cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Chanakya

జగన్...ఫిట్టా..ఫట్టా..?

జగన్...ఫిట్టా..ఫట్టా..?

ప్రతిపక్షనేతగా జగన్ సరైన దిశలోనే వెళ్తున్నారా? లేక తన చిత్తానికి తాను ముందుకు సాగుతున్నారా? ప్రతిపక్ష నేత అనిపించుకుని మరి కొన్ని నెలల్లో ఏడాది అనుభవాన్ని స్వంతం చేసుకుంటారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఫిట్టా..ఫట్టా..అన్నది చూడడానికి ఈ మాత్రం సమయం సరిపోతుంది. 

ఒక ప్రతిపక్షం పనేమిటి? అధికార పక్షం తన ఇష్టా రాజ్యానికి తన పనులు తాను చేసుకుపోవడానికే ప్రయత్నిస్తుంది. దాన్ని అడ్డుకోవడం అన్నది కీలక కార్యక్రమం ప్రతిపక్షానికి. ఏ విధంగా..?

శాసనసభ, మండలి వేదికలపై నిలదీసి..పాలక పక్షం చేస్తున్న తప్పులను ప్రచారం చేసి..ఆఖరికి ప్రజా వేదికలపైకి చేరి, ప్రజలను సమీకరించి, తద్వారా వస్తున్న వ్యతిరేకత చూసి అధికార పక్షం భయపడి వెనుకడుగు వేసేలా చేయాలి. 

అదే విధంగా ప్రతిపక్షం అన్న సంగతిని పదే పదే గుర్తుంచుకుని, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడడం కాదు. మంచి పనికి ఒకె అంటూ తాము నిర్మాణాత్మక ప్రతిపక్షం అని నిరూపించుకోవాలి.

మరి ఇవన్నీ చూస్తే, ఇప్పటి వరకు జగన్ సరైన బాటలోనే వెళ్తున్నారా? అని ప్రశ్నించుకుంటే, కాస్త అనుమానాలే మిగులుతున్నాయి..అయితే వ్యూహరచనలో విఫలమై వుండాలి లేదా..ఆలోచనా విధానంలో తేడా అన్నా అయి వుండాలి.

జగన్ చేసిందేమిటి?

అసలు ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతగా జగన్ చేసింది ఏమిటి? ఇంకా ప్రతిపక్ష పాత్ర ప్రారంభం కాకుండానే హుద్ హుద్ వచ్చింది. అక్కడ పెద్దగా ఏమీ చేయడానికి అవకాశం లేకపోయింది. తెలుగుదేశం పార్టీ చాలా తెలివిగా వ్యవహరించడంతో అవసరమైన వారికి, అక్కర్లేని వారికి కూడా సరుకులు పంచడం, డీలర్లు తమ శక్తి కొద్దీ సరుకులు చేసుకోవడం జరిగిపోయింది. ఏ ప్రజలు దీన్ని నిరసిస్తారు..అంతా అవకాశం దొరికింది అనుకునేవారే కదా. 

అందువల్ల వైకాపా ఈ వ్యవహారాన్నిపెద్దగా ప్రతిఘటించలేకపోయింది. ఏదో ప్రకటనలతో సరిపెట్టింది. ఆ తరువాత జగన్ గురిపెట్టింది రైతుల సమస్యలపై...రుణ మాఫీపై.  ఈ విషయంలో మాత్రం జగన్ అధికార పక్షంపై బాగానే వత్తిడి తేగలిగారు. అది ఏం రేంజ్ లో సాగిందంటే, జగన్ దీక్షకు దిగుతాననే సరికి, ఒక రోజు ముందుగా చంద్రబాబు దిగివచ్చి, రుణ మాఫీ విధి విధానాలు ప్రకటించేవరకు. 

