Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: అన్నాడిఎంకె విలీనమయినట్లేనా?

అన్నా డిఎంకెలోని పళనిస్వామి వర్గం, పన్నీరు సెల్వం వర్గం ఏ క్షణాన్నయినా విలీనం కావచ్చు. వాళ్లిద్దరి మధ్య బేరసారాలు చాలాకాలమే సాగి, చివరకు పన్నీరు చేసిన ముఖ్యమైన మూడు డిమాండ్లలో రెండిటిని పళనిస్వామి నెరవేర్చాడు. నిన్ననే ఆ మేరకు ప్రకటనలు వెలువడ్డాయి. జయలలిత మరణించిన ఎనిమిది నెలల తర్వాత ఆమె మృతిపై ఒక రిటైర్డ్‌ జజ్‌ ఆధ్వర్యంలో జుడిషియల్‌ కమిషన్‌ వేసి న్యాయవిచారణ చేయిస్తామని, ఆ జజ్‌ పేరు తర్వాత వెల్లడిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ప్రకటించాడు. అదే సమయంలో రాష్ట్రానికి జయలలిత అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆమె యింటిని మ్యూజియంగా మారుస్తామని కూడా ప్రకటించాడు. ఇక మూడో డిమాండైన శశికళ, దినకరన్‌లను పార్టీ నుంచి బహిష్కరించాలన్న డిమాండుపై యింకా స్పందించలేదు.

దానిపై పట్టుబట్టకుండా పన్నీరు తన వర్గాన్ని విలీనం చేస్తాడా లేదా అన్నది వేచి చూడాలి. ఈ రెండు వర్గాలు విలీనమైనంత మాత్రాన అన్నా డిఎంకె పార్టీ మళ్లీ ఒకటైందని అనడానికి వీల్లేదు. ఎందుకంటే దినకరన్‌ వర్గం ఒకటి బయటే వుండిపోయింది. దాని కున్న బలమెంతో యింకా తేలలేదు. రెండు నెలల మౌనం తర్వాత దినకరన్‌ మొన్న మధురై వద్ద బహిరంగ సభ పెడితే 25 వేల మంది హాజరయ్యారు. వారిలో 20 మంది ఎమ్మెల్యేలు, 4గురు ఎంపీలు కూడా వున్నారు. పళనిసామి బలవంతంగా ఆపేశాడు కానీ లేకపోతే మరో 20 మంది ఎమ్మెల్యేలు వచ్చేవారు. మొత్తం 40 మంది మా చేతిలో వున్నారని దినకరన్‌ చెప్పుకుంటున్నాడు. అదే నిజమైతే యీ రెండు వర్గాలు నిలిచినా ప్రయోజనం లేదు. పూర్తి విలీనం జరిగినట్లు కాదు.

ఈ రెండు వర్గాల పెళ్లికి పౌరోహిత్యం వహించిన ఘనత మాత్రం అమిత్‌ షా దే. తమిళనాడులో ఎలాగైనా జండా ఎగరేయాలని మహా కుతూహలంగా వుంది అతనికి. జయలలిత వున్నంతకాలం ఏమీ చేయలేకపోయారు. కనీసం ఆమె మరణం తర్వాతనైనా ఏదో ఒకటి బలంగా చేయకపోతే నాయకత్వశూన్యతను డిఎంకె నాయకుడు స్టాలిన్‌ పూరిస్తాడన్న భయం పట్టుకుంది. అందువలన ఎడిఎంకెను నిలబెట్టాలి. ఉట్టినే కాదు, తమతో విలీనం చేయించో, భాగస్వామిగా చేసుకునో నిలబెట్టి, ఎన్‌డిఏలో పాలుపంచుకునేట్లా చేసి రాజ్యసభలో వారి బలాన్ని తనకు అనుకూలంగా వాడుకోవాలి, యిదీ బిజెపి వ్యూహం.

