ఎమ్బీయస్‌ : సముద్రగర్భంలో దాగిన అమూల్యసంపదకై వేట

ఎప్పుడో 1885లో మునిగిపోయి ఓడలోని శిల్పాలకై యిప్పుడు భారత్‌-శ్రీలంక ప్రభుత్వాలు సంయుక్తంగా వేట మొదలుపెట్టాయి. అవి అంత ముఖ్యమైనవా అంటే అవుననే చెప్పాలి. మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో భరహూత్‌ స్తూపానికి సంబంధించిన ప్రాచీన సంపద…

ఎప్పుడో 1885లో మునిగిపోయి ఓడలోని శిల్పాలకై యిప్పుడు భారత్‌-శ్రీలంక ప్రభుత్వాలు సంయుక్తంగా వేట మొదలుపెట్టాయి. అవి అంత ముఖ్యమైనవా అంటే అవుననే చెప్పాలి. మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో భరహూత్‌ స్తూపానికి సంబంధించిన ప్రాచీన సంపద అది. క్రీస్తు పూర్వం 3 వ శతాబ్దిలో అశోకుడు వేయించిన స్తూపానికి యింకో వందేళ్ల తర్వాత శుంగుల కాలంలో మరిన్ని శిల్పాలు వచ్చి చేరాయి. బుద్ధుడి జీవితానికి సంబంధించిన అంశాలతో వున్న ఆ శిల్పాలు ఆర్కియాలిజలికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థకు మొట్టమొదటి అధిపతిగా వున్న సర్‌ అలెగ్జాండర్‌ కన్నింగ్‌హామ్‌ 1873లో నిర్వహించిన తవ్వకాల్లో బయట పడ్డాయి. వాటిని ఆయన కలకత్తాలోని ఇండియన్‌ మ్యూజియంలో భద్రపరిచాడు. లండన్‌లో జరిగే మ్యూజియంలో ప్రదర్శనకు పంపమని బ్రిటిషు అధికారులు కోరగా 1885 నవంబరు 8న కలకత్తాలో ''ఎస్‌ఎస్‌ ఇండస్‌'' అనే 3462 టన్నుల నౌకలో తేయాకు, నీలిమందుతో బాటు వేసి పంపించారు. అది మద్రాసు, కొలంబోల మీదుగా లండన్‌ వెళ్లవలసి వుంది. కానీ కొలంబో వెళుతూండగా దాని లంగర్లలో ఒకటి ఓడ అడుగుభాగానికి తగులుకుని రంధ్రం చేసేసింది. దాంతో అది మునిగిపోయింది. అదృష్టవశాత్తూ ఎవరూ మరణించలేదు కానీ వస్తువులన్నీ మునిగిపోయాయి. 

ఎక్కడ మునిగిందో కరక్టుగా తెలిస్తే ఆ శిథిలాలను వెలికి తీద్దామని అనుకున్నారు. త్రిన్‌కొమలీ వద్దనే వుండి వుండాలి అనే వూహతో గత శతాబ్దమంతా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అలాటి విఫలయత్నం చేసిన వారిలో ప్రముఖ సై-ఫై రచయిత, మేరిటైమ్‌ ఆర్కియాలజిస్టు ఆర్థర్‌ సి. క్లార్క్‌ కూడా వున్నారు. 2009లో శ్రీలంక అధికారులు తమ అంచనాలు సవరించుకుని త్రిన్‌కొమలీకి ఉత్తరాన 40 మీటర్ల లోతున వుండవచ్చు అనుకున్నారు. అంటే అది ఎల్‌టిటిఇకి కంచుకోటగా వున్న ముళ్లతీవు ప్రాంతం. టైగర్లు వుండగా అక్కడకి వెళ్లడం ప్రమాదకరం అని వూరుకున్నారు. ఇన్నాళ్లకి అంతర్యుద్ధం ముగిసి, సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి 2013 ఆగస్టులో శ్రీలంక సెంట్రల్‌ కల్చరల్‌ ఫండ్‌, మారిటైమ్‌ ఆర్కియాలజీ యూనిట్‌ రెండూ కలిసి ఉత్తర కోస్తా ప్రాంతమంతా గాలించి ముళ్లతీవులోనే శిథిలాలు, శిల్పాలు వుంటాయని తేల్చారు. బౌద్ధ శిల్పాలు కాబట్టి శ్రీలంకకు కూడా వీటిపై ఆసక్తి వుంది. ఇండియాలో శ్రీలంక హై కమిషనర్‌గా వున్న సుదర్శన సెనివెరత్నె స్వయంగా ఆర్కియాలజిస్టు కాబట్టి ఆ ఆపరేషన్‌కు సాయపడమని భారతప్రభుత్వంను కోరారు. రెండు ప్రభుత్వాలు ఒక ఒప్పందానికి వచ్చి మన విదేశాంగ వ్యవహారాల శాఖ అనుమతి వచ్చాక అండర్‌ వాటర్‌ ఆపరేషన్‌ మొదలుపెడతాయి. శ్రీలంక ప్రభుత్వం కలిసి ఆలోచిస్తున్నాయి. వారి ప్రయత్నాలు ఫలించి ఆ అమూల్య వారసత్వసంపద మళ్లీ మనకు దక్కాలని ఆశిద్దాం. 

ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]