మోటర్లకు మీటర్లు.. లాభమెంత? నష్టమెంత?

రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడానికే ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఈ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించేశారు. ఈ ఏర్పాటు వలన రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మిలియన్ యూనిట్ల…

రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడానికే ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఈ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించేశారు. ఈ ఏర్పాటు వలన రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 

అదే నిజమైతే.. విద్యుత్తు పరంగా, కొరత రూపంలో ఎదురవుతున్న చాలా సమస్యలకు ఇది పరిష్కారం అవుతుంది. పరిశ్రమలకు విద్యుత్తు అందుబాటులో ఉండడం కూడా మెరుగు పడుతుంది. విద్యుత్తు కోతలు తగ్గుతాయి. ప్రజల మీద భారం కూడా తగ్గుతుంది. ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలను బట్టి.. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించడం వలన.. 30 శాతం విద్యుత్తు ఆదా అవుతున్నది. ఇది చిన్న విషయం కాదు. అనేకానేక సమస్యలకు పరిష్కారం. 

వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు బిగించాలనే అభిప్రాయానికి వచ్చిన తర్వాత.. ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో దీనిని అమలు చేసింది. అప్పట్లోనే యాంటీ-జగన్ సమూహాల నుంచి ఈ నిర్ణయంపై నిరసనలు, వ్యతిరేకత వెల్లువెత్తాయి. రైతుల్లో భయాలు, అనుమానాలు పుట్టించే ప్రయత్నం జరిగింది. అయితే ఇవేమీ ఖాతరు చేయకుండా.. జగన్ తాను చేయదలచుకన్న పనిచేసుకుంటూ పోయారు. 

ఇప్పుడు పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళంలో అమలు చేయడం వలన ఫలితాలు వారికి తెలిసి వచ్చాయి. 30 శాతం విద్యుత్తు ఆదా, ఆ ఒక్క జిల్లాలో మీటర్ల వలన 33.75 మిలియన్ యూనిట్ల కరెంటు మిగులు అనేవి తెలిసొచ్చాయి. కాబట్టి, రాష్ట్రవ్యాప్తంగా మీటర్లు బిగించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

విద్యుత్తు ఆదా కావడం వంటి విషయాలన్నీ వాస్తవమే కావొచ్చు. కానీ.. ప్రజలు, రైతులు ఆ విషయాలను అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారా? మీటర్లు పెడితే ఏదేదో జరిగిపోతుందని ప్రతిపక్షాలు, వామపక్షాలు, యాంటి జగన్ శక్తులు చేస్తున్న ప్రచారం వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుందా? లేదా, జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న విద్యుత్తు ఆదా అనే సంగతి ప్రజలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుందా? అనేది చాలా కీలకమైన విషయం!

విద్యుత్తు ఆదా లాంటి మాటలు జనానికి ఎంత మేరకు రిజిస్టర్ అవుతాయనేది కీలకం. విద్యుత్తు ఆదా కావడం వలన రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందించడం సాధ్యం అవుతుంది అని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఇది నిజమే కావచ్చు.. మోటార్లు కాలిపోయే దుస్థితి ఉండని నాణ్యమైన విద్యుత్తు వారికి అందుతూ ఉండవచ్చు. కానీ.. మీటర్ల వలన ఎన్నటికీ కూడా రైతుల విద్యుత్తు వినియోగాన్ని బేరీజు వేసి.. ఎక్కువ వాడుతున్న వారికి కొత్తగా వడ్డించడం అనే ప్రక్రియ ఏదో ఒక రూపంలో మొదలు కానంత వరకు అంతా బాగానే ఉంటుంది. 

మీటర్లు పెట్టడం వలన.. మన ప్రభుత్వం చేతికి చిక్కుతున్నాం, ప్రభుత్వం మన మీద నిఘానేత్రం పెట్టింది.. విద్యుత్తు వినియోగాన్ని ఇతర సంక్షేమ పథకాలకు ముడిపెడుతుంది అనే తరహా భయాలు ప్రజలకు కలిగాయంటే ప్రభుత్వానికి చాలా నష్టం జరుగుతుంది. 

గృహవినియోగ విద్యుత్తు విషయంలోనే 300 యూనిట్లు అనేది ప్రభుత్వం ఒక మార్క్ కింద పెట్టుకుంది. ఆ వినియోగం దాటిన వారికి పలు సంక్షేమ పథకాలను కత్తిరిస్తున్నారు. ఒక నెలలో అలా వినియోగం దాటినా కూడా.. శాశ్వతంగా సంక్షేమ పథకాల్ని రద్దు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడం వలన.. మన వాడకాన్ని ప్రత్యేకంగా గమనిస్తున్నారు. దానిని ఇతర విషయాలు ముడిపెడతారు అనే అనుమానం ప్రజలకు కలగకుండా చూసుకున్నంత కాలం.. మీటర్ల వలన మేలే జరుగుతుంది.