Advertisement


Home > Articles - Kapilamuni
చిరంజీవి గారూ, ప్లీజ్... రీథింక్ & రీఫిల్...!

మెగాస్టార్ చిరంజీవి తన వ్యక్తిగత జీవితంలో మైలురాయి వంటి 150 వ చిత్రాన్ని చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఒక కొత్త వ్యక్తిగా సినీ పరిశ్రమలోని ఉద్ధండుల మధ్యకు అడుగుపెట్టి, తనను తాను మలచుకుంటూ వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ.. స్వయంకృషితో తనను తాను తీర్చిదిద్దుకుంటూ ఎదిగిన వ్యక్తి నేడు ‘చిరంజీవి’గా నిలిచిన ఈ కొణిదెల శివశంకరప్రసాద్. ఆయన  ప్రస్థానం నుంచి మిగిలిన వారు నేర్చుకోదగిన విషయాలే ఎక్కువగా ఉంటాయి. అలాంటి మెగాస్టార్... 149వ చిత్రానికి 150 చిత్రానికి మధ్య కొన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చేసింది. ఈ ‘గ్యాప్’ మీద రాజకీయాల ప్రభావం పరిమితం. కానీ సీరియస్‌గా ‘‘150వ సినిమా వెంటనే చేసేయాల్సిందే’’ అని కసరత్తు మొదలుపెట్టిన తర్వాత కూడా  ఇప్పటికి ఏళ్లు గడుస్తున్నాయి. 149 చిత్రాల అనుభవం ఉన్న ఒక మెగాస్టార్‌కి ఒక్క సినిమా విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పడుతున్నదెందుకు? జాప్యం జరుగుతున్నదెందుకు? ఇప్పటికీ టైటిళ్లు, టెంకాయ కొట్టే తేదీలూ లీక్ అవుతున్నాయే తప్ప గ్యారంటీ లేదు. ఇంత పెద్ద పెద్ద స్టార్ అలాంటి కెరీర్ సందిగ్ధావస్థలో ‘ఈదడం మరచిపోయిన చేప’లాగా కొట్టుమిట్టాడుతుండడం ఎందుకు జరుగుతోంది? లక్షలాది మంది అభిమానుల హృదయాల్లో  ఇలాంటి సందేహాలు కొల్లలుగా ఉన్నాయి. ఆ కోణంలో ఈ లేఖావ్యాసం ఓ విశ్లేషణ. 

ప్రియమైన చిరంజీవిగారూ!

నటుడిగా తన జీవన గమనాన్ని నిర్దేశించుకోదలచుకున్న ఒక మీలాంటి ఒక వ్యక్తికి, 150వ సినిమా చేస్తున్న సందర్భం చాలా అపురూపమైనది. ఉద్విగ్నభరితమైనది. ఉద్వేగపూరితమైనది. అలాంటి కీలక సందర్భంలో లోలోపల మీకు తెలియకుండానే చాలా మధనం తప్పక ఉంటుంది. పైగా మీరు ఎంచుకున్న రంగంలో సమకాలీనులకు సాధ్యం కాని అనేక కొత్త శిఖరాలను అధిరోహించిన వ్యక్తి మీరు. నటుడిగా అనేక మంది దర్శకులు, పెద్దల ఉలిదెబ్బలను ఆనందంగా స్వీకరించి మిమ్మల్ని మీరు మలచుకున్నారు. పరిణతి సాధించారు. ‘‘వారెవ్వా.. ఇది చేస్తే చిరు గాడే చెయ్యాల్రా’’ అని మీ సినిమా చూసి.. తెలుగుసినిమాకు ప్రాణదాత అయిన నేలక్లాసు ప్రేక్షకుడు.. ఈలవేసి మురిసిపోయేంత ప్రేమాభిమానాల్ని సొంతం చేసుకున్నారంటే అది కేవలం మీ స్వయంప్రతిభ, స్వయంకృషి, స్వీయవ్యవహారదక్షత మాత్రమే. కానీ ఇప్పుడు మీ 150 చిత్రం విషయంలో మీకేమైంది. సందిగ్ధమేఘాలు మిమ్మల్ని కమ్ముకుని.. ఊపిరాడనివ్వనట్లుగా కనిపిస్తోంది. మీ అభిమానుల్లోనూ రకరకాల సందిగ్ధాలు దోబూచులాడుతున్నాయి. అవేమిటో కాస్త సావకాశంగా అవలోకించండి.

