ఎమ్బీయస్‌ : మన్‌మోహన్‌ పట్ల జాలి పడాలా? – 2

 సిబిఐ స్పెషల్‌ కోర్టు మాత్రం తాలాబిరా 3 వ బ్లాకు గురించి మాట్లాడకుండా 2 వ బ్లాకు గురించే మాట్లాడుతూ, అది హిందాల్కోకు కేటాయించినట్లు చెపుతోంది. ఈ 2, 3 బ్లాకుల మర్మం, కేటాయింపు…

 సిబిఐ స్పెషల్‌ కోర్టు మాత్రం తాలాబిరా 3 వ బ్లాకు గురించి మాట్లాడకుండా 2 వ బ్లాకు గురించే మాట్లాడుతూ, అది హిందాల్కోకు కేటాయించినట్లు చెపుతోంది. ఈ 2, 3 బ్లాకుల మర్మం, కేటాయింపు జాయింటు వెంచర్‌కా, హిందాల్కోకు మాత్రమేనా అన్న ధర్మసూక్ష్మం స్పష్టంగా తేలితే తప్ప మన్‌మోహన్‌ నిర్ణయం తప్పో కాదో తెలియదు. ఈ వివాదం చెలరేగినప్పుడు 2013 అక్టోబరు 19 న ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ద్వారా విడుదల చేసిన ప్రధాని కార్యాలయం బులెటిన్‌లో కూడా ప్రభుత్వసంస్థలకు 85% వాటా వున్న జాయింటు వెంచర్‌కు 2, 3 బ్లాకులు కేటాయించినట్లు స్పష్టం చేశారు. దానిలోంచి విడిగా ఒక ముక్క బయటకు లాగి చూస్తామంటే ఎలా? అందుకే సిబిఐ 'మన్‌మోహన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఏమీ లేవు' అంటూ స్పష్టం చేసి వుండవచ్చు. 

ఏది ఏమైనా తక్కినవాళ్లు ఎత్తి చూపేదాకా ఆగకుండా మన్‌మోహన్‌ దేశప్రజలను విశ్వాసంలోకి తీసుకుని జరిగినదేమిటో ప్రకటించాలి. కేటాయింపు జాయింటు వెంచర్‌కు చేసినా, తర్వాత పరిణామాలు ఏం జరిగాయి? ప్రభుత్వ సంస్థలను తప్పించారా? హిందాల్కోయే మొత్తమంతా తవ్వుకుపోతోందా? అది చెప్పకుండా మన్‌మోహన్‌ తనకు మినహాయింపు కావాలంటూ సుప్రీం కోర్టుకి వెళ్లడం, కాంగ్రెసు పార్టీలో హేమీహేమీలు కపిల్‌ సిబ్బల్‌, చిదంబరం, అభిషేక్‌ సింఘ్విల చేత కేసు వాదింపచేసుకుని సమన్లు కొట్టించేసుకోవడం సబబు కాదు. కాంగ్రెసు పార్టీ మన్‌మోహన్‌ పక్షాన నిలుస్తాం అంటూ నిరసనలు చేపట్టడం వలన కుంభకోణం తప్పకుండా జరిగిందన్న నమ్మకం ప్రజల్లో మరింత గాఢంగా నాటుకుంటుంది. సాధారణ ప్రజలందరికీ తెలుసు – యుపిఏ పాలనలో అవినీతి విపరీతంగా జరిగిందని. మన్‌మోహన్‌ సొంతానికి డబ్బు తీసుకోలేదనీ, తన చేతికి మట్టి అంటుకోకుండా సోనియానే ఆయన చేత అన్ని దిక్కుమాలిన పనులూ చేయించిందని కూడా ప్రజలు అనుకుంటారు. ఒకవేళ అదే నిజమైనా మన్‌మోహన్‌కు అదేమీ ఘనత కలిగించే విషయం కాదు. ఆయన ప్రజల పక్షాన ప్రధానమంత్రి. సోనియా యింటి పాలేరు కాదు. ప్రజాధనాన్ని కాపాడవలసిన మనిషి, దాన్ని దొంగలు ఎత్తుకుపోతూ వుంటే చూస్తూ వూరుకుంటే తప్పు కదా! ఇంటికి కాపలాగా పెట్టుకున్న సెక్యూరిటీ గార్డు పడి నిద్రపోతూ వుంటే మెచ్చి మేకతోలు కప్పుతామా? తన్ని తగిలేస్తామా? మొన్న ఎన్నికలలో అందుకే ప్రజలు కాంగ్రెసును చిత్తుగా ఓడించారు. మన్‌మోహన్‌ కేసులో ఆయన నిద్రపోలేదు, సోనియా చెపితే కళ్లు మూసుకుని కూర్చున్నాడు. ఆయన వ్యవహారశైలి గురించి సంజయ్‌ బారు రాసినది గుర్తు చేసుకోవాలి. 2009 ఎన్నికలు మన్‌మోహన్‌ గెలిచినవే. అప్పణ్నుంచి ఆయన 'నా యిష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాను, లేకపోతే దిగిపోతాను' అనాల్సింది. దానికి బదులు ఆయన మరీమరీ కీలుబొమ్మగా అయిపోయాడు. ఎందువలన? పదవీవ్యామోహమా? 

