ఎమ్బీయస్‌: సిబిఐ చేతికి వ్యాపమ్‌- 2

ఇంత స్కాము జరుగుతూంటే, యిన్ని హత్యలు జరుగుతూంటే ముఖ్యమంత్రి ఏదో ఒకటి చేయాలి. 'అక్రమాలు జరిగాయని నా దృష్టికి రాగానే నేను విచారణకు ఆదేశించాను. ఇంతకంటె నా నిజాయితీకి వేరే రుజువేం కావాలి?' అని…

ఇంత స్కాము జరుగుతూంటే, యిన్ని హత్యలు జరుగుతూంటే ముఖ్యమంత్రి ఏదో ఒకటి చేయాలి. 'అక్రమాలు జరిగాయని నా దృష్టికి రాగానే నేను విచారణకు ఆదేశించాను. ఇంతకంటె నా నిజాయితీకి వేరే రుజువేం కావాలి?' అని ఆయన అడుగుతున్నాడు. ఆయన చేసినదేమిటో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. నియామకాల్లో అక్రమాల గురించి 2009 జులైలో బయటకు వచ్చింది. ఆనంద్‌ రాయ్‌ దీనిపై న్యాయవిచారణ జరపాలని మధ్య ప్రదేశ్‌ హై కోర్టును ఆశ్రయించారు. 2009 నవంబరులో 9 మంది బోగస్‌ అభ్యర్థులను గుర్తించి వారిపై కేసులు పెట్టారు. డిసెంబరులో ముఖ్యమంత్రి స్కాము గురించి విచారణ జరపడానికి ఒక ప్యానెల్‌ నియమించారు. 2011 మార్చి 31 న అసెంబ్లీలో మాట్లాడుతూ బోగస్‌ అభ్యర్థులెవరూ లేరని ప్రకటించారు. అయినా ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాసేస్తున్నారని, దొంగ ఫోటోలు, దొంగ సంతకాలతో పరీక్షలు పాసవుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. సంతకాలు, ఫోటోగ్రాఫులు నిజమైనవో కావో తేల్చడానికి రాష్ట్రంలో వున్న ఫోరెన్సిక్‌ లాబ్స్‌లో పరీక్షించి సెకండ్‌ ఒపీనియన్‌కై హైదరాబాదులోని, చండీగఢ్‌లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబ్స్‌కు పంపామని 2012 ఫిబ్రవరి 23న అసెంబ్లీలో చౌహాన్‌ ప్రకటన చేశారు. అది నిజమా కాదా అని ఆశీస్‌ చతుర్వేది అనే అతను సమాచార హక్కు కింద హైదరాబాదు, చండీగఢ్‌ లాబ్స్‌నుండి సమాచారం కోరాడు. వాళ్లు తమకేమీ అందలేదని చెప్పేశారు. అంటే చౌహాన్‌ అసెంబ్లీని తప్పుదోవ పట్టించినట్లే తేలుతోంది. ఈ విషయాన్ని యిప్పుడు కాంగ్రెస్‌ ప్రస్తావిస్తే బిజెపి అధికార ప్రతినిథి జివిఎల్‌ నరసింహారావు ''ఇవన్నీ అసెంబ్లీలో లేవనెత్తవలసిన అంశాలు'' అని తప్పించుకున్నారు.

2013 నుంచి దీనిపై విజిల్‌ బ్లోయర్స్‌ (తెలుగులో కొన్ని పత్రికలు ప్రజావేగులు అంటున్నాయి కానీ పారాహుషారీలు అనవచ్చేమో, వేగులు సమాచారం సేకరిస్తారు, పాలకులకు నివేదిస్తారు, కానీ వీళ్లు జరగబోయే దాని గురించి హెచ్చరిస్తున్నారు) చురుగ్గా పనిచేశారు. ఆధారాలు సంపాదించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు, హై కోర్టుకి వెళ్లారు. 2013 జులైలో పోలీసులు మారు పేర్లతో పరీక్ష రాస్తున్న 20 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వారం తిరక్కుండా కుంభకోణానికి సూత్రధారి ఐన జగదీశ్‌ సాగర్‌ను అరెస్టు చేశారు. అతనికి చెందిన 14 ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ యిటీవల ఎటాచ్‌ చేసింది. అతను విద్యార్థులు, ఉద్యోగార్థుల నుండి డబ్బు వసూలు చేసి బ్యాంకులో ఫిక్సెడ్‌ డిపాజిట్ల రూపంలో వేసి, వాటిని గ్యారంటీగా చూపి ఆస్తులు కొనడానికి లోన్లు తీసుకున్నాడట. అతని ద్వారా దీనిలో పాలు పంచుకున్న వారి పేర్లు కొన్ని తెలిశాయి. ముగ్గురు ఐయేయస్‌లు, ఇద్దరు ఐపియస్‌లు, మెడికల్‌ కాలేజీ నిర్వాహకులతో బాటు యిద్దరు మంత్రులు కూడా వున్నారు. 24 మంది ప్రముఖులు నిందితులు. మాజీ ఎక్జామ్స్‌ కంట్రోలర్‌, డైరక్టర్‌ వ్యాపమ్‌ పంకజ్‌ త్రివేది, మాజీ ప్రిన్సిపల్‌ సిస్టమ్‌ ఎనలిస్ట్‌ నితిన్‌ మహీంద్రా రికార్డులను మార్చివేశారు. 

