ఆఖరి పోరాటం.. ఏ జట్టుకు ఎంత అవకాశం?

క్రికెట్‌ ప్రపంచాన్ని జయించడానికి భారత్‌కు కావాల్సింది ఒకో ఒక్క విజయం. దశాబ్దాల కప్‌ కలను నెరవేర్చడానికి కావాల్సింది ఇంకొక్క విక్టరీ. రెండు దశాబ్దాల క్రితం ఆస్ట్రేలియా చేసిన గాయానికి మందు కూడా… ఆ ఒక్క…

క్రికెట్‌ ప్రపంచాన్ని జయించడానికి భారత్‌కు కావాల్సింది ఒకో ఒక్క విజయం. దశాబ్దాల కప్‌ కలను నెరవేర్చడానికి కావాల్సింది ఇంకొక్క విక్టరీ. రెండు దశాబ్దాల క్రితం ఆస్ట్రేలియా చేసిన గాయానికి మందు కూడా… ఆ ఒక్క విజయమే. ఆ ఒక్క విజయం కోసం ప్రపంచకప్‌ తుదిపోరులో ఆస్ట్రేలియాతో రోహిత్ సేన తలపడనుంది. లక్షా 32వేల మంది మధ్యలో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మరికొన్ని గంటల్లో ఈ ‘క్రికెట్ యుద్ధం’ ప్రారంభం కానుంది.

ఈ మెగా వార్‌లో విజయం సాధించి.. పుష్కర కాలం తర్వాత భారత్‌ కప్‌ను అందుకుంటుందా? చివరి మూడు వన్డే వరల్డ్‌ కప్పుల్లో ఆతిథ్య జట్టే గెలిచినట్టుగా.. టీమిండియా గెలిచి.. ఆ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తుందా? 140 కోట్ల మంది ఆశల భారాన్ని మోస్తున్న రోహిత్ సేన.. విజయతీరాలకు చేరుతుందా? మరికొన్ని గంటల్లో ఈ ప్రశ్నలకు సమాధానాలన్నీ దొరికేస్తాయి.

ఇప్పటివరకు 12 సార్లు వన్డే ప్రపంచకప్‌లు జరిగాయి. తాజా ప్రపంచ కప్ తో కలిపి ఫైనల్‌కు చేరడం టీమిండియాకు నాలుగోసారి. 1983లో కపిల్‌దేవ్‌ నేతృత్వంలో, 2011లో ధోనీ కెప్టెన్సీలో భారత్‌ కప్‌ను ముద్దాడింది. కానీ 2003లో ఆస్ట్రేలియాతో జరిగిన తుదిపోరులో టీమిండియా ఓటమిపాలైంది. ఇప్పుడు ఆ లెక్కను సరిచేయడానికి టైమ్‌ వచ్చింది. 2019 సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌ ఓడింది. ఆ మిస్టేక్‌ను సరిదిద్దుకోవడానికి ఈ వన్డే వరల్డ్‌కప్‌లో ఛాన్స్ వచ్చింది. కివీస్‌కు అవకాశం ఇవ్వకుండా రోహిత్‌ సేన విజయభేరి మోగించింది. ఇక చేదు జ్ఞాపకాలు చెరిపేసి చరితను లిఖించడానికి టీమిండియాకు మరోసారి అవకాశం లభించింది. రెండు దశాబ్దాల తర్వాత కంగారూలపై ఫైనల్‌లో ప్రతీకారం తీర్చుకునే టైమ్‌ వచ్చింది.

అయితే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ హోరాహోరీగా సాగినా.. కవ్వింపులతో స్టేడియం హీట్‌ ఎక్కలేదు. ఇరు జట్ల ఆటగాళ్లు జెంటిల్‌మెన్‌ క్రికెట్ ఆడారు. భావోద్వేగాన్ని గుండెల్లో దాచుకొని ఆటను ప్రదర్శించారు. కానీ ఆసీస్‌తో జరిగే ఫైనల్‌ అలా అస్సలు ఉండదు. పాకిస్థాన్‌తో పాటు ఆస్ట్రేలియాతో మనకు మ్యాచ్‌ అంటే.. ఆటగాళ్లతో పాటు అభిమానుల్లో టెన్షన్, టెన్షన్‌. బరిలో నిలిచే ఆటగాళ్లతో పాటు స్టాండ్స్‌లో ఉండే అభిమానులు తమ జట్టు విజయం కోసం నడుం బిగిస్తారు. మరి ఈ మెగా టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఎవరి బలమెంతో చూద్దాం!!

