ఈ శీర్షిక స్వభావం గురించి నేను మొదటి భాగంలోనే స్పష్టంగా రాసినా (నేను రాసినది యిది – '…ఖుశ్వంత్ సింగ్ అలాటి వాటిల్లో దిట్ట. అలా రాయగలుగుతానన్న ధైర్యం కలిగినప్పుడు ట్రావెలాగ్ రాస్తాను. అయితే యీ లోపున టూరిస్టులు సాధారణంగా ఎదుర్కొనే ఒక సమస్యను పరిష్కరించడానికి యీ సీరీస్ ద్వారా ప్రయత్నిస్తున్నాను…') కొంతమంది పాఠకులు కన్‌ఫ్యూజ్ అవుతూనే వున్నారు. నా అనుభవాలు చెప్తానని నేను ఎక్కడా రాయలేదు. నాకు ఎటువంటి ట్రావెలాగ్స్ నచ్చుతాయో, ఏవి నచ్చవో, గైడ్ నుండి సమాచార సేకరణ ఎంత కష్టమో ఉదాహరణలు యిస్తే వారందరినీ వెటకరించినట్లు కాదు. నేను యీ సీరీస్‌కు 'యూరోప్ ముచ్చట్లు' అని పేరు పెడితే దాని అర్థం యూరోప్ గురించిన విశేషాలు చెప్తాననే తప్ప నా యాత్రానుభవాలు చెప్తానని కాదు. అలా అయితే 'నా యూరోప్ ముచ్చట్లు' అని పేరు పెట్టేవాణ్ని. అయినా నా యాత్రల గురించి రాయమని అడగడం వింతగా వుంది. అందుకని యీ శీర్షిక పేరు మార్చేస్తున్నాను. 'యూరోప్ గాథలు' అని. ఇది ఏ వూరు ఎలా వెళ్లాలో అస్సలు చెప్పదు. పనికి వస్తుందో, పనికి రాదో తెలియకపోయినా ప్రతీ దాని గురించి ఎంతో కొంత తెలుసుకోవాలనే ఆసక్తి వున్న నాబోటి వెఱ్ఱివాళ్ల కోసమే యిది రాస్తున్నాను. దీనిలో యూరోప్ జానపదాల గురించి, చరిత్ర గురించిన గాథలుంటాయి. చరిత్రను గుర్తు పెట్టుకోవాలంటే దానికి సంబంధించిన ఫిక్షన్ చదివితేనే మనసులో నాటుకుంటుందని స్వీయానుభవం. అందువలన ఏదైనా చరిత్ర రాసినపుడు దానికి సంబంధించిన హిస్టారికల్ ఫిక్షన్ రచనను పరిచయం చేస్తాను. దాన్ని మెయిన్ స్టోరీతో కలపకుండా కింద హైపర్ లింక్‌గా యిస్తాను. ఓపిక వున్నవారు చదవవచ్చు.
నాకు హై స్కూల్లో ''ఐవాన్‌హో'' అనే నాన్-డిటైల్‌డ్ వుండేది. దాని ద్వారానే ఇంగ్లండులో నార్మన్లు, శాగ్జన్లు అనే జాతులు పరస్పరం కలహించుకునేవనీ, యూదులనే వేరే జాతి వుండేదని, రిచర్డ్ ద లయన్‌హార్టెడ్ వుండేవాడని, క్రూసేడ్స్‌లో పాల్గొన్నాడని .. యిలా అనేక విషయాలు తెలిసి, వాటిపై ఆసక్తి కలిగింది. ''రాబిన్ హుడ్'' నవల చదివితే షెర్‌వుడ్ అడవుల పేరు వినగానే పులకింత కలుగుతుంది. పాత తెలుగు కథలు, డిటెక్టివ్ నవలలు చదివి మదరాసుకి వెళితే ఆ పేర్లన్నీ పరిచితంగా తోచి, ఆత్మీయంగా తోస్తాయి. అందుకే నేను చరిత్రతో పాటు హిస్టారికల్ ఫిక్షన్‌కు కూడా అంత ప్రాధాన్యత యిస్తున్నాను. రెండూ కలగలిపితే యిబ్బందిగా వుంటోందంటున్నారని, విడగొడుతున్నాను. ఇంకో పది వ్యాసాల తర్వాత రెస్పాన్సు చూస్తాను. 'ఈ పద్ధతి కూడా నచ్చలేదు, మీరు ట్రావెలాగ్ రాసి తీరాల్సిందే, మీరు చూసినవాటి గురించే రాయాలి, తక్కిన వాటి జోలికి పోకూడదు' అంటే శీర్షిక ఆపేస్తాను, ఎందుకంటే ట్రావెలాగ్ రాసేటంతటి సామర్థ్యం వచ్చిందని నాకు యింకా నమ్మకం చిక్కటం లేదు. పైగా నేను చూసినవి మాత్రమే రాయాలంటే వర్సాయి రాజభవనం గురించి ఏమీ రాయకూడదు. సమయాభావం వలన నేను చూడలేకపోయాను, కానీ అదృష్టవంతుడైన పాఠకుడెవరైనా చూడవచ్చు కదా, ఎవరు చూడవచ్చారు, నేనే మళ్లీ పారిస్ వెళ్లి యీసారి చూడవచ్చేమో! చరిత్ర, విశేషాలు తెలుసుకుని గుర్తు పెట్టుకుంటే వెళ్లినపుడు భవిష్యత్తులో పనికి వస్తుంది అనే కాన్సెప్ట్ మీదే యీ సీరీస్ నడుస్తుంది. అది గమనించగోర్తాను.
