ఎమ్బీయస్‌: తమిళ రాజకీయాలు- 58

నటిగా సంధ్యకు పెద్ద డిమాండ్‌ ఏమీ లేదు. మంచి నటే కానీ, ప్రాముఖ్యత వున్న వేషాలు వేయలేదు. అయినా పిల్లల్ని మంచి స్కూలుకి పంపించింది. జయలలిత చర్చ్‌పార్క్‌ కాన్వెంట్‌లో చదివింది. ఆమె చిన్నప్పటి నుంచి…

నటిగా సంధ్యకు పెద్ద డిమాండ్‌ ఏమీ లేదు. మంచి నటే కానీ, ప్రాముఖ్యత వున్న వేషాలు వేయలేదు. అయినా పిల్లల్ని మంచి స్కూలుకి పంపించింది. జయలలిత చర్చ్‌పార్క్‌ కాన్వెంట్‌లో చదివింది. ఆమె చిన్నప్పటి నుంచి చాలా చురుకైనది, తెలివితేటలు కలది. ఇంగ్లీషులో చక్కగా రాసేది, మాట్లాడేది. స్కూల్లో చదువుతూండగానే 'జయలలిత' పేరుతో నాటకాలు వేసేది. బయట వైజి పార్థసారథి (కమెడియన్‌ వైజి మహేంద్రన్‌ తండ్రి) నడిపే డ్రామా కంపెనీ వేసే ఇంగ్లీషు నాటకాల్లో వేస్తూ వుండేది. వాటిని చూసిన వివి గిరి గారి అబ్బాయి శంకర గిరి ''ఎపిస్టల్‌'' (1961) అనే ఇంగ్లీషు సినిమాలో ఛాన్సు యిచ్చారు. సినిమా తీశాక 1966 దాకా అట్టేపెట్టి రిలీజు చేసినా కమ్మర్షియల్‌గా ఏమీ ఆడలేదు. అదే ఏడాది ''శ్రీశైల మహాత్మ్య'' అనే సినిమాలో బాలనటిగా వేసింది. తర్వాత 'మనె ఆలయ'' (1964) అనే కన్నడ సినిమాలో ఛాన్సు వచ్చింది. సినిమాల్లో వేస్తూనే చదువుకుంది. పబ్లిక్‌ పరీక్షలో గోల్డ్‌ మెడల్‌ వచ్చింది. పై చదువులకై స్కాలర్‌షిప్‌ కూడా వచ్చింది. స్టెల్లా మేరీస్‌ కాలేజీలో చదువుదామని ఆమె అనుకున్నా తల్లి చదువు మాన్పించి సినిమాల్లోకి వెళ్లమంది. జయలలితకు అది యిష్టం లేదు, కానీ యిల్లు గడవడానికి తల్లి మాటకు తలవొగ్గింది. సంధ్యకు తమిళం, కన్నడం, తెలుగు వచ్చు. జయలలితకు వాటితో బాటు ఇంగ్లీషు, హిందీ కూడా వచ్చు. పైగా భరతనాట్యం వచ్చు. కర్ణాటక సంగీతం నేర్చుకుంది. తల్లికి సినిమావాళ్లతో పరిచయాలున్నాయి. ' ''తేనెమనసులు'' సినిమాలో హీరోయిన్‌ వేషానికై ప్రయత్నించి తిరస్కరింపబడిన వాళ్లలో హేమామాలినితో బాటు జయలలిత కూడా వుంది. 

తెలుగు కుటుంబానికి చెంది, పద్మినీ పిక్చర్స్‌ పేర కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో భారీ చిత్రాలు తీసిన నటుడు, దర్శకనిర్మాత బిఆర్‌ పంతులుగారు చదువులకు యిబ్బంది లేకుండా సినిమా తీస్తానని మాట యిచ్చి ఆమెకు 15 వ ఏట ''చిన్నద గొంబె'' అనే కన్నడ సినిమాలో కల్యాణ కుమార్‌ పక్కన హీరోయిన్‌ ఛాన్సు యిచ్చి రూ.3000 పారితోషికం యిచ్చారు. అంతేకాదు, ఎమ్జీయార్‌తో తాను తీస్తున్న భారీ చిత్రం ''ఆయురత్తిల్‌ ఒరువన్‌'' (వెయ్యిమందిలో ఒకడు) అనే సినిమాలో ఆమెను హీరోయిన్‌గా వేయిద్దామనుకున్నారు.  నిజానికి జయలలిత ఎమ్జీయార్‌ కంటె 31 ఏళ్లు చిన్నది. అప్పట్లో ఎమ్జీయార్‌ పక్కన బి సరోజాదేవి వరుసగా సినిమాలు వేస్తూ వుండేవారు. ఎమ్జీయార్‌ భార్య జానకి కన్నడ సినిమాలో జయలలితను చూసి సిఫార్సు చేశాక ఎమ్జీయార్‌ ఓకే చెప్పాడు. (తర్వాతి రోజుల్లో జానకి, జయలలిత కలహించుకున్నారు). కన్నడ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ఎమ్జీయార్‌కు ధైర్యం వచ్చింది. 