ఇప్పటివరకు భారత్‌-ఆసీస్‌ 150 వన్డేల్లో పోటీపడ్డాయి. ఆసీస్‌ 83 సార్లు, టీమిండియా 57 సార్లు విజయం సాధించాయి. పది మ్యాచ్‌ ల్లో ఫలితం రాలేదు. అదే వన్డే ప్రపంచకప్‌లో మొత్తంగా 13 సార్లు ఇరుజట్లు తలపడ్డాయి. ఆసీస్‌ 8, భారత్‌ 5 సార్లు గెలిచాయి. 1983 మెగాటోర్నీలో చెరో ఒక్కసారి విజయం సాధించగా, 2003లో ఆసీసే రెండుసార్లు గెలిచింది. 2003లో లీగ్‌ మ్యాచ్‌ తో పాటు ఫైనల్లోనూ మనం ఓటమిపాలయ్యాం. 2015 సెమీస్‌లోనూ కంగారూలదే పైచేయి. అయితే 2019 ప్రపంచకప్‌లో 36 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుచేశాం. ఈ మెగాటోర్నీ లీగ్‌ మ్యాచ్‌లోనూ ఆరు వికెట్ల తేడాతో సత్తాచాటాం. వన్డే వరల్డ్‌కప్‌లో మన జట్టుపై ఆసీస్‌కు మెరుగైన రికార్డు ఉన్నా.. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో మనవే మూడు విజయాలు. ఈ విజయాలు మన జట్టులో మరింత ఆత్మవిశ్వాసం నింపుతుంది.

ఈ ప్రపంచకప్‌లో రోహిత్‌సేన అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తోంది. సమష్టిగా పోరాడుతూ ప్రత్యర్థులని వణికిస్తోంది. తొలుత బ్యాటింగ్‌ చేసినా, ఛేజింగ్ చేసినా టీమిండియాదే హవా. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఏ ఒక్క ప్లేయర్‌పై ఆధారపడట్లేదు. ఒక్కరుగా కాకుండా జట్టుగా అదరగొడుతున్నారు. రోహిత్ శర్మ పిడుగులా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. పిచ్‌తో, ప్రత్యర్థితో సంబంధం లేకుండా బౌండరీల మోత మోగిస్తున్నాడు. వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా జట్టు కోసం అత్యుత్తమంగా ఆడుతున్నాడు. సెహ్వాగ్‌లా, గిల్‌క్రిస్ట్‌లా ఆది నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాడు. అతడికి తోడుగా వచ్చే గిల్‌ కూడా సమన్వయంతో అదరగొడుతున్నాడు. రోహిత్‌ బాదుడు ముగిసిన అనంతరం తాను చార్జ్‌ తీసుకుంటున్నాడు.

ఇక వన్‌డౌన్‌లో వచ్చే విరాట్ కోహ్లి టీమిండియా ఇన్నింగ్స్‌కు ఇరుసులా మారుతున్నాడు. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతూ భారీస్కోరుకు బాటలు వేస్తున్నాడు. మునపటి కింగ్‌ కోహ్లిలా రికార్డులు బద్దలుకొడుతున్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్‌, కేఎల్ రాహుల్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. గాయాల నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన వారిద్దరిపై తొలుత సందేహాలు, విమర్శలు వచ్చాయి. కానీ వాటిని పటాపంచలు చేస్తూ పరుగుల వరద పారిస్తున్నారు. శ్రేయస్‌ తన కెరీర్‌లోనే బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. అలవోకగా సిక్సర్లు బాదుతున్నాడు. కేఎల్‌ రాహుల్‌ క్లాస్‌గా మాస్‌ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. చివర్లో వచ్చే సూర్యకుమార్‌ యాదవ్‌, జడేజా కూడా ఫామ్‌లో ఉండటంతో భారత్ బ్యాటింగ్‌ అద్భుతంగా ఉంది. సూర్య చాలా ఇంపాక్ట్‌ ప్లేయర్‌. అతడు కాసేపు క్రీజులో ఉన్నా ప్రత్యర్థికి తీరని నష్టమే. ఇక జడ్డూ కూడా మెరుపు బ్యాటింగ్‌ చేస్తుండటం టీమిండియాకు సానుకూలాంశం.  ఈ టోర్నీలో టాప్‌ రన్‌ స్కోరర్‌గా కోహ్లి ఉంటే, 5,7 ర్యాంక్‌లో రోహిత్, శ్రేయస్‌ ఉన్నారు. ఈ గణాంకాలే చాలు టీమిండియా బ్యాటింగ్‌ బలం గురించి చెప్పడానికి!

