ఇది టాలీవుడ్లో తాజాగా షికారు చేస్తున్న పుకారు. సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించేసి ప్రివ్యూలు వేసి చూసుకున్న తర్వాత.. కలిగిన అసంతృప్తిలో రీషూట్ జరిగినా సరే.. ఏదో రెండు మూడు సీన్లు ప్యాచ్అప్ చేస్తారంతే.. అని మనం అనుకోవచ్చు. కానీ 'అఖిల్' సినిమా విషయంలో రీషూట్ కు చాలా ఎక్కువ సమయం కేటాయించినా పర్లేదు.. క్వాలిటీ లో మాత్రం రాజీ పడడానికి లేదన్నట్లుగా ఇప్పుడు పట్టుదలతో చేస్తున్నారని వినికిడి. ప్రస్తుతం జరుగుతున్న రిపేరు పనులన్నీ పూర్తయితే.. చిత్రం సంక్రాంతి బరిలోకి విడుదల అవుతుందని అనుకుంటున్నారు.
నితిన్ నిర్మాతగా అక్కినేని అఖిల్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ వినాయక్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అక్కినేని అభిమానులంతా.. దీనికోసం చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా ఎక్కువ నిడివి గ్రాఫిక్ వర్క్ కూడా ఉన్న ఈ చిత్రం మొత్తం పూర్తయిన తర్వాత.. ప్రివ్యూ చూసిన నాగార్జున పెదవివిరిచిన సంగతి తెలిసిందే. గ్రాఫిక్ వర్క్‌లో మార్పులతో పాటూ.. చాలా వరకు రీషూట్ చేయాల్సిందే అని ఆయన పట్టుబట్టారుట.
ఈ రీషూట్ అంత త్వరగా ముగిసిపోయేది కాదు. పైగా రీషూట్ ఉన్న నిడివిని బట్టి.. ఏయే సీన్లలో రీషూట్ చేస్తున్నారనే దాన్ని బట్టి.. కొత్తగా గ్రాఫిక్ వర్క్ కూడా చేయాల్సి వస్తుంది. ఇదంతా చాలా ఎక్కువ సమయం పడుతుంది. ప్రస్తుతం అక్టోబరు నెల కూడా ముగిసిపోతుండగా.. ఎంత చేసినా.. డిసెంబరు 15 లోగా విడుదల కు సిద్ధం చేయాలి. ఆ తర్వాత.. సంక్రాంతి వరకు శూన్యమాసం గనుక.. సినీఇండస్ట్రీ సెంటిమెంటు ప్రకారం భారీ సినిమలు విడుదల కావు. పైగా అఖిల్‌ను తొలిసారిగా తెరకు పరిచయం చేస్తూ.. శూన్యమాసం దుర్ముహూర్తాల్లో విడుదలకు సాహసించే అవకాశం లేదు.
సో, ఈ ఒకటిన్నర నెల వ్యవధిలో సినిమా ఎటూ పూర్తి కాదు గనుక.. ఆ తర్వాత నెల రోజులు కూడా ప్రశాంతంగా పని పూర్తిచేసి.. పర్ఫెక్ట్ సినిమాగా తీర్చిదిద్ది సంక్రాంతి పోటీకే విడుదల చేయాలని అనుకుంటున్నట్లుగా ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.