ఇంతవరకు బాగానే వెళ్లింది జగన్ ప్రతిపక్ష బండి. కానీ అక్కడి నుంచే ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్న రీతిలో సాగుతోంది. జగన్ కు అతి పెద్ద సమస్యలు కొన్ని వున్నాయి. అది ఒకటి కేంద్రాన్ని బలంగా విమర్శించలేకపోవడం. రెండవది కేసిఆర్ ప్రభుత్వాన్ని ఉపేక్షించడం..మూడవది, ఎన్నికల తరువాత నాయకులను వదులుకోకుండా వుండడంలో చూపుతున్న ఆసక్తి, కార్యకర్తల సమీకరణ,  ఆ బేస్ ను బలోపేతం చేసుకోవడం, వారిని చురుగ్గా వుంచడం, పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం అన్నది మిగిలినవి. 

కేంద్రంపై గట్టిగా మాట్లాడలేకపోవడానికి కారణం అర్థం చేసుకోవచ్చు. జగన్ పై వున్న కేసులు అలాంటివి. వాటి నుంచి చాకచక్యంగా బయటకు రావడం అవసరం. అందుకోసం కేంద్రంతో సఖ్యంగా వుండడం అన్న జగన్ స్ట్రాటజీని అర్థం చేసుకోవచ్చు. కానీ ఎన్నికల తరువాత చాలా కాలం తెలంగాణలోని కేసిఆర్ ప్రభుత్వాన్ని ఉపేక్షించుకుంటూ వచ్చారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల మాదిరి కాదు, ఈ రెండు రాష్ట్రాల వ్యవహారం. ఇదంతా అవిభక్త కవలల టైపు. కలిసి వున్నారా అంటే వున్నట్లే..విడివిడిగానే అంటే అలాగే..కానీ ఈ లింక్ వల్ల వచ్చే ఇబ్బందులు ఇన్నీ అన్నీ కావు. 

అందునా చేరో చోట, చెరో పార్టీ అధికారంలో వుంటే మరీనూ. నిజానికి ఇది అదే సమయంలో ప్రతి పక్షాలకు వరం అవుతుంది. కానీ జగన్ ఈ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. దాదాపు ఇప్పటి వరకు కేసిఆర్ ప్రభుత్వాన్ని నిలదీసిందీ లేదు..దానిపై పోరాడిందీ లేదు. మహా అయితే పత్రికా ప్రకటనలు తప్ప. అసలే పార్టీ అంతంత మాత్రంగా వున్న తెలంగాణలో దాన్ని పునర్నిర్మాణం చేసే ప్రయత్నమే కనిపించలేదు. 

వ్యవస్థ అస్తవ్యస్థం

ఇక పోతే అది కీలకమైనది కార్యకర్తలు, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం అన్నది. తరచు ప్రయోగాలు చేయడం అన్నది జగన్ పార్టీకి వున్న అతి పెద్ద సమస్య. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఎవర్నో ఒకర్ని నమ్మి పగ్గాలు అప్పగించడం, వాళ్లు వాళ్లకు చేతయినంత చేటుచేసాక, వాళ్లను తప్పించి వేరేవాళ్లకు అప్పగించడం అన్నది ఇప్పటికీ నడుస్తున్న శైలి. ప్రస్తుతం పార్టీ పగ్గాలు విజయసాయిరెడ్డి చేతిలో వున్నాయి. ఆయన తరచు జిల్లాలు తిరుగుతున్నారు..సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ నాయకులు తప్ప కార్యకర్తలు కనిపించడం లేదన్నది వాస్తవం. 

