ఎమ్బీయస్‌ : సునామీకి పదేళ్లు – ఒక కుటుంబానికి సంతోష ఘడియలు

2004 డిసెంబరు 26న సునామీ వచ్చింది. ఇండోనేసియాలోని ఒక కుటుంబంలో యిద్దరు పిల్లలు తప్పిపోయారు. పదేళ్ల తర్వాత సినిమా ఫక్కీలో వాళ్ల ఆచూకీ తెలియవచ్చింది. జమాలియా అనే గృహిణి, తన భర్త రంగకుటితో కలిసి…

2004 డిసెంబరు 26న సునామీ వచ్చింది. ఇండోనేసియాలోని ఒక కుటుంబంలో యిద్దరు పిల్లలు తప్పిపోయారు. పదేళ్ల తర్వాత సినిమా ఫక్కీలో వాళ్ల ఆచూకీ తెలియవచ్చింది. జమాలియా అనే గృహిణి, తన భర్త రంగకుటితో కలిసి సముద్రతీరంలో ఒక యింట్లో నివసిస్తోంది. వాళ్లకు ముగ్గురు పిల్లలు. ఆ రోజు ఉదయం 8 గంటలకు ఆమె యింటి బయట బట్టలు ఆరవేస్తూండగా సునామీ వచ్చిపడింది. దాంతో ఆమె, భర్తా ముగ్గురు పిల్లలూ  ఇంట్లోంచి బయటపడి మోటర్‌సైకిల్‌ ఎక్కి మార్కెట్‌వైపుకి దూసుకుపోయారు. కానీ అలలు వాళ్లను వెంటాడాయి. జమాలియాను, 8 ఏళ్ల ఆమె పెద్దకొడుకును లోపలికి యీడ్చాయి. కానీ యిద్దరూ కలిసికట్టుగా దేన్నో పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. ఏడేళ్ల రెండో కొడుకు ఆరిఫ్‌, నాలుగేళ్ల కూతురు జన్నా తండ్రితో వున్నారు. పిల్లలిద్దర్నీ ఒక చెక్కమీదకు ఎక్కించి తండ్రి దాన్ని గట్టిగా పట్టుకుని ఆపాడు. కానీ సునామీ తగ్గి సముద్రంలోకి నీళ్లు మళ్లీ వెనక్కి వెళుతూ వెళుతూ బలంగా గుంజడంతో అతని పట్టు జారి ఆ చెక్క నీట్లోకి వెళ్లిపోయింది. పిల్లలిద్దరూ కనుమరుగై పోయారు. వాళ్లిద్దరూ ఎక్కడో అక్కడ క్షేమంగా వుండి వుంటారనే ఆశతో తలిదండ్రులు కాలం వెళ్లదీస్తున్నారు. వాళ్ల వూరు పాడుపడింది. మకాం మార్చారు. 

జమాలియా అన్నగారు యీ మధ్య ఆమె వద్దకు వచ్చి 'నీ కూతురు జన్నా నాకు కలలో మూడురోజుల పాటు వచ్చింది. క్షేమంగా వున్నానని చెప్తోంది' అన్నాడు. జమాలియా నిట్టూర్చి వూరుకుంది. సునామీ వచ్చి పదేళ్లయిన సందర్భంగా చాలా కథనాలు వెలువడుతున్నాయి. ఆ సందర్భంగా అనాథలుగా దొరికిన వాళ్ల ఫోటోలు పేపర్లలో వస్తే ఒకదాన్ని సంపాదించి అతను జమాలియా వద్దకు వచ్చి 'ఈ అమ్మాయే మన జన్నా అని నాకనిపిస్తోంది.' అని అన్నాడు. ఇప్పుడామె 14 ఏళ్ల పిల్ల. 'అవును, నా కూతురేనని చెప్తూ కడుపులో పేగు కదులుతోంది.' అంది జమాలియా. భార్యాభర్తలిద్దరూ కలిసి వాళ్ల వూరికి 100 కి.మీ. దూరంలో వున్న వూరికి వెళ్లి వెనియాతీ అనే పిల్లను కలిశారు. 'ఈ పిల్ల సునామీ సమయంలో దొరికిన మాట నిజమే. బీచ్‌లో స్పృహ లేకుండా కనబడితే రక్షించి ఒకళ్లు కొంతకాలం పెంచారు. తర్వాత వాళ్ల వలన కాకపోతే మరొకళ్లు, ఆ తర్వాత మేము తీసుకున్నాం. మీ కూతురు అవునో కాదో తెలియకుండా మీకు అప్పగించే ప్రశ్న లేదు' అన్నారు వాళ్లు. 'పిల్లను తీసుకెళ్లి మూడు రోజుల పాటు అప్పటి పరిసరాల్లో తిప్పుతాం, గుర్తు పడుతుందేమో చూదాం' అంది జమాలియా. వాళ్ల వూరంతా ధ్వంసమై పోయింది. పాత గురుతులు ఏమీ మిగల్లేదు. వెనియాతీకి యిదంతా కొత్తగా తోచింది. అంతలోనే జమాలియా తల్లి యిల్లు కంటపడింది. సునామీ విలయంలో ఆ యిల్లు మాత్రం మిగిలింది. అది చూడగానే ఆ పిల్ల ''మా అమ్మమ్మ యిక్కడ వుండేది. తన దగ్గర కోళ్లగంప వుండేది. నాకు యీతపళ్లు పెట్టేది.'' అంటూ గుర్తు చేసుకుంది. జమాలియాకు నమ్మకం కుదిరింది యీ పిల్ల తన పిల్లే అని.

''మీరేం చెప్పినా డిఎన్‌ఏ టెస్టు చేయించందే మేం అప్పగించం'' అన్నారు పెంపుడు తలిదండ్రులు. ''అది చేయించడానికి మా దగ్గర డబ్బు లేదు'' అన్నారు జమాలియా, భర్త. చివరకు ఏ టెస్టూ లేకుండానే తీసుకెళ్లండి అన్నారు వాళ్లు. జమాలియా కథనం టీవీల్లో ప్రసారమైంది. సునామీ వచ్చేముందు ఆమె తన పిల్లలతో ఎంత సంతోషంగా వుండేదో వర్ణిస్తూ అప్పటి ఫోటోలు కూడా చూపించారు. పశ్చిమ సుమత్రాలో యింటర్నెట్‌ కేఫ్‌ నడిపే ఒకామె ఆ ఫోటోలు చూసి వులిక్కిపడింది. ఆ ఫోటోల్లో కనబడుతున్న ఏడేళ్ల కుర్రవాడే సునామీ వచ్చిన మర్నాడు తన కేఫ్‌ వద్దకు వచ్చి దిగాలుగా నిలబడితే తను జాలిపడి వాణ్ని పెంచుతోంది. వాడే వీడా? తెలుసుకోవాలని జమాలియా ఫోటోను డౌన్‌లోడ్‌ చేసి, ప్రింటవుట్‌ తన పెంపుడు కొడుకు చేతిలో పెట్టింది. అది చూస్తూనే వాడు ''ఈవిడ మా అమ్మ'' అన్నాడు. కలిసొచ్చే కాలం కాబట్టి జమాలియా కొడుకు తల్లి వద్దకు నడిచి, కాదు పరుగుపరుగున వచ్చాడు. అతనికోసం ఏ పరీక్షలు పెట్టలేదు, ఎవరూ అడగలేదు. సునామీ వాళ్లకు నష్టం చేసినా సునామీ స్మృతులు వాళ్ల నష్టాన్ని పూడ్చాయి.

ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]