ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇండియా.. మనోభావాల పేరుతో ఎవరన్నా ఎవరిమీదన్నా దాడి చేయొచ్చు. మరి చట్టాలేం చేస్తున్నాయి.? ఆ మాట మాత్రం అనొద్దు. చట్టం తన పని తాను చేసుకుపోతుందంతే.
ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్రప్రదేశ్.. అంటూ విభజన, సమైక్య ఉద్యమాలు జరుగుతున్న కాలంలో మనోభావాల పేరుతో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ ఉద్యమాల ముసుగులో అనేక దాడులు జరిగాయి. కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు విధ్వంసాలు జరిగాయి.. వ్యక్తులపైనా దాడుల జరిగిన సంఘటనలు అనేకం. అంతెందుకు ఎమ్మెల్యే, ఓ పార్టీ అధినేతపైన సాక్షాత్తూ అసెంబ్లీలోనే దాడి జరిగింది. చివరకు ‘భావోద్వేగం’ పేరుతో ఆ కేసులన్నీ నీరుగార్చబడ్డాయి.
ఇక, తాజాగా మనోభావాల పేరుతో దాడి జరిగింది. ఈసారి కాస్త వెరైటీ. బుల్లితెరపై ఓ కామెడీ షోలో ఓ కమెడియన్ ప్లే చేసిన స్కిట్ వివాదాస్పదమయ్యింది. తమ మనోభావాల్ని కించపర్చారంటూ కమెడియన్ వేణుపై ఓ వర్గం ప్రతినిథులు (?!) దాడి చేశారు. ఈ దాడిలో వేణుకి గాయాలయ్యాయి. అతనిప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దాడి చేయడంతోపాటు, వేణుకి వ్యతిరేకంగా పోలీసులకు ఆ వర్గం ప్రతినిథులు ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారా.? లేదా.? అన్నది వేరే విషయం. ప్రస్తుతానికైతే వేణు, ఆ వర్గ ప్రతినిథుల దాడిలో కాస్త తీవ్రంగానే గాయపడ్డాడు. ఇక, ఆ ఛానల్ యాజమాన్యం పైనా, ఆ కామెడీ షో జడ్జిలు, ఆ షోని రూపొందించిన సంస్థపైనా ఫిర్యాదులు చేశారు సదరు వర్గం ప్రతినిథులు.
ఇదివరకు కొన్ని సినిమాల విషయంలోనూ ఇలాంటివి జరిగాయి. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా ఎంత వివాదాస్పదమయ్యిందో అందరికీ తెల్సిందే. ఏకంగా ఆ చిత్ర దర్శకుడి కార్యాలయంపై దాడి జరిగింది అప్పట్లో. అది ఉద్యమాల సెగ. ఇప్పుడు సెగ ఇంకో రూపంలో తగులుతోందంతే. ఎవర్నీ కించపర్చేందుకు తాను ఆ స్కిట్ చేయలేదంటున్నాడు వేణు. కామెడీ షో ప్రదర్శనకు ముందు ఎవర్నీ కించపర్చడానికి కాదు.. అనే లైన్ వుంటుందన్నది నిర్వాహకుల వాదన.
ఎవరన్నా బాధపడి వుంటే, తదుపరి ఎపిసోడ్‌లో క్షమాపణలు చెబతామని వేణు, సదరు ఛానల్ నిర్వాహకులు చెబుతున్నా, వేణుపై దాడి జరగడం దారుణమైన విషయమే. చట్టాలమీద గౌరవం లేకుండా మనోభావాల పేరుతో ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడులు చేసుకుంటూ పోతే ఇక చట్టాలెందుకు.? ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాల చేతకానితనం సుస్పష్టం.