నాలుగు నెలల్లో అంటే నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి స్పెషల్‌ టాస్క్‌ ఫోర్సు (ఎస్‌టిఎఫ్‌)ను ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. స్కాం మాట వచ్చినప్పుడల్లా నేనే దాని గురించి దర్యాప్తు ఆదేశించాను, గమనించండి అని చెప్పుకుంటున్నారు. 2013 ఆగస్టు నుండి ఎస్‌టిఎఎఫ్‌ విచారణ ప్రారంభించింది. 45 కాలేజీ ఎడ్మిషన్లు 10 రిక్రూట్‌మెంట్లు గురించి 55 కేసులు పెట్టింది. 2013 అక్టోబరులో 345 మంది పరీక్షలు కాన్సిల్‌ చేసారు. డిసెంబరులో మాజీ ఉన్నత విద్యామంత్రి లక్ష్మీకాంత్‌ శర్మను జైల్లో పెట్టారు. ఎస్‌టిఎఫ్‌ విచారణ సరిగ్గా నడపటం లేదని ఆరోపిస్తూ 2014 ఏప్రిల్‌లో జబల్‌పూర్‌లో హై కోర్టు 14 పిటిషన్లు వేశారు. అప్పుడు హై కోర్టు తను పర్యవేక్షిస్తానంది. రాష్ట్రంలో 20 చోట్ల స్పెషల్‌ కోర్టులు పెట్టింది. 2014 నవంబరులో ఎస్‌ఎఫ్‌టి దర్యాప్తు ఎలా సాగుతోందో పర్యవేక్షించడానికి హై కోర్టు ఒక రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేసింది. మాజీ ఐపియస్‌ అధికారి, టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌ కూడా సభ్యులుగా వున్నారు.

పరిశోధన గట్టిగా సాగిస్తే సంబంధిత వ్యక్తులు చచ్చిపోతున్నారు. అది కూడా రకరకాలుగా! ఉదాహరణకి ఎస్సయి ట్రైనింగ్‌ పొందుతున్న అనామిక సికర్వార్‌ (25) చెరువులో శవంగా తేలింది. డీన్‌గా పనిచేసే డికె సకాలే అక్రమంగా సీట్లు పొందిన వారిని తొలగించారు. తర్వాత కాలిన గాయాలతో కాలేజీ కాంపస్‌లో 2014 జులైలో శవంగా కనబడ్డారు. అక్రమంగా సీట్లు సంపాదించిన వారి జాబితా తయారు చేసి ఎస్‌టిఎఫ్‌కు యిచ్చిన జబల్‌పూర్‌ మెడికల్‌ కాలేజీ డీన్‌ అరుణ్‌ శర్మ హోటల్లో పోయారు. శవాన్ని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రి వైద్యనిపుణులు పోస్టు మార్టం చేశారు. గొంతు నులిమిన ఆనవాళ్లున్నాయట. ఫుడ్‌ యిన్‌స్పెక్టర్‌ నియామకాల్లో నిందితుడు విజయ్‌ పటేల్‌ ఏప్రిల్‌ 29 న తన లాయరును కలవాలి. దానికి ముందు రోజే బస్తర్‌లో ఒక హోటల్లో శవంగా మారాడు. చనిపోయినవారిలో చాలామంది 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు మధ్యలో వున్నవారే. 