మీకు స్పష్టత లేకపోవడమే తొలివిఘ్నం!

‘లార్జర్ దేన్ లైఫ్ సైజ్’ ఇమేజికి చేరుకున్న ప్రతి ఒక్కరికీ ఒక దశలో ఇప్పుడు మీకున్న సందిగ్ధత లాంటిది ఉంటుంది. అయితే ప్రపంచంలో గొప్పవాళ్లంతా ఆ సందిగ్ధపు పొరలను కూడా అధిగమించిన వారే! ఆ సంగతి మీకు తెలియనిది కాదు. రాజకీయంగా ఉన్న వైఫల్యాలను గురించి విపులంగా చర్చించడానికి ఈ వ్యాసం వేదిక కాదు. కానీ.. రాజకీయాల్లోకి వెళ్లినంత మాత్రాన సినీ రంగానికి దూరం కావాలనుకున్న నాటి ఆలోచనే సమీక్షించుకోదగినది. 

సినిమా చేయాలా వద్దా? ఎలాంటి సినిమా? ఇలాంటి అనేక సందిగ్ధతలు మిమ్మల్ని వెనక్కు లాగుతున్నట్లు కనిపిస్తోంది. మీలో కొంత సందిగ్ధం ఉంటే చాలు.. సాధారణంగా చుట్టూ పది మంది చేరి.. ఎవరి ప్రయోజనాలకు వారు బాటలు వేసుకుంటూ అలాంటిది చేయండి, ఇలాంటిది చేయండి.. అంటూ మీలోని సందిగ్ధాన్ని మరింత పెంచగలరు. 
చిన్న ఉదాహరణతో అనుకుందాం. మీరు ఒక సినీ రచయితను  లేదా దర్శకుడిని పిలిచి ‘‘కథకావాలి. నా 150వ సినిమా అంటే నీకో అంచనా ఉంటుంది కదా! ఆ మేరకు కథ తయారుచేసుకురా’’ అని మీరు చెప్పారంటే గనుక.. మీరు నూటికి నూరుశాతం ఫెయిలయినట్లే. మీలో సందిగ్ధత అనేది కొండల్లా పేరుకుపోయి ఉన్నట్లే. మీరు ప్రస్తుతం అలాచెప్పే దశలో లేరు అనే సంగతి తెలుసుకోండి. ‘‘ఇదిగో నా 150 వ చిత్రానికి ఫలానా రకం కథకావాలి. ఒకటి సిద్ధం చేయండి’’ అని చెప్పగలిగితేనే... అది సరైన ఫలితాన్నిస్తుంది. ఆలోచించండి. 

అసలు మీరు చేయదలచుకున్నదేంటి? ఎందుకు?

సినిమా అనేది ప్రధానంగా ‘వినోద’ మాధ్యమం. ప్రజలకు అది సందేశాన్ని, సమాచారాన్ని, ఆలోచనను, స్ఫూర్తిని, జ్ఞానాన్ని, దార్శనికతను, శక్తిని కూడా అందించగలదని 149 సినిమాల అనుభవంలో మీకు తెలియకుండా ఉండదు. ఇన్‌ఫాచుయేషన్ తప్ప ప్రేమంటే తెలియని కుర్రాడు ప్రియురాలిని కాఫీడేల వెంట తిప్పడం తప్ప.. మరోరకంగా తమ బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చునని ఎరగనట్లుగా.. సినిమా పట్ల అవగాహన లేకపోయినా, దాని మీద ఆశ ఉన్న ఓ కుర్రాడు ‘వినోదం’ అనే కొలబద్ధగా సినిమాను ఎంచుకున్నట్లుగా... ఇంతటి సీనియర్ అయినా మీరు ఇంకా మొదటి నిర్వచనం దగ్గర తచ్చాడుతున్నారు ఎందుకు?