ఇప్పుడు ఇంగ్లండు గురించి చెప్పుకుని వస్తాను. కింగ్ ఆర్థర్ కథ గురించి, నైట్ (కెఎన్‌ఐజిఎట్‌టి) ల గురించి విని వుంటారు. ఆర్థర్ కథకు చారిత్రక ఆధారం లేకపోయినా మన భట్టివిక్రమార్క కథలా చాలా జానపదంలో చాలా పాప్యులర్. అతనితో బాటు పన్నెండుమంది నైట్స్ వుండేవారని, అందరూ కలిసి రౌండు టేబుల్ వద్ద సమానస్థాయిలో కూర్చుని చర్చించేవారని ప్రతీతి. ఆర్థర్ కథలో సాహసం, రొమాన్సు, నాటకీయత, ప్రతీకారం అన్నీ వున్నాయి. అందుకే దాని ఆధారంగా అనేక నవలలు, సినిమాలు వచ్చాయి. తాజాగా ''నైట్స్ ఆఫ్ ద రౌండ్ టేబుల్ – కింగ్ ఆర్థర్'' అనే సినిమా 2016లో రాబోతోంది. నైట్‌హుడ్ అంటే రాజభక్తి ప్రదర్శించిన పరాక్రమవంతులకు రాజు లేదా ప్రభువు యిచ్చే పదవి. వారిని అప్పణ్నుంచి పేరుకు ముందు 'సర్' అనే బిరుదు చేర్చి పిలుస్తారు. నైట్‌లకు శూరత్వంతో బాటు ధీరోదాత్తత, ఔదార్యం, నియమబద్ధజీవనం, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, బలహీనుల పట్ల షివల్రీ కలిగి వుండాలి. అటువంటివారికి రాజులు కొంత భూమి యినాముగా యిచ్చేవారు. వారు దానిపై ఆదాయాన్ని అనుభవిస్తూ, రాజుకు అవసరమైనప్పుడు సైనికసాయం చేసేవారు. ఆధునికయుగంలో కూడా నైట్‌హుడ్, రాణి చేత ''సర్'' బిరుదప్రదానాలు కొనసాగుతున్నాయి. ఎటొచ్చీ యిప్పటివారు గుఱ్ఱాలెక్కి యుద్ధాలు చేయనవసరం లేదు. తమతమ రంగాల్లో ప్రావీణ్యం సంపాదించి వుండాలి. మధ్యయుగాల నాటి నైట్స్‌ను ఆధారం చేసుకుని అనేక కథలున్నాయి. కింగ్ ఆర్థర్ కథ చెప్పాలంటే శాగ్జన్స్ తో అతను చేసిన పోరాటాల ప్రస్తావన వస్తుంది. శాగ్జన్ల గురించి, అంతకు ముందు పాలించిన రోమన్ల గురించి కాస్త చెప్పాల్సి వస్తుంది. ఇదంతా క్రీస్తు కాలం నుంచి రికార్డయిన చరిత్ర చెప్తుంది. క్రీ.పూ. 325లో బ్రిటన్ గురించి గ్రీకు నావికుడు పైథియస్ రాసిన సమాచారంతో చరిత్ర మొదలవుతోంది. మరి అంతకు ముందునుంచి బ్రిటన్‌లో వున్న వారి కథేమిటి? అసలు ఆ దేశానికి బ్రిటన్ అనే పేరు ఎలా వచ్చింది? అనేదానికి పురాణగాథ చెప్తారు.
