రాజేశ్ ఖన్నా వెలుగుతూన్న రోజుల్లో మన వి.బి.రాజేంద్రప్రసాద్‌గారు ఆయన్ని బుక్ చేసి యిబ్బంది పడ్డారు. రాజేంద్ర ప్రసాద్ గారి ''దసరా బుల్లోడు'' తెలుగులో ఎంత హిట్టో తెలుసుకదా, హిందీలో ''రాజేశ్ ఖన్నా'' తీసి అక్కడా హిట్ కొడదామనుకున్నా రు. రాజేశ్ ఖన్నా అప్పటికే ''ఆరాధనా'', ''హాదీ మేరే సాథీ'' సినిమాల విజయంతో తో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారు. ఏడున్నర లక్షలు పారితోషికం తీసుకుంటున్నాడు. ఈయన ''దసరాబుల్లోడు''కు బుక్ చేయడానికి వెళితే 12 లక్షలు అడిగాడు. పైగా తన సెక్రటరీ గుర్నామ్‌సింగ్‌కు 50 వేలు అదనంగా యివ్వాలన్నాడు. అన్నిటికీ ఈయన సరేనంటూ ఓ కండిషన్ పెట్టారు. ''ప్రారంభించాక ఆర్నెల్లలో పూర్తి చేయాలి. డేట్స్ రెండునెలలు కంటిన్యువస్‌గా యివ్వాలి'' అని కండీషన్. రాజేశ్ ఖన్నా సరేనన్నాడు.
''దసరాబుల్లోడు'' సినిమా రాజేశ్‌ఖన్నాతో హిందీలో రాబోతుందని వినగానే నార్త్ ఇండియాలోని డిస్ట్రిబ్యూటర్స్ క్యూలు కట్టి అడ్వాన్సులు యిచ్చేశారు. సినిమాకు ఇంత హైప్ రావడంతో రాజేశ్ ఖన్నాకు భయం వేసింది. ''సినిమా అటోయిటో అయితే నీ కెరియర్ ఫినిష్.'' అని అతని సన్నిహితులు భయపెట్టారు. దాంతో రాజేశ్ ఖన్నా ఆలోచనలో పడ్డాడు. సినిమా వద్దనలేడు, చేయలేడు. ఇక రాజేంద్రప్రసాద్‌గార్ని తిప్పడం మొదలెట్టాడు. బొంబాయి వెళితే 'ఇక్కడికి ఎందుకండీ రావడం, మద్రాసులో షూటింగు వుంది. అక్కడకు వస్తున్నానుగా. అక్కడే మాట్లాడదాం.' అనేవాడు. సరేనని మద్రాసు వచ్చాక పొద్దున్నే వెళితే 'సాయంత్రం రండి సరదాగా కూచుందాం' అనేవాడు. సాయంత్రం అసలు విషయం తప్ప తక్కినవన్నీ మాట్లాడేవాడు. మర్నాడు పొద్దున్న, సాయంత్రం రండి, సరదా కబుర్లు….
ఇలాగ 15 రోజులు గడిచాయి. మద్రాసులో షూటింగు అయిపోయింది. ఆఖరిరోజు 'ఎయిర్‌పోర్టుకు రండి, అక్కడ మాట్లాడదాం' అన్నాడు. అక్కడ విమానం ఎక్కబోతూ ఓ కవరు చేతిలో పెట్టాడు. చూస్తే డేట్స్ షెడ్యూల్ అన్నమాట. ఈయన రెండు నెలలు వరసగా అడిగితే ఆయన నెలకు ఒకటి, రెండు రోజుల చొప్పున ఓ సంవత్సరంలో 26 రోజులు యిచ్చాడు. తక్కినవి మరుసటి ఏడాది! ఈ లెక్కన సినిమా తీయడానికి రెండు సంవత్సరాలు పడుతుందన్నమాట. రెండు నెలల్లో పూర్తి చేస్తానని మాట యిచ్చి రెండు సంవత్సరాలకు ప్లాను చేసినందుకు రాజేంద్రప్రసాద్‌కు కోపం వచ్చింది.
అతనెంత సూపర్ స్టారయినా సరేనని, శుబ్భరంగా తిట్టిపోస్తూ ఓ పెద్ద వుత్తరం రాశారు. రాజేశ్ ఖన్నా కంగు తిన్నాడు. ఈయన శాంతింపజేద్దామని చూశాడు. ''కానీ ఇలాటి చీట్‌లతో నేను పనిచేయను'' అని రాజేంద్రప్రసాద్ భీష్మించడంతో తీసుకున్న అడ్వాన్సు తిరిగి యిచ్చేశాడు. ఇక్కడితో కథ సుఖాంతం అనుకోవడానికి లేదు. దీని కారణంగా ''దసరాబుల్లోడు'' హిందీ వెర్షన్ తీయకుండానే 10 లక్షలు నష్టపోయారు రాజేంద్రప్రసాద్. రానూ, పోనూ ఖర్చులూ వాటికి చాలానే అవుతుంది కానీ మరీ యింత అవదుకదా. దీనిలో 3 లక్షల ఖర్చుకు కారణం – ఓం ప్రకాశ్! నాగేశ్వరరావుగారి అన్నగారి పాత్ర ఎస్.వి.రంగారావుది వుంది కదా, ఆ అన్నగారి పాత్రకు బుక్ చేసిన ఓంప్రకాశ్‌కు యీయన 3 లక్షలు అడ్వాన్సు యిచ్చారు. రాజేశ్ ఖన్నా ఎడ్వాన్సు తిరిగియిచ్చేశాడు కానీ యీయన మాత్రం తిరిగి యివ్వలేదు. ''రాజేశ్ ఖన్నా ఆడిన మాట తప్పాడు కానీ నేను తప్పలేదు కదా, కావాలంటే నాచేత పని చేయించుకో'' అన్నాడాయన!