జయలలిత మరణం తర్వాత శశికళ ఎకాయెకి ముఖ్యమంత్రి అయిపోకుండా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వున్న పన్నీరునే కొనసాగించి తను పార్టీ పగ్గాలు చేపట్టింది. దానికి గాను అతను తనకు సంపూర్ణ విధేయుడిగా వుంటాడని ఆశించింది. ఎలాగైనా సరే శశికళను రాజకీయంగా అంతం చేస్తే తప్ప ఎడిఎంకె తనకు చిక్కదని గ్రహించిన బిజెపి పన్నీరును ఎక్కవేసింది. నువ్వు స్వతంత్రంగా వ్యవహరిస్తే మేం అండగా వుంటామని చెప్పింది. అది గ్రహించిన శశికళ పన్నీరును దింపివేసింది. ఆమె చెప్పగానే దిగిపోయిన పన్నీరుకు ఎవరు చెప్పారో ఏమో తిరగబడ్డాడు. అతనికి మీడియా, కేంద్రం బాసటగా నిలబడ్డాయి. అతను పులుకడిగిన ముత్యమనీ, ముఖ్యమంత్రి పదవికి అతను తప్ప వేరెవరూ వుండతగరనీ సోషల్‌ మీడియాలో నానా హడావుడీ చేశారు. అవన్నీ చూసి పన్నీరు నిజంగా తను అంతటి మొనగాణ్నని అనుకున్నాడు.

శశికళను అదుపు చేస్తే చాలు, బోల్డు మంది ఎమ్మెల్యేలు తనవైపు పరిగెత్తుకుంటూ వస్తారని అమిత్‌ను నమ్మించగలిగాడు. అమిత్‌ లెక్క ఎక్కడ తప్పిందో కానీ పన్నీరును విపరీతంగా వెనకేసుకుని వచ్చి, క్యాంప్‌ రాజకీయాలు నడిపిన శశికళపై కత్తి కట్టాడు. ఆమె అనుచరులపై ఐటీ దాడులు జరిగాయి. క్యాంప్‌ను భగ్నం చేసే ప్రయత్నాలు జరిగాయి. క్యాంప్‌ రాజకీయాలనేవి శశికళతోనే ప్రారంభమయ్యాయన్నంత బిల్డప్‌ మీడియా యిచ్చింది. చివరకు చూస్తే ఏమైంది? పన్నీరు సెల్వం చేవ లేని నాయకుడిగా తేలాడు. శశికళ ప్రస్తుతం అత్యంత బలంగా వున్న బిజెపి ప్రయత్నాలను ఓడించగలిగిన యుక్తిపరురాలిగా నిరూపించుకుంది. పన్నీరు రాజీనామా చేసి, ఒక చిన్న వర్గానికి నాయకుడిగా మిగిలాడు. శశికళ తన వర్గాన్ని నిలబెట్టుకోవడమే కాక, పళనిస్వామి అనే అనుచరుణ్ని ముఖ్యమంత్రిగా చేసింది. 

రాజకీయంగా శశికళను ఎదుర్కోలేకపోయిన బిజెపి న్యాయపరంగా ఆమెపై కక్ష సాధించదలచింది. జయలలిత బతికి వున్నంతకాలం స్తబ్ధంగా వున్న న్యాయప్రక్రియ హఠాత్తుగా చురుకుతనం తెచ్చుకుంది. శశికళ జైలుపాలైంది. సోదరి కుమారుడైన దినకరన్‌కు పార్టీ పగ్గాలప్పగించి కారాగారవాసానికి తరలింది. ఇప్పుడు దినకరన్‌పై కొత్త కేసులు మోపబడ్డాయి. అతనికీ జైలు, బెయిలు. ఎడిఎంకెను చీల్చడానికి పన్నీరు చాలలేదు కాబట్టి పళనిపై దృష్టి పెట్టారు. నిశితంగా పరిశీలించి, అతను శశికళ నిలబెట్టిన వ్యక్తే అయినా శశికళ నిల్చోమంటే నిల్చుని, కూర్చోమంటే కూర్చునే వ్యక్తి కాదని, స్వప్రయోజనాలను అంచనా వేసుకుని వ్యవహరించే వ్యక్తి అనీ అర్థం చేసుకున్నారు. పన్నీరు డిమాండ్లను తిరస్కరిస్తూనే అసెంబ్లీలో తన పదవి కాపాడుకోగలిగిన సమర్థుడని కూడా గ్రహించారు.