దీనికి రెండు కారణాలున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు పార్టీనిర్వహణ అనేది అంత సులభ సాధ్యం కాదు. ఎందుకంటే రాజకీయాలను, పార్టీలను నమ్ముకున్న వారిలో నూటికి యాభై మంది వారి వారి స్వంత లేదా వ్యాపార ప్రయోజనాలు ఆశించి వుంటారు. అందువల్ల  అది తెలుగుదేశం కావచ్చు, వైకాపా కావచ్చు. దీనికి తోడు పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో వైకాపా కార్యకర్తల హత్యలు వంటివి పరిస్థితిని మరింత దిగజార్చాయి. దీంతో కార్యకర్తలను ముందుకు నడిపించడం కాస్త కష్టమైంది. కానీ ఈ పరిస్థితి లేని జిల్లాల్లో కూడా వైకాపా అటువంటి ప్రయత్నాలు చేయలేదు. 

మరోపక్క మిగిలిన పార్టీలు సదస్సులు, సభ్యత్వ నమోదలు వంటి కార్యక్రమాలు చురుగ్గ చేస్తున్నాయి. వైకాపా అలాంటి వ్యవహారాల జోలికి పోవడం లేదు. విజయవంతం కావు అన్న భయం వుంటే వుండొచ్చు. కానీ నికార్సయిన సరుకు ఎంత వస్తే అంతే రావచ్చు. పార్టీకి ఒక్క ఊళ్లో ఒకళ్లో ఇద్దరో  వుంటే వుండొచ్చు. కానీ జెండా అనేది కనిపిస్తుంది. ఇప్పుడు వైకాపా జెండా అన్నది ఏ ఊరిలోనూ కనిపించడం లేదు. స్టామినా తక్కువ వున్నవారు, మరే పార్టీ చేరదీయదు అనుకున్నవారు కొంతమంది వైకాపా ను వీడకుండా వున్నారు. వీరితోనే పోస్టుల భర్తీ వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు తప్ప, విస్తృతికి ప్రయత్నించడం లేదు.

వైకాపా ప్రతిపక్ష పాత్ర ప్రారంభించిన తొలినాళ్లలోనే ఎదురైన కీలకసమస్యలు కొన్ని వున్నాయి. ఒకటి రాజధాని భూముల సమీకరణ. రైతులను ఇబ్బంది పెట్టి, బెదిరించి మరీ సేకరణ చేసారు. ప్రతిపక్షాలన్నీ దీన్ని నిరసించాయి తప్ప ఒక్క తాటిపైకి రాలేదు. ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా ఆ దిశగా ప్రయత్నమూ చేయలేదు. పోనీ రాజధాని ప్రాంతంలో బలమైన ఉద్యమాన్ని నిర్మించలేకపోయింది. రాజధానిపై రైతులను సమీకరించి ఉద్యమం చేయలేకపోయింది. నిజంగా అక్కడ సమీకరణలో సమస్య వుండి వుంటే, వైకాపా కనువ సరైన ఉద్యమం నిర్మించి వుంటే, కచ్చితంగా అధికారపార్టీ అడగు కాస్తయినా వెనక్కు వేసేది. 

ప్రజా ఉద్యమాలేవీ?

ఇక బడ్జెట్ సమావేశాలు. వీటిని పూర్తిగా వైకాపా పట్టిసీమకు అంకితం చేసేసింది. రైతులు, డ్వాక్రా మహిళల సమస్యలు ప్రస్తావిద్దామనుకున్నా అధికార పక్షం ఆగడాల ముందు అది సాగలేదు. సరే, మంది బలం వుంది. అసెంబ్లీలో నెగ్గలేకపోయారు. మరి ఈ రెండూ జనాల సమస్యలే కదా. మరి జన ఉద్యమం నిర్మించే దిశగా వైకాపా ఎందుకు ప్రయత్నం చేయడం లేదు. డ్వాక్రా రుణాల మాఫీ జరగలేదు..అంగన్ వాడీల వేతనాల పెంపు సమస్య వుంది. దీనికి తోడు పట్టి సీమ వల్ల అన్యాయం జరుగుతుంది అంటున్నారు. ఈ మూడింటిపై మూడు ప్రజా ఉద్యమాలు నిర్వహించవచ్చు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు అస్సలు జరగలేదు. మరోపక్క విద్యుత్ చార్జీలు పెంచారు. వాటిపై కూడా ప్రజలను సమీకరించే పని పెట్టుకోనేలేదు. ఎంత సేపూ ప్రకటనలు తప్ప, వేరే వ్యవహారం లేదు.
 
