పింగళి నాగేంద్రరావు గారిది బందరు. ''రారాజు'', ''వింధ్యరాణి'' అనే నాటకాలు రాసి చాలా పాప్యులర్ అయ్యారు. ''తారుమారు'' (1942) అనే సినిమాకు పింగళి మాటలు, పాటలు రాశారు. ''వింధ్యరాణి'' (1948)కి కూడా రాస్తే అది ఫెయిలయింది. అపజయంతో యింటికి తిరిగి వెళ్లాలాని సంశయిస్తూ వుంటే బందరు వారే అయిన కమలాకర కామేశ్వరరావు ఆయన్ని కెవి రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. కెవికి ఎప్పుడూ ఎక్స్‌క్లూజివ్ రైటరు కావాలి. ''భక్త పోతన'' ''యోగి వేమన''లకు సముద్రాలే రైటరు. తర్వాత ఆయనకు మంచి పారితోషికాలతో బయట నుంచి ఆఫర్లు వస్తూ వుంటే ''ఫ్రీ లాన్సర్‌గా ఏ సినిమాల కయినా రాసుకో'' అని పంపించి వేశారు. తను తీయబోయే జానపద చిత్రానికి తన కోసమే పనిచేసే రైటర్ ఎవరైనా వున్నారా అని వెతుకుతూంటే పింగళి పరిచయమ్యారు. ఆయనతో ''గుణసుందరి కథ'' రాయించుకున్నారు. అది హిట్. ఆ తర్వాత ''పాతాళభైరవి''. అదీ హిట్. ఇక కెవికి ఆయన పర్మనెంటు రైటరు అయిపోయారు. ఆయన సొంత సినిమాలు ''శ్రీకృష్ణార్జున యుద్ధం'', ''పెళ్లినాటి ప్రమాణాలు'', ''భాగ్యచక్రం''కు కూడా ఆయనే రాశారు.
ఇన్ని సినిమాలకు రాసినా బిఎన్ రెడ్డికి పింగళి నచ్చలేదు. ఆయన ''మల్లీశ్వరి'' సినిమాకు రైటరు గురించి చూస్తూ వుంటే కెవి ''నా ''గుణసుందరి కథ''కు పింగళి బాగా రాశారు కదా, ఆయన చేత రాయించుకో బ్రదర్'' అన్నారు. ''ఆయనది ఎరుకల యానాది భాష! 'గిడిగిడి', 'మామగోరు' లాటివి (గుణసుందరి కథలో శివరావు డైలాగులు) నాకు నచ్చవు'' అన్నారు. అలాగే కెవి ''పెద్దమనుషులు''కు రైటరు గురించి చూస్తూ వుంటే బియన్ ''మా కృష్ణశాస్త్రి చేత రాయించుకుని, రాజేశ్వరరావును మ్యూజిక్ డైరక్టరుగా పెట్టుకో'' అన్నారు. ''నాకీ మహావులు, జీనియస్సులు వద్దు బ్రదర్ అన్నారు'' కెవి. ఆయన భయానికి తగ్గట్టే విశ్వనాథ సత్యనారాయణ గారితో ఆయన సిటింగ్స్ బెడిసి కొట్టాయి.
గౌరీనాథ శాస్త్రి అనే గొప్ప నటుడు వుండేవారు. వాహినీవారి ''భక్త పోతన''లో శ్రీనాథుడు, ''పెద్దమనుషులు'' సినిమాలో మెయిన్ విలన్ వేషాలు ఆయనే వేశారు. ''పెద్దమనుషులు'' తీసేనాటికే ఆయన ''గీతాంజలి'' అనే సినిమా తీసి ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. ఫ్లాపయిన తన సినిమాకు మార్పులు ఏవైనా చేసి మళ్లీ షూట్ చేసి విడుదల చేయాలని అనుకుని డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళితే ''మీరు కెవి రెడ్డి గారి సినిమాలో పని చేస్తున్నారు కదా, ఆ మార్పులేవో ఆయన చేసి మళ్లీ షూటింగు చేస్తే మేం పెట్టుబడి పెడతాం'' అన్నారు. ఇక ఆయన కెవి రెడ్డిని మొహమాట పెట్టసాగాడు. కెవికి తన సినిమాతో సతమతమవుతూ కూడా శాస్త్రిగారి వేధింపు భరించలేక పగలు షూటింగయ్యాక, రాత్రి భోజనానంతరం యింట్లో ''గీతాంజలి'' సినిమా మార్పులు, చేర్పులపై చర్చ మొదలుపెట్టారు. శాస్త్రిగారు తన స్నేహితులు విశ్వనాథ సత్యనారాయణగారిని తీసుకుని వచ్చారు. లింగమూర్తి అనే సాహిత్యవాసనలున్న నటుడు కెవికి సన్నిహితుడు. ఆయన్నీ కూర్చోబెట్టారు. హీరో హీరోయిన్ల మధ్య ఒక శృంగార ఘట్టం. డైలాగులు రాసి రేపు తెస్తాను అన్నారు విశ్వనాథ. తెచ్చాక చదవనారంభించారు – ''మాధవీ! నేను చచ్చిన వెనుక నా ఆత్మ నీ చుట్టునే తిరుగుచుండును'' అని హీరో అంటాడు. కెవి నిర్ఘాంతపోయారు. శుభమా అని శృంగారం రాయమంటే యీయన తొలి వాక్యమే చావుతో మొదలు పెడతాడేమిటని. ఆయన గొప్ప రచయిత కానీ సినిమాలకు పనికి రాడు అని లోపల అనుకున్నా ఆ ముక్క ఆయనకు చెప్పడం ఎలా? ఇలా కొన్ని రాత్రులు చర్చలతో గడిచాక విశ్వనాథ వారే పరిస్థితి గ్రహించి ''నా వల్ల కాదయ్యా! మీ ఏడుపు ఏదో మీరే ఏడవండి'' అని వెళ్లిపోయారు.
''ఉమా చండీ గౌరీ శంకరుల కథ'' ఫెయిల్ కావడంతో నాగిరెడ్డి, చక్రపాణి కెవి యూనిట్‌ను (పింగళితో సహా) మూసేసి నెలజీతాలు ఆపేశారు. 1950 నుంచి 17, 18 సంవత్సరాలు నికరాదాయంతో స్థిమితంగా కాలం గడిపిన పింగళికి జీవితంలో అభద్రత తోచింది. తన యింటిని ఘంటసాలగారికి చాలా చౌకగా అమ్మేసి మేడమీద పోర్షన్‌లో అద్దెకుండేవారు. కింద పోర్షన్‌ను ఘంటసాల వేరేవారికి అద్దెకిచ్చారు. 1970 ప్రాంతంలో ఆయనకు గొంతు కాన్సర్ వచ్చింది. ఎన్టీయార్ తనకు తెలిసిన డాక్టరుకు ఫోన్ చేసి వెల్లూరు హాస్పటల్‌కు పంపారు. పింగళి ఎన్టీయార్ సొంత సంస్థకై ''శ్రీకృష్ణ సత్య'', ''చాణక్య చంద్రగుప్త'' స్క్రిప్టులు రాసి యిచ్చేశారు. వెల్లూరులో కాస్త తగ్గి, మద్రాసు వచ్చాక మళ్లీ హెచ్చి, చివరకు ఇంట్లోనే వుంటూ కోబాల్ట్ చికిత్స తీసుకునేవారు. ఓ రోజు డివి నరసరాజుగారు ఆయన యింటికి వెళితే ''నాకు కోబాల్టు చికిత్స నెలరోజుల్లో అయిపోతుంది. అయ్యాక మా స్వస్థలం బందరు వెళ్లిపోతాను. ఇంట్లో వున్న వస్తువులన్నీ అమ్మేస్తున్నాను. వెండి సామాను, సినిమా శతదినోత్సవాలకు యిచ్చిన వెండి కప్పులు అమ్మేశాను. ఇక లైబ్రరీ వుంది. అమ్మి పెట్టమని ఆరుద్రకు చెపితే అనంతపురంలో ఎవరో వున్నారన్నారు కానీ యిప్పట్లో జరిగేట్టు లేదు. మీకైతే ఆ లైబ్రరీ వుపయోగపడుతుంది. తీసుకుంటారా?'' అన్నారు. నరసరాజు ''లైబ్రరీ అమ్మవద్దు. డబ్బు కావాలంటే చెప్పండి యిస్తాను'' అన్నారు. ''ఎంతో అక్కరలేదు, వెయ్యి రూపాయలుంటే చాలు'' అన్నారు పింగళి. మర్నాడు డబ్బు యిచ్చినపుడు పింగళి గట్టిగా కావలించుకుని ''మీకు కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియటం లేదు. నా దగ్గరున్న డబ్బును బందరు దగ్గర దూరపు బంధువులకు అప్పు యిచ్చాను. ఇవిగో ప్రామిసరీ నోట్లు. కానీ వాళ్లు ధాన్యం అమ్మితేగానీ యివ్వలేమంటున్నారు.'' అని కన్నీళ్లు పెట్టుకున్నారు. నరసరాజుగారు వారించినా తను పోయిన తర్వాత కొన్ని పుస్తకాలు తన జ్ఞాపకార్థం అంటూ ఆయనకు పంపించే ఏర్పాటు చేశారు పింగళి.
ఆయన బ్రహ్మచారి. తల్లితో వుండేవారు. వంటమనిషి వంట చేసి పెట్టేది. తల్లి పోయాక వంటమనిషి కొడుకు రామమూర్తిని యింట్లో పెట్టుకుని వయొలిన్ నేర్పించారు. అతని కూతురికి కాలేజీ చదువు చెప్పించారు. వాళ్లు కూడా సొంత బంధువుల్లాగానే యీయన్ని చూసుకున్నారు. తనకు రావలసిన డబ్బు గురించి ఎన్టీయార్ వద్దకు, సాయం చేస్తారేమో కనుక్కోమని నాగిరెడ్డి గారి వద్దకు రామమూర్తిని పంపిస్తే ఇంటర్వ్యూలే దక్కలేదుట. ఇది జరిగిన కొన్ని రోజులకు పింగళి పోతే ఆ యింటర్వ్యూల విషయం నరసరాజు ఆరా తీశారు. ఎన్టీయార్ సినిమాల విషయంలో రెమ్యూనరేషన్ సంగతి ఎలా మాట్లాడుకున్నారో కానీ రామారావుగారు అనుకున్న పైకం మొత్తం యిచ్చేశాననే ఉద్దేశంలో వున్నారు. పింగళి తనకు యింకా రావాలనే అభిప్రాయంలో వున్నారు. ఇక నాగిరెడ్డిగారితో నరసరాజుగారు పింగళి ఆఖరి రోజుల పరిస్థితి చెపితే ఆయన బాధపడుతూ ''నా కెవ్వరూ చెప్పలేదండి. ఆయన మన కంపెనీకి 15 ఏళ్లకు పైగా పనిచేశారు. మంచి సినిమాలకు రాశారు. ఆయన పరిస్థితి తెలిస్తే నేను వూరికే వుండేవాణ్నా? ఎంతమందికి సహాయం చెయ్యలేదు?'' అన్నారట. ఇదంతా ''అదృష్టవంతుని ఆత్మకథ''లో రాసిన డివి నరసరాజుగారు దీనికి ముక్తాయింపుగా ''ఈ పెద్దపెద్దవాళ్లతో యింటర్వ్యూల విషయంలో సామాన్యంగా జరిగేదేమిటంటే – వాళ్లకి పర్శనల్ సెక్రటరీలనో, లేక గేటులో బంట్రోతులనో వుంటారు. యజమానికి, వచ్చిన మనిషికి గల సంబంధం వాళ్లకి తెలియక 'ఇంట్లో లేరు' అనో 'బిజీగా వున్నారు, యిప్పుడు వీలుపడదు' అనో చెప్పి పంపించి వేస్తారు. పింగళి విషయంలో అలాటిదేదో జరిగి వుంటుంది' అని రాశారు. (సశేషం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2015)