మరో తెలుగువాడైన సివి శ్రీధర్‌ తన చిత్రాలయ పిక్చర్స్‌ పేర తీస్తున్న ''వెన్నీర ఆడై'' (1965-తెల్ల దుస్తులు) సినిమాలో శ్రీకాంత్‌ పక్కన హీరోయిన్‌గా ఛాన్సిచ్చారు. ఈ సినిమా హీరో, హీరోయిన్లతో బాటు నిర్మల అనే సెకండ్‌ హీరోయిన్‌, మూర్తి అనే కమెడియన్‌లకు తొలి సినిమా కావడంతో వాళ్లు దాన్ని తమ పేరుకు ముందు తగుల్చుకుని 'వెన్నిరాడై నిర్మల', 'వెన్నిరాడై మూర్తి' గా పేరు తెచ్చుకుని తెలుగు సినిమాల్లో కూడా నటించారు. జయలలితది దీనిలో చాలా క్లిష్టమైన మానసిక సంఘర్షణ కల పాత్ర. అయినా అవలీలగా నటించి, అందరి మెప్పూ పొందింది.  వెన్నీర ఆడైకు ఎ సర్టిఫికెట్టు రావడంతో అప్పటికి 18 ఏళ్లు నిండని జయలలిత ఆ సినిమాను హాల్లో చూడలేకపోయింది. సినిమా హిట్‌ అయింది. అదే ఏడాది రిలీజైన ''ఆయురత్తిల్‌ ఒరువన్‌''లో జయలలిత అందం, అభినయం జనాలకు వెర్రెక్కించింది. సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌. ఇక అప్పణ్నుంచి ఎమ్జీయార్‌ తన సరసన సరోజాదేవి స్థానంలో జయలలితను రికమెండ్‌ చేయసాగాడు. సరోజాదేవితో ఆఖరిగా వేసిన సినిమా 1967లో రిలీజైంది. ఎమ్జీయార్‌, జయలలిత  జోడీకి ఆఖరి సినిమా  అయిన ''పట్టికాట్టు పొణ్ణయ్య'' (1973) వరకు వాళ్లిద్దరూ కలిసి మొత్తం 27 సినిమాలు వేశారు. వాటిలో చాలాభాగం సూపర్‌ హిట్సే.

జయలలితకు 1965లోనే తెలుగు సినిమా ''మనుషులు-మమతలు''లో   నాగేశ్వరరావు పక్కన హీరోయిన్‌ ఛాన్సు వచ్చింది. ఆ పై ఏడాది ''ఆస్తిపరులు''లో వచ్చింది. ఇలా తెలుగు, కన్నడ, తమిళం సినిమాలు వేసుకుంటూ (మధ్యలో ''ఇజ్జత్‌'' అనే హిందీ సినిమాలో ధర్మేంద్ర పక్కన హీరోయిన్‌గా వేసింది) తారగా చాలా పైకి ఎదిగింది. నాగేశ్వరరావుతో 7 సినిమాలు వేయగా, ఎన్‌టి రామారావు పక్కన 12 సినిమాల్లో వేసింది. కృష్ణ, శోభన్‌బాబులతో కూడా వేసింది. తమిళంలో ఎమ్జీయార్‌తోనే కాకుండా రవిచంద్రన్‌, జయశంకర్‌, ముత్తురామన్‌ వంటి యువహీరోలతో బాటు శివాజీ గణేశన్‌తో 17 సినిమాలు వేసింది. కొంతకాలం సినిమా రంగాన్ని ఒక వూపు వూపి మూడు ఫిల్మ్‌ఫేర్‌ ఎవార్డులు తెచ్చుకున్నా 32 ఏళ్లకే ఆమె 15 ఏళ్ల కెరియర్‌ ముగిసిపోయింది. 1980 నాటి ''నాయకుడు-వినాయకుడు'' ఆమె చివరి సినిమా అనుకోవచ్చు. సినిమానటిగా ఆమె చాలా ప్రొఫెషనల్‌గా వుండేదని చెప్తారు. తెరపై అల్లరిగా, చిలిపిగా నటించినా తెర వెనుక ఆమె సీరియస్‌గా, డిగ్నిఫైడ్‌గా వుండేదట. మాట పడేది కాదు. ఎంత సీనియరైనా సరే అదలించబోతే లెక్కచేసేది కాదు, తలబిరుసని ఎవరైనా అనుకున్నా లక్ష్యపెట్టేది కాదు. హీరోలకు వంగి దణ్ణాలు పెడుతూ, వారి ఔదార్యం కోసం పడిగాపులు పడడం ఆమెకు తెలియని విద్య. సెట్లో ఎవరితో మాట్లాడకుండా, పుస్తకం చదువుతూ కూర్చునేది. ఇంట్లో పెద్ద లైబ్రరీ మేన్‌టేన్‌ చేసేది. సూక్ష్మగ్రాహి. ఒకటి రెండు సార్లు డైలాగులు వింటే చాలు, గుర్తు పెట్టుకుని నటించేసేది. ఆమె కొన్ని సినిమాల్లో పాటలు పాడింది కూడా. ఇంగ్లీషులో కథలు రాసిందని, ''ఇలస్ట్రేటెడ్‌ వీక్లీ''లో ఒకటి పడిందని అంటారు. సినిమాల్లో గడిస్తూండగానే మద్రాసులో పోయెస్‌ గార్డెన్‌లో యిల్లు కట్టుకుని దానికి తల్లి పేర ''వేదనిలయం'' అని పేరు పెట్టుకుంది. హైదరాబాదులో ద్రాక్షతోటలున్న ఫామ్‌హౌస్‌ కొంది. ఇలాటి జయలలిత ఎమ్జీయార్‌ను అమితంగా ఆకర్షించింది. ఎందుకు?

