Advertisement


Home > Articles - Kapilamuni
విమోచనదినం- ఎంఐఎం మద్దతిస్తే శెభాష్!

ఇది ఒక కీలకఘట్టం. ఈనెల 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం. నిజాంపాలన నుంచి తెలంగాణ ప్రజానీకానికి విముక్తి లభించిన రోజు. రజాకార్ల దాష్టీకాల చీకటిరాజ్యం సమసిపోయిన రోజు. తెలంగాణ నేల స్వతంత్ర భారతదేశంలో భాగంగా మారినరోజు. దేశమంతా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న రోజున తెలంగాణ కూడా సెలబ్రేట్ చేసుకోవడంలో నిజానికి అర్థంలేదు. ఒకవేళ జాతీయ ఉత్సవంలో తాము కూడా భాగస్వాములు కావడం తప్పుకాకపోయినా.. ఈ గడ్డకు నిజమైన విముక్తి లభించిన సెప్టెంబరు 17వ తేదీని సెలబ్రేట్ చేసుకోకపోవడం రాజకీయ నాయకుల సంకుచిత ఆలోచన సరళికి నిదర్శనంగా భావించాలి. 

నిజాంపాలనకు చరమగీతం పాడి తెలంగాణ ప్రాంతం భారతదేశంలో అంతర్భాగంగా మారినరోజు ఇది. ఈ రోజుకు మతపరమైన విభజన రేఖలు అంటగట్టకుండా ఉండాలంటే ప్రధానంగా రెండు విషయాలు గమనించాలి. 1) ‘నిజాం పాలన’ అంటే కేవలం ‘ముస్లింపాలన’ అని అర్థంకాదు. నిజాం పాలనలో ప్రజలను కాల్చుకు తిన్న హిందూ పటేళ్లు, దేశ్‌ముఖ్ లు ఎందరో ఉన్నారు. 2) నిజాం పాలనలో ఇబ్బందులు పడినవారు కేవలం హిందువులు మాత్రమే అనుకోవడం కూడా అవాస్తవం. ఆ దుర్మార్గపు పాలనను ఒక మతానికి ఆపాదించకుండా ఉన్నట్లయితే.. దానిని సెలబ్రేట్ చేసుకోవడానికి  ఎవ్వరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు.

కానీ, విమోచనను భాజపా డిమాండ్ చేయడంవల్ల దానికి మతం రంగు పులమబడుతోంది. ఎందుకంటే.. నిజాంపాలనను అంతమొందించిన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటే.. తెలంగాణలోని ముస్లిం సమాజం మొత్తం బాధపడుతుందని, ఆవేదనకు గురవుతుందని, అలా నిర్వహణకు పూనుకున్న పార్టీని ముస్లింలు ద్వేష భావంతో చూస్తారని రాజకీయ నాయకులకు ఒక దురభిప్రాయం స్థిరపడిపోయింది. ఇది చాలాతప్పు. సరైన అవగాహనలేని, ముస్లింల పట్ల అపోహలు మాత్రమే ఉన్న రాజకీయ నాయకుల పరిణతి లోపమే ఇలాంటి భావాలకు మూలం.

ప్రపంచం నలుమూలలా ఇస్లామిక్ తీవ్రవాదం వెర్రి తలలు వేస్తున్నది గనుక... చాలా ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాల మూలాల్లో హైదరాబాదీ జాడలు దొరుకుతున్నాయి గనుక నగరంలో ‘లిహ్యా- తకియా’ (గడ్డం – టోపీ) పెట్టుకుని కనిపించే ప్రతి కుర్రవాడినీ ఉగ్రవాది అనే అనుమానపు దృక్కులతో చూస్తే ఎంతటి తప్పిదం, అమానవీయం అవుతుందో మనకు స్పృహ ఉంది. 

