ఒకప్పుడు ‘స్త్రీ పాత్ర లేని నాటకాలు’ వస్తుండేవి. కారణాలు రెండు: స్త్రీ పాత్రలు వెయ్యటానికి స్రీలు సిధ్ధంగా వుండకపోవటం; పురుషులు స్త్రీ పాత్రలు వేసినా ఆ పాత్రలు రక్తి కట్టక పోవటం. చిత్రమేమిటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ర్ట తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా, తెలంగాణ ప్రజలకు ‘స్త్రీ పాత్ర లేని నాటకాన్ని’ చూపిస్తున్నారు. తన మంత్రి వర్గాన్ని తొలి సారి ఏర్పాటు చేసినప్పుడు కానీ, విస్తరణ చేసినప్పుడు కానీ ఒక్క మహిళా మూర్తిని కూడా ఆహ్వానించలేదు.
అయినా సరే కేసీఆర్ ను ‘తప్పు పడితే తంతాం’ అన్నట్లు, ‘గులాబీ’ మేధావులూ, కేసీఆర్‌ను మోసే ‘పింక్’ మీడియా అధిపతులూ ‘ఫత్వా’లు జారీ చేస్తున్నారు. తెలంగాణ తేరగా వచ్చేయ లేదన్న సంగతి వారికీ తెలుసు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఎదురు చూపులూ, వేన వేల ఉద్యమ కారుల ఆందోళనలూ, వందలాది విద్యార్థుల ప్రాణ త్యాగాలూ వున్నాయి. వీరిలో మహిళలే లేరా? ఉంటే వారికంటూ పాలనలో ప్రాతినిథ్యమే అవసరం లేదా?
కేసీఆర్‌ను మోసే మేధావుల దృష్టిలో, తెలంగాణలో అందరి క్షేమాన్నీ ఒక్క కేసీఆరే చూడగలరు. అంటే, దళితుల క్షేమాన్ని దళితుడి కన్నా, స్త్రీల క్షేమాన్ని స్త్రీ కన్నా కేసీఆర్ ఎక్కువ చూడగలరు. కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి గా వున్నప్పుడు మళ్ళీ ఈ వర్గాలనుంచి వేరే ప్రాతినిథ్యం అవసరమా? అక్కడికీ ఉపముఖ్యమంత్రి స్థానంలో ఒక దళితుణ్ణి వుంచారు కదా ఇది చాలదా? ఇవీ ఆయన అనుయాయుల వాదనలు.
కేసీఆర్ ప్రభుత్వం పనిచెయ్యటం మొదలు పెట్టి ఆరు నెలలు దాటి పోయింది. అంటే ‘పుణ్య(పదవీ) కాలం’లో అప్పుడే పదిశాతం పూర్తయిపోయింది. ‘అప్పుడే ఆయన మీద విమర్శలా? వ్యాఖ్యలా?’ అనే జాగ్రత్త చర్యలు ఇక నడవవు. ఆయన పాలన కింద వున్న ప్రతీ పౌరుడికీ, ఆయన పాలన మీద వ్యాఖ్య చేసే హక్కు వుంటుంది.
స్వతంత్ర తెలంగాణకు తొట్ట తొలిముఖ్యమంత్రిగా దళితుణ్ణి చేస్తానని చెప్పి వాగ్దాన భంగానికి పాల్పడటం, ఎవరు ఒప్పుకున్నా, లేకున్నా, కేసీఆర్ చేసిన తొలి చారిత్రక తప్పిదం. తాను ఆ పీఠం మీద కూర్చుని సమర్థించుకున్న తీరు కూడా దళితులపట్ల సానుభూతి వున్నట్లుగా లేదు. లోతుగా చూస్తే అవమానించే విధంగానే వుంది. ‘ఇప్పుడే ఏర్పాటు చేసుకుంటున్న రాష్ర్టం కదా! సమర్ధవంతమయిన పాలన అవసరం కదా! అందుకుని నన్ను వుండాలనే పార్టీలో శ్రేణులంతా కోరుకుంటున్నారు.’ దాదాపు ఇదే అర్థంలో ఆయన తనను తాను సమర్థించుకుంటూ వచ్చారు. అంటే, అసలు టీఆర్‌ఎస్‌లో తనంతటి సమర్థులు పార్టీలోనే లేరనా? లేక తన పార్టీలోని దళిత నేతల్లో లేరనా? అంటే దళిత నేతను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడితే సమర్థమయిన పాలన ఇవ్వలేడనే గా అర్థం?
