రామ్ చరణ్ ఎలాగైనా దర్శకుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడని వార్తలు తెగ వినిపిస్తున్నాయి. పవన్ తీయబోయే సినిమాను దీనికి అవకాశంగా మార్చాలని అనుకుంటున్నాడు చరణ్ అంటూ కొనసాగింపు వార్తలు కూడా వినవస్తున్నాయి. పవన్..త్రివిక్రమ్ మంచి మిత్రులే. అయినా కూడా త్రివిక్రమ్ ను ఏ మేరకు పవన్ ఒప్పించగలడు అన్నది అనుమానం.
ఎందుకంటే టాలీవుడ్ లో ఓ ఉదంతం గురించి అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది. అదేమంటే..సన్నాఫ్ సత్యమూర్తి సినిమాను చరణ్ చేయాల్సి వుందని, కానీ కారణాంతరాల వల్ల అది జరగలేదు. ఓ ప్రాజెక్ట్ సెట్ కావడం, కాకపోవడం అన్నదానికి చాలా కారణాలు వుంటాయి. అదేమంత పెద్ద చిత్రం కాదు. కానీ ప్రాజెక్టు క్యాన్సిల్ అన్న సమాచారాన్ని రామ్ చరణ్ నేరుగా తాను తివిక్రమ్ కు చెప్పకుండా, తన మేనేజర్ ద్వారా చెప్పించారని, అది త్రివిక్రమ్ ను కాస్త హర్ట్ చేసిందని టాలీవుడ్ గుసగుసల సారాశం.
అప్పుడే త్రివిక్రమ్ కోబలి ఫ్రాజెక్ట్ మీదకు వెళ్లిపోదాం..సత్యమూర్తిని పక్కన పెట్టి అనుకున్నాడట. అయితే ఈ వైనం తెలిసి, బన్నీ ముందుకు వచ్చి, ఆ ప్రాజెక్టు పూర్తి చేసాడని, అప్పటి నుంచి బన్నీకి చరణ్ కు మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని కూడా వినిపిస్తూ వుంటుంది.
కట్ చేస్తే…ఇప్పుడు మళ్లీ చరణ్ ఓ సినిమా త్రివిక్రమ్ తో చేద్దాం అని అనుకుంటున్నాడు. పవన్ మధ్యవర్తిత్వం కూడా వుండొచ్చు. అందువల్ల మరి త్రివిక్రమ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.