తమిళంలో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా సుందర్ పాండియన్. ఈ నెల 14కు సరిగ్గా రెండేళ్లయిపోతుంది. దీని తెలుగు హక్కులు సుడిగాడు హిట్ అనంతరం దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు, రంజిత్ మూవీస్ వారు కలిసి కొన్నారు. కానీ ఇప్పటి దాకా దీన్ని తెరకు ఎక్కించడం కుదరడం లేదు. దీనికి సరైన హీరో సునీల్ అని కొన్నవాళ్ల అయిడియా.
కానీ ఎందుకో అతగాడితో వారికి నప్పడం లేదని తెలిసింది. అల్లరి నరేష్ చాలా ఇంట్రస్ట్ గా వున్నాడు కానీ, అతగాడికి ఆ క్యారెక్టర్ నప్పుతుందా అని వీరి అనుమానం. వీరు మరి కొంతమందిని అనుకున్నారు కానీ వర్కవుట్ కాలేదు ఎందుకో. ఎనభై లక్షలకు హక్కులు కోన్నారు. 24నెలల వడ్డీ లెక్కేసుకుంటే మరో అరవై లక్షల వరకు అయింది. అంటే రమారమి కోటిన్నర ఇప్పటికే మదుపు.
సరదాకుర్రాడి లైఫ్ లో ప్రేమ చిగురించిన వేళ, మర్డర్ కేసు వచ్చి మీదపడడం, ఆపై ట్విస్టుల వంటి కథ ఇది. లైన్ ఎవరూ కొట్టేయకపోవచ్చు కానీ, చిన్న చిన్న సీన్లు అటు మార్చి ఇటు మార్చి లాగించేసే ప్రమాదం వుంది. అందువల్ల ఇకనైనా తొందరపడకుంటే సుందరపాండియన్ ముదిరిపోయి, పనికిరాకుండా పోయే ప్రమాదం వుంది.