‘ఆటోజానీ’ అనే చిత్రం మీరు చేయబోతున్నట్లుగా టైటిల్ లీక్ అయిన నేపథ్యంలో ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఇలాంటి టైటిల్‌తో ఉండగల ఒక చిత్రం చేయడం ద్వారా మీరేం అనుకుంటున్నారు? తెలుగు ప్రేక్షకలోకాన్ని విచ్చలవిడిగా ఎంటర్‌టైన్ చేసేద్దాం అని దూసుకెళ్లిపోతున్నట్లుగా కనిపిస్తోంది. దీన్నిచూస్తే నాబోటి సామాన్య అభిమానికి కలిగే సందేహాలు కొన్ని ఉన్నాయి. అసలు మీరు చేయదలచుకున్నదేంటి? ఎందుకు?

(1) ‘‘వినోదం అనగా నవ్వులు మరియు కామెడీ’’ అనుకుందాం. మీరు ఎంతటి వినోదాన్ని ప్రేక్షకులకు అందించగల స్థితిలో ఉన్నారు. అదికూడా ఈ అరవయ్యేళ్ల వయసులో! బ్రహ్మానందం, సప్తగిరిని మించిన కామెడీ చేయగలిగిన స్థితిలో మీరున్నారా? శ్రీనువైట్ల కోన వెంకట్ బాపతు తలాతోకా ఉండని పుట్టెడు నవ్వుల్ని మీరు జనానికి పంచగల స్థితిలో ఉన్నారా? ఒకసారి చెక్ చేసుకోండి.

(2) ‘‘వినోదం అనగా డ్యాన్సులు తద్వారా అలరించడం’’ అనుకుందాం. చిరంజీవి అనే హీరో కేవలం డ్యాన్స్‌లు అనే అదనపు అర్హత ద్వారా తన తొలిరోజుల్లో సమకాలీనులైన అందరు హీరోల మీద పైచేయి సాధించి ఎదిగాడనే సంగతి మీకు తెలుసు. తెలుగుతెరకు అలాంటి డ్యాన్స్‌పటిమను రుచిచూపించి... ఎప్పటికప్పుడు  అందులో ట్రెండ్స్  మారుస్తూ వచ్చినది మీ ఘనతే! కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? మగధీరలో చిన్న బిట్ డ్యాన్స్ కోసం... ఘరానామొగుడు నాటి పాత క్లిప్పింగ్‌ను వాడుకోవాల్సి వచ్చింది. ఎంతటి నామర్దా ఇది. పైగా ఇప్పుడు అల్లు అర్జున్, ఎన్టీఆర్ ల కంటె ఎంత గొప్పగా డ్యాన్స్ చేయగలరు? ఎలాంటి డ్యాన్స్‌లతో ప్రేక్షకులను అలరించగలరు? వారికంటె బాగా చేస్తాననే నమ్మకం మీకుందా? అంత అవసరం అసలేమిటి? ఆలోచించారా.

