చిత్రం : తుంగభద్ర
రేటింగ్: 2/5
బ్యానర్: వారాహి చలనచిత్రం
తారాగణం: ఆదిత్ అరుణ్, డిరపుల్ చోప్డే, సత్యరాజ్, కోట శ్రీనివాసరావు, రవివర్మ, శివకృష్ణ, సప్తగిరి, పవిత్ర లోకేష్ తదితరులు
సంగీతం: హరిగౌర
కూర్పు: తమ్మిరాజు
ఛాయాగ్రహణం: రాహుల్ శ్రీవాత్సవ్
నిర్మాత: రజని కొర్రపాటి
రచన, దర్శకత్వం: శ్రీనివాసకృష్ణ గోగినేని
విడుదల తేదీ: మార్చి 20, 2015
కత్తి పట్టిన వాడు చివరకు దానికే బలి అవుతాడు అనే పాయింట్‌పై రూపొందిన తుంగభద్రలో పాలిటిక్స్ బ్యాక్‌డ్రాప్‌ని, రూరల్ లవ్‌స్టోరీని మిక్స్ చేసారు. పవర్‌లోకి రాగానే అవతలి పార్టీ వాళ్లని నిర్దాక్షిణ్యంగా చంపేసే మైండ్‌సెట్ ఉన్న రాజకీయ నాయకుల మధ్య, వర్గ పోరాటాల మధ్య చిగురించిన ఒక ప్రేమ సఫలమైందా లేదా అనేది ‘తుంగభద్ర’ ప్లాట్. దర్శకుడు శ్రీనివాసకృష్ణ రొటీన్‌కి భిన్నమైన చిత్రాన్ని చేయాలని ఆరాట పడ్డాడు. అయితే ఆ ప్రయత్నంలో అతనేం మనకి తెలియని కొత్త కథని, మనం చూడని వాటిని చూపించలేదు. ‘యజ్ఞం’ సినిమాలో ఇంచుమించుగా ఇలాంటి లవ్‌స్టోరీనే చూసాం. కాకపోతే అది కమర్షియల్ ఫార్మాట్‌లో సాగితే… తుంగభద్ర నేల విడిచి సాము చేయకుండా రియాలిటీకి దగ్గరగా ఉంటుంది.
దర్శకుడు ఇవ్వాలనుకున్న సందేశం… ఈ చిత్రాన్ని తలపెట్టిన ఉద్దేశం అన్నీ గొప్పవే కాకపోతే తెరపై జరిగేదంతా ఆసక్తిగా చూసేటట్టుగా, పాత్రలతో మమేకమై వాటి భవిష్యత్తు ఏమవుతుందో తెలుసుకోవాలని ఆరాటపడేట్టుగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడంలో మాత్రం విఫలమయ్యాడు. యజమాని కూతుర్ని ప్రేమించే కుర్రాడు… నైతికత గురించి పడే సంఘర్షణ ఎన్ని సినిమాల్లో చూడలేదు? అలాంటి అంశాన్ని తీసుకున్నప్పుడు కొత్తగా చెప్పలేకపోయినా కనీసం ఆహ్లాదకరంగా చూపించడానికి ప్రయత్నించాలి. హింసాత్మక రాజకీయ నేపథ్యంలో సాగే ప్రేమకథలో ఉండాల్సిన మృదుత్వం, మనసుకి హత్తుకునే గుణం ఇందులోని ప్రేమకథకి లేవు.
ప్రేమకథని సరిగ్గా తీసి ఉన్నట్టయితే తుంగభద్ర ఎంతో కొంత రక్తి కట్టి ఉండేది. కానీ అదే పనిగా రిపీట్ అయ్యే సీన్స్‌తో, సరైన రీజన్ లేకుండా ప్రేమలో పడిపోయే లీడ్ క్యారెక్టర్స్‌తో లవ్‌స్టోరీ డిజప్పాయింట్ చేస్తుంది. రాజకీయ గొడవలు కూడా చాలా పేలవంగా చిత్రీకరించారు. అధికారం చేజారిన తర్వాత సత్యరాజ్ పాత్రతో సహా అతని వర్గం మొత్తం బలహీనమైపోయినట్టు చూపించడం ఆకట్టుకోదు. కనీసం ఇటు నుంచి నామమాత్రపు ప్రతిఘటన కూడా లేకుండా సినిమా ముగించేసారు. సత్యరాజ్ తీసుకున్న నిర్ణయంతో ఆ మారణహోమం ముగుస్తుందని చెప్పడం కన్విన్సింగ్‌గా లేదు. కాకపోతే హీరోయిజమ్‌కి పోయి వాస్తవానికి దూరంగా కాకుండా వీలయినంత రియల్‌గా ఎండ్ చేయడం మాత్రం మెచ్చుకోతగ్గ అంశం.
