రివ్యూ: అఖిల్
రేటింగ్: 2.5/5
బ్యానర్: శ్రేష్ఠ్ మూవీస్
తారాగణం: అఖిల్ అక్కినేని, సయేషా సైగల్, మహేష్ మంజ్రేకర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి తదితరులు
కథ: వెలిగొండ శ్రీనివాస్
సంభాషణలు: కోన వెంకట్
సంగీతం: అనూప్ రూబెన్స్, తమన్ (పడేసావే)
నేపథ్య సంగీతం: మణిశర్మ
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: అమోల్ రాథోడ్
నిర్మాత: నితిన్
కథనం, దర్శకత్వం: వి.వి. వినాయక్
విడుదల తేదీ: నవంబరు 11, 2015
ఎన్నో అంచనాలు, అక్కినేని వంశాభిమానుల ఆశలు, మరో పెద్ద స్టార్ అవుతాడనే నమ్మకాలు.. అక్కినేని అఖిల్ తెర మీదకి వస్తూనే చాలా బాధ్యతలు భుజాన వేసుకొచ్చాడు. తండ్రిలా వెరైటీ వెరైటీ కథనో, అన్నయ్యలా లవర్బాయ్గానో ట్రై చేయకుండా ఫస్ట్ అటెంప్ట్‌లోనే కమర్షియల్ హీరోగా నిలబడిపోవాలనే ఆశయంతో వి.వి. వినాయక్‌లాంటి మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్‌తో మొదటి సినిమా సైన్ చేశాడు. వినాయక్ డైరెక్టర్, హీరో నితిన్ ప్రొడ్యూసర్, ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్, కోన వెంకట్‌లాంటి చేయి తిరిగిన రైటర్.. ఇలా అఖిల్ ఫస్ట్ మూవీకి సెటప్ బాగా కుదిరింది. ఈ కాంబినేషన్ అంతా చూస్తే పూర్తి స్థాయి కమర్షియల్ ప్యాకేజ్‌తో వస్తున్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంతమంది కలిసి చేస్తున్న సినిమా మిస్‌ఫైర్ అయ్యే అవకాశమే లేదన్నట్టు ట్రేడ్ కూడా అఖిల్‌పై ఫుల్ కాన్ఫిడెన్స్ చూపించింది.
కాంబినేషన్ బాగానే సెట్ చేసుకున్నారు కానీ 'కంటెంట్' మీద ఫోకస్ పెట్టలేదు. సూర్యగ్రహణం సమయంలో సూర్యుడి నుంచి ఉద్భవించే కిరణాలు భూమికి చేటు చేస్తుంటాయని, వాటిని ఆపే శక్తి జువా అనే లోహ గోళానికి ఉందని.. భూమికి నష్టం కలగనివ్వకుండా ఆ జువాని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఒక ఆఫ్రికన్ తెగ వారు తీసుకున్నారని.. కథ మొదలు పెడితే ఇదేదో రొటీన్‌కి భిన్నమైన ఫాంటసీ సినిమా అనిపిస్తుంది. అయితే అఖిల్‌లో ఆ పాయింట్‌కి మించి కథ లేదు. ఆ జువాని దక్కించుకోవాలని విలన్ ప్రయత్నాలు, ఆ క్రమంలో హీరో అతనికి ఎదురు పడడాలు, ఫైనల్‌గా దుష్టసంహారం. ఇంతే కథ. కనీసం ఆ జువాపై ఫోకస్ పెడుతూ 'దేవీపుత్రుడు' తరహా గ్రాఫిక్స్ ప్రధాన సినిమా తీసినా ఎంతో కొంత కొత్తదనం ఉండేది. ఆ పాయింట్ ఒక్కటి మెన్షన్ చేస్తే అదే కొత్తదనమని ప్రేక్షకులు ఫీలయిపోతారన్నట్టు మిగిలిన సినిమాని మొత్తం ఏమాత్రం ఆసక్తి కలిగించని సన్నివేశాలతో, పేలవమైన కథనంతో నడిపించేసారు.
అఖిల్‌కి వినాయక్ పెద్ద ఎస్సెట్ అవుతాడని అనుకుంటే, చివరకు అఖిలే వినాయక్‌కి సపోర్ట్ కావాల్సి వచ్చింది. కుందేలుకి హార్ట్ ఆపరేషన్ చేయడం.. అది కూడా అఖిల్‌కి బ్లూ టూత్ ద్వారా రాజేంద్రప్రసాద్ పుస్తకాలు చదువుతూ చెప్తుంటే, అది విని హీరోయిన్‌కి వివరిస్తూ ఆమెతో ఆపరేషన్ చేయించడం, అది సక్సెస్ అవడం లాంటి సీన్ చూడగానే ఇక మిగతా సినిమాపై నమ్మకం సడలిపోతుంది. ఎలాంటి హైస్ లేకుండా ఫ్లాట్‌గా, బోరింగ్‌గా సాగిపోతున్న సినిమాని పాటలొచ్చినప్పుడల్లా అఖిల్ ఓన్ చేసుకున్నాడు. తన అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్‌తో ప్రతి పాటనీ విజువల్‌గా మరో లెవల్‌కి తీసుకెళ్లాడు. డాన్స్ పరంగా నాగ్, చైతన్య నుంచి అంతగా ఆశించని అక్కినేని అభిమానులకి ఇది నిజంగా స్వీట్ సర్ప్రైజే. కథనం సంగతి అలా ఉంచి కనీసం నటీనటుల నుంచి తనకి కావాల్సింది రాబట్టుకోవడంలో కూడా వినాయక్ ఫెయిలయ్యాడు. చాలా సన్నివేశాల్లో దాదాపు అందరూ అగమ్యగోచరంగా కనిపిస్తుంటారు. అఖిల్‌కి కెమెరా బెరుకు లేదు. ఫోటోజెనిక్ ఫేస్, హాండ్సమ్ లుక్స్‌తో ఇన్‌స్టంట్‌గా ఇంప్రెస్ చేస్తాడు కానీ ఎక్స్ప్రెషన్స్, డిక్షన్‌పై ఫోకస్ పెట్టాలి. మొదటి సినిమాకే ఎక్కువ ఆశించడం తగదు కానీ కమర్షియల్ హీరోగా ఇది కాన్ఫిడెంట్ డెబ్యూనే అని చెప్పాలి.
