విశాఖకి టాలీవుడ్‌.. ఛాన్సే లేదా.?

తెలుగు సినీ పరిశ్రమ విశాఖకు తరలి వెళ్ళిపోతుందా.? అన్న ప్రశ్న చాలాకాలంగా విన్పిస్తోంది. మరీ ముఖ్యంగా గత నాలుగేళ్ళలో చాలా సార్లు ఈ విషయమై తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ‘అబ్బే..…

తెలుగు సినీ పరిశ్రమ విశాఖకు తరలి వెళ్ళిపోతుందా.? అన్న ప్రశ్న చాలాకాలంగా విన్పిస్తోంది. మరీ ముఖ్యంగా గత నాలుగేళ్ళలో చాలా సార్లు ఈ విషయమై తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ‘అబ్బే.. చాలా కష్టం.. చెన్నయ్‌ నుంచి హైద్రాబాద్‌కి రావడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది.. ఇప్పుడు ఇంకో చోటకి వెళ్ళాలంటే అది అంత తేలిక కాదు..’ అని పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేశారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక, రెండు రాష్ట్రాల్లోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలన్న ఆకాంక్ష చాలామందిలో వుంది. హైద్రాబాద్‌లో సినీ పరిశ్రమ వున్నా, సినిమాల్ని ఇరు రాష్ట్రాల్లోనూ ప్రేక్షకులు ఆదరిస్తారనే అభిప్రాయం సినీ పరిశ్రమలో ప్రముఖంగా విన్పిస్తోంది. అందులో నిజం లేకపోలేదు. అదే సమయంలో, తమ రాష్ట్రంలోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షని గౌరవించాల్సిన బాధ్యత కూడా తెలుగు సినీ పెద్దలపై వుంది.

సినీ పరిశ్రమ ద్వారా వేలాది మందికి ఉపాధి దొరుకుతోందన్నది నిర్వివాదాంశం. నిన్న మొన్నటిదాకా హైద్రాబాద్‌ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని. హైద్రాబాద్‌లో వున్నా తిరుపతిలో వున్నా, శ్రీకాకుళంలో వున్నా ఒకే రాష్ట్రం గనుక.. ఎంచక్కా వలస వచ్చేసి, హైద్రాబాద్‌లో సెటిలైపోవడమో.. లేదంటే వున్న ఊళ్ళో ఆస్తుల్ని అలానే వుంచేసుకుని.. కేవలం ఉపాధి నిమిత్తం హైద్రాబాద్‌లో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకోవడమో జరిగేది చాలామంది విషయంలో.

అయితే ఇప్పుడు పరిస్థితులు వేరు. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక.. జనం ఆలోచనల్లోనూ ఎంతోకొంత మార్పు వస్తోంది. ‘మా రాష్ట్రంలో మాకు అవకాశాలు దొరికితే బావుండేది..’ అన్న అభిప్రాయం తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ వ్యక్తమవుతోంది. ఇదే తెలుగు సినీ పరిశ్రమలో కొంత కలవరపాటుకు కారణమవుతోంది. పోటీ పడి, రెండు ప్రభుత్వాలూ సినీ పరిశ్రమకు అభివృద్ధికి సహకరిస్తాయనడం తెలుగు సినీ పరిశ్రమలో ఆనందం నింపుతున్నప్పటికీ, ప్రాంతీయ విద్వేషాల పునాదుల మీద జరిగిన విభజనతో ఎప్పుడు ఎలాంటి తలనొప్పి వస్తుందో తెలియని టెన్షన్‌ సినీ ప్రముఖులది.

ఆ సంగతి అటుంచితే, విశాఖలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇస్తోన్న ఆఫర్స్‌ కొంతమంది సినీ ప్రముఖుల్ని అటువైపుగా ఆలోచించేలా చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత అందమైన ప్రాంతాల్లో విశాఖ జిల్లా అరకు ప్రాంతంతోపాటు, ఉభయ గోదావరి జిల్లాల్నీ ప్రముఖంగా చెప్పుకోవాలి. ‘కేవలం షూటింగ్‌ కోసమే ఆ ప్రాంతాల్ని ఉపయోగించుకోవడం కన్నా.. ఓ బ్రాంచ్‌ విశాఖలోనూ ఏర్పాటు చేసుకుంటే మంచిదే..’ అని కొందరు అభిప్రాయపడ్తున్నా, అలా బ్రాంచ్‌ ఏర్పాటు చేస్తే టాలీవుడ్‌లోనూ విభజన వచ్చే ప్రమాదం వుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

‘రెండు రాష్ట్రాల్లోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం..’ అని మొన్నామధ్య తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వ్యాఖ్యానించినా.. ఏ క్షణాన సెంటిమెంట్‌ రగిలి పరిస్థితులెలా వుంటాయో తెలియదు గనుక, పరిస్థితుల్ని సినీ ప్రముఖులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికిప్పుడైతే విశాఖ విషయంలో ఎలాంటి ఛాన్స్‌ తీసుకునే అవకాశం లేదు టాలీవుడ్‌లో. భవిష్యత్తులో మాత్రం.. అంటే రెండేళ్ళకో, మూడేళ్ళకో.. నెమ్మదిగా సినీ పరిశ్రమ కొంతవరకు కొత్త బ్రాంచ్‌ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసుకుకునేందుకు అవకాశం లేకపోలేదు. అదే జరిగితే.. ఉపాధి అవకాశాలు సినీ పరిశ్రమ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోనూ పెరుగుతాయి.