ఒకప్పుడు బీసీలకు రిజర్వేషన్లను ఇస్తూ మండల్ శిఫారసులను అమలు జరిపినప్పుడు దేశంలో ఇలాంటి వాదనలే వచ్చాయి. బీసీలకూ, ఎస్సీలకూ ఇవ్వటం వల్ల ‘ప్రతిభ’ కు అన్యాయం జరుగుతుందని. అంటే వారి భావం ఈ వర్గాలలో ప్రతిభా వంతులు వుండరని. దాదాపు కేసీఆర్ సమర్థనలో ఈ భావనే కనిపించింది.
ఇప్పుడు స్త్రీలకు ఇవ్వక పోవటంలో కూడా కేసీఆర్ ఇదే వాదనను చేస్తారా? మంత్రిగా పనిచేయగల సామర్థ్యం వున్న ఎమ్మెల్యేలూ, ఎమ్మెల్సీలూ తన పార్టీలో లేరనే ఆయన భావిస్తున్నారా? తెలుగువారి దౌర్భాగ్యం ఏమిటో కానీ, రెండు రాష్ట్రాలు కలిసి వున్నప్పుడు కూడా ఇన్ని దశాబ్దాలలో అన్ని వర్గాల వారూ ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు కానీ, మహిళ మాత్రం ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేక పోయింది. కానీ కీలకమైన శాఖలు(హోంమంత్రి సహా) మహిళ నిర్వహించింది. రాష్ర్ట విభజన తర్వాత స్త్రీలకు మరిన్ని అవకాశాలు రెండు రాష్ట్రాలలోనూ వస్తాయని ఆశించారు. కానీ రాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు స్థానం కల్పించినా, వారికి ప్రాధాన్యం కలిగిన శాఖల్ని ఇవ్వలేదు. తెలంగాణలో అయితే కేసీఆర్ ‘సున్నా’ చుట్టేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఒక మహిళ (విజయశాంతి) సొంతంగా పార్టీ (తల్లి తెలంగాణ) పెట్టి, టీఆర్‌ఎస్‌లో విలీనం చేసి వైనాన్నే ఆయన మరచినట్టున్నారు. చాలా కాలంలో పార్టీలో ఆమెకు తనతో పాటు (పక్కనే కుర్చీ వేసి) సమ స్థానం కల్పించారు. తీరా అధికారంలోకి వచ్చేసరికి, మంత్రి మండలి ఏర్పాటు మొత్తం ‘స్త్రీ పాత్రలేని గులాబీ నాటకం’ లాగా మారిపోయింది.
ఇప్పటికయినా కళ్ళు తెరచి స్త్రీలకు ప్రాధాన్యం కలిగిన శాఖల్ని ఇచ్చి, తన మంత్రి వర్గంలోకి ఆహ్వానించక పోతే, ఆయన రెండవ చారిత్రక తప్పిదం చేసినట్లవుతుంది. ఆయన తొలి ముఖ్యమంత్రిగా సచివాలయంలో వేసిన కుర్చీలో కాదు, చరిత్ర వేసిన కుర్చీలో కూర్చున్నారన్న విషయాన్ని విస్మరించ కూడదు. ఇప్పుడు ఆయన చేసిన ప్రతీపనీ చరిత్రలో నమోదవుతుంది. తెలంగాణ ఉద్యమ నేతగా ఆయన సాధించుకున్న ఖ్యాతిని తరిగి పోకుండా చూసుకోవాలంటే, ఇలాంటి తప్పిదాలకు దూరంగా వుండాలి.
సతీష్ చందర్