(3) ‘‘వినోదం అనగా పంచ్‌లు, స్టైలింగ్’’ అనుకుందాం. మీరు ఎరిగిన ‘రఫ్ఫాడించడం, బాక్సు బద్ధలవడం’ దగ్గరినుంచి సినీ పంచ్‌ల రూపురేఖలు ఇవాళ పూర్తిగా మారిపోయాయి. అయినా ఇవాళ తెరమీద త్రివిక్రం లాంటి దర్శకుడి సినిమాలో అయితే ప్రతివాడూ ప్యాంట్ షర్ట్ వేసుకోకపోయినా.. పంచ్ లు మాత్రం తప్పక వేసేస్తుంటాడు. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మీరు మళ్లీ  ఎంట్రీ ఇచ్చి.. పవన్‌కల్యాణ్, మహేష్ లను మించి పంచ్‌లు వేసి మెప్పించేది ఏముంటుంది? జనాల్ని మురిపించే స్టయిలింగ్ అంటారా.. పవన్‌కల్యాణ్, ప్రభాస్‌లను మించి ఎలా యూత్‌ను ఇంప్రెస్ చేయగలరు?
ఇలాంటి కోణాలన్నిటినీ.. మీరు కాస్త సావకాశంగా మీలో మీరు తర్కించుకోండి. అలాంటి ఆత్మసమీక్ష లోంచి అచ్చంగా మీరు ఎలాంటి సినిమా చేయాలో మీకే ఒక కొత్త అయిడియా వస్తుంది.

ప్రజలు మీనుంచి కోరుకుంటున్నది ఏంటి?

ఎలాంటి సినిమా చేయాలో నిర్ణయించుకునే ముందు.. మీరు ప్రజలు మీ నుంచి ఏం కోరుకుంటున్నారో కూడా సమీక్షించుకోవాలి. ఈ ప్రక్రియ సహజంగానే జరుగుతుంది. కానీ.. ఇలాంటి సమీక్ష మామూలుగా మన వందిమాగధులను చుట్టూతా పరివేష్ఠింపజేసుకుని.. ఓ సమావేశం నిర్వహించి.. చర్చించుకోవడం జరుగుతూ ఉంటుంది. వారు తమ మనసెరిగి.. తదనుగుణంగా పక్కవాయిద్యాలు శృతిచేసుకుంటూ ఉంటారు. వారు అలా చేస్తున్నారనే అనుమానం కూడా మీకుంటుంది. అందుకని వారి మాల్ని పూర్తిగా నమ్మనూ లేరు. ఏతావతా ఆలోచన ఆలస్యం అవుతూ ఉంటుంది. 

రాజకీయాల్లో మీరు ఎంట్రీ ఇచ్చినది రాంగ్ టైం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కావొచ్చు. కానీ, ఆ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది జనం మీమీద కొత్త ఆశలు పెట్టుకున్నారనే సంగతి అయినా మీరు అర్థం చేసుకోవాలి. మీరు పొగడ్త కింద తీసుకోకుండా ఉండేట్లయితే.. ఒక సంగతి చెప్పాలి. మంచోచెడో ఈ రాష్ట్రంలో ఎన్‌టి రామారావు తర్వాత.. ప్రజలందరి అభిమానాన్ని అతి ఎక్కువ స్థాయిలో సంపాదించుకుంటున్న నటుడు మీరొక్కరే. కులం, మతం, ప్రాంతం అన్నిటికీ అతీతంగా జనం మిమ్మల్ని ప్రేమించారు. ఎన్టీఆర్‌లాగే, మీరు కూడా పార్టీ పెట్టదలచుకున్నప్పుడు.. మీమీద కూడా అలాగే ఆశలు పెరిగాయి. కానీ అంతమంది జనం ప్రేమించిన మీ పార్టీ.. ఒక కులానికి పరిమితమైన పార్టీగా ముద్ర పడిపోవడం ఎలా జరిగిందో మీ సమీక్షల్లో బహుశా అర్థమయ్యే ఉంటుంది. జనం తనను నమ్మినందుకు ఆ ఎన్టీఆర్ ఎలా రుణం తీర్చుకున్నారో.. మీరు ఆ పనిచేయలేకపోయారు. అక్కడ మీరు విఫలమయ్యారు. ఇప్పుడు మళ్లీ సినిమాలు అంటున్నారు. ఆ వైఫల్యాన్ని పూడ్చుకోవడానికి ఈ కొత్త ప్రస్థానంలో సెకండిన్నింగ్స్‌లో ఎలాంటి  ప్రయత్నం చేస్తున్నారు. 

