బాలు: అదేంట్రా బైకు అంత డ్యామేజ్ అయిపోయింది… ఎవడు గుద్దేసేడేంటి?
శీను: సిగ్నల్ దగ్గర స్పీడుగా వెళ్తూ వెళ్తూ… ఆరెంజ్ పడిపోయిందని సడన్‌గా ఆగిపోయాన్రా.. వెనకాల నుంచి ఒకడొచ్చి ముద్దెట్టేసాడు…
బాలు: ఆరెంజ్‌లో ఉంటే దాటేయొచ్చు కదరా… ఎందుకు ఆగిపోవడం?
శీను: (తల పైకెత్తి బాలుకేసి చూస్తూ… హస్కీ వాయిస్‌లో చెప్పాడు) ‘ఐ యామ్ దట్ ఛేంజ్…!!!’
బాలు: షార్ట్ ఫిలిం ఎఫెక్టా… గుద్దినోడేమైనా కాంపెన్సేసన్ ఇచ్చాడా?
శీను: అడిగాను. ‘ఐ డోంట్ హావ్ ఛేంజ్’ అని ఎల్లిపోయాడు!
బాలు: (శీను పక్కన కూర్చుంటూ..) అబ్బ… మెడ పట్టేసిందిరా
శీను: యే.. నువ్వు కూడా నాలాగా ఏదైనా ఛేంజ్‌లు ట్రై చేసావేంటి?
బాలు: లేదురా.. రభస ఫస్ట్ డే ఫస్ట్ షోకెళ్లాను. ఆ రష్లో టికెట్ దొరికేసరికి తీరిపోయింది బాగా…
శీను: రెండో రోజు వెళ్తే దర్జాగా ముందు సీటు మీద కాళ్లేసుకు కూర్చుని చూసేవాడివిగా
బాలు: ఎల్లెహె.. రెండో రోజెందుకు ఖాళీ అయిపోద్ది?
శీను: నిజమే… మొదటి రోజే అయిపోయుండాలి!
బాలు: మరీ ఓవర్ చేయకురోయ్. ఇంతకంటే ఏముంటుందిరా ఒక సినిమాలో.
శీను: అన్ని సినిమాల్లోను ‘ఇంతకంటే ఏముంటుంది’ అనుకునే ఇది తీసినట్టున్నారు. ఇంతే ఉంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుంటున్నారు.
బాలు: మాస్ మసాలా మేస్టారూ… అది మారదు.
శీను: మసాలా ఫ్రెష్‌గా ఉంటేనే ఘాటు. ‘బెస్ట్ బిఫోర్’ డేట్ దాటేస్తే ఇలాగే ఉంటది రిజల్టు.
బాలు: బ్రహ్మానందం కామెడీ అయినా నచ్చలేదా?
శీను: ఎన్టీఆర్ సినిమా చూసొచ్చి ముందు మాట్లాడుకునేది బ్రహ్మీ గురించా?
బాలు: హీరోయిజమ్కేమి తక్కువ… బాల్ ఆడేసుకున్నాడు
శీను: బౌన్సింగ్ బాల్సేనా.. బాగా ఆడాడు కదా?
బాలు: ఫస్టాఫ్‌లో ‘యాంటీ లవర్స్ స్క్వాడూ’.. అదీ.. సూపర్‌గా ఉన్నాయా లేదా?
శీను: పనికొచేదేది ఏదైనా ఉంటే చెప్పు.
బాలు: బుడ్డోడు పాడిన పాట… అది కేక కదా.
శీను: దానికి ఆడియో వింటే చాలు కదా?
బాలు: డాన్సులు ఇరగదీసాడా లేదా..
శీను: అసలు ఎన్టీఆర్ డాన్సేస్తే ఎలాగుంటుందో తెల్సా?
బాలు: బ్రహ్మానందంతో కామెడీ…
శీను: మళ్లీ బ్రహ్మీ దగ్గరకొచ్చేసావా?
బాలు: ఎంత హీరో అయితే మాత్రం అన్నీ బుడ్డోడే చెయ్యాలా?
శీను: అదే నా డౌటు. అసలు ఎన్టీఆర్ ఈ బొమ్మ ఎందుకు చేసాడో అర్థం కాలేదు నాకు..
బాలు: బుడ్డోడి కోసం రాసుకున్న కథ కాదంటలే. రామ్‌తో కందిరీగ 2 అని చేద్దామనుకున్నాడంట డైరెట్టరు.
శీను: అద్గదీ సంగతి. అవున్రరేయ్… ఎన్టీఆర్ చేసిన ఊసరవెల్లి కూడా రామ్ చేయాల్సిందే కదా.