అలాగే, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తే ముస్లింలు బాధపడతారని అనుకోవడం కూడా ఆ మతస్తులకు అంతే అవమానకరమైన అమానవీయ భావన అని మనం తెలుసుకోవాలి. ఇలాంటి అభిప్రాయం మనం కలిగిఉన్నాం అంటే.. దాని అర్థం... తెలంగాణ ముస్లిం సమాజం మొత్తం రజాకార్ల ఆనవాళ్లే అని నింద వేస్తున్నట్లు లెక్క! మరి ఇలాంటి నింద ఇన్నాళ్ల తర్వాత కూడా చెరిపేసుకోవడానికి ముస్లింలు ఆలోచించడం లేదా అనేది ప్రస్తుత ప్రస్తావన.

ఎంఐఎం వ్యవహార సరళిలో కూడా మార్పు వస్తోంది. ఆ పార్టీ సారథి అయిన అసదుద్దీన్ ఒవైసీ మాటలు కూడా ఈ సందర్భంగా గమనార్హాలు. ఆయన హైదరాబాదు చంచల్ గూడలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తమ ఎంఐఎం పార్టీ అంటే రజాకార్ల పార్టీ అనే ఉద్దేశంతో చూడవద్దని కోరారు. ఆ పార్టీ నేతల నుంచి ఇది చాలా సహేతుకమైన కోరిక. ప్రతి ముస్లింను ఉగ్రవాది అనే దృష్టితో చూడరాదని వారు ఎలా కోరుకుంటారో.. ఆ పార్టీని రజాకార్ల పార్టీగా చూడరాదని కోరుకోవడం కూడా వారి హక్కు.

మరి అసదుద్దీన్ ఒవైసీ కోరికలో వ్యక్తమవుతున్న భావం.. అందరి విశ్వాసంలోకి ఎలా రాగలుగుతుంది? ఈ ప్రశ్నకు జవాబు చాలా చిన్నది. రజాకార్ల పాలన అంతమైన సందర్భాన్ని వారు కూడా ఉత్సవంలా జరుపుకోగలిగితే.. ఆయన వ్యక్తం చేసిన భావం.. అంతరంగంలోంచి వచ్చినదేనని.. ఎంఐఎం ముస్లిం సమాజం అభ్యున్నతికి ఆవిర్భవించిన పార్టీనే తప్ప.. రజాకార్ల జాడలను కాపాడేందుకు ఏర్పడినది కాదనే అభిప్రాయం అప్రకటితంగానే అందరికీ కలుగుతుంది.

ఈ తెలంగాణ నేలకు అసలైన స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో ఆ సందర్భాన్ని ఉత్సవంలా నిర్వహించడానికి ఎలాంటి రాజకీయ ప్రేరేపిత జంకుగొంకులు లేకుండా అధికారంలో ఉన్న పార్టీలు ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే అలాంటి ఉత్సవం అంటూ జరిగితే.. స్వాతంత్ర్యం లభించిన వైనం స్మరించుకోవాలే తప్ప.. ఎవరి మనోభావాలు గాయపడేలా విమర్శలు రువ్వరాదనే సంగతిని కూడా ఇవతలి పక్షం గుర్తంచుకోవాలి.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్ భారతీయ జనతా పార్టీనుంచి వినిపిస్తుంటుంది గనుక.. తతిమ్మా సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఈ విషయంలో మౌనం పాటిస్తుంటాయి గనుక.. ఇదేదో హిందూత్వ ఎజెండాతో కూడిన అంశం అనుకోవడం మన భావదారిద్ర్యం. తమది రజాకార్ల పార్టీ కాదని అంటున్న అసదుద్దీన్, అలాంటి వారి దుర్మార్గపు పాలన అంతమైపోయిన రోజు తమకు కూడా మంచిరోజే అనే సంకేతాలను కూడా ఇవ్వగలిగితే.. సమాజంలో సోదరమతాల మధ్య సామరస్య వాతావరణం మరింతగా పరిఢవిల్లుతుంది.

- కపిలముని
kapilamuni.a@gmail.com