మరో రెండేళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాయత్తం అవుతున్నారు. గత నెలలో పాత కేబినెట్ రద్దు చేశారు. పాత, కొత్త కలయికతో ఎన్నికల కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. మంత్రి పదవులు పోయిన, అలాగే ఆశించి భంగపడిన వారిని పిలిపించుకుని వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పటికే కొంత మందిని ఓదార్చారు. ముఖ్యంగా సమీప బంధువు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తీవ్రంగా కలత చెందిన సంగతి తెలిసిందే. బంధువు పరిస్థితి అట్లా వుంటే, ఇక మిగిలిన వాళ్ల మనోగతం ఏంటో ఊహించుకోవడం కష్టం కాదు.
పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో జగన్ కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. టీడీపీపై గట్టిగా మాట్లాడ్డం లేదని, ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులైన తమపై ప్రతిపక్ష నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని జగన్ ప్రశ్నిస్తున్నారనేది హాట్ టాపిక్ అయ్యింది. దీన్ని బట్టి జగన్ అన్నీ గమనిస్తున్నారని అర్థమవుతోంది. వైసీపీలో ప్రమాద ఘంటికలను గుర్తించినందుకు జగన్‌ను మెచ్చుకోవాలి. అయితే ఎక్కువ మంది మంత్రులు, ఎమ్మెల్యేలు మౌనాన్ని ఎందుకు ఆశ్రయించారో జగన్‌కు ఇంకా అర్థం కానట్టుంది. దీనంతటికి జగన్ వైఖరే కారణమని చెప్పక తప్పదు.
మరోసారి అధికారంలోకి రావాలని జగన్ కోరుకుంటున్నట్టే, ప్రతి ప్రజాప్రతినిధికి తనకంటూ కొన్ని లెక్కలుంటాయి. జగన్ మనసులో ఏమున్నదో పసిగట్టలేని అమాయక ప్రతినిధులెవరూ లేరు. రెండేళ్లలో జరిగే ఎన్నికల సమరానికి తన ఎమ్మెల్యేలకు జగన్ దిశానిర్దేశం చేశారు. సర్వే నివేదిక ఆధారంగానే రానున్న రోజుల్లో సీటు ఇస్తానని, గెలుపే ధ్యేయంగా భవిష్యత్‌లో కఠిన నిర్ణయాలుంటాయని జగన్ హెచ్చరించారు.
అలాగే పేర్ని నాని, కొడాలి నాని లాంటి బలమైన జగన్ మద్దతురాలకు కూడా కేబినెట్‌లో దక్కకపోవడం వైసీపీ ఎమ్మెల్యేలకు ఓ హెచ్చరికగా పని చేసింది. ఎవరినైనా జగన్ పక్కన పెడతారనేందుకు ఈ ఇద్దరు నాయకుల ఉదంతమే నిదర్శనం. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే తలంపు ప్రజాప్రతినిధుల్లో రావడం సహజమే. ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత కూడా వైసీపీ ప్రజాప్రతినిధులను ఆందోళనకు గురి చేస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దూకుడు మీద ఉండడాన్ని వైసీపీ ప్రజాప్రతినిధులు గమనిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్న నేపథ్యంలో ప్రజానాడిని పసిగడుతున్న వైసీపీ ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ మంది మౌనమే ఉత్తమ మని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే జగన్ సర్వే పేరుతో టికెట్ ఇస్తారో, ఇవ్వరో అనే భయం అధికార పార్టీ ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు చంద్రబాబు, టీడీపీ నేతలపై అనవసరంగా విమర్శలు గుప్పించి, అక్కడ కూడా అవకాశం లేకుండా ఎందుకు చేసుకోవాలనే ఆలోచనే వైసీపీ ఎమ్మెల్యేలు, చివరికి అమాత్య పదవి దక్కించుకున్న వాళ్ల నోళ్లను కట్టి పడేస్తోంది.
ఏపీలో సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించడానికి లేదు. ఇక మిగిలిన అభివృద్ధి మాటేమిటి? అనే ప్రశ్నకు జవాబు వెతుక్కోవాల్సి వస్తోందని అధికార ఎమ్మెల్యేలు, ఎంపీల వాదన. ఈ మూడేళ్లలో ప్రభుత్వ సానుకూల అంశాలు ఉన్నప్పటికీ, ఇదే సమయంలో ప్రతికూల అంశాలు అంతకు మించి ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలే చెబుతున్నారు. ముఖ్యంగా రైతుల్లో ప్రభుత్వంపై చెప్పుకోతగ్గ సానుకూలత లేదు.
గతంలో రైతులు పంటల బీమా చెల్లించేవాళ్లు. పంటలకు భారీ మొత్తంలో సంబంధిత ఇన్స్యూరెన్స్ కంపెనీల నుంచి నష్టపరిహారం పొందేవాళ్లు. అయితే జగన్ వచ్చిన తర్వాత ప్రభుత్వమే బీమా సొమ్ము చెల్లిస్తుందని, తాను రైతుల పక్షపాతి అని నమ్మ బలికారు. గతంలో వైఎస్సార్ రైతులకు దన్నుగా నిలబడడంతో, కొడుకు కూడా అలాగే వుంటారని ఆశించిన వాళ్లకు నిరాశ ఎదురైంది. జగన్ బీమా సొమ్ము చెల్లించక పోవడం వల్లే తాము నష్టపరిహారానికి నోచుకోలేదని రైతాంగం గుర్రుగా ఉంది.
సంక్షేమ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ఏంటో వైసీపీ ప్రజాప్రతినిధులకు బాగా తెలుసు. అందుకే చంద్రబాబు, లోకేశ్‌లపై వైసీపీ మెజార్టీ ప్రజాప్రతినిధులు నోరు జారడం లేదు. అందుకే మీడియా అంతా టీడీపీ వాయిసే మార్మోగుతోంది. అడపాదడపా జగన్ మాట్లాడితే తప్ప వైసీపీ వాదన మీడియాకు పట్టడం లేదు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ, మరోసారి అధికారంలోకి వస్తుందా? అంటే …ఏమో చెప్పలేం అని మెజార్టీ ప్రజానీకం నుంచి సమాధానం వస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రజాప్రతినిధుల మౌనం వెనుక కారణం ఏంటో జగన్‌కు త్వరలో తెలిసొచ్చే అవకాశం ఉంది.
సొదుం రమణ