అఖిల్ కథ నడిచిన విధానంలో మనకి తెలిసిన ఫార్ములా పరంగా పెద్ద మార్పులేం లేవు. మొదటి భాగమంతా వినోదంతో, ప్రేమకథతో కాలక్షేపం చేయడం, ఇంటర్వెల్‌కి సమస్య ఎదురు కావడం, తర్వాత ఆ సమస్య పరిష్కరించడానికి కథానాయకుడు బయలుదేరడం, చివరకు తనకి పెద్ద సవాల్ ఎదురవడం, దానిని అధిగమించి అనుకున్నది సాధించడం.. ఏ కమర్షియల్ సినిమా తీసుకున్నా ఇదే ఫార్ములా. దీనిని అప్పీలింగ్‌గా చెప్పడమే వినాయక్ టాలెంట్ అంతా. ఇలాంటి సినిమాలు ఎన్నో తీసినా కానీ ఆడియన్స్‌ని మళ్లీ మళ్లీ మెప్పించగలిగిన వినాయక్ ఈసారి తన మార్కు కనీసం ఒక్క సందర్భంలోను చూపించలేదు. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలు కానీ, ఫాన్స్‌కి పూనకాలు వచ్చేసే హీరోయిజమ్ ఎలివేషన్లు కానీ, కడుపు చెక్కలయ్యే కామెడీ కానీ ఏదీ లేకుండా నిస్సారంగా సాగిపోయే అఖిల్ సినిమాకి పాటలు, హీరో, హీరోయిన్లే ఆకర్షణగా మారారు. ఒకప్పుడు బ్రహ్మానందాన్ని బ్రహ్మాండంగా వాడేసుకున్న దర్శకుల్లో శ్రీను వైట్ల, వినాయక్ ముందుండే వాళ్లు. వైట్ల మాదిరిగానే ఇప్పుడు వినాయక్ కూడా తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడంలో విఫలమయ్యాడు.
పాటలు ఆడియోలో ఎలా ఉన్నా అఖిల్ డాన్సులతో, మంచి లొకేషన్లతో చూడ్డానికి బాగున్నాయి. సాంకేతిక వర్గంలో పెద్ద పెద్ద పేర్లే ఉన్నా కానీ వినాయక్ నుంచి ఊహించని ఈ ఎయిమ్‌లెస్ మూవీకి ఎవరూ ఎక్స్ట్రా బూస్ట్ ఇవ్వలేకపోయారు. ఫస్ట్ హాఫ్‌లో మేటర్ లేకుండా పాటలు, ఫైట్లతో నడిపించేసినా కనీసం సెకండ్ హాఫ్‌కి అయినా మనకి తెలిసిన వినాయక్ డ్రైవింగ్ సీట్ తీసుకుంటాడనిపిస్తుంది. కథాపరంగా కుదిరిన సెటప్‌కి వినాయక్‌లాంటి మాస్ డైరెక్టర్ థ్రిల్లింగ్ సీన్స్‌తో రేసీగా నడిపించడానికి వీలున్న ద్వితీయార్ధాన్ని ఏమాత్రం స్పీడ్ లేని నీరసమైన సన్నివేశాలతో క్లయిమాక్స్ వరకు కాలక్షేపం చేసేయడం విచిత్రంగా అనిపిస్తుంది. కనీసం క్లయిమాక్స్‌లో అయినా వినాయక్ ముద్ర కనిపించలేదు. అసలే సన్నివేశాలు రాసుకున్న తీరు పేలవంగా ఉంటే ఆ గ్రాఫిక్స్ మూలంగా ఇంకా బ్యాడ్‌గా తయారైంది. అఖిల్ పడుతున్న తపనకి, పడుతున్న కష్టానికి, అతనికి ఉన్న కసికి.. దర్శకుడి తరఫు నుంచి మినిమమ్ సపోర్ట్ కూడా లేకపోవడంతో ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా కాస్తా ఎపిక్ డిజప్పాయింట్మెంట్గా మిగిలింది. అఖిల్‌కి కమర్షియల్ హీరోగా నిలబడే లక్షణాలున్నాయని ఫాన్స్ శాటిస్ఫై అవుతారు కానీ అతని పరిచయానికి ఈ సినిమాని ఎంచుకోవడం వారు సైతం ఆమోదించడం కష్టం మరి.
బోటమ్ లైన్: అఖిల్‌లో జోష్ ఉంది కానీ 'అఖిల్'లో లేదు!
– గణేష్ రావూరి