పబ్లిసిటీ ఓకె..రేటింగ్ నాట్ ఓకె

సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి..పైరసీకి ఎవరు కారణం? సినిమాను ఎవరు బతికించాలి? చాంబర్ అధ్యక్షుడు ఎన్ వి ప్రసాద్ ఇందుకు తన వంతు ఓ కారణం కనుగొన్నారు. మీడియా మిత్రులకు సినిమా ఇండస్ట్రీ ఎంతగానో…

సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి..పైరసీకి ఎవరు కారణం? సినిమాను ఎవరు బతికించాలి? చాంబర్ అధ్యక్షుడు ఎన్ వి ప్రసాద్ ఇందుకు తన వంతు ఓ కారణం కనుగొన్నారు. మీడియా మిత్రులకు సినిమా ఇండస్ట్రీ ఎంతగానో సహకరిస్తోందని, వారికి సినిమాల ఫొటోలు, విడియోలు, క్లిప్పింగ్ లు ఇచ్చి కోపరేట్ చేస్తోందని, అందువల్ల వాళ్లు కూడా ప్రతిగా స్టార్ రేటింగ్ లు మాని, పైరసీ మీద దృష్టిపెట్టాలని ఆయన సలహా..సూచన. తెలిసి అన్నారో, తెలియక అన్నారో, తెలివిగా అన్నారో కానీ ఎన్వీ ప్రసాద్ మాటలు చాలా ఆలోచనలకు దారి తీస్తున్నాయి.

ఒకటి సినిమా పైరసీని మీడియా అరికట్టగలదా? ఏ విధంగా. సినిమా రంగంలో జనాలు ఎక్కువగా పైరసీ సీడీలే చూస్తారన్నది వాస్తవమా కాదా? టాప్ కేడర్ ను మిగిలిన సినిమా జనాల్లో తాము ఎక్కువగా పైరసీ సీడీ చూస్తామని చెబుతుంటారు. సినిమాల్లో వుంటూ, సినిమాపై బతుకుతూ, పైరసీ సీడీ చూడము అని చెప్పగలిగేవారు ఎంతమంది వుంటారు? మీకు మీరే మీ వారిపై ఓ సర్వే జరిపించండి.

సరే, ఆ సంగతి అలా వుంచితే, వెబ్ మీడియాకు ఫోటోలు, విడియోలు ఇవ్వడం పుణ్యానికేమీ కాదు. మీ సినిమాలకు పబ్లిసిటీ వస్తుందని. ఇది ఉభయ తారక వ్యవహారం. మీవల్ల మీడియాకు, మీడియా వల్ల మీకు లాభం. చానెళ్లు స్టార్ కార్యక్రమాలు, ఇంటర్వూలు ఎందుకు చేస్తున్నాయి. మీరు ప్రకటనలు ఇస్తున్నారు కాబట్టి. వాళ్లు ఆ కార్యక్రమాలు చేస్తారని మీరు ప్రకటనలు ఇస్తున్నారు. అక్కడ అది ఉభయతారకం. ఇందులో ఎవరు ఎవరికీ చేసే మేలు అంటూ ఏమీ లేదు. వెబ్ సైట్ లు కూడా అంతే.  వెబ్ సైట్  లపై అంత ఆసక్తి లేకుంటే, వాటిని మీ మీ కార్యక్రమాలకు పిలవడం మానేయండి..వాటికి మెటీరియల్ ఇవ్వడం మానేయండి..ఎవరికి నష్టం.?

ఇక సమీక్షలు, రేటింగ్ లు అన్నది తెలుగు సినిమా రంగానికే పరిమితమైన వ్యవహారం కాదు. అన్ని భాషా చిత్రాలకు ఈ తరహా వ్యవహారం వుంది. పోనీ మీకు రేటింగ్ లు ఇష్టం లేనపుడు ఎందుకు వాటిని మీ ప్రచారానికి వాడుకుంటారు. ఫలానా సైట్ ఇంత రేటింగ్..ఇంకో సైట్ ఇంతరేటింగ్..అంటూ మీరు పోస్టర్లు ఎందుకు వేసుకుంటారు? అంటే ఆయా సైట్ రేటింగ్ లకు క్రెడిబులిటీ వుందనేగా.  అంటే మీకు మంచి రేటింగ్ ఇస్తే ఓకె. లేదంటే నాట్ ఓకె.

సరే వెబ్ సైట్ల ను రేటింగ్ లు ఇవ్వద్దంటారు. మరి ఫేస్ బుక్, ట్విట్టర్ , వాట్సప్  లను ఏం చేద్దాం. అందులో అభిప్రాయాలు సినిమా విడుదలైన మూడు గంటల్లో వరదలా వెల్లువెత్తుతున్నాయి కదా..వాటిని ఎలా కట్టడి చేస్తారు? అక్కడ అయిదుగురో, పదిమందో కాదు అభిప్రాయాలు వెలిబుచ్చేది..లక్షలాది మంది. మీరే చెబుతున్నారు సినిమా జనానికి చేరువైపోయింది. సినిమా విడుదలైన గంటల్లోనే ఎస్ఎమ్ఎస్ లు వెళ్లిపోతున్నాయిఅని.

అంటే ఇప్పుడు చేయాల్సింది మీడియాను బతిమాలడం, బెదిరించడం కాదు. సినిమాను బాగు చేసుకోవడం. హీరోల చుట్టూ నిర్మాతలు, కథలు, దర్శకులు తిరగడం ఆపాలి. మంచి సినిమా తీస్తే, ఏ సైట్ కూడా కావాలని తక్కువ రేటింగ్ ఇవ్వదు. అలా ఇస్తే, నెటిజన్   లలో ఆ సైట్ కు వున్న క్రెడిబులిటీ పోతుంది. ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా వుంది ఎన్ వి ప్రసాద్ గారి మాట. మంచి సినిమా మేం తీయలేం…మీరు మాత్రం మంచి రేటింగ్ ఇవ్వండి అంటే ఎలా?