బాలు: అవును. అయితే ఏంటిప్పుడు?
శీను: ఆ డైరెక్టర్లు ఈ కథ ఫలానా హీరోకైతే బెస్టు అని అనుకోడానికి ఓ కారణం ఉండుంటుంది కదా. దానిని ఎన్టీఆర్ అర్థం చేసుకోవాలి కదా…!
బాలు: నువ్వేమంటున్నావో నాకర్థం కావట్లేదురా.
శీను: ఇది అర్థమైతే ‘రభస’ గురించి ఇంతసేపు నాతో డిస్కషన్ చేస్తావా ఏంటి కానీ.. ఇంకేదైనా చెప్పు.
బాలు: హీరోయిన్లయినా నచ్చలేదా నీకు. ‘అత్తారింటికి దారేది’ హీరోయిన్లురా..
శీను: రేయ్… గబ్బర్‌సింగ్ డైరెట్టరు… అత్తారింటికి దారేది హీరోయిన్లు.. ఇవి కాదు కావాల్సినది.
బాలు: నాకు కథ కూడా నచ్చింది. ఒక పాయింట్‌తో స్టార్ట్ చేసి ఇంటర్వెల్ దగ్గర ట్విస్టిచ్చి… భలేగా ఎండ్ చేసాడు.
శీను: చెన్నయ్‌లో నువ్వో ఫ్రెండ్ పెళ్లికెళ్లాలని బయల్దేరావనుకో. ముంబైలో ఎవడిదో పెళ్లి దగ్గర దింపేసారనుకో. ఏదో ఒకటిలే.. పెళ్లే కదా అని అక్కడే ఉండిపోతావా?
బాలు: తల తోక లేకుండా ఏం మాట్లాడుతున్నావెహే..
శీను: ఎగ్జాక్ట్లీ… తల, తోక లేదనే అంటున్నాను.
బాలు: థమన్ పాటలు బాగున్నాయి కదా…
శీను: మామూలుగానే కొత్తగా చేయడానికి ఇష్టపడడు. ఇలాంటి కథలు చెప్తే బాగా అరిగిపోయిన ట్యూన్లు ఇచ్చేస్తాడు.
బాలు: నేను ఏది చెప్తే నువ్వు ఒప్పుకున్నావని…
శీను: సర్లే ఇంకేంటి కబుర్లు..
బాలు: అనుష్క బ్రేక్ తీసుకుంటుందంట…
శీను: ఎవరు మన అరుంధతా? ఇంకా సినిమాలు చేస్తుందా?
బాలు: ఏం మాట్లాడుతున్నావ్. రుద్రమదేవి, బాహుబలి..
శీను: కోప్పడిపోకురా బాబూ… ఈమధ్య కనిపించకపోతే డౌటొచ్చింది. ఇంకా ఏంటి విశేషాలు.
బాలు: లారెన్స్ బొమ్మ ‘ముని 3’ డిసెంబర్లో వస్తదంట..
శీను: ఎందుకైనా మంచిది.. అప్పుడు ఎక్కడికైనా వెళ్లిపొమ్మని చెప్తున్నావా?
బాలు: అదేంటి, అలా అంటున్నావ్
శీను: హారర్ సిన్మాలంటే నాకు భయం కదా. ఎలర్ట్ చేస్తున్నావేమో అని. మ్మ్.. ఇంకా..
బాలు: ‘గోపాల గోపాల’లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ లెంగ్త్ పెంచారంట..
శీను: ఓ మై గాడ్.. ఎందుకలా?
బాలు: ఎందుకేంటి. పవన్ ఎక్కువ సేపు ఉంటే ఎక్కువ కలెక్షన్లు వస్తాయి కదా.
శీను: మరలాంటప్పుడు హీరో క్యారెక్టరే ఇవ్వొచ్చుగా. ఎందుకొచ్చిన ‘స్పెషల్’ పెయిన్సు! ఇంకేంటి న్యూసు..
బాలు: (మొబైల్లో స్క్రోల్ చేస్తూ..) ఉండు చూడనీ… ఆఁ.. సచిన్‌కి ‘నీ జతగా నేనుండాలి’తో బ్రేకొచ్చిందంట. యాక్టింగ్ బాగా ఇంప్రూవ్ అయిందంట.
శీను: (కింద పడి నవ్వుతూ) ఓరి బాబోయ్ కామెడీ… ‘రభస’ మొత్తం మీద ఇలాంటి జోక్ లేదు కదరా!
– గణేష్ రావూరి