అనూహ్య హత్య యువతులకు పాఠం…!

ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంకు చెందిన టీసీఎస్‌ ఉద్యోగిని ఎస్తేర్‌ అనూహ్య హత్య కేసులో దోషి చంద్రభాన్‌కు  ఉరి శిక్ష విధిస్తూ మహిళా కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇవ్వడాన్ని దేశమంతా హర్షిస్తోంది. ముఖ్యంగా మహిళా లోకం స్వాగతిస్తోంది.…

ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంకు చెందిన టీసీఎస్‌ ఉద్యోగిని ఎస్తేర్‌ అనూహ్య హత్య కేసులో దోషి చంద్రభాన్‌కు  ఉరి శిక్ష విధిస్తూ మహిళా కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇవ్వడాన్ని దేశమంతా హర్షిస్తోంది. ముఖ్యంగా మహిళా లోకం స్వాగతిస్తోంది. చంద్రభాన్‌ను ఉరితీస్తేనే అనూహ్య ఆత్మకు శాంతి కలుగుతుంది. ఆమె కుటుంబం గుండెమంట చల్లారుతుంది. అయితే అనూహ్య హత్య ఎలా జరిగిందో మీడియాలో వచ్చిన కథనాలు చదివిన తరువాత ఎందుకింత తెలివితక్కువగా వ్యవహరించింది? అనే ప్రశ్నించుకోవల్సి వస్తోంది. 

'ఆంధ్రజ్యోతి'లో  'ఆ రోజు ఏం జరిగిందంటే…' అనే శీర్షికతో ప్రచురించిన కథనం, ఆంగ్ల పత్రిక 'టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా' కథనం అనూహ్య తొందరపాటును, అజాగ్రత్తను తెలియచేస్తున్నాయి. ఇంజినీరింగ్‌  చదివి,  పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి ఇంత తెలివితక్కువగా ఎలా ప్రవర్తించిందో అర్థం కావడంలేదు. 2014 జనవరి 5వ తేదీ తెల్లవారుజామున అనూహ్య ముంబయిలో (లోక్‌మాన్య తిలక్‌ టెర్మినస్‌)  రైలు దిగింది. బ్యాగులు కొట్టేయడం వంటి చిల్లర దొంగతనాలు చేసే చంద్రబాన్‌ ఆ సమయంలో అక్కడికి అదే పని మీద వచ్చాడు. 

ఒంటరిగా రైలు దిగిన అనూహ్యను చూసి ఆమె దగ్గరకు వెళ్లాడు. తాను టాక్సీ డ్రైవర్‌నని, రూ.300 ఇస్తే ఆమె ఉంటున్న అంధేరీ దగ్గర దింపుతానని చెప్పాడు. రైల్వే స్టేషన్లలో ఆటోవాలాలు, టాక్సీ డ్రైవర్లు ఇలా అడగడం సహజం. కానీ స్టేషన్‌ నుంచి బయటకు వచ్చాక టాక్సీ లేదు. మోటారు సైకిల్‌ ఉంది. అతను టాక్సీ ఉందని అబద్ధం చెప్పాడని ఆమెకు అర్థమైంది. అతను మోటారు సైకిల్‌ మీద తీసుకెళతానన్నాడు. ఆమె రానంది. ఆ సమయంలో ఆమె ఏం చేయాలి? మరో టాక్సీయో, ఆటోనో మాట్లాడుకొని వెళ్లాలి. 

కాని చంద్రభాన్‌ ఆమెను వదలిపెట్టకుండా 'కావాలంటే నా బైకు నెంబరు, మొబైల్‌ నెంబరు మీ బంధువులకు తెలియచేయండి' అని నమ్మబలికాడు. కాని ఆ సమయానికి అనూహ్య సెల్‌ ఫోన్‌లో బ్యాలెన్స్‌ లేదు. అయినప్పటికీ తల్లిదండ్రులకు ఫోన్‌ చేసినట్లుగా నటించింది. చంద్రభాన్‌ను నమ్మించేందుకు ఇలా చేసింది. అతను ఆమెను బైక్‌ ఎక్కించుకొని రాంగ్‌ రూట్లో తీసుకెళ్లాడు. ఓ నిర్మానుష్య ప్రదేశంలో బైక్‌ ఆపేసి పెట్రోల్‌ అయిపోయిందని చెప్పాడు. ఆ తరువాత ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా హత్య కూడా చేశాడు. 

ఈ దారుణ ఘటన జరగడంలో అనూహ్య అమాయకత్వం స్పష్టంగా కనబడుతోంది. ముంబయిలో ఆమె తెల్లవారుజామున పావు తక్కువ ఐదింటికి దిగింది. అంటే ఇంకా తెల్లవారలేదు. తెల్లవారకపోయినా ముంబయి వంటి మహానగరం మేలుకొనే ఉంటుంది కదా…! స్టేషన్లోనే మరో గంట కూర్చుని ఉంటే తెల్లవారేది. ఆ పని చేసి ఉండాల్సింది. ఆమెకు మరో శాపం మొబైల్‌లో బ్యాలెన్స్‌ లేకపోవడం. సుదూర ప్రయాణం చేసేటప్పుడు ఫోన్లో బ్యాలెన్స్‌ ఉందో లేదో చూసుకోవాలి కదా. ఆమె ఆ పని చేయలేదు. 

ఇక అసలు విషయం …అపరిచిత వ్యక్తి వచ్చి మోటారు సైకిల్‌ మీద తీసుకెళతానంటే గుడ్డిగా నమ్మడం. అతను బైకు నెంబరు, మొబైల్‌ నెంబరు మీ బంధువులకు చెప్పు అనగానే మంచోడని నమ్మి బైకు ఎక్కి వెళ్లిపోవడం. అపరిచితుడి బైక్‌ మీద తెల్లవారుజామున వెళ్లడం సురక్షితం కాదనే విషయం అనూహ్య ఎందుకు ఆలోచించలేదు? ట్యాక్సీలో వెళ్లేందుకు ఆమె దగ్గర డబ్బు లేదని అనుకోలేం. టాక్సీ ఉందని చెప్పి బైక్‌ దగ్గరకు తీసుకెళ్లినప్పుడే వెంటనే స్టేషన్‌లోకి వచ్చేయాలి కదా…! ఆ పని ఎందుకు చేయలేదు? 

అనూహ్య వ్యవహిరించిన తీరుకు జవాబు దొరకడం లేదు.  ముంబయి నేరాలకు అడ్డా అనే సంగతి ప్రపంచమంతా తెలుసు. అక్కడ వ్యభిచార కూపాలు ఉన్నాయనే సంగతి తెలుసు. టాక్సీ, ఆటోల డ్రైవర్లు ఆడపిల్లలను ట్రాప్‌ చేస్తారని తెలుసు. ఒంటరిగా ప్రయాణించే యువతులు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అపరిచితుల మాటలు గుడ్డిగా నమ్మడమేనా? ఒంటరి యువతులు అనూహ్య మాదిరిగా అజాగ్రత్తగా ఉండకూడదనేది అర్థమవుతోంది.