జనం ఇన్నాళ్లుగా మీమీద పెట్టుకున్న రెండోపార్శ్వపు ఆశల గురించి, నమ్మకం గురించి... ‘వాటిని నేను గుర్తించాను’, ‘మీరుణం నేను తప్పకుండా తీర్చుకుంటాను’ అని మీదైన సినిమా మీడియా ద్వారా వారికి చెప్పవలసిన బాధ్యత మీమీద లేదా? ప్రజలు చిరంజీవిని మళ్లీ ఒక ‘రౌడీమొగుడు’లాగా చూసుకుని మురిసిపోదాం అనుకుంటున్నారా? అలాగని మీరు ఏ సర్వే ద్వారా అయినా తెలుసుకున్నారా? తెలుసుకుంటే ఇంకా మంచిది.

మీరు అచ్చంగా ‘ఆటోజానీ’ లాంటి సినిమాలు చేసుకుంటూ.. జనాన్ని అలరిస్తూ తరించండి. లేదా ‘నాకు ఇంత ఇచ్చిన సమాజానికి తిరిగి నేనేం ఇచ్చాను..’ (పార్టీ పెట్టేప్పుడు ఇవి మీ మాటలే) అనేది తేల్చుకోవడానికి రాజకీయాల్లో కూడా కొనసాగేట్లయితే.. ‘...అలా తిరిగి మీరు ఏం ఇవ్వదలచుకున్నారో.. ఆ దిశగా, మీ దార్శనికతవైపు ఆలోచించేలా ప్రజల్ని తీర్చిదిద్దే’ సినిమాలు చేయండి. మీకో ఇరవైకోట్లు రెమ్యునరేషన్ ఇచ్చుకుని, ఓ 80 కోట్ల సినిమా చేసి.. కనీసం 150 కోట్లు వసూళ్లు చేయాలనుకునే నిర్మాత ఒక్కడి కోసం మీరు సినిమా చేస్తున్నారా? లేదా మీనుంచి ఏమీ ఆశించకుండా మీకు నీరాజనాలు పట్టిన, ఇంకా మిమ్మల్ని కొత్త శిరాల మీద చూడాలనుకుంటున్న లక్షల మంది అభిమానుల కోసం మీరు చిత్రం చేస్తున్నారా?

అలాగే ఇంకో పెద్ద ప్రశ్న కూడా వేచి ఉంది. అభిమానుల క్షణికానందం కోసం సినిమాచేస్తున్నారా? వారి శాశ్వతమైన మంచి కోసం సినిమాను మీరు అంగా వాడుకోదలచుకున్నారా? ఈ విషయంలో స్పష్టంగా ఒక నిర్ణయానికి రండి. తర్వాత మిగిలిన పనులు వాటంతట అవే జరిగిపోతాయి. 

వ్యక్తిత్వవికాసం మీకు నేర్పిందేమిటి?

చిరంజీవి గారూ! వ్యక్తిత్వ వికాస నిపుణులు అనేకమంది తమ తమ వ్యాసాల్లో చిరంజీవిని చూసి నేర్చుకోవడం గురించి ఉదాహరణలు ఇచ్చారు. స్వయంగా మీరు అనేక పుస్తకాల్ని ఆవిష్కరించారు. వాటిని చదివినట్లు చెప్పారు. వ్యక్తిత్వ వికాసానికి మీరో ‘మూర్తి’గా పలువురు భావిస్తారు. అయితే అలాంటి వ్యక్తిత్వ వికాసం మీకు అసలు ఏం నేర్పింది? ఫలితం గురించిన ఆపేక్ష లేకుండా పనిచేయడం (నిష్కామకర్మ), మీ దక్షతను దాచుకోకుండా పనిచేయడం అనే లక్షణాలు మీలో పోయాయా? పాజిటివ్ థింకింగ్ లాంటివన్నీ మరచిపోయారా? మీలో ఉన్న తాత్విక చింతన మొత్తం ఏమైపోయింది?

