కార్టూనిస్టు ప్రాణ్ కుమార్ శర్మ ఆగస్టు 5 న తన 76 వ యేట కొలోన్ క్యాన్సర్‌తో పోయారు అని చెప్తే చటుక్కున గుర్తుపట్టడం కష్టం. కామిక్స్ హీరో ‘చాచా చౌధురీ’ సృష్టికర్త అంటే ఓహో అంటారు. 1969లో ‘‘లోట్పోట్’’ అనే హిందీ మ్యాగజైన్‌కే సృష్టించిన ఈ పాత్ర ఆయనకు విశేష ఖ్యాతి తెచ్చిపెట్టింది. 191లో డైమండ్ క్లాసిక్స్ వారు ఆయనతో ఒప్పందం పెట్టుకుని కామిక్స్‌గా వేయడం మొదలుపెట్టారు. అప్పణ్నుంచి 500 టైటిల్స్ వెలువడ్డాయి. వాటిలో చాలా భాగం 10 భాషల్లోకి అనువదించబడ్డాయి. కోటి ప్రతులు అమ్ముడు పోయి వుంటాయని అంచనా. 10-13 సం॥ వయసున్న పిల్లలు మీకు బాగా తెలిసిన కామిక్ కారెక్టరు ఏది అని అడిగితే చాచా చౌధురీ పేరే చెప్పారు. 2001లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ ఆయనకు లైఫ్‌టైమ్ ఎఛీవ్మెంట్ ఎవార్డు ఇచ్చారు. భారతదేశంలో కామిక్స్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు 1995లో పీపుల్ ఆఫ్ ద ఇయర్‌గా సంభావించారు. 193లో దేశసమైక్యతపై ఆయన చేసిన కామిక్స్ బుక్‌ను అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ రిలీజ్ చేశారు. అమెరికాలోని ఇంటర్నేషనల్ మ్యూజియం ఆఫ్ కార్టూన్ ఆర్ట్‌లో చాచా చౌధురీ సీరీస్‌ను శాశ్వతంగా ప్రదర్శనకు వుంచారు. వీటిపై ఆధారపడి టీవీ సీరీస్ కూడా వచ్చాయి.
ఆయన 193లో కసూర్‌లో పుట్టారు. గ్వాలియర్‌లో బిఏ చదివి ఢిల్లీకి వచ్చి ఈవెనింగ్ కాలేజీ ద్వారా ఎంఏ పట్టా తెచ్చుకున్నారు. బొంబాయిలోని జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుండి ఐదేళ్ల ఫైన్ ఆర్ట్స్ కోర్సును దూరవిద్య ద్వారా చదివారు. ఏదైనా స్కూలులో డ్రాయింగ్ టీచరు అవుదామనుకుంటూనే ఢిల్లీ నుండి వెలువడే ‘‘మిలాప్’’ అనే దినపత్రికలో తన 22 వ యేట కార్టూనిస్టుగా చేరారు. ‘‘దాబూ’’ అనే ఒక పాత్ర సృష్టించి దాన్ని పాప్యులరైజ్ చేశారు. అదొక్కటే కాదు శ్రీమతీజీ, పింకీ, బిల్లూ, రామన్, చన్నీ చాచీ – ఇలాంటి పాత్రలు సృష్టించి వాటి సీరీస్ నడిపారు. కన్నడంలో ‘‘ప్రజావాణి’’ దినపత్రిక కోరికపై అక్కడ కూడా ‘‘పుట్టి’’, ‘‘రామన్’’ వంటి పాత్రలతో సీరీస్ నడిపారు. అయితే ఆయనకు అమితంగా పేరు తెచ్చిన చాచా చౌధురీ పాత్ర 1969లో పుట్టింది. తెలుగులో ‘మునసబు పెదనాన్న’ అనుకోవచ్చు. ఆయన వయసులో పెద్దవాడు, శారీరకంగా మరీ బలవంతుడేమీ కాదు. తలపాగ, వెయిస్టుకోటు, చేతిలో చేతికర్ర, వెంట రాకెట్ అనే ఒక కుక్క. బుద్ధిబలం మాత్రం అపారం. కంప్యూటర్ల వంటి ఆధునిక యంత్రాలేమీ లేకుండా కేవలం నిశిత పరిశీలనతో చురుకుగా ఆలోచించి, కేవలం కామన్‌సెన్స్‌తో సమస్యలు పరిష్కరిస్తాడు, దొంగల్ని పట్టేస్తాడు.
ఆయనకు సహాయపడడానికి సాబు అనే పరగ్రహవాసి వున్నాడు. గురుగ్రహం నుండి వచ్చాడు. చాచా భార్య బీనీ చాచీ చేతి వంట రుచి మరిగి, ఇక్కడే వుండిపోయాడు. 15 అడుగుల పొడుగుంటాడు. బుద్ధి వుందో లేదో తెలియదు కానీ పెద్దగా వుపయోగించడు. ఇక స్థూలకాయురాలైన చాచీ అతనికి పూటకి 10 చపాతీలు, 12 కిలోల హల్వా, 20 లీటర్ల లస్సీ తయారుచేసి పెట్టలేక అలిసిపోతూ వుంటుంది. ఆవిడ అప్పడాల కర్రతో దొంగల్ని తరిమివేస్తూ వుంటుంది. ఒక్కోప్పుడు తనకు బంగారు గాజుల జత చేయించలేదని మొగుడిపై విరుచుకు పడుతూ వుంటుంది. సాబూ కవల సోదరుడు దాబూ కూడా వున్నాడు. ఇక విలన్ కూడా లేకపోతే సెట్టు పూర్తి కాదు కాబట్టి, రాకా అనే విలన్ వున్నాడు. ఒకప్పుడు గజదొంగ, చక్రం ఆచార్య అనే ఆయన ఇచ్చిన మంత్రజలం తాగి చావులేని భూతమై పోయాడు. వీళ్లు ఎక్కడో సముద్రగర్భంలో పాతి పెట్టేసినా మళ్లీ మళ్లీ తిరిగి వస్తూ వుంటాడు. అతను కాక గోబర్ సింగ్ అనే ఒక బందిపోటు, ధమాకా సింగ్ అతని అనుచరులు పలీతా, రుల్దూ కూడా వున్నారు. ఈ పాత్రలన్నీ భారతీయ వాతావరణంలో పుట్టినవే కాబట్టి ఇక్కడి చిన్నపిల్లలను ఎంతగానో అలరించాయి. ప్రాణ్ మరణం వలన బాధపడేవారిలో పిల్లలు, ఒకప్పటి పిల్లలూ (అంటే అందరం) ఎక్కువ వుంటారు.
ఎమ్బీయస్ ప్రసాద్