నరేష్ తో, సునీల్ తో రెండు పెద్ద హిట్ లు ఇచ్చినా భాయ్ సినిమాతో ఇమేజ్ అంతా డామేజ్ అయిపోయింది వీరభద్రమ్ చౌదరికి. పైగా హిట్ అయితే కథల జడ్జిమెంట్ లో నాగ్ ప్రతిభ ఇంతా అంతాకాదని చెప్పేవాళ్లంతా, భాయ్ నష్టం అంతా మాత్రం చౌదరి ఖాతాలో ఏకంగా వేసేసారు. అక్కడ నాగ్ జడ్జిమెంట్ పవర్ ఏమయిందని ఎవరూ అడగరు. అది వేరే సంగతి.
మొత్తానికి భాయ్ సినిమాతో వైకుంఠపాళిలో మొదటి మెట్టకు చేరుకున్నట్లయింది చౌదరి పరిస్థితి. ఒక్క అల్లరి నరేష్ మాత్రం అవకాశం ఇస్తానని గ్యారంటీ వాగ్దానం చేసాడు. అయితే అది ఎప్పుడు నెరవేరుతుందన్నదే అనుమానం. ఎందుకంటే ఇప్పటికి బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ పూర్తయింది. బందిపోటు సగంలోవుంది. ఈ రెండూ కాకుండా, అనిల్ సుంకర ఎకె బ్యానర్ పై మరో సినిమా గుట్టుచప్పుడు కాకుండా తయారవుతోంది.
అదే బ్యానర్ పై మరో సినిమా కూడా కమిట్ అయినట్లు తెలుస్తోంది. అది నరేష్ 49వ సినిమా. ఇక యాభై వ సినిమాను ప్రెస్టీజియస్ గా తీసుకుని, పెద్ద బ్యానర్ పై, పెద్ద డైరక్టర్ తో చేయాలని నరేష్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అలా అయితే 51 సినిమా వరకు చౌదరికి అవకాశం దక్కదు. అంటే కనీసం 2015 చివర్నో, 2016లోనో చాన్స్ రావచ్చు.