శీర్షికను బట్టి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పులిలాంటివాడని అనుకోవద్దు. ‘అదిగో పులి’… కథ మనందరికీ తెలుసు. చిన్నతనంలో చదువుకున్నదే. దీనికి, పవన్ రాజకీయ కథకు పోలికలు ఉన్నాయి. ఆ కథ ఓసారి గుర్తు చేసుకుందాం. తండ్రీకొడుకులు పొలానికో, ఊరికో వెళుతుంటారు. తండ్రి మందు నడుస్తుంటే కొడుకు వెనక నుంచి వస్తుంటాడు. ఆ సమయంలో వాడికో చిలిపి ఆలోచన వస్తుంది. ‘నాన్నా పులి…పులి’ అని భయంగా అరుస్తాడు. తండ్రి కంగారుగా, భయంగా ‘ఎక్కడ…ఎక్కడ’ అనుకుంటూ వస్తాడు. కొడుకు నవ్వి ‘పులి లేదు…గిలి లేదు. ఊరికే అన్నాను’ అంటాడు. కొద్దిసేపటి తరువాత మళ్లీ ఇలాగే జరుగుతుంది. మళ్లీ తండ్రి భయపడి పరుగెత్తుకుంటూ వస్తాడు. కొడుకు నవ్వుతూ ఊరికే అన్నానని అంటాడు. కాసేపటి తరువాత కొడుకు మళ్లీ ఇలాగే చేస్తాడు. కాని తండ్రి పట్టించుకోకుండా ముందుకు వెళతాడు. కాని ఆ సమయంలో నిజంగానే పులి వస్తుంది. కొడుకు నిజంగానే భయంతో కేకలు పెడతాడు. కాని ప్రయోజనం ఉండదు. జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది. దీన్నే పవన్ కళ్యాణ్‌కు వర్తింపచేసుకోవచ్చు.
పులి అనుకుంటే…..
‘జనసేన’ అనే పార్టీ పెడుతున్నానని ప్రకటించినప్పటి నుంచి, మొన్నీమద్య నిర్వహించిన మీడియా సమావేశం వరకు ఆయన ఏం సాధించాడో తెలియదు. రాజకీయాల్లోకి వస్తున్నానని అంటే జనం నిజమేననుకున్నారు. స్వాగతించారు. పాలకులను నిలదీస్తా…తప్పు చేస్తే ప్రశ్నిస్తే…ప్రజా సమస్యలపై పోరాడతా అంటే ‘జయీభవా…విజయీభవ’ అని దీవించారు. అప్పుడప్పుడు నోరు తెరిచి రెండు ముక్కలు మాట్లాడినా సంచలనంగా చెప్పుకున్నారు. ఈమధ్య మీడియా ముందుకొచ్చి టీఆర్‌ఎస్, టీడీపీ, భాజపాలపై విమర్శలు చేశాడు. ఆయన వ్యాఖ్యలపై జనం తమకు తోచిన రీతిలో భాష్యం చెప్పుకున్నారు. ఇక మళ్లీ ఎప్పుడు మాట్లాడతాడో అనుకుంటున్నారు. ఈయన సాధారణంగా లేవడుగాని లేస్తే మనిషి కాడని కూడా కొందరు చెప్పుకున్నారు. కొన్నాళ్ల తరువాత పవన్ మళ్లీ మాట్లాడతాడు. ‘జనంలోకి రాకుండా ఎన్ని మాట్లాడితే ఏం లాభం?’ అని అప్పుడు పెదవి విరుస్తారు. అదిగో పులి అనుకుంటే పిల్లి అయిందని నవ్వుకుంటారు. తాను నిజంగానే పులిలాంటివాడినని ఆ తర్వాత గాండ్రించినా ఎవరూ పట్టించుకోరు. పవన్ మీడియా సమావేశం నిర్వహించిన తరువాత అది తెలంగాణ, ఆంధ్రా నాయకులకు మంచి ఆహారమైంది. ఎడాపెడా విమర్శలు చేశారు. ‘మమ్మల్ని ఇంతమాట అంటాడా?’ అని ఆగ్రహించారు. వారి విమర్శలు ఎలా ఉన్నా తన రంగానికే (సినిమా) చెందిన దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. పవన్ ఎలా ఉండాలో తెలియచేశాయి. వివాదాస్పద సినిమాలేక కాకుండా, వ్యాఖ్యలకు కూడా పెట్టింది పేరైన రాంగోపాల్ వర్మ ‘పిల్లిలా మారకు….పులిలా గాండ్రించు’ అని గీతోపదేశం చేశారు. రాంగో ఇంకా చాలా అన్నా ప్రధానమైంది ఇదే. ఆంధ్రా టీడీపీ నాయకుల విమర్శలకు స్పందించి వారిపై మళ్లీ విమర్శలు చేసిన పవన్, దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యపై ఏమీ కామెంట్ చేసినట్లుగా లేదు. అలా అనడం ఆయనకు రుచించలేదా? లేక తాను పిల్లినో, పులినో తేల్చుకోలేకపోతున్నాడా?
