ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుతో వికృత వ్యాపారం జరుగుతోంది. పబ్లిసిటీని పీక్స్‌కి తీసుకెళ్ళి, జనాన్ని ఉత్కంఠకు గురిచేసి, బెట్టింగ్ ముగ్గులోకి దించుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై మొదటి నుంచీ అనేక వివాదాలు. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. క్రికెట్‌లో ఏ క్షణాన ఎలాంటి పరిణామాలైనా చోటుచేసుకోవచ్చు. కానీ ఐపీఎల్‌లోనే ఈ వైపరీత్యాలు అధికం.
మ్యాచ్ మ్యాచ్‌కీ బెట్టింగులు.. బంతి బంతికీ బెట్టింగులు.. పరుగు పరుగుకీ బెట్టింగులు.. దేశంలో ఏ మూలకి వెళ్ళినా బెట్టింగ్ గురించి చిన్నపిల్లాడు సైతం చెప్పేస్తాడు. ఆ బెట్టింగులకి తగ్గట్టుగానే మ్యాచ్‌ల ఫలితాలు మారిపోతుంటాయి. ఈ రోజు ఏ మ్యాచ్ జరుగుతుంది? ఎవరు గెలుస్తారు? అన్నదానిపై దాదాపు ఓ అంచనాకి వచ్చేస్తుంటారు బెట్టింగ్‌లకు అలవాటుపడిపోయినవారు. ఇక్కడే అసలు సిసలు బెట్టింగ్ పంజా విసురుతుంది. చివరి నిమిషంలో ఫలితం మారిపోతుంది. ఎందుకిలా? అని బెట్టింగ్‌లో సొమ్ములు కోల్పోయినవారు నెత్తీనోరూ బాదుకుంటారు. తమకు అన్యాయం జరిగిందని వాపోతారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఇంటర్మీడియట్ విద్యార్థుల నుంచి, అరవయ్యేళ్ళ వయసున్నవారి వరకూ బెట్టింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రతియేటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో వందల కోట్లు బెట్టింగుల్లో చేతులు మారుతున్నాయంటే, క్రికెట్ పేరుతో ఎంతటి వికృత క్రీడ జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుతో పెద్ద కుంభకోణమే నడుస్తోందనే విమర్శలు ఈనాటివి కాదు. కానీ కుంభకోణం వెలుగు చూసింది మాత్రం 2013 లోనే.
పలువురు క్రికెటర్లు ఈ కుంభకోణంలో ఇరుక్కుపోయి, తమ క్రీడా జీవితాన్ని నాశనం చేసుకున్నారు. కాదు కాదు, వారిని ఇరికించి వారి జీవితాన్ని నాశనం చేశారనే విమర్శలూ కోకొల్లలు. కేరళ స్పీడ్ స్టర్‌గా భారత క్రికెట్‌లో మంచి పేరు తెచ్చుకున్న శ్రీశాంత్ ఐపీఎల్ కుంభకోణంతోనే క్రీడా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. 'నేను ఏ తప్పూ చేయలేదు. నా జీవితాన్ని నాశనం చేశారు' అంటాడు శ్రీశాంత్, ఐపీఎల్ కుంభకోణం గురించి ప్రశ్నిస్తే.
లక్షలు, కోట్లు వెచ్చించి ఫ్రాంచైజీలు ఆటగాళ్ళను కొనుక్కుంటున్నాయి. వ్యాపారం లాభసాటిగా వుండడంతో క్రికెటర్లు ఉత్సాహంగా ఐపీఎల్‌లో పాల్గొంటున్నారు. ఇక్కడ టాలెంట్ బయటకు రావడం సంగతేమోగానీ, ఆటగాళ్ళకు భలే గిట్టుబాటు అవుతోంది. ఆయా సంస్థలూ ఇబ్బడిముబ్బడిగా నోట్ల కట్టల్ని వెనకేసుకుంటున్నాయి. అంతిమంగా క్రికెట్ అనేది అభాసుపాలవుతోంది భారతదేశంలో.
ఓ ఆటగాడిపైనో, ఓ జట్టుపైనో, ఓ ఫ్రాంఛైజీపైనో, ఓ పెట్టుబడిదారుడిపైనో వేటు వేస్తే ఉపయోగం వుండదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అసలు ఉద్దేశ్యం ఏమిటో తేలాలి. ఆటగాళ్ళను వెలికి తీయడమే ఐపీఎల్ ప్రధానోద్దేశ్యమైతే, ఇందులో వ్యాపారానికి అవకాశం లేకుండా చేయగలిగాలి. ఒకవేళ వ్యాపారం తప్పనిసరైతే, దానికి కొన్ని పరిమితులు వుండాలి. బెట్టింగ్‌కి ఆస్కారమే లేకుండా చేయాలి. కానీ, ఇవన్నీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమేనా? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. అసాధ్యమేమీ కాదుగానీ, క్రికెట్‌కి పట్టిన ఐపీఎల్ మకిలి వదలాలంటే, పాలకుల్లోనూ, బీసీసీఐలోనూ చిత్తశుద్ధి వుండాలి. అదే కదా అసలు సమస్య.