బ్రిటన్ దేశానికి ఆ పేరు పెట్టినవాడు బ్రూటస్. సీజర్ హత్య చేసినవాడు రోమన్ బ్రూటస్ అయితే యితను ట్రోజన్ బ్రూటస్. ఇతని తండ్రి ఈనియాస్ ట్రాయ్ వీరుడు. ''ఇలియడ్'' అనే గ్రీకు పురాణ గాథలో ట్రాయ్ నగరానికి పాలకుని కొడుకు గ్రీసులో ఒక దేశపు రాజు భార్యను ఎత్తుకుని వచ్చాడు. ఆమె కోసం గ్రీసులోని తక్కిన రాజులందరూ కలిసి ట్రాయ్‌పై దండెత్తి ఆ నగరాన్ని నాశనం చేశారు. ట్రాయ్ రాజుకు వరుసకు సోదరుడికి, వీనస్ అనే దేవతకు పుట్టినవాడే ఈనియాస్. అతను యుద్ధంలో బతికి, పొరుగుదేశపు రాజు ఆశ్రయం పొందాడు. అతని తరఫున అతని శత్రువైన ఇటలీ రాజుని ఓడించి, అతని కూతుర్ని పెళ్లాడి ఇటలీకి రాజయ్యాడు. రోమ్ నగర స్థాపకులైన రోములస్ సోదరులు అతని వంశజులే. కొంతకాలానికి ఈనియస్ భార్య గర్భం దాల్చింది. ఎవరు పుడతారో చెప్పమని జోస్యుణ్ని అడిగితే కొడుకు పుడతాడని అతను తల్లి చావుకి, తండ్రి చావుకి కారకుడవుతాడని చెప్పాడు. అతను చెప్పినట్టుగానే కొడుకు పుట్టాడు, ప్రసవంలోనే తల్లి చనిపోయింది. ఆయా అతనికి బ్రూటస్ అని పేరు పెట్టింది. అతనికి 15 సం||రాల వయసుండగా తండ్రితో బాటు వేటకు వెళ్లాడు. జింకలను వేటాడుతూ పొరపాటున వేసిన బాణం అతని తండ్రి ఈనియాస్‌కి తగిలి చనిపోయాడు. దాంతో దాయాదులు బ్రూటస్‌ను దేశంలోంచి వెళ్లగొట్టారు. అతను గ్రీసు చేరాడు. ట్రాయ్ యుద్ధంలో పాల్గొన్న మహావీరుడు ఎకిలీజ్ కుమారుడు ఓడిపోయిన ట్రాయ్ రాజు కుమారుల్లో ఒకణ్ని బందీగా పట్టుకుని రాజైన పాండ్రాసస్ వద్ద బానిసగా వుంచాడు. తన బంధువు బందీగా వున్న దుస్థితి చూసి బ్రూటస్ పాండ్రాసస్‌తో పోరాడి అతన్ని గెలిచాడు. అప్పుడు పాండ్రాసస్ తన రాజ్యంలో మూడో వంతుతో పాటు కూతుర్ని యిచ్చి పెళ్లి చేశాడు.
మావగారిచ్చిన ధనరాశులతో, భార్యతో నౌకలెక్కి వెళుతున్న బ్రూటస్‌కు ఒక దీవిలో డయానా ఆలయం కనబడింది. జోస్యం చెప్పించుకుంటే ఆ దేవత ''నువ్వు గాల్ దేశం ఉత్తరంవైపుకి వెళ్లు. అక్కడకు వెళ్లి రెండవ ట్రాయ్ నగరాన్ని నిర్మించు. అది ట్రాయ్ లాగానే ఐశ్వర్యంతో వర్ధిల్లుతుంది. ఎప్పటికీ నాశనం కాదు.'' అని అశరీరవాణిగా వినిపించింది. అతను తన ప్రయాణాన్ని ఉత్తరదిశగా సాగిస్తూ వుండగా దారిలో కోరినియస్ అనే బలాఢ్యుడు తారసిల్లాడు. ఇద్దరూ కలిసి సాహసాలు చేసుకుంటూ ముందుకు సాగారు. వారికి మహాకాయులైన (జైంట్స్) కొందరి అధీనంలో వున్న అల్బియాన్ అనే పెద్ద దీవి (ప్రస్తుతం బ్రిటన్) తగిలింది. వారిని ఓడించి ఆ దీవిని వీళ్లిద్దరూ పంచుకున్నారు. కోరినియస్ తన భాగానికి వచ్చిన ఆగ్నేయ బ్రిటన్ ప్రాంతానికి తన పేర కోరినియా అని పేరు పెట్టాడు. అదే యిప్పటి కార్న్‌వాల్. దానికి పై భాగం బ్రూటస్‌కు దక్కగా దానికి తన పేర బ్రిటన్ అని పెట్టాడు. థేమ్స్ నదీతీరాన ఒక నగరాన్ని కట్టి దానికి ''న్యూ ట్రాయ్'' అనే అర్థం వచ్చేట్లా 'ట్రాయ్‌యా నోవా' అని పేరు పెడితే కొంతకాలాని అది జనం నోట్లో పడి ట్రినోవాంటమ్ అయిపోయింది. ఆ తర్వాతి కాలంలో రాజ్యానికి వచ్చిన లడ్ అనే అనే అతను నగరానికి గోడలు కట్టి తన పేర 'కేయర్-లడ్' (లడ్ కోట) అని పేరు పెట్టాడు. అదే కాలక్రమంలో కేయర్ లన్‌డైన్‌గా లండన్‌గా మారింది. (సశేషం) (చిత్రం – బ్రిటన్‌వైపు తన స్నేహితుడితో, భార్యతో నౌకలో పయనిస్తున్న ట్రోజన్ బ్రూటస్, 15 వ శతాబ్దపు మాస్టర్ విస్టేస్ వేసిన చిత్రం, పారిస్‌లోనే బిబిలోతెక్ నేషనల్ మ్యూజియంలో వుంది)
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2015)