ఒత్తిడి తట్టుకోలేకే మీడియా ముందుకా?
‘జనసేన’ పార్టీ ప్రకటించిన సందర్భంగా మాట్లాడిన పవన్, మధ్యలో మరో రెండుసార్లు జనం ముందుకొచ్చారు. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చాడు. ‘జనసేన’ ప్రకటించిన సందర్భంలో ‘కాంగ్రెస్ హఠావో…దేశ్ బచావో’…అని ఆవేశంగా నినాదమిచ్చారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలిసిందే. ఓసారి ఉత్తరాంధ్రలో మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక రాష్ర్టం కోసం దేహీ..దేహీ..దేహీ అని ఎంతకాలం దేబిరించాలి? అని ఆవేశపడ్డారు. ఆ తరువాత ఏపీ రాజధాని కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన భూ సమీకరణ వ్యవహారం వివాదాస్పదం కావడంతో పవన్ తుళ్లూరు తదితర మండలాల్లో పర్యటించి అక్కడి రైతులతో మాట్లాడాడు. భూ సమీకరణను తాను వ్యతిరేకిస్తున్నానని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తానని ప్రకటించాడు. దీక్ష చేయాల్సిన అవసరం లేదనుకున్నాడో ఏమో గమ్మున ఉండిపోయాడు. హైదరాబాదులో చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడాడు. ఇది జరిగి మూడు నెలలైంది. అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పరిణామాలు జరిగాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రత్యక్షంగా ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు. నీటి తగాదాలు, విద్యుత్తు గొడవలు, చదువులపై ఘర్షణలు జరిగాయి. అసలే వాతావరణం వేడెక్కి ఉండగానే నోటుకు ఓటు కుంభకోణం బద్దలైంది. దానికి ప్రతిగా ఫోన్ ట్యాపింగ్ బాంబు పేలింది. ఇంత జరిగినా పవన్ కళ్యాణ్ ఒక్కమాటా మాట్లాడలేదు. పవన్ ఎందుకు గమ్మున కఉర్చున్నాడు? ఎందుకు నోరు విప్పడంలేదు? రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి తన అభిప్రాయాలు ఎందుకు చెప్పడంలేదు?…ఇలా అనేక ప్రశ్నలు శరపరంపరలా వచ్చాయి. ఈ విషయంలో మీడియా పవన్‌ను వెంటాడింది. రాజకీయ పార్టీల నాయకులు గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. ఒక్కమాటలో చెప్పాలంటే పవన్‌పై తీవ్రమైన ఒత్తిడి కలిగింది. మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. పవన్‌పైనే ఒత్తిడి తేవడానికి కారణం?…‘నేను నాయకులను, పాలకులను ప్రశ్నిస్తా…నిలదీస్తా’..అని అన్నాడు కాబట్టి. ఏదైతేనేం చివరకు ఒత్తిడిని తట్టుకోలేక మీడియా ముందుకు వచ్చాడు. ఒక విప్లవ వీరుడి గెటప్‌లో కనబడ్డాడు. ఆయన్ని చూసిన కొందరు సీతారామరాజు అన్నారు. కొందరు ఏసుక్రీస్తులా ఉన్నాడన్నారు. మరికొందరు చే గువేరా మాదిరిగా ఉన్నాడన్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా పవన్ కొత్తగా ఉన్నాడనేది వాస్తవం.
కొత్తగా ఏం చెప్పాడు?
పవన్ బాగా హోంవర్క్ చేసుకొని మీడియా సమావేశానికి వచ్చాడని మహా టీవీ ఎడిటర్ ఐ.వెంకట్రావ్ వ్యాఖ్యానించారు. నిజమే….చెప్పాల్సిన పాయింట్లన్నీ రాసుకొని వచ్చాడు. ఆశువుగా మాట్లాడితే అంత బ్యాలన్స్‌డ్‌గా (అన్ని పార్టీలపై విమర్శలు చేయడం) ఉండేది కాదు. ఎవరిని ఎంత డోసు ప్రకారం విమర్శించాలో అంత డోసు ప్రకారమే విమర్శించాడు. అయితే ఆంధ్రా నాయకులకు కాస్త డోసు ఎక్కువగా పడినట్లు కనబడింది. ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని కూడా విమర్శించి తాను భాజపా, టీడీపీ ‘తొత్తు’ను కానని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇద్దరు ముఖ్యమంత్రులను, ప్రధాని మోదీని నేరుగా విమర్శించకుండా జాగ్రత్త పడ్డాడు. తెలంగాణ ముఖ్యమంత్రితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో పవన్‌కు తెలుసు. తాను ఉండేది హైదరాబాదులో. ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి. ఇంకా సినిమా రంగాన్ని వదులుకోలేదు. అందుకే ‘కేసీఆర్ తెలుగు జాతి ఐక్యతకు తొలి అడుగు వేశారు’ అని ప్రశంసించారు. ఆ తొలి అడుగు ఏమిటి? విజయనగరానికి చెందిన ఆనందసాయిని యాదాద్రి ఆధునికీకరణ కార్యక్రమానికి చీఫ్ ఆర్కిటెక్చర్‌గా నియమించడం. ఈయన పవన్‌కు సన్నిహితుడే. వాస్తవానికి కేసీఆర్ ఏ అడుగూ వేయలేదు. ఒకవేళ తొలి అడుగు అనుకున్నా ఆ అడుగు ఆనందసాయి నియామకం కాదు. ‘యాదాద్రి’ పేరు ఆంధ్రాకు చెందిన చినజీయర్ స్వామి సూచిస్తే కేసీఆర్ అంగీకరించారు. ఆయన చెప్పిన ప్రకారమే మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఆయనకు పాదాభివందనం చేశారు. మరి అదేం అడుగు? కేసీఆర్‌కు దైవభక్తి ఎక్కువ. తరచుగా చండీయాగం చేస్తుంటారు. అప్పుడు ఆంధ్రా నుంచి వేద పండితులను పిలిపిస్తుంటారు. దీన్నేమంటారు? మంత్రి హరీష్‌రావును విమర్శించాడుగాని మరో మంత్రి కేటీఆర్ జోలికి వెళ్లలేదు. ఇదీ జాగ్రత్తే. పవన్ మాట్లాడిన దాంట్లో కొత్త విషయాలేమున్నాయి? తెలంగాణ జనం, ఆంధ్రా జనం ఏమనుకుంటున్నారో అవే విషయాలు చెప్పాడు. అవి వాస్తవాలే. ‘అంతర్యుద్ధం’ మాట వాడాడు. అలాంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రులు కొట్టుకుంటుంటే రెచ్చిపోవడానికి తెలుగు రాష్ట్రాల జనం పిచ్చోళ్లు కారు. వాళ్లను, వీళ్లను తిట్టేసి తన పని తాను చేశానని అనుకున్నాడు పవన్. కాని ఏమీ చేయలేదు. తన కర్తవ్యాల గురించి చెప్పలేదు. ప్రజలకు తాను ఏం చేయాలనుకుంటున్నాడో వివరించలేదు. తన గమ్యం, లక్ష్యం,బాధ్యత విశదపరచలేదు. మీరు మాట్లాడటంలేదన్నారు…చూడండి మాట్లాడాను అనే ధోరణిలో వ్యవహరించాడు.
అడుగు వేయని ఆరడుగుల బుల్లెట్టు
పవన్ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నాడని తెలియగానే జనం ఆసక్తి చూపించారు. ‘జనసేన’ పార్టీ పెడుతున్నానని ప్రకటించగానే ఘనంగా స్వాగతించారు. నిజంగానే ‘ఆరడుగుల బుల్లెట్టే’నని అనుకున్నారు. ధైర్యం నిండిన రాకెట్టేనని ఫీలయ్యారు. కొందరు ఉత్సాహవంతులు తమకు తాము జనసేన పార్టీ నాయకులుగా ప్రకటించుకున్నారు. విరాళాలు పోగు చేశారు. పార్టీ జెండాలు భుజాన వేసుకొని తిరిగారు. ఇలాంటి పనులు చేయొద్దని పార్టీ ఇంకా ఏర్పడలేదని పవన్ ప్రకటించగానే నీరుగారిపోయారు. త్వరలోనే పార్టీ నిర్మాణం జరుగుతుందని ప్రకటించిన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ జిహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. గత సాధారణ ఎన్నికల్లో టీడీపీభాజపా కూటమికి ఆయన మద్దతు ఇవ్వడం, ఆ అభ్యర్థుల తరపున విసృ్తతంగా ప్రచారం చేయడం, తెలంగాణలో కేసీఆర్‌పై నిప్పులు చెరగడం, ఆంధ్రలో టీడీపీభాజపా కూటమి అధికారంలోకి రావడానికి పవన్ ప్రచారమే కీలకంగా మారిందని మీడియాలోనూ హోరెత్తడం తెలిసిందే. ఆ సమయంలో పవర్‌స్టార్ ‘పవనాలు’ అంత బలంగా వీచాయి. నేతలను నిలదీస్తానని, అధికారంలో ఉన్నవారు తప్పు చేస్తే ప్రశ్నిస్తానని పవన్ హూంకరించిన సంగతీ తెలుసు. పవర్ స్టార్ ‘పవనం’ ఉత్తి గాలి కాదని, హోరు గాలని, ప్రభంజనమని, దాంట్లో అవినీతిపరులు కొట్టుకుపోతారని…పాపం ఆయన అభిమానులు, రొటీన్ రాజకీయ నాయకులతో విసిగిపోయి ఉన్న జనం అనుకున్నారు. తనకు సినిమాపై కూడా ఆసక్తి తగ్గిందని చెప్పుకోవడంతో ఇక పూర్తిగా రాజకీయాల్లోకి దిగిపోతాడని అనుకున్నారు. కాని జరగలేదు. ఆయన సినిమాలు ఆగలేదు. మళ్లీ ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు. ప్రస్తుతానికి ఇంటర్వెల్.
నాగ్ మేడేపల్లి