చిన్న సినిమాలు, కంటెంట్ రిచ్ ఉన్న సినిమాల్ని నిర్మించేందుకు దిల్ రాజు ప్రొడక్షన్స్ స్థాపించాడు దిల్ రాజు. హర్షిత్, హన్షితలను నిర్మాతలను చేశాడు. ఈ బ్యానర్ పై వచ్చిన తొలి చిత్రం బలగం. తెలుగు ప్రేక్షకుల్ని కదిలించి కల్ట్ స్టేటస్ అందుకుంది ఈ మూవీ.
అందుకే డీఆర్పీ బ్యానర్ పై వచ్చే నెక్ట్స్ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈరోజు దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై రెండో సినిమాను ఎనౌన్స్ చేశారు. ఇందులో కూడా చాలా ప్రత్యేకతలున్నాయి.
ఈ సినిమాకు 'ఆకాశం దాటి వస్తావా' అనే అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ చూస్తే ఇది యూత్ ఫుల్ లవ్ స్టోరీ అనే విషయం అర్థమౌతూనే ఉంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. కొరియోగ్రాఫర్ యష్ ను హీరోగా పరిచయం చేస్తున్నారు. శశికుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.
ఈ మూవీతో మరో హీరోయిన్ ను పరిచయం చేస్తున్నారు. ఆమె పేరు కార్తీక. బాలీవుడ్ లో పీకే, త్రీ ఇడియట్స్ లాంటి సినిమాలకు డీవోపీగా పనిచేసిన మురళీధరన్ కూతురు ఈమె. మలయాళంలో ఆల్రెడీ 2 సినిమాలు చేసిన ఈమెను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నారు.
యష్ మాస్టర్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాతో సింగర్ కార్తీక్, మ్యూజిక్ డైరక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. పాటలు చాలా బాగా వచ్చాయంటున్నారు దిల్ రాజు. త్వరలోనే మూవీ టీజర్ ను లాంఛ్ చేయబోతున్నారు. బలగం తర్వాత వస్తున్న సినిమా కావడంతో, ఈ మూవీపై అందరి దృష్టిపడింది.