ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాల మార్పునకు వేళైంది. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ, ఇప్పటి నుంచే సమరానికి రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ ఎప్పట్లా ఒంటరిగానే బరిలోకి దిగనుంది. వైసీపీకి వ్యతిరేకంగా ఏకమయ్యే పార్టీల గురించే చర్చంతా. పొత్తుల్లేకుండా వైసీపీని ఎదుర్కోవడం అసాధ్యమని టీడీపీ, జనసేన అధినేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు వారి మాటలు చెబుతున్నాయి.
తాజాగా మరోసారి చంద్రబాబునాయుడు పొత్తులపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు చర్చ జరుగుతోంది. కాకినాడలో ఆయన మాట్లాడుతూ ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలిసిరావాలి. ప్రజా ఉద్యమం రావాలి. దానికి టీడీపీ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని చంద్రబాబు స్నేహ హస్తాన్ని చాచారు. పొత్తులపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఆలోచనల్లో భావసారూప్యత ఉంది. దీంతో పొత్తు కుదుర్చుకోవడం వరకూ ఇబ్బంది తలెత్తదు.
అయితే పొత్తు కుదుర్చుకున్నంత ఈజీగా క్షేత్రస్థాయిలో రాజకీయాలు సవ్యంగా సాగవు. 2014లో టీడీపీ-బీజేపీ కూటమికి జనసేనాని మద్దతు పలికారు. పొత్తు, మద్దతు మధ్య చాలా తేడా వుంటుంది. ఈ సూక్ష్మ సీరియస్ అంశాన్ని చంద్రబాబు, పవన్ గుర్తించాల్సి వుంటుంది. 2014లో జనసేనాని మద్దతు తమకు కలిసొచ్చిందని, ఇదే 2024లో పునరావృతం అవుతుందని టీడీపీ నేతలు పదేపదే అంటున్నారు. అలా అనుకుంటే బోల్తా పడడం ఖాయం.
జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు.. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తాం’ అని పవన్ ప్రకటించారు. దీనికి తాను నాయకత్వం వహిస్తానని పవన్ స్పష్టం చేశారు. చంద్రబాబు కూడా ఇదే మాట అంటున్నారు. జగన్‌పై వ్యతిరేక ఉద్యమానికి టీడీపీ నాయకత్వం వహిస్తుందని ఆయన కాకినాడ వేదికగా తేల్చి చెప్పారు.
నాయకత్వం అంటే ఏంటి? ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన అసెంబ్లీ సీట్లు వస్తే… ముఖ్యమంత్రిగా తామే వుంటామని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. బహుశా జనసేన శ్రేణుల్ని సంతృప్తిపరచడానికి పవన్ కూడా ఇదే రకమైన అభిప్రాయంతో చెప్పి వుంటారని అనుకోవచ్చు. టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకుంటే ….సీఎం అభ్యర్థి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఇరు పార్టీల కార్యకర్తల్ని, నాయకుల్ని సంతృప్తిపరిచాల్సి వుంటుంది.
అలాగే 2014లో జనసేనాని మద్దతుకు పరిమితమై, ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. కానీ ఈ దఫా అలా కుదరదు. ఈ నేపథ్యంలో సుమారు 75 అసెంబ్లీ స్థానాలు కావాలని జనసేనాని డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇన్ని చోట్ల టీడీపీ ఆశావహుల పరిస్థితి ఏంటి? తమ నాయకత్వానికి ఎసరు పెడితే ఎవరైనా ఊరుకుంటారా? చంద్రబాబు వ్యూహాత్మకంగా త్యాగాలకు సిద్ధం కావాలని తన పార్టీ నాయకులకు పిలుపు ఇవ్వడం వరకు బాగుంది. మరి ఆచరణ సాధ్యమా? చంద్రబాబును సీఎం చేసేందుకు తామెందుకు బలి కావాలని జనసేన శ్రేణులు ఆలోచిస్తే పరిస్థితి ఏంటి? గతంలో 2014లో బాబును సీఎం చేసి, ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందో జనసేన ప్రధాన ఓటు బ్యాంక్ అయిన కాపులకు బాగా తెలుసు.
సీఎంగా పవన్‌కల్యాణ్ పేరును ప్రకటించే దమ్ము, ధైర్యం, త్యాగం టీడీపీకి ఉన్నాయా? అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ఎటూ చంద్రబాబు త్యాగానికి సిద్ధమని అన్నారు కాబట్టి, ప్రకటించాలని జనసేన కండీషన్ పెడితే, రాజకీయ సమీకరణలు ఇట్లే వుంటాయా? హిందూపురంలో జనసేనకు టికెట్ కేటాయిస్తామంటే… చాలా సంతోషం బావగారు అని బాలకృష్ణ అనగలరా? ఎటూ ఎక్కడా సీటు లేని లోకేశ్‌ను త్యాగం చేయాలని అడిగితే… సరే అంటారా? పొత్తులకు వెళ్లే ముందు టీడీపీ గుర్తు చేసుకోవాల్సింది 2009 ఎన్నికలను.
నాడు ఇదే పరిస్థితుల్లో రెండోసారి వైఎస్సార్‌ను సీఎం కాకుండా అడ్డుకోవాలనే వ్యూహంతో మహాకూటమి పేరుతో టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు ఏకమయ్యాయి. నాడు తెలంగాణలో టీఆర్ఎస్ నిలిచిన సీట్లలో కనీసం నాలుగో వంతు కూడా గెలవలేని పరిస్థితిని అసెంబ్లీ వేదికగా వైఎస్సార్ ఎండగట్టిన సంగతి తెలిసిందే.
2009లో అందరూ ఏకమైనా ప్రజలు ఎందుకు ఆదరించలేదో టీడీపీ ఆత్మపరిశోధన చేసుకోవాలి. అలాగే 2018లో తెలంగాణలో కేసీఆర్‌ను పడగొట్టేందుకు రాజకీయంగా బద్ధ శత్రువులైన కాంగ్రెస్, టీడీపీ కలిసినా ఫలితాలేంటో చూశాం. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదుర్చుకున్నంత మాత్రాన విజయం ఖాయమని ఊహల్లో విహరిస్తే వెన్ను విరగక తప్పదు. పొత్తు వల్ల లాభనష్టాలను బేరీజు వేసుకుని ముందడుగు వేయాల్సి వుంటుంది.
ఉదాహరణకు పొత్తులో భాగంగా టికెట్ ఇచ్చేది లేదని అచ్చెన్నాయుడికి చెప్పండి చూద్దాం…ఆయన ఊరుకుంటారేమో! అధికారాన్ని వదులుకోడానికి ఎవరూ సమ్మతించరు. అది రాజకీయ లక్షణం. కావున ఇల్లలకగానే పండగ కానట్టే… పొత్తు కుదిరినంత మాత్రాన అధికారంలోకి వచ్చినట్టే అనే భ్రమల నుంచి టీడీపీ బయటపడితే మంచిది.
సొదుం రమణ