ఆ పదవిలో వుండి ఆయన కొన్ని రంగాల్లో కొన్ని మంచిపనులు చేయలేక పోలేదు. కానీ మొత్తం మీద బాలెన్స్‌ షీటు వేసి చూస్తే దేశానికి, ఆయన యిమేజికి జరిగిన నష్టమే ఎక్కువ. వ్యక్తిగతంగా ఆస్తులు వెనకేసుకోనప్పుడు, కీర్తి తెచ్చుకోనప్పుడు సోనియాయో, రాహులో చెప్పినట్లల్లా ఆడడం దేనికి? బ్లాక్‌మెయిల్‌ చేశారా? బ్లాక్‌మెయిల్‌కు గురయ్యేటంత తప్పేమీ చేశాడీయన? మామూలు పౌరుల కంటె విద్యావంతులకు సమాజం పట్ల బాధ్యత ఎక్కువ. వివేకానందుడి దగ్గర్నుంచి అందరూ అదే మాట చెప్పారు. ఉన్నతవిద్యను, ఉన్నతోద్యోగాలను, అంతర్జాతీయ కీర్తిని కట్టబెట్టిన మాతృదేశం పట్ల మన్‌మోహన్‌ వంటి మేధావి ఏ బాధ్యతా లేదా? కేవలం సోనియా చెప్పిన చోటల్లా సంతకం పెట్టడానికి ఆత్మ అమ్ముకోవాలా? ఈ కేసులో మన్‌మోహన్‌ దొరక్కపోవచ్చు, మరో దానిలో దొరకవచ్చు, దానిలో కూడా సిబిఐ ద్వారా ఏదో మతలబు చేయవచ్చు. ఫైళ్లు మాయం కావచ్చు. నా ఆఫీసుకి మట్టి అంటుకోకుండా దడి కట్టుకుని మడి పాటించాను కాబట్టి నేను సేఫ్‌ అని మన్‌మోహన్‌ అనుకోవడం దుర్మార్గం. కాబినెట్‌లో ఒక్కో మంత్రి జైలుకి వెళుతూ వుంటే వైకేరియస్‌ లయబిలిటీ (సంక్రమించే బాధ్యత) ఆయనకు వుండదా? ఈ కేసు బయటకు రాగానే కాంగ్రెసు పార్టీ చేసిన పాపాలకు మన్‌మోహన్‌ మూల్యం చెల్లించాల్సి వస్తోందని బిజెపి, దాని మిత్రపక్షాలు జాలి పడుతూ ప్రకటనలు చేశాయి. అలాటి ఆయనపై జాలి పడాలా? మరి యీ దేశప్రజలపై ఎవరు జాలిపడాలి?  పాపాలు కాంగ్రెసు పార్టీ మాత్రమే కాదు, మన్‌మోహనూ చేశారు. ఎవరి పాపానికి వారు మూల్యం చెల్లించడం న్యాయం. గడుసువాళ్లు తప్పించుకుంటే తప్పించుకోవచ్చు. 

