వరల్డ్ కప్‌లో సంచలనాలే కాదు, వివాదాలూ తెరపైకొస్తున్నాయి. అంపైరింగ్ విషయంలో బంగ్లాదేశ్ చాలా సీరియస్ అవుతోంది. నాకౌట్ మ్యాచ్‌లో టీమిండియా చేతిలో పరాజయాన్ని చవిచూసిన బంగ్లాదేశ్, ఆ మ్యాచ్‌లో రోహిత్‌శర్మ ఔటయి వుంటే తామే విజయం సాధించేవాళ్ళమనే భావనతో వుంది. రోహిత్‌శర్మ బంతిని గాల్లోకి లేపడం, అది కాస్తా బంగ్లా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళడం.. సరిగ్గా ఆ టైమ్‌లో అంపైర్ నో బాల్ ప్రకటించడంతో బంగ్లాదేశ్ డీలాపడింది.
ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటిదాకా రెండుసార్లు బంతి వికెట్లను తాకినా వికెట్లకు, బెయిల్‌కి వున్న ఎల్‌ఈడీ బల్బులు వెలిగీ, బెయిల్స్ పైకెగరలేదు. దాంతో బౌలర్లు నిరాశపడ్డారు. రివ్యూలకు వెళ్ళినా నాటౌట్ అని తేలింది. అలాగని ఆ సందర్భాల్లో అంపైరింగ్‌నో, లేదంటే రివ్యూ సిస్టమ్‌నో ఎవరూ విమర్శించలేదు. కానీ బంగ్లా అలా కాదు, తమకు అన్యాయం జరిగిందంటూ వ్యవహారాన్ని రాద్ధాంతం చేసే పనిలో బిజీగా వుంది.
బంగ్లా జట్టు ఎంత బలమైనదో ప్రపంచ క్రికెట్‌లో ప్రతి ఒక్కరికీ తెలుసు. టీమిండియాపై బంగ్లా గెలవడం అంటే అది అసాధ్యమని అనలేంగానీ, టీమిండియా నిర్లక్ష్యంతో వుంటేనే జరుగుతుంది బంగ్లా గెలుపు. సరే ఆటల్లో గెలుపోటములు సహజం.. అనుకుంటే అసలు వివాదమే లేదు. బంగ్లా అలా అనుకోకపోవడంతోనే సమస్య వస్తోంది.
వాస్తవానికి అంపైరింగ్ తప్పిదాలకు ఎక్కువ బలైపోయింది ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా ఆటగాళ్ళే. మరీ ముఖ్యంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్‌ద్రావిడ్.. అంపైరింగ్ బాధితుల లిస్ట్‌లో ఫస్ట్ వుంటారు. ‘నాకు బాగా నచ్చిన ఆటగాడు సచిన్..’ అని చెప్పే చాలామంది అంపైర్లు సచిన్ ఔట్ కాకపోయినా, ఔటని ప్రకటించేసిన సందర్భాలెన్నో. తమ తప్పుడు అంపైరింగ్ కారణంగా ఔటయిన సచిన్‌కి చాలామంది అంపైర్లు ‘క్షమాపణ’ కూడా చెప్పారు. ద్రావిడ్ విషయంలోనూ ఇలా చాలాసార్లు జరిగింది. సచిన్‌గానీ, ద్రావిడ్‌గానీ తప్పుడు అంపైరింగ్‌తో తాము ఔటయ్యామని ఎక్కడా వ్యాఖ్యానించలేదు.
క్రికెట్ అనేది జెంటిల్‌మెన్ గేమ్. ఆటలో అన్నీ వుంటాయి. ఎత్తులు, పైయెత్తులే కాదు, పరిమితులకు లోబడి ప్రత్యర్థిని కవ్వించడం కూడా జరుగుతుంటుంది. ఒక్కోసారి ఆటగాళ్ళు సంయమనం కోల్పోతారు. కొన్ని సందర్భాల్లో అంపైరింగ్‌లో తప్పులు దొర్లుతుంటాయి. ఇవన్నీ క్రికెట్‌లో భాగం. ఓడిపోయాక, తమ ఓటమికి కారణం ఇదీ.. అని విశ్లేషించుకోవడంలో తప్పులేదుగానీ, తమ ఓటమికి తప్పు ఇంకొకరిదనే వ్యాఖ్యలు చేయడం, వివాదాలు సృష్టించడం క్రికెట్‌కి మంచిది కాదు. ‘పసికూన’ బంగ్లా ఈ విషయంలో చాలా నేర్చుకోవాల్సి వుంది.