టీమిండియాకి అగ్ని పరీక్ష.!

సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. ఇటీవలే టెస్టుల్లోనూ, ముక్కోణపు వన్డే సిరీస్‌లోనూ టీమిండియాని కంగారు పెట్టిన ఆస్ట్రేలియాతో సెమీస్‌ పోరులో టీమిండియా తలపడనుంది. టెస్ట్‌ సిరీస్‌, ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఓటమికి బదులు…

సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. ఇటీవలే టెస్టుల్లోనూ, ముక్కోణపు వన్డే సిరీస్‌లోనూ టీమిండియాని కంగారు పెట్టిన ఆస్ట్రేలియాతో సెమీస్‌ పోరులో టీమిండియా తలపడనుంది. టెస్ట్‌ సిరీస్‌, ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం టీమిండియాకి వరల్డ్‌కప్‌ సెమీస్‌ రూపంలో దక్కింది.

అయితే, ఆస్ట్రేలియాని పడగొట్టే సత్తా టీమిండియాకి వుందా.? అన్నదే ఇక్కడ అసలు సిసలు ప్రశ్న. లేకనేం.. ఇప్పుడున్న టీమిండియా ఫామ్‌.. ఇదివరకన్నెడూ ఎవరూ చూడనిది. బ్యాట్స్‌మన్‌, బౌలర్‌.. ఇలా అందరూ రాణిస్తున్నారు. గతంలో పరిస్థితులు వేరు. టీమిండియా ఆల్‌ రౌండ్‌ నైపుణ్యంతో ప్రత్యర్థుల్ని మట్టికరిపిస్తూనే వుంది. వరుసగా ఏడు మ్యాచ్‌లు.. ఏడు విజయాలు.. డెబ్భయ్‌ వికెట్లు.. ఇదీ టీమిండియా ట్రాక్‌ రికార్డ్‌.

ఆస్ట్రేలియా విషయానికొస్తే.. ఈ జట్టు సైతం పటిష్టంగానే వుంది. బ్యాట్‌తోనూ, బంతితోనూ సమాధానం చెప్పగల ఆటగాళ్ళున్నారు ఆస్ట్రేలియాలో. అదీ ఆ జట్టు ప్రధాన బలం. పైగా, టీమిండియాపై వరల్డ్‌ కప్‌ పోటీల్లో ఆస్ట్రేలియాకి ఘనమైన రికార్డే వుంది. దాంతో, మానసికంగా ఆస్ట్రేలియా కాస్త బలంతో వుంది. ప్రత్యర్థి ఎవరైనాసరే.. పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతోన్న టీమిండియా, ఆస్ట్రేలియాని సైతం అదే రీతిలో పడగొట్టేందుకు సన్నద్ధమవుతుండడం గమనార్హం.

మొత్తమ్మీద, టీమిండియాకి అసలు సిసలు పరీక్ష.. ఆ మాటకొస్తే అగ్ని పరీక్ష ఈ నెల 26న ఎదురు కానుంది. ఈ పోరులో గట్టెక్కేందుకు టీమిండియాకి అన్ని అర్హతలూ వున్నా, ఆస్ట్రేలియాని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. టీమిండియా అయినా ఆస్ట్రేలియా అయినా.. సెమీస్‌ దాటితేనే ఫైనల్‌కి చేరుకునేది. కప్‌ కొట్టాలంటే ఫైనల్‌లో సత్తా చాటాల్సిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్లూ తమ వ్యూహాలకు పదును పెట్టనున్నాయి. మరి ఎవరి వ్యూహం వర్కవుట్‌ అవుతుందో.. ఈ టఫ్‌ ఫైట్‌లో విజయం ఎవరిదో తెలియాలంటే మార్చ్‌ 26 వరకూ వేచి చూడాల్సిందే.