బాహుబలి సినిమా ప్రదర్శించిన థియేటర్ల లెక్క తెలుస్తుంది కానీ, వేసిన షోలకు లెక్కా జమా లేదు. అన్ని ప్రదర్శనలు వేసారు. ఇప్పుడు తెలుగు వెర్షన్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్ల మేరకు షేర్ సాధించిందని అంచనా వేస్తున్నారు. ఇది అసలు కనీ వినీ ఎరగని ఓపెనింగ్. హిందీ, తమిళ, కన్నడ వెర్షన్లు అదనం.
నిజంగా ఇది నభూతో న భవిష్యతి. ఓ పెద్ద సినిమా బడ్జెట్ మొత్తంతో సమానం ఈ ఒక్క రోజు షేర్. బాహుబలి ప్రారంభించినపుడు కూడా ఈ మాదిరి హైప్ ను ఊహించి వుండరు. అసలు ఈ హైప్ చూస్తుంటే ట్రేడ్ వర్గాలకు మతిపోతోంది.
థియేటర్ల మీదకు ఈ జనం దండయాత్ర ఏమిటి? టికెట్ ల కోసం క్యూలు బారులు తీరడం ఏమిటి? నాలుగైదు రోజులకు రాష్ట్రంలో అన్నిథియేటర్లు, అన్ని షోలు ఒకే సినిమా మానియాతో ఊిగిపోవడం ఏమిటి? సాధారణంగా డివైడ్ టాక్ వచ్చాక, కలెక్షన్లపై ప్రభావం పడుతుంది.
కానీ ఇక్కడ అసలు ఆ టాక్ నే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓసారి చూసేద్దాం అన్నది తప్ప మరేమీ కాదు. తీరా చూసాక,అంత లేదు అంటున్నారు. కానీ ఎవరూ చూడకుండా వుండాలని మాత్రం అనుకోవడం లేదు. ఈ ట్రెండ్ ఇలా ఒక్కరోజు కొనసాగితే చాలు..బాహబలి బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, ఇంట్లో రాజమౌళి ఫొటో పెట్టేసుకోవచ్చు.