*********
ఈ ఓం ప్రకాశ్ మీకు తెలుసనుకుంటాను. బట్టతల వుంటుంది. కమెడియన్‌గానూ వేస్తాడు, కారెక్టరు యాక్టర్‌గానూ వేస్తాడు. కాస్త డిసిప్లిన్ వున్నవాడు కాబట్టి మన దక్షిణాదివాళ్లు తీసిన హిందీ వెర్షన్లలో అతన్ని తప్పకుండా బుక్ చేస్తూంటారు. ఈయన సినిమాలు కూడా తీశాడు. 1948లో రిలీజైన ''లాహోర్'' అనే సినిమాలో ఆయన నటించడంతోబాటు ఆ సినిమాలో పెట్టుబడి కూడా పెట్టాడు. ఆ సినిమాకు శ్యామ్ సుందర్ అని అప్పట్లో గొప్ప మ్యూజిక్ డైరక్టర్. ఆయన ప్రతిభావంతుడే కానీ తాగుబోతు. తాగితే ఏం పేలతాడో ఆయనకే తెలియదు. ఆ రోజుల్లో ఓ కొత్త గాయని రంగంలోకి ప్రవేశించింది. శ్యామ్ సుందర్ ఆమె చేత పాట పాడించడానికి నిశ్చయించుకుని రిహార్సల్స్ మొదలెట్టాడు. హార్మనీ ముట్టడానికి ముందే మందు కొట్టాడు. దానితో ఒళ్లూ పై తెలియలేదు. భయంతో ఆ అమ్మాయి చిన్న తప్పు చేసినా సరే 'సరిగ్గా పాడు, శ్యామ్ సుందర్ పాటంటే మజాకా అనుకున్నావా?..'' అంటూ బండబూతులు కురిపించేవాడు.
ఆ అమ్మాయికి యీయనంటే గౌరవం వుంది కానీ యీ తిట్లు భరించలేకపోయింది. ఓ రోజు దణ్ణం పెట్టి వచ్చేసింది. దెబ్బకి శ్యామ్‌సుందర్‌గారికి మత్తు దిగిపోయింది. తన పాటకి న్యాయం చేకూర్చాలంటే ఆ అమ్మాయే తగినదని తెలుసుకున్నాడు. వచ్చి పాడమని కబురుపెట్టాడు. ఆమె రాలేదు. కబురు మీద కబురు పెట్టినా రాలేదు. 'పోనీ యింకోరి చేత పాడించండి' అన్నారు నిర్మాతలు. 'పాట బాగా రావాలంటే ఆ అమ్మాయే పాడాలి. ఆమె పాడకపోతే ఆ పాట వదిలేద్దాం' అన్నాడు శ్యామ్ సుందర్. 'బహారే ఫిర్ భీ ఆయేంగీ' అనే ఆ పాట ట్యూన్, లిరిక్ అందరికీ నచ్చింది. వదులుకోవడానికి వాళ్లు సిద్ధపడలేదు. అప్పుడు నిర్మాతల్లో ఒకడైన ఓం ప్రకాశ్ ఆమె వద్దకు వెళ్లాడు. అతన్ని ఆ అమ్మాయి అన్నగారిలా భావిస్తుంది. రాఖీ కూడా కట్టింది. ''చూడమ్మా, అతని మాటలు పట్టించుకోకు. వచ్చి పాడేయ్'' అన్నాడు ఓం ప్రకాశ్.
''నాలో తప్పుంటే గద్దించవచ్చు. వందసార్లు పాడమన్నా పాడతాను. కానీ ఆ బూతులేమిటి అసహ్యంగా..?' అంది ఈ అమ్మాయి.
''పాటల రికార్డింగులో నేను పక్కనే కూచుంటాను. అతన్ని పల్లెత్తుమాట అననీయను. సరేనా?'' అంటూ ఆమెను తీసుకొచ్చాడు ఓం ప్రకాశ్. దగ్గరుండి రికార్డు చేయించాడు. సినిమా, పాట రెండూ హిట్ అయ్యాయి. ఇంతకీ ఆ నవగాయనిపేరు చెప్పలేదు కదూ – ఆమె పేరు లతా మంగేష్కర్! – (సశేషం) (ఫోటోలు- ఓం ప్రకాశ్)
– ఎమ్బీయస్ ప్రసాద్