జయలలిత సినిమా రంగానికి వచ్చేసరికే ఎమ్జీయార్‌ టాప్‌ హీరో. తెర మీద, తెర వెనుక దైవసమానుడు. అందరూ అతనంటే వణికి చచ్చేవారు. టాప్‌ డైరక్టర్లు, ప్రొడ్యూసర్లు అతని ఎదుట సిగరెట్టు కాల్చడానికి కూడా జంకేవారు. అతని మాట సుగ్రీవాజ్ఞ. ఎదురు సమాధానం చెప్పే సమస్యే లేదు. తన కటాక్షవీక్షణం కోసం హీరోయిన్ల దగ్గర్నుంచి తపించిపోతూ వుండేవారు. అలాటి ఎమ్జీయార్‌కు యీ జయలలిత యిండివిడ్యువాలిటీ చూస్తే ముచ్చట వేసింది. ఆమె పాలరాయి వంటి ఆమె శరీరవర్ణం (శివాజీ గణేశన్‌ ఆమెను బంగారుశిల్పం అని వర్ణించాడు), సంస్కారం, ఇంగ్లీషు భాషాజ్ఞానం, మేధోపటిమ చూసి అబ్బురపడిపోయాడు. జయలలిత రాజ్యసభ సభ్యురాలిగా వున్నపుడు ఒక ఉత్తరాది నాయకుడు యీమె సినిమానటి కదాన్న చిన్నచూపుతో షేక్‌స్పియర్‌ నాటకంలో ఓ డైలాగు చెప్పి కళ్లెగరేశాట్ట. ఈమె వెంటనే ఆ డైలాగు తర్వాతి భాగం అప్పచెప్పి, అతన్ని ఆశ్చర్యపరిచిందట. మురారి తన ఆత్మకథలో జయలలిత తెలివితేటల్ని చాలా మెచ్చుకున్నారు. సినీ నటీమణుల్లో విలక్షణమైన యిలాటి వ్యక్తి చూసి ఎమ్జీయార్‌ మోహపడడంలో వింత లేదు. పైగా తెరపై తమ జోడీ తన అభిమానులకు, ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తోంది. అందువలన ఆమెను ముద్దు చేయసాగాడు. జయలలిత దీన్ని పూర్తిగా ఎడ్వాంటేజి తీసుకుంది. 'మీకైతే ఎమ్జీయార్‌ దేవుడేమో కానీ, నాకు మాత్రం మామూలు మనిషే' అని చాటి చెప్పాలని చూసేది. అతన్ని తనతో సమానమైనవాడిగా చూసేది, టీజ్‌ చేసేది, కోపం వస్తే అలిగేది. ఆమె ఏం చేసినా ఎమ్జీయార్‌కు కోపం వచ్చేది కాదు, చిన్న పిల్ల మారాం చేసినట్లు ఫీలయ్యేవాడు. ఆమెను యింట్లోవాళ్లు పిలిచినట్లుగా అమ్మూ అని పిలిచేవాడు. (సశేషం) ఫోటో – నృత్యప్రదర్శన సందర్భంగా తల్లితో చిన్నప్పటి జయలలిత 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015)

[email protected]

Click Here For Archives