ఆదిత్ అక్కడక్కడా హీరో రామ్‌ని తలపించాడు. నటన పరంగా ఇంకా చాలా మెరుగుపడాలి. చూడ్డానికి బాగున్నాడు కానీ ఆ పాత్రకి అవసరమైన కేర్‌లెస్ బాడీ లాంగ్వేజ్ కానీ, ఈజ్ కానీ చూపించలేకపోయాడు. డిరపుల్‌ది ఎక్స్‌ప్రెసివ్ ఫేస్. ఆమె నటన ఆకట్టుకుంటుంది. సత్యరాజ్ ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలిచాడు. పాత్రకి తగిన గాంభీర్యాన్ని చూపిస్తూ కనిపించిన ప్రతి ఫ్రేమ్‌లో డామినేట్ చేసాడు. కోట శ్రీనివాసరావు పర్‌ఫార్మెన్స్ బాగుంది. రవివర్మకి మరో చెప్పుకోతగ్గ పాత్ర దక్కింది. కె.ఎ. పాల్‌పై సెటైర్‌లా తీసిన సప్తగిరి క్యారెక్టర్ తేలిపోయింది. కామెడీ పండిరచకపోగా, సీరియస్‌గా సాగుతున్న డ్రామాలో పంటి కింద రాయిలా తయారైంది. ధనరాజ్ క్యారెక్టర్‌తో చేయించాలని చూసిన కామెడీ కూడా ఫెయిలైంది.
దర్శకుడు ప్రేమకథని ఆకట్టుకునేలా తెరకెక్కించలేకపోయినా కానీ పొలిటికల్ డ్రామాని మాత్రం కొంతవరకు బాగానే హ్యాండిల్ చేసాడు. బహుశా లవ్‌స్టోరీని పక్కన పెట్టి మొత్తంగా రాజకీయ గొడవల మీదే ఫోకస్ పెట్టి ఉంటే మంచి రియలిస్టిక్ డ్రామాగా తుంగభద్ర పేరు తెచ్చుకుని ఉండేది. సత్యరాజ్ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర్నుంచి ఆ పాత్ర ఇంటెన్సిటీ బాగా తగ్గిపోయింది. క్లయిమాక్స్ హడావుడిగా అనిపిస్తుంది కానీ దానిని చిత్రీకరించిన విధానం మాత్రం బాగుంది. ఇలా అడపాదడపా శ్రీనివాసకృష్ణ మెరుపులు చూపించినప్పటికీ బిగి సడలని కథనంతో ప్రేక్షకుల్ని అరెస్ట్ చేయలేకపోయాడు. ఒకానొక పాయింట్‌లో తెరపై ఏం జరుగుతుందనే దానిపై కూడా ఆసక్తి కలగని దశకి తుంగభద్ర చేరిపోతుంది.
ఈ ప్రేమ జంట ఏమవుతుంది..? వైరి వర్గం పాశవికంగా రెచ్చిపోతుంటే వారి అరాచకాలకి ముగింపు ఎలా ఉంటుంది? లాంటి బేసిక్ పాయింట్స్‌పై కూడా ఇంట్రెస్ట్ కలగని విధంగా స్క్రీన్‌ప్లే సాగిపోవడంతో తుంగభద్ర తీవ్రంగా నిరాశపరుస్తుంది. సినిమా ఎంత సీరియస్‌గా ఉన్నా కానీ ఏం జరుగుతుందనే ఉత్కంఠని మెయింటైన్ చేసినట్టయితే కమర్షియల్ రిజల్ట్ మాట ఎలా ఉన్నా ఆడియన్స్‌ని శాటిస్‌ఫై చేసే అవకాశముంటుంది. తెరపై సత్యరాజ్ అభినయం, తెరవెనుక రాహుల్ ఛాయాగ్రహణం తుంగభద్రకి ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. రాజకీయ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, సంభాషణలు ఈ చిత్రాన్ని కంప్లీట్ డిజాస్టర్ కాకుండా హెల్ప్ అయ్యాయి. నీరసంగా సాగే ప్రేమకథ, విసిగించే కామెడీ దీనికి ప్రధాన బలహీనతలయ్యాయి. అటు వినోదం కోరుకునే ప్రేక్షకుల్ని అలరించలేక, ఇటు సీరియస్ డ్రామాలని ఇష్టపడే ఆడియన్స్‌కి తగ్గ ఇంటెన్సిటీ లేక తుంగభద్ర రెంటికీ చెడ్డ రేవడి అయింది. ఉద్దేశం మంచిదే అయినా కానీ, సందేశం పనికొచ్చేదే ఉన్నా కానీ పట్టు లేని కథనంతో గాడి తప్పింది.
బోటమ్ లైన్: తీరం చేరడం కష్టం!
– గణేష్ రావూరి