ఒక సినిమా.. ఐదు భాషల్లో..!

ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాష పేక్షకులకు పరిచయం చేయడానికి అనువైన ప్రక్రియల్లో డబ్బింగ్ మొదటిది.. రీమేక్ రెండోది. కొన్ని సినిమాలు డబ్బింగ్ చేస్తే చాలనిపిస్తాయి.. మరికొన్ని సినిమాలు సినిమా వాళ్లకే…

ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాష పేక్షకులకు పరిచయం చేయడానికి అనువైన ప్రక్రియల్లో డబ్బింగ్ మొదటిది.. రీమేక్ రెండోది. కొన్ని సినిమాలు డబ్బింగ్ చేస్తే చాలనిపిస్తాయి.. మరికొన్ని సినిమాలు సినిమా వాళ్లకే రీమేక్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇలాంటి ఉత్సాహాన్ని అనేక మందికి ఇచ్చే సత్తా ఉంటుంది కొన్ని సబ్జెక్టులకు!  అవి అనేక మందిని ఆకట్టుకొంటాయి.. అనేక భాషల్లో రీమేక్ అవుతాయి! స్ట్రెయిట్ కథాంశాలకు ధీటుగా.. ఎక్కడిక్కడ లోకల్ పేక్షకులను ఆకట్టుకొనే సత్తా ఉంటుంది ఆ సబ్జెక్టులకు. భారతీయ సినిమా చరిత్రలో అలాంటి సినిమాలెన్నో ఉన్నాయి. అలాంటి సినిమా ఆసక్తికరమైన విశేషాలు ఇవి.

ఈ మధ్యకాలంలో చూసుకొంటే.. ‘మర్యాద రామన్న’ సినిమాను ప్రస్తావించుకోవాలి. హలీవుడ్ సినిమా ‘‘అవర్ హాస్పిటాలిటీ’’ స్ఫూర్తితో రూపొందించిన ఈ సినిమా మొదటగా తెలుగులో వచ్చింది. ఈ కథాంశానికి రాజమౌళి ఇచ్చిన ట్రీట్‌మెంట్ తెలుగు వారిని తెగ ఆకట్టుకొంది. తెలుగులో సినిమా సూపర్ హిట్ అయ్యింది. అంతే.. ఈ సినిమా అనేక మంది భారతీయ చలనచిత ప్రముఖులను ఆకట్టుకొంది. ముందుగా కన్నడ వాళ్లు దీన్ని రీమేక్ చేశారు. ఆ తర్వాత తమిళులు దీన్ని తిరగతీశారు. ఇక హిందీలో అజయ్ దేవగణ్ వంటి స్టార్‌హీరో ఈ సినిమాను రీమేక్ చేశాడు. ఆ తర్వాత మలయాళంలో రీమేక్ అయ్యింది. ఈ విధంగా ఈ సినిమా ఐదు భారతీయ భాషల్లో రీమేక్ అయిన ఘనతను సంపాదించుకొంది.

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘విక్రమార్కుడు’ కూడా ఇలాంటి ఘనతనే కలిగిన సినిమా. మొదటగా తెలుగు.. తర్వాత తమిళం.. అటుపై కన్నడ.. ఆ తర్వాత హిందీ, మధ్యలో బెంగాలీలో రీమేక్ అయ్యింది ఈ సినిమా. 

అలాగే ‘‘దృశ్యం’’ ఈ సినిమా మలయాళంలో మొదటగా రూపొంది యావత్ దేశాన్నే ఆకట్టుకొంటోంది. మలయాళం తర్వాత ఈ సినిమాను తెలుగు వాళ్లు టేకప్ చేశారు. తెలుగులో వెంకీ హీరోగా రూపొందిన ఈ సినిమా ఆ వెంటనే కన్నడలో రూపొంది హిట్ కొట్టింది. గత వారంలో ఈ సినిమా కమల్ హీరోగా తమిళంలో రీమేక్ అయ్యి  అక్కడా విజయం సాధించింది. త్వరలోనే హిందీలో రీమేక్ కాబోతోంది. ఈ విధంగా నాలుగు దక్షిణాది భాషల్లో హిందీతో కలిపి ఐదు భాషలను పూర్తి చేసుకొంది ఈ సినిమా.

ఇలా ఐదు భాషల్లో రీమేక్ అయిన ఘనత ఎక్కువగా మలయాళ సినిమాలకే దక్కుతూ వస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన కథా ‘‘పర్యంబోల్’’ అనే మలయాళ సినిమా కూడా పలు భాషల్లో రీమేక్ అయ్యింది. మలయాళంలో శ్రీనివాసన్- మమ్మూట్టీలు ప్రధాన పాతలు చేసిన ఆ సినిమాను తెలుగు, తమిళ, హిందీల్లో రీమేక్ చేశారు. ఇక మలయాళ చిత్రమే అయిన ‘చందముఖి’ కూడా ఇలానే పలు భాషల్లో రూపొందింది. ఎప్పుడో మలయాళంలో వచ్చిన ఆ సినిమమాను కన్నడలో రీమేక్ చేశారు. అక్కడ హిట్ అయ్యే సరికి.. తమిళ, తెలుగుల కోసం రజనీకాంత్ హీరోగా రూపొందింది. హిందీలో కూడా ఆ సినిమాను రీమేక్ చేశారు. ఈ విధంగా ఆ సబ్జెక్టు ఐదు భాషల సినీ ప్రియులను రీచ్ అయ్యింది.

అలాగే మరో మలయాళ సినిమా ‘బాడీగార్డ్’ కూడా విభిన్న చిత్ర పరిశమల్లోని ప్రముఖులను ఆకర్షించింది. తెలుగులో వెంకీ దాన్ని రీమేక్ చేయగా..తమిళంలో కూడా ఆ సినిమా రీమేక్ అయ్యింది. బాలీవుడ్‌లో దాన్ని సల్మాన్ ఖాన్ రీమేక్ చేశాడు! ప్రస్తుతం మరో మలయాళ బొమ్మ పలు భాషల్లో రీమేక్ అవుతోంది. అదే ‘బెంగళూరు డేస్’ ఈ సినిమా తమిళ వెర్షన్ ఇప్పటికే రెడీ కాగా.. తెలుగు వెర్షన్ ప్రతిపాదనలో ఉంది. కన్నడ, హిందీల్లో కూడా ఈ సినిమా రీమేక్ ప్రతిపాదనలున్నాయి.

ఇంతే కాదు.. ఇలా పలు భాషల్లో రూపొందిన మలయాళ సినిమాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు హిట్లర్. ఈ సినిమా మమ్ముట్టీ హీరోగా మొదట వచ్చింది. ఆ దశలో ఫ్లాఫుల్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేశాడు. సూపర్ హిట్‌ను దక్కించుకొన్నాడు. తమిళంలో ఈ సినిమాను సత్యరాజ్ రీమేక్ చేశాడు. కన్నడలో విష్ణువర్ధన్ రీమేక్ చేశాడు. హిందీలో సునీల్ షెట్టి హీరోగా ఐదుగురు చెల్లెళ్ల ముద్దుల అన్నయ్య సినిమా రీమేక్ అయ్యింది. ఆ విధంగా ఐదు భాషల వారిని రీచ్ అయ్యింది.

అలాగే తెలుగులో ‘పెద్దరికం’ పేరుతో వచ్చిన జగపతి బాబు సినిమా ముందుగా మలయాళంలో రూపొందింది. తర్వాత తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ అయ్యింది. తెలుగులో ‘ధనలక్ష్మీ ఐ లవ్యూ’ పేరుతో వచ్చిన కామెడీ పీస్ ఒరిజినల్ వెర్షన్ మలయాళ బొమ్మనే. ఇదే ‘హేరాఫెరీ’గా హిందీలో వచ్చింది. తమిళంలో కూడా రూపొందింది. కన్నడ ప్రేక్షకులను కూడా అలరించింది ఈ సినిమా. 

వెంకటేష్ హీరోగా నటించగా మనకు పరిచయం ఉన్న ‘చంటి’, ’అబ్బాయిగారు’ సినిమాలు కూడా ఐదు భాషల సినిమాలే. ‘‘అబ్బాయిగారు’’ సినిమా మొదటగా మలయాళంలో వచ్చింది.. ఆ తర్వాత వరసగా.. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ అయ్యింది. అన్ని చోట్లా స్టార్ హీరోలు నటించిన సినిమా హిట్ అయ్యింది. ‘‘చంటి’’ సినిమా మొదటగా తమిళంలో ఆ తర్వాత తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చింది. కొన్ని చోట్ల బాగానే ఆడింది మరికొన్ని చోట్ల ప్లాఫ్ అయ్యింది.

ఎస్వీకృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘శుభలగ్నం’ సినిమా కూడా పలు భాషల్లో స్టార్ హీరోల చేతిల్లో పడింది. తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రీమేక్ అయ్యింది. ఇలా పలు భాషల్లో రూపొందిన కొన్ని సినిమాల్లో ఒక చోట హిట్ అయ్యి మరికొన్ని చోట్ల ప్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ‘‘ముత్తు’’ సినిమా ముందుగా మలయాళంలో రూపొందింది. ఆ సబ్జెక్టును రజనీకాంత్ రీమేక్ చేసి.. తెలుగు, తమిళ భాషల్లో హిట్ కొట్టాడు. అయితే ఇదే సినిమా హిందీ కోసం రజనీకాంత్‌తోనే రీమేక్ అయ్యింది. అది అక్కడ అట్టర్ ప్లాఫ్ అయ్యింది. 

తవ్వి తీస్తే.. ఒక నాలుగైదు భాషల్లో రీమేక్ అయిన సబ్జెక్టులు ఎన్నో కనిపిస్తాయి. డబ్బింగుల రూపంలో కాకుండా.. స్టార్ హీరోలే రీమేక్ చేసిన సినిమాలెన్నో కనిపిస్తాయి. ఆ సినిమాలను అభిమానించే ప్రేక్షకులకు ఈ రీమేక్ కబుర్లు కచ్చితంగా ఆసక్తికరమైనవే.