చిరంజీవి పుట్టినరోజునాడు ఆయన నటించే 150వ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుందని గతంలో వార్తలొచ్చాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయ్యాక, చిరంజీవి కేంద్రమంత్రి పదవి కోల్పోయిన విషయం విదితమే. అప్పటినుంచీ ఆయన రాజకీయాల్ని పక్కన పెట్టి సినిమాలపై ఫోకస్ పెట్టారంటూ ఊహాగానాలు విన్పించాయి. ‘ఔను, సినిమా చేస్తున్నా..’ అని చిరంజీవి కూడా చెప్పుకొచ్చారుగానీ ఆ ప్రాజెక్ట్ అసలు ఫైనల్ అయ్యిందో లేదో తెలియని పరిస్థితి.
వి.వి. వినాయక్ దర్శకత్వం వహించనున్న (?!) ఆ సినిమాని రామ్‌చరణ్ నిర్మించాల్సి వుంది. ‘అన్నయ్య సినిమాకి నేనే దర్శకుడిని..’ అని వినాయక్ చెబుతూనే వున్నాడిరకా. అయితే చిరంజీవి రాజకీయాల్ని పూర్తిగా పక్కన పెట్టేశారన్న వార్తలకి ఘాటైన సమాధానంగా మొన్నామధ్య కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ హల్‌చల్ చేశారాయన. రాజకీయ విమర్శలు అటుంచితే, ఆయన సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయినా చిరంజీవి 150వ సినిమా విషయమై సస్పెన్స్ తొలగిపోవడంలేదు.
అసలు ఇప్పట్లో చిరంజీవి చేయబోయే 150వ సినిమా వస్తుందా.? అన్నదానిపైనే క్లారిటీ లేని పరిస్థితి. కథ ఫైనలైజ్ కావడంలేదని చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పారు. అయితే ‘మళ్ళీ సినిమాల్లో నటిస్తా..’ అనే మాట చిరంజీవి రెండు మూడేళ్ళుగా చెబుతూనే వున్నారు. ‘శంకర్‌దాదా జిందాబాద్’ సినిమా తర్వాత చిరంజీవి హీరోగా సినిమాలు చేయడం మానేశారు. ‘మగధీర’ సినిమాలో కాస్సేపు అలా మెరిశారంతే.
మొత్తమ్మీద, చిరంజీవి సినిమా చేస్తున్నారంటూ వచ్చిన వార్తలతో అభిమానులు ఆనందించడం.. ఆ తర్వాత ఆ సినిమా కదలికల గురించి సమాచారం అస్సలేమీ లేకపోతే డీలా పడటం.. ఇదంతా ఓ రొటీన్ వ్యవహారంలా మారిపోయింది. ఇంతకీ, చిరంజీవి సీరియస్‌గానే రీ`ఎంట్రీ గురించి ఆలోచిస్తున్నారా.? ఏమో మరి ఆయనకే తెలియాలి.