ఇలాంటి కీలక సమయంలో ‘బాహుబలి’ ని మించిన ఓపెనింగ్‌లు, థియేటర్లు పడే సినిమా చేయాలి అంటూ నేలబారు లక్ష్యాలను పెట్టుకుని ‘అలాంటి సినిమా కావా’లంటూ మీరు దర్శకుల్ని వెంటపడుతూ ఉంటే గనుక, మీరు ఎప్పటికీ సినిమా చేయలేరు! మీ సినిమా జీవితం అనేది చరిత్రపుటలకు ఎక్కిపోయిన ‘గతం’ అవుతుందే తప్ప.. దానికి ఇక ‘భవిష్యత్తు’ లేదు! ముందు ఫలితం మీద కన్నేసి, దానికోసం పనిని వంకర టింకర మార్పులతో చేసుకుంటూ పోయే పద్ధతిని అనుసరించవద్దు. మీరు నటుడు. నటన, పెర్ఫార్మెన్స్ అంటే ఆపాదమస్తకమూ ఒక తహతహ, తపన నిండినటువంటి.. లోలోపల  జ్వలించే తృష్ణను కలిగిఉన్నటువంటి.. ఒక ‘మెగాస్టార్ చిరంజీవి’... ఒక మామూలు వ్యక్తి అయిన కొణిదెల శివశంకర ప్రసాద్‌లో ఉన్నాడు. 

ఆ ‘చిరంజీవి’గా మిమ్మల్ని మీరు నడిపించుకోండి. కెరీర్ తొలిదశలోనే ఉన్నాను.. అనుకుంటూ మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి. మీ బాటను మీరే తీర్చిదిద్దుకోండి. ‘చిరు’ పథనిర్దేశకుడు ‘చిరు’నే కావాలి. చిరంజీవి సినిమా చేసేసి ఏదో ఓపెనింగ్స్ టికెట్లు అమ్మేసి నాలుగు రాళ్లు వెనేకసేసుకుందాం.. దీన్ని డైరక్టు చేసేసి.. కొత్త రికార్డులతో కీర్తిని పెంచేసుకుందాం... నిత్యం చిడతలతో మిమ్మల్ని భజన చేసి ఏతో ఒక రకంగా లబ్ధిపొందుదాం అని ఎదురుచూసే ఆమాంబాపతు వ్యక్తులు మీ ఆలోచనల్ని నిర్దేశించే దుస్థితి రాకుండా జాగ్రత్తపడండి. అలాంటి వాళ్లకోసం కాకుండా.. మామూలు వ్యక్తినుంచి మెగాస్టార్‌గా మిమ్మల్ని మార్చిన ప్రేక్షకులకోసం సినిమా చేయండి. వాళ్లకోసం సినిమాచేయాలనే ఫీలింగ్ మీకు వస్తే.. వెంటనే కూడా చేయగలరు. ఒకవేళ, కీడెంచి మేలెంచుదాం అనుకుంటే గనుక, 150 ఫ్లాప్ అయితే ఏమైంది.. అది పాపమూ నేరమూ అనుకోవద్దు. 151 ఉంటుంది. ఆ తర్వాత 152 కూడా ఉండాలి. మీరు  ప్రేక్షకులకోసమే మీనుంచి వారికి కావాల్సిన చిత్రాలను చేస్తూఉండండి. మీ కష్టం వృథా పోదు.. మీ జీవితానికి అర్హమైన అద్భుతాన్ని వాళ్లు మీకు తప్పక అందిస్తారు. కాలయాపన వద్దు, పనిమీద మాత్రమే దృష్టిపెట్టండి. కాలగమనంలో మీకోసం కొత్తశిరాలు నిరీక్షిస్తున్నాయి.

ప్రేమతో మీ

సురేష్

suresh@greatandhra.com