మరోవైపు ఆస్ట్రేలియా జట్టులో కూడా బ్యాటింగ్ ఎంతో పటిష్టంగా ఉంది. ట్రావిస్‌ హెడ్‌ సూపర్ ఫామ్‌, డేవిడ్‌ వార్నర్‌ అనుభవం, మిచెల్‌ మార్ష్‌ సమయోచిత బ్యాటింగ్‌తో.. ఆసీస్‌ టాప్‌ ఆర్డర్‌ ఛాలెంజింగ్‌గా ఉంది. ఆ తర్వాత వచ్చే స్టీవ్‌ స్మిత్‌, లబుషేన్‌ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొనే అనుభవం సొంతం. ఇక స్మిత్ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో చాలా ప్రమాదకరమైన బ్యాటర్‌. సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై 30 పరుగులే చేసినా సఫారీ బౌలర్లపై ఆధిపత్యం కొనసాగించాడు. 2015లో టీమిండియాతో జరిగిన సెమీస్‌లో స్మిత్ సెంచరీ చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన 2019 సెమీస్‌లోనూ 85 పరుగులు చేశాడు. అయితే స్మిత్, లబుషేన్‌ తర్వాత వచ్చే మాక్స్‌వెల్‌, ఇంగ్లిష్‌ భీకర హిట్టర్లు. గాయంతో కూడా అఫ్గాన్‌పై సంచలన ఇన్నింగ్స్‌ ఆడిన మాక్సీ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. ఇక టోర్నీ టాప్‌ స్కోరర్‌లో వార్నర్‌ ఆరు, మిచెల్ మార్ష్‌ 9 స్థానంలో ఉన్నారు.

అయితే టీమిండియా బ్యాటర్లు నిలకడగా పరుగులు సాధించడం విశేషం. ప్రతిమ్యాచ్‌లోనూ సమష్టిగా రాణిస్తూ భారీస్కోరులు సాధిస్తున్నారు. ఇది భారత్‌కు ప్లస్‌ పాయింట్‌. కానీ ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో నిలకడ లేదు. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కొక్కరు జట్టును గెలిపిస్తున్నారు. అయితే భారత్‌తో పోలిస్తే ఆసీస్‌కు ఉన్న ప్లస్ పాయింట్.. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండటం. వారి బౌలర్లు బ్యాటుతో క్రీజులో ఎక్కువసేపు నిలుస్తున్నారు. అఫ్గానిస్థాన్‌పై సంచలన విజయంలో, దక్షిణాఫ్రికాని ఓడించి ఫైనల్‌కు చేరడంలో వారి లోయర్‌ ఆర్డర్‌ పాత్ర కీలకం.

ఇక టీమిండియా బౌలింగ్‌ విషయానికి కొస్తే.. ప్రత్యర్థులకు ముచ్చెటమలే. మన పేస్ త్రయం బుమ్రా, సిరాజ్‌, షమి.. వికెట్ల వేటలో పోటీ పడుతున్నారు. బుమ్రా బ్యాటర్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాడు. డాట్ బాల్స్‌తో ప్రత్యర్థులను వేదిస్తున్నాడు. మరోఎండ్‌లో ఆ ఒత్తిడిని సిరాజ్‌, షమి.. వికెట్లుగా క్యాష్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ది బెస్ట్ పేస్‌ టీమ్‌ మన జట్టుదే. ఇక స్పిన్‌ లో జడేజా, కుల్‌దీప్‌ తిప్పేస్తున్నారు. కివీస్‌తో జరిగిన సెమీస్‌లో కుల్‌దీప్‌ 42, 44 ఓవర్‌ వేసిన తీరు అద్భుతం. ఆ రెండు ఓవర్లు కలిపి కేవలం 4 పరుగులే ఇచ్చి వికెట్ పడగొట్టి తన సత్తా చూపించాడు. టోర్నీలో లీడింగ్‌ వికెట్ టేకర్‌గా 23 వికెట్లతో షమి నిలిచాడు. బుమ్రా 18, జడేజా 16, కుల్‌దీప్‌ 15 వికెట్లు తీశారు.

మరోవైపు ఆసీస్‌ పేస్‌ దళం కూడా గొప్పగానే ఉంది. స్టార్క్‌, హేజిల్‌వుడ్‌, కమిన్స్‌తో పోటాపోటీగా ఉంది. పిచ్‌ కాస్త అనుకూలిస్తే వాళ్లు చెలరేగిపోతారు. సెమీస్‌లో సఫారీలను అల్లాడించారు. ఇక భారత్‌ తో జరిగిన తొలి మ్యాచ్‌ లో రెండు పరుగులకే మన మూడు వికెట్లు పడగొట్టారు. స్పిన్‌ భారాన్ని జంపా మోస్తున్నాడు. ఈ టోర్నీలో షమి తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌ జంపానే. మాక్స్‌వెల్, హెడ్‌, మిచెల్ మార్ష్ కూడా బంతిని అందుకుంటూ జట్టుకు ఉపయుక్తంగా ఉంటున్నారు.