ఢిల్లీ వెళ్లడం ఎందుకు?

పోనీ ప్రకటనలతో సరిపెట్టారా అంటే, ప్రజా సమస్యలు వదిలి ప్రత్యేక హోదా, నిధులు కావాలి అంటూ కేంద్రం దగ్గరకు జగన్ వెళ్లారు. ఇది మరీ అసంబద్ధం. అది అధికార పార్టీ వ్యవహారం. పాలనకు నిధుల కావాలి, అభివృద్ది సాధనకు ప్రత్యేక హోదా కావాలి. అన్నది పాలక పక్షం ఎలాగూ సాధించుకుంటుంది. దాని కోసం జగన్ కు ఎందుకు ఆతృత. తను వెళ్లాక పోనీ నిధులు, హోదా వచ్చేసిందే అనుకుందాం. అదేమన్నా జగన్ ఖాతాలోకి వస్తుందా? అయితే భాజపా ఖాతాలోకి వెళ్తుంది. తప్పితే దాని మిత్ర పక్షం తేదేపా తీసుకుంటుంది. ఆ మాత్రం దానికి తాను చేయాల్సిన, పోరాడాల్సిన వాటిని వదిలి ఢిల్లీ ఎందుకు వెళ్లడం. పైగా తాను ఢిల్లీ వెళ్తే, కేసుల మాఫీకి అని తెలుగుదేశం ఎలాగూ నింద వేస్తుంది. అది తెలిసీ ఎందుకు వెళ్లడం.

అంతకన్నా అసెంబ్లీ కాగానే ప్రజల్లోకి మూడు టీమ్ లుగా వెళ్లి వుంటే..పట్టిసీమతో నిజంగా సమస్య అయితే ప్రజలు కలిసి వస్తారు కదా..కదం తొక్కుతారు కదా. అలాగే డ్వాక్రా మహిళలను, అంగన్ వాడీ మహిళలను ఉద్యమదిశగా నడిపించవచ్చు కదా. కరెంట్ చార్జీలపై జనాభిప్రయాన్ని కూడా గట్టవచ్చు కదా..

ఇదంతా ఎవరు చేయాలి. నాయకులు. లేదా గెలిచిన ప్రతినిధులు. అందరికి అందరూ నిమ్మకు నీరెత్తినట్లు వున్నారు. కారణం, ఇప్పట్లో ఎన్నికలు లేవు, ప్రతిపక్షంలో వుంటూ కాణీ ఆదాయమూ లేదు. నిజానికి చాలా మంది తెలుగుదేశంలోకి జారుకునేవారే. అయితే ఫిరాయింపుల సమస్య, మరోపక్క ఇలాంటివాటిపై తెలుగుదేశం పార్టీ కూడా అంత సుముఖంగా లేదు. ఆరంభంలో ఒకరిద్దరిని ప్రోత్సహించింది కానీ, ఇప్పటికే పార్టీ ఇబ్బడి ముబ్బడిగా నాయకులతో కిటకిటలాడుతోంది. ఇంకా తెచ్చుకోవడం అంటే లేని పోని ఇబ్బందులను కొని తెచ్చుకోవడమే. 