వారిలో కొంతమంది మరణకారణాల గురించి ఒక్కసారి పరికిస్తే ఒక ప్యాటర్న్‌ ఏమైనా మీకే తట్టవచ్చు. 1) రోడ్డు యాక్సిడెంటులో పోయినవారు – 2010 జూన్‌ 14న అనూజ్‌ ఉల్కే, అనుషూల్‌ సచన్‌, శ్యామ్‌వీర్‌ యాదవ్‌, 2012 నవంబరులో అరవింద్‌ శాక్యా, 2013 సెప్టెంబరులో తరుణ్‌ మచార్‌, 2013 అక్టోబరులో ఆనంద్‌ సింగ్‌ యాదవ్‌, 2013 డిసెంబరులో దేవేంద్ర నాగర్‌, 2) ఓవర్‌డోస్‌లో మద్యం సేవించి చనిపోయిన వారు – 2009 నవంబరులో వికాస్‌ సింగ్‌, 2010 అక్టోబరులో గ్యాన్‌ సింగ్‌, 2013 ఆగస్టులో అశుతోష్‌ తివారి 3) విషప్రయోగంతో మరణించినవారు – 2014 జూన్‌లో రవీంద్ర ప్రకాశ్‌ సింగ్‌ 4) నది పక్కన లేదా చెరువులో శవంగా కనిపించినవారు – 2015 జనవరిలో లలిత్‌ కుమార్‌ గోలరీయా, 2015 ఫిబ్రవరిలో అమిత్‌ సాగర్‌ 5) ఉరి వేసుకుని చచ్చిపోయిన వారు – 2012 అక్టోబరులో ఆదిత్య చౌదరి, 2013 ఏప్రిల్‌లో ప్రమోద్‌ శర్మ, 2014 ఫిబ్రవరిలో దినేశ్‌ జాతవ్‌, 2015 జనవరిలో రమేంద్ర సింగ్‌ భాడోరియా 6) బ్రెయిన్‌ హెమరేజితో పోయిన వారు – 2014 ఏప్రిల్‌లో వికాస్‌ పాండే, 2015 మార్చిలో గవర్నరు కొడుకు శైలేశ్‌ యాదవ్‌ 7) జైల్లో గుండె వ్యాధితో పోయినవారు – నరేంద్ర తోమార్‌ (వయసు 29) 8) అంతుపట్టని వ్యాధితో ఆసుపత్రిలో పోయినవారు – 2015 జూన్‌లో రాజేంద్ర ఆర్యా,9) కారణం చెప్పలేని చావులు – 2014 ఏప్రిల్‌లో నరేంద్ర రాజ్‌పుత్‌, 2015 ఏప్రిల్‌లో విజయ్‌ సింగ్‌ పటేల్‌.

ఇవన్నీ చూసి కాబోలు ఎస్‌టిఎఫ్‌ చీఫ్‌ కూడా విచారణ చేయడానికి భయంగా వుంది అనేశాడు. అక్షయకుమార్‌ మృతి తర్వాత జర్నలిస్టులందరికీ భయం పట్టుకుంది. సిట్‌ చీఫ్‌గా వున్న జస్టిస్‌ చంద్రేశ్‌ భూషణ్‌ – అవి అనుమానస్పద మరణాలు కావు కానీ అసహజ మరణాలే అని ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి మొత్తం ఎంతమంది పోయారన్నదానిపై ఎవరి అంకె వారిదైనా కనీసం 30 మంది అని మనం అనుకోవచ్చు. బతికున్నవాళ్లకు కూడా ఎప్పుడు పోతామేమోనన్న భయం పట్టుకుంది. ఫ్రీలాన్స్‌ డిజిటల్‌ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌, ఎథికల్‌ హ్యాకర్‌ అయిన ప్రశాంత్‌ పాండేకు వ్యాపమ్‌కు సంబంధించిన 40 జిబి డేటా దొరికింది. కాంగ్రెసు వాళ్లు అడిగినా యివ్వలేదు. దాన్ని ఎస్‌టిఎఫ్‌కు యిస్తే వాళ్లు ఉపయోగించుకోలేదు. పైగా పోలీసులకు చెప్పినట్లున్నారు, వాళ్లు అతని కుటుంబంపై ఇండోర్‌ నుంచి 40 కిమీ ల దూరంలో ఒక ట్రక్కు చేత దాడి చేయించారు. స్కాములో పాలు పంచుకున్న మెడికల్‌ స్టూడెంట్ల చేత యితన్ని కొట్టించారు. అఫీషియల్‌ సెక్యూరిటీ అడిగాడు, ఇచ్చారు. ఇచ్చాక కూడా ఆరుసార్లు దాడి జరిగింది. సైకిల్‌ మీద తిరిగే (స్కూటరుకు డబ్బుల్లేవు) విజిల్‌ బ్లోయర్‌ చతుర్వేదికి సెక్యూరిటీ గార్డులుగా వుండమంటే వుండడానికి నిరాకరించిన గార్డుల సంఖ్య 23! అంటే అందరికీ భయంగానే వుందన్నమాట. విజిల్‌ బ్లోయర్స్‌ ప్రొటక్షన్‌ యాక్ట్‌ అసమగ్రంగా వుంది. దాన్ని సవరించ వలసిన అవసరం వుంది.  

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2015)

[email protected]

Click Here For Archives