అసలు యీ కేసులో మన్‌మోహన్‌కి సమన్లు యివ్వడంలోనే ఒక ప్లాను వుందేమో తెలియదు. అగాథా క్రిస్టీ నవల ఒకదానిలో (''ద మిస్టీరియస్‌ ఎఫైర్‌ ఎట్‌ స్టయిల్స్‌'' అనుకుంటా) ఒకడు హత్య చేస్తాడు. పోలీసులు ప్రాథమిక ఆధారాలతో అతనిపై కేసు పెట్టబోతారు. డిటెక్టివ్‌ అతను నిర్దోషి అని వాదిస్తాడు. పోలీసులు వదిలేస్తారు. డిటెక్టివ్‌ తన పరిశోధన కొనసాగించి తిరుగులేని సాక్ష్యాలు సంపాదించి, అప్పుడు పోలీసులను కేసు పెట్టమంటాడు. వాళ్లు తెల్లబోతారు – నువ్వేగా నిర్దోషి అని గతంలో చెప్పావ్‌? అని. అప్పుడు అతను వివరిస్తాడు – 'ఇంగ్లండ్‌ చట్టాల ప్రకారం ఒక వ్యక్తిపై ఒక అభియోగం రెండుసార్లు మోపలేం (డబల్‌ జెపార్టీ అంటారు) అరకొర సాక్ష్యాలతో మీరు మొదట్లో పెట్టిన కేసు ముందుకు సాగితే కేసు వీగిపోయి, అతను నిర్దోషిగా విడుదల అయ్యేవాడు. ఎందుకంటే అవన్నీ అతను కల్పించిన తప్పుడు సాక్ష్యాలే. విచారణ సమయంలో వాటిని తిరగకొట్టే ఎలిబయ్‌లు అతను సిద్ధంగా పెట్టుకున్నాడు. ఒకసారి అతను బయటకు వచ్చేసిన తర్వాత ఎన్ని సాక్ష్యాలు దొరికినా అతన్ని బోనెక్కించలేరు. అందుకే అప్పుడు తప్పించాను.' అని. ఇప్పుడు మన్‌మోహన్‌పై పెట్టిన కేసులో జాయింటు వెంచర్‌కు 2, 3 బ్లాకులు ఎలాట్‌ చేశారని, హిందాల్కో ఒక్కదానికీ యివ్వలేదని తేలిందనుకోండి. అప్పుడు దురుద్దేశం అంటగట్టలేరు. ఎందుకంటే 85% వాటా ప్రభుత్వ సంస్థలదే. కేసు కొట్టేస్తే ప్రజలకు జాలి కలుగుతుంది. ఈ కేసు తర్వాత సవ్యమైన కేసు పెట్టినా అదీ బోగస్సే అనుకోగలరు. ఇదంతా రాజకీయ దురుద్దేశంతో సాగుతోంది అని కాంగ్రెసు గగ్గోలు పెట్టగలదు. జనతా పార్టీ పాలనలో చరణ్‌ సింగ్‌ యిలాగే అరకొర సమాచారంతో జీప్‌ స్కాండల్‌లో ఇందిరా గాంధీని అరెస్టు చేయించాడు. ఆమె నానా యాగీ చేసింది. చివరకు కేసు నిలవలేదు. ప్రజల సానుభూతి, జనతా పార్టీ అనైక్యత తోడై ఇందిరా గాంధీ 1980లో తిరిగి అధికారం చేపట్టింది. ఈ హిందాల్కో వ్యవహారంలో నా అనుమానాలకు కారణం – పరేఖ్‌ చూపుతున్న స్థయిర్యం! కేసు ముందుకు నడిచిన కొద్దీ స్పష్టత వస్తుంది.  

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]

Click Here For Part-1