బాహుబలి క్లయిమాక్స్‌ ‘లాక్‌’ ఇన్స్‌పిరేషన్‌ అక్కడిదేనా?

సినిమా మొత్తం.. బాహుబలి పట్ల కట్టప్ప వీర విధేయతను ప్రతిబింబించేలా నడుస్తుంది. కానీ చివర్లో అమరేంద్ర బాహుబలి వెన్ను పోటుకు బలయ్యాడనే సత్యాన్ని ముడివిప్పి చెప్పినప్పుడు.. ఆ ద్రోహి ఎవరు అనే ప్రశ్న రాగానే..…

సినిమా మొత్తం.. బాహుబలి పట్ల కట్టప్ప వీర విధేయతను ప్రతిబింబించేలా నడుస్తుంది. కానీ చివర్లో అమరేంద్ర బాహుబలి వెన్ను పోటుకు బలయ్యాడనే సత్యాన్ని ముడివిప్పి చెప్పినప్పుడు.. ఆ ద్రోహి ఎవరు అనే ప్రశ్న రాగానే.. 'నేనే' అని ప్రేక్షకుల్లో కొండంత సస్పెన్స్‌ను నింపేస్తాడు కట్టప్ప. సరిగ్గా ఈ సస్పెన్స్‌లాక్‌.. మొదటి భాగం సినిమాకు చివరి షాట్‌ కింద ఉండిపోయింది. 

సాధారణంగా టీవీ సీరియల్స్‌ అన్నీ ఎపిసోడ్‌ చివర్లో ఏదో ఒక ఇలాంటి లాక్‌తో ఆగిపోతుంటాయి. ఆ తరహాలోనే దీన్ని కూడా ముగించారేమో అని అంతా అనుకున్నారు. కానీ నిజానికి ఇలాంటి మొత్తం కథలో కనిపించని, వినిపించని అత్యంత ఇంటరెస్టింగ్‌ 'లాక్‌' పెట్టడం అనేది కూడా ఇదే తరహాలో రెండు భాగాలుగా విడుదల అయిన ఒక హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌నుంచి లిప్ట్‌ చేశారా అని అనిపిస్తోంది. 

లిఫ్టింగ్‌ తప్పు కాదు. నేరమేమీ కాదు. దీన్ని మనం కాన్సెప్చువల్‌ అడాప్షన్‌ అని కూడా పిలుచుకోవచ్చు. స్ఫూర్తిగా కూడా చెప్పుకోవచ్చు. అయితే.. పోస్టర్ల డిజైనింగ్‌ తదితర తరహాల్లో ఇంగ్లిషు సినిమాలను అనుసరించినట్లు కనిపిస్తున్న బాహుబలి.. ఈ పార్ట్‌ 1 ఎండ్‌ లాక్‌ ను కూడా అలాగేచేసిందా అనేది ప్రశ్న. 

కిల్‌ బిల్‌ అనేది వాల్యూం 1, 2 అంటూ రెండు భాగాలుగా వచ్చిన ప్రపంచంలో పేరెన్నిక గన్న భారీ యాక్షన్‌ సినిమా. వాల్యూం 1 లో తన కుటుంబాన్ని అంతమొందించిన తన కడుపులో బిడ్డను కూడా చంపేసిన బిల్‌ను, అతని జట్టును అంతం చేయడానికి హీరోయిన్‌ ఉమా తుర్మాన్‌ తిరుగుతూ ఉంటుంది. చివర్లో బిల్‌ కోసం వేట సాగాలి.. అది రెండో భాగంలో ఉండచ్చు అని అనుకుంటున్నప్పుడు.. 'ఇంతకూ తన కూతురు బతికి ఉన్న సంగతి ఆమెకు తెలుసా' అంటూ బిల్‌ తాను తెరమీద కనిపించకుండానే.. ఓ సందేహాన్ని ప్రేక్షకుల్లో నాటుతాడు. అప్పటిదాకా కడుపులో బిడ్డను కూడా చంపేశారనే ఉక్రోషం కూడా కలిపి.. హీరోయిన్‌ ప్రవర్తిస్తుంటుంది. అయితే బిడ్డ సేఫ్‌ అనే మాట చివరి షాట్‌గా వస్తుంది. 

సరిగ్గా అదే తరహాలో బాహుబలి విషయంలో కూడా.. ఒకటో భాగాన్ని అప్పటిదాకా బాహుబలికి విధేయుడిగా ఉన్న కట్టప్పే.. అమరేంద్ర బాహుబలిని వెన్నుపోటు పొడిచి చంపేశాడనే సత్యాన్ని ప్రకటించి.. అపరిమితమైన ఆసక్తిని రేకెత్తించి సినిమా ఆపేశారు. ఈ పోలిక యాదృచ్ఛికం కూడా కావచ్చు. స్ఫూర్తి పొంది ఉండవచ్చు. కానీ.. చాలా ఆసక్తికరంగా వాడుకున్నారన్నది నిజం.