కోర్టుకి వెళ్లడంతో, అతని అప్పీలును జులై 9 న వింటానని వాళ్లు అనడంతో, అప్పటిదాకా సిబిఐ విచారణ అక్కరలేదంటున్న సిఎం సిబిఐకు ఒప్పుకున్నాడు. అంతకు ముందు రోజే రాజ్‌నాథ్ సింగ్ అక్కరలేదు పొమ్మన్నాడు. సడన్‌గా నిర్ణయం మారింది. ఇదే కాదు, మధ్యప్రదేశ్‌లోని ప్రయివేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో 50% సీట్లు భర్తీ చేయడానికి అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ డెంటల్ అండ్ మెడికల్ కాలేజెస్ నిర్వహించే డిమాట్ (డెంటల్ అండ్ మెడికల్ ఎడ్మిషన్ టెస్ట్)లో స్కాము జరిగిందని ఆనంద్ రాయ్ ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని న్యాయమూర్తులనేకమంది తమ పిల్లల అడ్మిషన్లకై లంచాలు చెల్లించి డిమాట్ను భ్రష్టు పట్టించారని అన్నారు. దాంతో హై కోర్టు ఆన్సర్ షీట్లను ఆప్టికల్ మార్క్కై పరీక్ష సెంటర్ల వద్దే స్కానింగ్ చేయించి భద్రపరచమని ఆదేశించింది. ఎందుకంటే వ్యాపమ్ స్కాములో సూత్రధారులు, తమ కాండిడేట్లకు ఆన్సర్ షీట్లను ఖాళీగా యిమ్మనమని చెప్పేవారు. వాటిని తర్వాత సరైన ఆన్సర్లతో నింపేవారు. రీఎగ్జామ్ చేయించినా మోసం బయటపడదు. అంతేకాదు, ఒక గతంలో పరీక్ష రాసి పాసయిన తెలివైన కుర్రవాడికి దగ్గరగా తమ కాండిడేట్‌కు సీటు పడేట్లు మానిప్యులేట్ చేసేవారు. ఇద్దరూ పాసయ్యేవారు. తెలివైన కుర్రాడికి మెడికల్ కాలేజీలో సీటు వచ్చాక అతను దాన్ని ఒదులుకునేలా ఒప్పందం. వదులుకున్నాక ఆ సీటును మేనేజ్మెంట్ రూ.25-30 లక్షలకు అమ్ముకునేది.
ఆర్థిక నేరాలకు భారత ప్రజలు అలవాటు పడిపోయారు కానీ వరుస హత్యలకు అలవాటు పడలేదు. తమ నేరం బయటపడుతుందన్న భయంతో వాళ్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అనుకోవడానికి లేదు. అంత సెన్సిటివ్ వ్యక్తులైతే అలాటి పనులు చేసి వుండేవారే కాదు. జీవితేచ్ఛ నశించిందనడానికి వాళ్లు యింకా యౌవనంలోనే వున్నారు, డబ్బులు పడేసి ఉద్యోగాలు, సీట్లు తెచ్చుకున్నారు. నిరాశ దేనికి? ఎవరూ నోరెత్తకుండా, రహస్యాలు భయపెట్టే ధైర్యం చేయకుండా కావాలనే అందర్నీ చంపి పారేస్తున్నారు. విచారణ గట్టిగా ప్రారంభించకుండానే యింత మంది చచ్చిపోయారు, లోతుగా తవ్వడం మొదలెడితే ఎంతమందికి ముప్పు వుందో తెలియదు. విచారణ కంటె ముందు చచ్చిపోయిన వారి సంగతేమిటి అన్న సందేహం సహజంగా వస్తే నమ్రత కేసులో ఆమె తండ్రి చెప్పినది మనకు కాస్త క్లూ యిస్తుంది – మెడికల్ సీటు వచ్చాక డబ్బు దగ్గర పేచీ వచ్చిందట. అందువలన చంపేశారట. పేచీ ఎందుకు వచ్చిందో తెలియదు. ఇస్తానన్న దాని కంటె తక్కువ యిచ్చారో, లేక ఒప్పుకున్న దానికంటె వాళ్లు ఎక్కువ యిమ్మన్నారో. ఏది ఏమైనా తేడా వస్తే చంపేయడానికి వాళ్లు వెనకాడటం లేదు. హంతకుల సామర్థ్యం తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక వూరు కాదు, ఒక సమయం కాదు, హత్య చేయాలంటే అవకాశం చిక్కాలి. ఒంటరిగా దొరకాలి. అలాటిది యిన్ని హత్యలు టపటపా చేయిస్తున్నారంటే ఎంత గుండెలు తీసిన బంటులై వుండాలి! వాళ్లకు ప్రభుత్వ మద్దతు తప్పకుండా వుండి వుంటుంది. ఒకవేళ చౌహాన్‌కి వాళ్ల గురించి ఏమీ తెలియదు అంటే అతను చచ్చు దద్దమ్మ అయివుండాలి. లేదా వరుస చావులకు చలించని కిరాతకుడు అనుకోవాలి. తన రాష్ట్రంలో యింతటి భయానక వాతావరణం ఏర్పడితే అతనిలో చలనమే లేదు. అతనికే కాదు, బిజెపి ఉన్నత స్థాయిలో కూడా లేదు.