శశికళ పార్టీ జనరల్‌ సెక్రటరీయే అని ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖపై తను సంతకం చేస్తూనే తన సహచరుల చేత 'మన్నారుగుడి మాఫియా'కు వ్యతిరేకంగా ప్రకటనలు యిప్పించాడు. శశికళ చెప్పినట్లూ  చేయటం లేదు, అలా అని బహిరంగంగా వారితో సంబంధం లేదనీ ప్రకటించలేదు. పార్టీ హెడ్‌క్వార్టర్స్‌ సెక్రటరీ హోదాలో ఏప్రిల్‌ నెల నుంచి పార్టీ ప్రధాన కార్యాలయంలో పోస్టర్ల నుంచి శశికళ ఫోటోలు తీయించి వేశాడు. దినకరన్‌ కేసుల్లో యిరుక్కున్నాక పార్టీ తరఫున ప్రదర్శనలు అవీ జరిపించలేదు. ఇదంతా చూసి దినకరన్‌ షాక్‌ తిన్నాడు. పన్నీరు బహిరంగంగా తిరగబడితే, విధేయుడనుకున్న యీ పళని యింకా అంతకంటె ముదురులా అనిపించాడు. తమ కుటుంబానికి అత్యంత విధేయులైన ఎమ్మెల్యేలనందరినీ కూడగట్టాలంటే ముందు కుటుంబంలో ఐక్యత సాధించాలి. అందుకని తన మేనమామ, శశికళ తమ్ముడు ఐన  దివాకరన్‌తో రాజీ పడ్డాడు. 

అధికారం చేతిలో వున్న పళని మరో పక్క సొంతంగా బలపడే ప్రయత్నాలు సాగించాడు. పార్టీ ఏకం కావడానికి పన్నీరు షరతులు వల్లిస్తూ వుండగానే అతని వర్గం నుంచి యిద్దరు ఎమ్మెల్యేలను వాళ్ల నియోజకవర్గాలలో పనులు చేసిపెట్టి తన వైపు లాక్కోగలిగాడు. అది చూసి పన్నీరును అంటిపెట్టుకుని వుంటే లాభమేమిటన్న మీమాంసలో పడ్డారు అతని వర్గీయులు. బజెట్‌ సెషన్‌లో పళని జారిపడడం ఖాయమనుకున్నారు కానీ అతను డిఎంకె సభ్యులు స్పీకరుపై అనుచిత చేష్టలకు పాల్పడినపుడు వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా వూరుకున్నాడు. కరుణానిధి స్వయంగా రానక్కరలేదన్నాడు. డిఎంకె, ఎడిఎంకెల మధ్య కక్షసాధింపు చర్యలు పరిపాటి కాబట్టి అతని సంయమనం డిఎంకెను మెప్పించింది. అంతటితో ఆగకుండా అతను ఎమ్మెల్యేల జీతభత్యాలను విపరీతంగా పెంచి అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. 

ఇలా తన రాజకీయ చతురతను ప్రదర్శించి బిజెపిని మెప్పించాడు పళని. ఇక వాళ్లు అతన్ని పదవీభ్రష్టుణ్ని చేసే ఆలోచన మానేసి, శశికళ ఛాయలోంచి బయటకు వస్తే చాలు, నీకే మా మద్దతు అనసాగారు. ఎందుకంటే అప్పటికే వాళ్లకు తమిళనాడులో సొంతంగా ఎదగడం ఎంత కష్టమో బాగా అర్థమైంది. రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి తీసుకురావడం ఎంత కష్టమో అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది. కమలహాసన్‌ కానీ, రజనీకాంత్‌ కానీ తెలివితేటలున్నవారే కావచ్చు, ప్రజాదరణ వున్న నటులే కావచ్చు, వాళ్లు మీటింగు పెడితే జనాలు విరగబడి రావచ్చు. కానీ రాజకీయనాయకుడికి చాలా ఓపిక వుండాలి, ప్రజల్లో తిరిగే తీరిక వుండాలి.

అతి సామాన్య కార్యకర్తను సైతం పేరు పెట్టి పలకరించి, అతని యింట్లో ఫంక్షన్‌కు హాజరై, గుర్తు పెట్టుకునే ప్రజ్ఞ వుండాలి. అది రాత్రికి రాత్రి పట్టుబడదు. ఎంత చేసినా ప్రజలు ఆదరిస్తారో లేదో తెలియదు. శివాజీ గణేశన్‌ నాలుగు దశాబ్దాలపాటు రాజకీయాల్లో నలిగిన తర్వాత సొంతంగా పార్టీ పెడితే నిలబెట్టిన వాళ్లందరూ ఓడిపోవడమే కాదు, తను కూడా ఓడిపోయాడు. ప్రజలతన్ని నటుడిగానే చూశారు తప్ప లీడరుగా కాదు. రజనీకాంత్‌కి యీ విషయాలన్నీ తెలుసు. తన అనారోగ్యం దృష్ట్యా తను తిరగలేననీ తెలుసు. అయినా అభిమానులను ఉత్తేజపరచడానికి తెరపై 'నేనే రంగంలోకి వస్తే...' అంటూ డైలాగులు పెట్టిస్తాడు. ఇలాటివి కమల హాసన్‌ యీ మధ్య మొదలెట్టాడు. దిగి లోతు తెలుసుకునే ప్రయత్నంలో మునిగిపోవచ్చు కూడా. 

