పైరసీనే గెలిచిందా.?

భారీ అంచనాల నడుమ విడుదలైన 'బాహుబలి' చిత్రం విజువల్‌ ఎఫెక్ట్స్‌ పరంగా చాలా బాగుందనే టాక్‌ సంపాదించుకుంది. తొలిరోజు వసూళ్ళ రికార్డుల్నీ సృష్టించేసింది. మరోపక్క సినిమా విడుదలకు ముందే 'బాహుబలి' టీమ్‌, పలువురు సినీ…

భారీ అంచనాల నడుమ విడుదలైన 'బాహుబలి' చిత్రం విజువల్‌ ఎఫెక్ట్స్‌ పరంగా చాలా బాగుందనే టాక్‌ సంపాదించుకుంది. తొలిరోజు వసూళ్ళ రికార్డుల్నీ సృష్టించేసింది. మరోపక్క సినిమా విడుదలకు ముందే 'బాహుబలి' టీమ్‌, పలువురు సినీ ప్రముఖులు పైరసీకి హెచ్చరికలు పంపారు. సినిమాలో నటించిన స్టార్స్‌ స్టామినాని మించి.. ఆ మాటకొస్తే తెలుగు సినిమా స్టామినాని మించి ఈ సినిమాకి ఖర్చు చేయడంతో, సినిమాకి పైరసీ భయం ఓ రేంజ్‌లో పట్టుకుంది. 

సినిమా విడుదలైన తొలిరోజే కొందరు మొబైల్‌ ఫోన్లలో సినిమాని చిత్రీకరించి సర్క్యులేట్‌ చేసే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తూ, సినిమాని పెద్ద తెర మీదే చూడాలి, మొబైల్‌లోనో, పైరసీ వీడియోని కంప్యూటర్లలోనో చూడటం నాన్సెన్స్‌.. అని సగటు సినీ ప్రేక్షకులు నిర్ణయించుకోవడంతో, పైరసీ దెబ్బ పెద్దగా తగలలేదు మొదటి రోజు. 

కానీ, రెండో రోజుకీ, మూడో రోజుకీ సీన్‌ మారిపోయింది. థియేటర్లలో టిక్కెట్లు దొరక్కపోవడంతో చాలామంది పైరసీని ఆశ్రయించేశారు. మార్కెట్‌లోకి పైరసీ సీడీలు వచ్చేశాయి. కొన్ని పైరసీ సీడీలు, యాంటీ పైరసీ టీమ్‌కి దొరికేశాయి కూడా. ఇది ప్రతి సినిమా విషయంలోనూ జరిగేదే. అసలంటూ పైరసీ బయటకే రాకుండా చూడగలిగితే తప్ప, ఒక్కసారి పైరసీ సీడీ బయటకు వస్తే.. ఆ తర్వాత దాన్ని ఆపడం ఎవరితరమూ కాదు. 

'బాహుబలి' విషయంలో నష్టం నెమ్మది నెమ్మదిగా జరిగిపోతోంది. తెలుగు సినిమాకి పెనుభూతంలా తయారైన పైరసీ, ప్రతిసారీ ప్రతి సినిమా విషయంలోనూ గెలుస్తూనే వుంది. ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం.