ఎమ్బీయస్‌: వినోద్‌ మెహతా – 25

వినోద్‌ మెహతాకు స్థిరత్వం లేదన్న ప్రచారాన్ని ''ఔట్‌లుక్‌'' అబద్ధం చేసింది. అతని సారథ్యంలో ఆ పత్రిక ముందుకు సాగింది. అతను కూడా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటిదాకా ప్రస్తావించిన సంఘటనల ద్వారా అధికారులు,…

వినోద్‌ మెహతాకు స్థిరత్వం లేదన్న ప్రచారాన్ని ''ఔట్‌లుక్‌'' అబద్ధం చేసింది. అతని సారథ్యంలో ఆ పత్రిక ముందుకు సాగింది. అతను కూడా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటిదాకా ప్రస్తావించిన సంఘటనల ద్వారా అధికారులు, వ్యాపారవేత్తలు, వివిధ వర్ణాల రాజకీయ నాయకులు పత్రికలను ఎలా నియంత్రించాలని చూస్తారో పాఠకులకు అర్థమై వుంటుంది. ప్రతివాళ్లూ పత్రికలు తమ పాజిటివ్‌ సైడ్‌నే చూపాలి తప్ప, నెగటివ్‌ సైడ్‌ను చూపకూడదనే కోరుకుంటారు. చూపిస్తే మండిపడతారు, శిక్షించాలని చూస్తారు. ఇలా ఎన్ని సంఘటనలు చెప్పుకుపోయినా యిదే విషయం మాటిమాటికీ రుజువౌతుంది, పేర్లు మారతాయంతే. అందువలన వినోద్‌ కథకు మనం ముక్తాయింపు పలకవచ్చు. అయితే దానికి ముందు అతనికి విపరీతంగా పేరు దానితో పాటు కష్టాలు తెచ్చిపెట్టిన నీరా రాడియా టేపుల వ్యవహారం మాత్రం విపులంగా తెలుసుకోవాలి. వాటిని బయట పెట్టిన పత్రిక ''ఔట్‌లుక్‌'' కాబట్టి, (వాళ్ల కంటె ఒక్క రోజు ముందు ''ఓపెన్‌'' అనే పత్రిక కూడా ప్రచురించింది) అవి వాళ్లకు ఎలా చేరాయో వినోద్‌ వంటి యిన్‌సైడర్‌ మాత్రమే చెప్పగలడు. అందువలన ఆ ఉదంతం ఆసక్తికరంగా వుంటుంది.

''ఔట్‌లుక్‌''లో రాజకీయ విభాగం చూసే అజిత్‌ పిళ్లయ్‌తో వినోద్‌ రోజూ 11 గంటలకు ఆఫీసులో భేటీ వేస్తూ వుంటాడు. అజిత్‌ ప్రెస్‌ క్లబ్‌లో చాలా సేపు గడుపుతూ, రకరకాల పుకార్లను మోసుకుని వస్తాడు. 2010 ఫిబ్రవరిలో ఓ రోజు అజిత్‌ ఒక 8 పేజీల నోట్‌ పట్టుకుని వచ్చాడు. అది నీరా రాడియా అనే లాబీయిస్టు అనేకమంది పారిశ్రామికవేత్తలతో, రాజకీయ నాయకులతో, జర్నలిస్టులతో జరిపిన సంభాషణల సారం అని చెప్పాడు. దాన్ని నమ్మాలో లేదో తెలియక వూరుకున్నారు. ఇంకో రెండు రోజులు పోయాక అజిత్‌ ఇంకో 14 పేజీల సమాచారం తెచ్చాడు. అది సిబిఐకు, సిబిడిటి (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరక్ట్‌ టాక్సెస్‌)ల మధ్య అఫీషియల్‌ కరస్పాండెన్స్‌. అది నమ్మదగ్గదానిగానే వున్నా, దానికి జోడించిన రతన్‌ టాటా – ముకేశ్‌ అంబానీ – బర్ఖా దత్‌ – వీర్‌ సంఘ్వీ – రాడియా సంభాషణ నమ్మడానికి వీల్లేనట్లుంది. పైగా వాటి మీద సంతకాలు లేవు. వీళ్లందరూ కలిసి రాజా చేతుల్లోంచి దయానిధి మారన్‌ చేతుల్లోకి టెలికామ్‌ పోర్టు ఫోలియో జారిపోకుండా వుండడానికి ప్రయత్నిస్తూన్నట్లు తోస్తోంది. దానిలో పాత్రధారులుగా వున్నవారికి యిటువంటి యిమేజి లేకపోవడం చేత యీ దశలో కథనం ప్రచురిస్తే నవ్వులపాలు అవుతామని సీనియర్‌ ఎడిటర్లు అందరూ అభిప్రాయపడ్డారు. దాంతో దాన్ని పక్కన పడేశారు. ఆ పై వారం అజిత్‌ వచ్చి ''నాకు దీన్ని సంపాదించి యిచ్చినవారు త్వరగా పబ్లిష్‌ చేయమని ఒత్తిడి చేస్తున్నారు'' అన్నాడు. ''ఎవరు వారు?'' అంటే ''టెలికామ్‌ బిజినెస్‌లోనే వున్న ఒక కార్పోరేట్‌ సంస్థకు సంబంధించినవారు..'' అన్నాడు. ''అలా అయితే వెయ్యకపోవడం మంచిదైంది'' అనుకున్నారు వినోద్‌, సహచరులు. వీళ్లతో పాటు అనేక పత్రికలకు వాళ్లు యిదే సమాచారం అందించారు. చిన్న పత్రికల వాళ్లు 'గాసిప్‌' కాలమ్‌లో కొద్దికొద్దిగా వేసి వూరుకున్నారు. పెద్ద పత్రికలు మాత్రం ముట్టుకోలేదు. సంభాషణల్లో యితరుల మాట ఎలా వున్నా రతన్‌ టాటా వుండడం వలన అందరూ ఆలోచనలో పడ్డారు. టాటాలకు మంచి పేరు వుంది. పైగా వాళ్ల గ్రూపుతో చెడగొట్టుకుంటే యాడ్‌ ఆదాయం పూర్తిగా పోతుంది. 

ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి. గౌరవ్‌ ఘేయ్‌ అనే గోల్ఫ్‌ ఆటగాడు కలకత్తాలో టూర్నమెంటు ఆడడానికి వెళ్లి కాడ్‌బరీ చాక్‌లెట్‌ కొంటే దానిలో పురుగులు కనబడ్డాయి. అతను మర్నాడే ప్రెస్‌ కాన్ఫరెన్సు పెట్టి కాడ్‌బరీని చెరిగేశాడు. సమావేశానికి వచ్చిన పత్రికల్లో, టీవీ ఛానెల్లో ఒక్కరు కూడా అతని ఫిర్యాదును ప్రచురించలేదు. కాడ్‌బరీకి కోపం వచ్చి యాడ్స్‌ ఆపేస్తుందని భయం. అతను వినోద్‌ పొరుగింట్లో వుంటాడు. వచ్చి చెప్పుకున్నాడు. వినోద్‌ ''ఔట్‌లుక్‌''లో ఆ చాక్‌లెట్‌ ఫోటో వేసేశాడు. అంతే కాడ్‌బరీ మేనేజర్లు బొంబాయి నుంచి వీళ్ల ఆఫీసుకు వచ్చారు. ''మీరు వేసినది అబద్ధమని అనం. 10 వేల పీసెస్‌లో ఏదో ఒక దానికి అలా వస్తుంది. ఆ మాట కొస్తే అమెరికాలో యూరోప్‌లో యితర తయారీదారులకు కూడా యిలాటి యిబ్బందులు పడుతూ వుంటారు. ఈ మాత్రానికి మీరు యాగీ చేయడం బాగా లేదు'' అన్నారు. (తాజాగా వచ్చిన మ్యాగీ వివాదం గుర్తు తెచ్చుకోండి) కానీ వినోద్‌ చలించలేదు. చివరకు వాళ్లు షాపుల్లో ఆ చాక్‌లెట్లు పెట్టిన డబ్బాలు శుభ్రంగా లేకపోవడం చేత పురుగులు పట్టాయని ఒప్పుకుని దేశం మొత్తం మీద ఆ డబ్బాలన్నీ వెనక్కి తెప్పించుకున్నారు. ఇలాటిది జరగాలంటే యాడ్‌ ఆదాయం గురించి పట్టించుకోని పబ్లిషరు కావాలి. టాటాలకు కోపం తెప్పిస్తే పత్రిక మూసుకోవాలన్న భయంతో అందరూ ఆగిపోయారు. ఆ రోజు రాత్రి వీర్‌ సంఘ్వీ ఇటలీ నుంచి వినోద్‌కు ఫోన్‌ చేసి ''వచ్చే వారం నా పరువు తీసే ఆర్టికల్‌ ఏదో వేయబోతున్నావని విన్నాను..'' అని అడిగాడు. అబ్బే లేదే అన్నాడు వినోద్‌. జర్నలిస్టులుగా తమకున్న ఖ్యాతి పోతుందని అతనూ, బర్ఖా దత్‌ భయపడ్డారు. ప్రతిపక్షంలో వున్న అరుణ్‌ జైట్లే 2జి స్కాండల్‌ గురించి పార్లమెంటులో ప్రసంగించ బోతున్నాడని తెలిసి, బర్ఖా అతని వద్దకు వెళ్లి రాడియా టేపుల్లో తన పాత్ర గురించి ప్రస్తావించవద్దని కోరిందట.
 

వినోద్‌ యింతే రాశాడు. తమ చేతికి వచ్చిన మందుగుండు సామగ్రి వంటి సమాచారాన్ని వీళ్లు ప్రచురించడానికి ఎందుకు జంకారో తెలుసుకోవాలని యింకా వివరాల కోసం అజిత్‌ పిళ్లయ్‌ రాసిన ''ఆఫ్‌ ద రికార్డ్‌'' పుస్తకాన్ని చదివాను. అజిత్‌ రాసినది – 'నా చేతికి వచ్చిన 14 పేజీల నోట్‌లో మొదటి 5 పేజీలు ఇన్‌కమ్‌టాక్స్‌ శాఖకు, సిబిఐకు మధ్య జరిగిన కరస్పాండెన్సు. అది వాళ్ల లెటర్‌హెడ్స్‌ మీద వుంది. అయితే 'ఇంటర్నల్‌ ఇవాల్యుయేషన్‌ రిపోర్ట్‌' పేర దానికి ఎటాచ్‌ చేసిన తక్కిన పేజీలన్నీ మామూలు కాగితం మీద వున్నాయి. సంతకాలు లేవు. పైగా ప్రింటవుట్ల జిరాక్సు కాపీలు. అది నాకు ఇన్‌కమ్‌టాక్స్‌ డిపార్టుమెంటు సిబ్బంది నుంచే వచ్చినా ఎవరో కార్పోరేట్ల తరఫున వాళ్లు నాకు యిచ్చి వుంటారని తోచింది. ఎందుకంటే దానిలో వాడిన భాష ఆఫీసు కరస్పాండెన్సులో వాడే భాషలా లేదు. కార్పోరేట్లు వాడే స్టయిలైజ్‌డ్‌ ఇంగ్లీషులో వుంది. ఒక కార్పోరేటు పోటీ కార్పోరేట్‌పై బురద చల్లడానికి యిలాటి కాగితాలు పుట్టించడం మామూలే. వాటిని నమ్మి ప్రచురిస్తే పత్రికలకు దెబ్బ. అందుకే ఆగాం. 2010 నవంబరులో రాడియా కాల్స్‌ వున్న సిడి మా చేతికి వచ్చాక అవి విని, యీ నోట్సును వెరిఫై చేయబోతే మాకు అర్థమైనదేమిటంటే – ఆ నోట్సు ఎవరో కార్పోరేటు ఉద్యోగి తయారు చేసినా అతను రాడియా టేపులన్నీ విన్నాకనే అది తయారుచేశాడు. దానిలో వున్నవన్నీ వాస్తవాలే. అయితే భాష కారణంగా మాకు అనుమానం వచ్చింది.' (సశేషం) 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2015)

[email protected]

Click Here For Archives