సినిమా తొలిరోజు చూసిన వారు కాస్త పెదవి విరిచారు. ఇప్పటికీ చాలా మంది అప్ టు ది మార్క్ లేదనే అభిప్రాయంతోనే వున్నారు. కానీ కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి. రికార్డులు బద్దలైపోతున్నాయి. అంతే కాదు, ఎవరూ బద్దలు కొట్టలేని కొత్త రికార్డులు తయారవుతున్నాయి. అమెరికాలో రికార్డులు మాయం..దేశవ్యాప్తంగా తొలి, మలి రోజుల రికార్డులు ఫట్. ఇప్పుడు మరింత ముందుకు అదే రేంజ్ లో వెళ్తోంది బాహుబలి.
తొలి, మలి, ఆ మర్నాడు అంటే శుక్ర, శని, ఆది కలిపి మొత్తం వరల్డ్ వైడ్ గా 150 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిందని లెక్కలుచెబుతున్నారు. తొలిరోజు డెభై కోట్లకు పైగా, మలి రోజు నలభై కోట్లకు పైగా వసూళ్లు సాగించిన బాహుబలి సండేనాడు కూడా దగ్గర దగ్గర నలభై వసూలు చేసిందని తెలుస్తోంది. అంటే మూడు రోజుల్లో 150 కోట్లు ప్రేక్షకుల నుంచి కొల్లగొట్టిందన్నమాట.
ఇక్కడ తెలుగునాట చూస్తే, బుధవారం వరకు ఇదే ఊపు కనిపించేలా వుంది. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణలో కూడా. అంటే మరిన్ని కొత్త రికార్డులు రెడీ అయిపోతాయి. పైగా ఇప్పటికీ ఆంధ్రలో చాలా చిన్నపట్టణాల్లో ఫ్లాట్ 200 రూపాయిల టికెట్ అన్నది నడుస్తోంది. అయినా జనాలు రెడీ అంటున్నారు.
అటు బాలీవుడ్ లో రెండో రోజు పుంజుకుంది. మూడో రోజు లెక్కలు తెలియాలి. నిజానికి మండే నుంచి ట్రెండ్ తగ్గుతుందని అనుకున్నారు..కానీ స్టడీగానే వుంటోంది. ఇది బుధవారం వరకు సాగుతుంది. ఆ తరువాత మళ్లీ శని, ఆది ల్లో ఊపే అవకాశం వుంది. అంటే బాహబలి బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు పండగే పండగ. ఇటీవలి కాలంలో ఇలా అందరి అదృష్టాలను మార్చేసిన సినిమా ఇదే.