అయితే హార్దిక్‌ గాయంతో అయిదుగురు బౌలర్లతోనే టీమిండియా బరిలోకి దిగుతోంది. సెమీస్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు ఒకదశలో మన బౌలర్లపై ఒత్తిడి తెస్తున్నా.. రోహిత్‌కు ఆరో బౌలర్‌ను ఎంచుకోవడం సమస్యగా మారింది. అయితే బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించడం, దానికి తగ్గట్టుగా ఫీల్డర్లను మొహరించడంతో రోహిత్ సారథిగా సక్సెస్‌ అవుతున్నాడు. కానీ ఆసీస్‌కు ఆరో బౌలర్‌గా సపోర్ట్ చేయడానికి ఆల్‌రౌండర్లు ఉన్నారు. 

ఇక ఫైనల్‌ జరిగే నరేంద్ర మోడీ స్టేడియం సీటింగ్ కెపాసిటీతో పాటు పిచ్‌ కూడా స్పెషలే. నూతన స్టేడియాన్ని నిర్మించిన తర్వాత ఇక్కడ ఏడు మ్యాచ్‌లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన జట్లు మూడు సార్లు, ఛేజింగ్‌ చేసిన జట్లు నాలుగు సార్లు గెలిచాయి. ఇక్కడ బౌలింగ్‌కు ఫేవరేట్‌గా ఉంటుంది. 286 అత్యధిక స్కోరు. అది కూడా ఈ టోర్నీలోనే ఇంగ్లాండ్‌పై ఛేజింగ్‌లో కివీస్‌ సాధించింది. టీమిండియా ఇక్కడ నాలుగు మ్యాచ్‌లు ఆడగా అన్నింట్లోనూ గెలిచింది. రెండు సార్లు డిఫెండింగ్‌లో, మరో రెండుసార్లు  ఛేజింగ్‌లో సత్తాచాటింది.

కెప్టెన్సీ పరంగా చూస్తే కమిన్స్‌పై రోహిత్ శర్మదే పైచేయి. ఏ దశలో ఏ బౌలర్‌ను ఉపయోగించాలో హిట్‌మ్యాన్‌కు ఫుల్‌ క్లారిటీ ఉంది. ఈ మెగాటోర్నీలో టీమిండియా బెస్ట్ ఫామ్‌లో ఉండటానికి ఓ కారణం రోహిత్‌శర్మనే. బౌలర్‌నే కాదు, ఏ ప్లేయర్‌ను ఏ ఫీల్డింగ్‌ ప్లేస్‌లో ఉంచాలో కూడా రోహిత్ పక్కా ప్లానింగ్‌ తో బరిలోకి దించుతున్నాడు. నెదర్లాండ్స్‌, కివీస్‌ మ్యాచ్‌లో ప్లేయర్లు క్యాచ్‌లు చేజార్చినా.. బౌండరీలను ఆపడంలో, డబుల్స్‌ను సింగిల్స్‌గా మార్చడంలో సక్సెస్ అయ్యారు. 

ఇక ఆస్ట్రేలియాను చిత్తు చేసే అస్త్రాలు మన జట్టు అమ్ములపొదిలో పుష్కలంగా ఉన్నాయి. అంతేగాక అజేయ జట్టుగా రికార్డు మరింత బలాన్ని ఇస్తుంది. అప్పటికీ ప్రత్యర్థి జట్టు మనపై ఒత్తిడి చేసినా.. స్టేడియంలో లక్షా 32వేల మంది చెప్పే వందేమాతరం నినాదాలే.. మనల్ని గెలుపు బాట పట్టిస్తాయి. మన ప్లేయర్లను యుద్ధవీరులుగా తీర్చుదిద్దుతాయి. క్రికెట్‌ను మతంగా భావించే మన దేశంలో, అభిమానుల మధ్య రోహిత్‌సేన ఈ ప్రపంచకప్‌ను తప్పక ముద్దాడుతుంది. జగజ్జేతగా నిలుస్తుంది. 140 కోట్ల భారతీయుల ఆశలను తీరుస్తుంది. ఆల్‌ ది బెస్ట్ టీమిండియా.

– శ్రీకాంత్ అంకాల