చౌహాన్‌కు పోటీగా ఎదుగుతున్న కైలాస్ విజయవర్గీయలో కూడా కాఠిన్యమే కనబడింది. ఇప్పటిదాకా అప్రతిహతంగా సాగుతున్న చౌహాన్‌ను కట్టడి చేయడానికి బిజెపి కేంద్ర నాయకత్వం అతని కాబినెట్లో మంత్రిగా వున్న కైలాస్‌ను ఢిల్లీ రప్పించి పార్టీకి జాతీయ స్థాయిలో జనరల్ సెక్రటరీ చేసేసింది. చౌహాన్‌తో ఒక్క ముక్క కూడా చెప్పలేదు. కైలాస్ అమిత్ షాకు చాలా ఆత్మీయుడు. కైలాస్ స్వస్థలం ఇందోరు, గుజరాత్ సరిహద్దుల్లో వుంది. అమిత్ షాను గుజరాత్ నుండి బహిష్కరించినపుడు కైలాస్ అతనికి ఇందోరులో ఆశ్రయం యిచ్చాడు. గుజరాత్ నాయకులు అమిత్ ను అక్కడకి వచ్చి కలిసేవారు. 2004లో ఉమా భారతిని పార్టీలోంచి తీసేసినప్పుడు తనకు ఛాన్సు వస్తుందని కైలాస్ అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు మోదీ-అమిత్ వచ్చాక అతనికి అచ్ఛే దిన్ వచ్చాయి. నీతి ఆయోగ్‌లో ముఖ్యమంత్రుల కమిటీకి చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఇప్పుడు యీ స్కాము వచ్చింది కాబట్టి చౌహాన్‌ను తప్పించి కైలాస్‌కు ఛాన్సిస్తారా అనుకుంటూండగానే అతను చాలా తెలివితక్కువగా ప్రవర్తించాడు. రాష్ట్రంలో యింతమంది రాలి పోతూ వుంటే రాజధానిలో పెద్ద విజయోత్సవ ర్యాలీ తలపెట్టాడు – తనకి జాతీయ కార్యదర్శి పదవి దక్కినందుకట. అప్పుడే జర్నలిస్టు అక్షయకుమార్ మరణించడంతో జర్నలిస్టులు అతని గురించి అడిగారు. కైలాస్ తేలికగా కొట్టిపారేస్తూ – 'ఛోడో యార్, హమ్సే బఢ్కర్ హై క్యా, పత్రకార్?' అని తీసిపారేశాడు. జర్నలిస్టు అయినంత మాత్రాన మా కంటె మొనగాడా అనే మాట అంత అనాలోచితంగా అనడం కొంప ముంచింది. తర్వాత అతను క్షమాపణ చెప్పుకోవలసి వచ్చింది.
చౌహాన్‌కు యిప్పటిదాకా సమర్థుడైన ముఖ్యమంత్రి అనే పేరు వుంది. కానీ యిటీవల మైనింగ్ స్కాముల్లో అతని పేరు, ఫ్యామిలీ పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు ఆయన భార్య మీదే నింద పడింది. ఆమె నిందితులకు పంపిన ఎస్సెమ్మెస్‌ల రికార్డును కాంగ్రెసు పార్టీ 2015 ఫిబ్రవరిలో విడుదల చేసింది. సిఎం ప్రయివేటు సెక్రటరీగా పనిచేసిన ప్రేమ్ చంద్ ప్రసాద్ కూతురు 2012లో మెడికల్ సీటు అక్రమంగా సంపాదించింది. ఇద్దరి మీదా కేసులు పెట్టి వూరుకున్నారు. విచారణ లేదు. చివరకు 2014 జూన్‌లో యాంటిసిపేటరీ బెయిలు సంపాదించారు. దాన్ని సవాలు చేయలేదు. చౌహాన్ సోదరుడి కూతురు రీతూ చౌహాన్ పేరు పబ్లిక్ సర్వీసు కమిషన్ స్కాములో నిందితురాలిగా పేరు బయటకు వచ్చింది. 2008లో ఆమె డిప్యూటీ కలక్టరుగా సెలక్టయింది. 2011లో కాంగ్రెసు నాయకుడు కెకె మిశ్రా దానిపై రచ్చ చేయబోతే ''ఫ్యామిలీట మాటర్లను రాజకీయాల్లోకి లాగవద్దు'' అంటూ చౌహాన్ అతనికి కబురు పంపించాడు. ఆయనపై యిప్పటిదాకా బిజెపి అధిష్టానం ఏ చర్యా తీసుకోలేదు. పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నమూ చేయలేదు. తన పేరు స్కాములో వినబడడంతో ఎలర్టయిన ఉమా భారతి కేసు సిబిఐకు అప్పగించాలని డిమాండ్ చేసింది. ఆమె చౌహాన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఫెయిలయింది. అధిష్టానం పార్టీ నుంచి పంపించివేసింది. ఆరేళ్ల తర్వాత వెనక్కి తీసుకునేటప్పుడు మధ్యప్రదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని ఆమె నుండి మాట తీసుకుని అప్పుడు రానిచ్చారు. ఇప్పుడు ఆమె భోపాల్‌కు వచ్చినా తన యింట్లో వుంటుంది తప్ప పార్టీ హెడ్‌క్వార్టర్సుకి వెళ్లదు.
ముఖ్యమంత్రి మాట సరే, గవర్నరు మాటేమిటి? ఎస్టిఎఫ్ గవర్నరుకు వ్యతిరేకంగా 2015 ఫిబ్రవరి 24 న ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది, కానీ గవర్నరు పదవిలో వున్నాడు కాబట్టి ఏమీ చేయలేకపోయారు. మోదీ సర్కారు ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించి రక్షణ లేకుండా చేయవచ్చు కదా. ఎందుకు చేయటం లేదు? అధికారం చేతికి రాగానే ఎంతోమంది గవర్నర్లను యింటికి పంపిన మోదీ యీయన విషయంలో మెతక వైఖరి ఎందుకు అవలంబిస్తున్నారు? ఆయన అసలు దొంగల గురించి రహస్యాలు బయట పెడతాడనా?
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2015)