అందుకే తేదేపా ఊరుకుంది.దీంతో తప్పని సరై వైకాపా లో కొనసాగుతున్న వారు చాలా మంది వున్నారు.వీరంతా తెరచాటున తేదేపాతో సఖ్యతగా వుంటూ చిన్న చిన్న పనులైనా చక్క బెట్టుకుంటున్నారు. ఇలాంటి వారితో ఏం ఉద్యమాలను నిర్మిస్తారు. ఈ పరిస్థితి జగన్ కు తెలియంది కాదు. మరో సమస్య ఏమిటంటే ప్రతిపక్షంలో వున్నపుడు పార్టీని నిలబెట్టుకోవాలంటే డబ్బులు కూడా చాలా కీలకం. అధికారంలో వుంటే, తమ పనుల కోసం నాయకులు తమ జేబుల్లోంచి డబ్బులు తీసి ఖర్చు చేస్తారు. ప్రతిపక్షానికి ఆ వెసులు బాటు వుండదు. అలా అని ఇప్పుడు జగన్ తన చిత్తానికి డబ్బులు ఖర్చు చేయడం అన్నది మానేసాడు. ఓదార్పు యాత్రలు ప్రారంభించినపుడు విచ్చలవిడిగా డబ్బులు జల్లారు. జనం వెల్లు వెత్తారు. ఇప్పుడు మళ్లీ ఆ రేంజ్ లో జనం రావాలి, ఉద్యమించాలి అంటే, అంతకు అంతా ఖర్చు చేయాలి.

తొందరేముంది?

జగన్ ఆలోచన ఇప్పటి నుంచీ అంత లెవెల్ లో ఉద్యమించి చేసేదేముంది అన్న రీతిలో సాగుతోంది. ఇంకా నాలుగేళ్ల సమయం వుంది. అంతగా కావాలంటే, ఎన్నికలకు దగ్గర చేసి, అప్పుడు ఖర్చు చేసి ఉద్యమాలు నిర్మించవచ్చు. ఇప్పటి నుంచీ అదే కార్యక్రమం పెట్టుకుంటే అలుపు తప్ప సాధించేది ఏమీ వుండదని ఆలోచన చేస్తున్నట్లుంది. ఇది కొంత వరకు వాస్తవమే కావచ్చు కానీ, జనాలు ఎప్పటికప్పుడు లెక్కలు కడుతుంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని జనం పట్టించుకోవడం లేదు. తీరిగ్గా నాలుగేళ్ల తరువాత ప్రజల ముందుకు వెళ్తామంటే కుదరదు. బహుశా ఈ ఉద్దేశంతోనే కావచ్చు, జగన్ ఉద్యమ నిర్మాణం సంగతి పక్కనపెట్టి, తనకు అలవాటైన ఓదార్పు బాటలోనే ముందుకు వెళ్తున్నారు. 

ఈ పేపర్ ఎక్కడా?

వైకాపా తరపున ఇన్ హౌస్ మాగ్ జైన్ తెస్తామని, ఈ పేపర్ నిర్వహిస్తామని, తద్వారా కార్యకర్తలకు, నాయకులకు దిశ, దశ, ఫీడింగ్ కలిగిస్తామని గతంలో విజయసాయి రెడ్డి చెప్పారు. కానీ ఇప్పటి వరకు  ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు లేదు. సాక్షి పత్రికను మరీ పార్టీ కోసం వాడుకునే అవకాశం తక్కువ. ఎందుకంటే కాస్తయినా బ్యాలెన్స్ గా నడపకుంటే, నాలుగేళ్లు నిలబడాలి. వచ్చే ఎన్నికల నాటికి,పార్టీ, సాక్షి రెండూ నిలబడడం అవసరం. 

మరి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ, జగన్ ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించగలుగుతున్నారా అంటే కాస్త అటు ఇటుగా అనే సమాధానం వస్తుంది తప్ప, సూపర్ అనో, అవును అనో మాత్రం సమాధానం రాదు. అలా కాకుండా శభాష్ అనిపించుకోవాలంటే, జగన్ కు చాలా పరిస్థితులు అనుకూలించాలి. పార్టీని నిర్వహించగల పటిమ కావాలి. అది సాధ్యమేనా? అంటే వేచిచూడాల్సిందే.

చాణక్య

writerchanakya@gmail.com

 


×