ఇటువంటి గందరగోళపు వాతావరణంలో తమిళ ఓటరు నాయకుడిగా పరిగణించేది స్టాలిన్‌ను మాత్రమే. అది బిజెపికి మింగుడుపడని వ్యవహారం. అందుకని ఎడిఎంకెలోని ముక్కలన్నీ బొంతగా కుట్టే దర్జీ పని చేపట్టింది.  దానిలో పళని వర్గానికే పెద్దపీట వేస్తానంది. అది అదనుగా తీసుకుని  పళని పన్నీరు వర్గం తనతో కలిసేవరకు వాళ్లకి కేంద్రంలో ఏ పదవీ యివ్వకూడదని షరతు విధించాడు. ఎందుకంటే దినకరన్‌ ఎప్పుడు కాళ్ల కింద చాప లాగేస్తాడో తెలియదు. పన్నీరు పక్షాన వున్న పదిమంది అవసరపడతారు. బిజెపి కూడా పన్నీరుని దువ్వుతూనే వున్నా, అతని వద్ద ఎంపీలు ఎక్కువమంది వున్నా వాళ్లకు ఏ పదవీ అప్పగించలేదు. పరిస్థితులు యిలా వుండగానే రాష్ట్రపతి ఎన్నికల ప్రకటన వచ్చింది.

తమిళనాడు వ్యవహారాల్లో బిజెపి అనవసరంగా కలగజేసుకుంటోందని తమిళనాడు జనాలు అభిప్రాయపడుతున్నా జంకకుండా పళని వెంటనే కోవింద్‌ అభ్యర్థిత్వానికి మద్దతు పలికాడు. వెంటనే ఉలిక్కిపడి పన్నీరు, దినకరన్‌లు కూడా అదే విధంగా ప్రకటనలు చేశారు. బిజెపి దానికి సానుకూలంగా స్పందించింది. కోవింద్‌ ప్రమాణస్వీకారానికి హాజరైన పళనికి మోదీతో చాలాసేపు సమావేశమయ్యే అవకాశం చిక్కింది. జులై 27 న కలాం స్మారకచిహ్నం ఆవిష్కరణకై మోదీ తమిళనాడు వచ్చినపుడు రెండు గంటలపాటు సాగిన ఫంక్షన్‌లో పళని మోదీ పక్కనే వున్నాడు.

మెడికల్‌ కాలేజీల ఎడ్మిషన్‌ విషయంలో 'ప్రత్యేక' పరిస్థితులు అంటూ తమిళనాడు కోరిక మేరకు నీట్‌ నుంచి మినహాయింపు యిచ్చేశారు. దానికై ఆర్జినెన్స్‌ తేబోతున్నారు. ఇలా పళనిని మచ్చిక చేసుకున్న బిజెపి చొరవ తీసుకుని పన్నీరు వర్గాన్ని పళని వర్గంతో కలుపుతోంది. ఒప్పందం ప్రకారం పళని ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. పన్నీరు రాజ్యసభకు వెళ్లి బహుశా ఏ కేంద్రమంత్రో అయ్యి దానితో సరిపెట్టుకుంటాడు. ఇంకో రెండు కేంద్రమంత్రి పదవులు పళని వర్గానికి దక్కుతాయని అంచనా.

ఇక పళని ఆమోదించిన పన్నీరు డిమాండ్ల విషయానికి వస్తే - జయలలిత మృతిపై విచారణకు కమిషన్‌ వేశారు. విచారణలో ఏం తేలుస్తారు? శశికళ పీక పిసికేసిందని చెప్పగలరా? అలా చెపితే అపోలో హాస్పటల్స్‌ ప్రతిష్ఠ ఏం కాను? ఈ విచారణ అనేక అపోహలను తొలగిస్తుందంటూ అపోలో స్వాగతించింది. ఈ విచారణలో జయలలితది సహజ మరణమే అని తేలితే పన్నీరు వర్గానికి దెబ్బ. ఎందుకంటే తన ముఖ్యమంత్రి పదవి పోయిన దగ్గర్నుంచి అది అసహజమరణమని అతను వాదిస్తూ వచ్చాడు. అందుకే అతని వర్గీయుడు యీ ప్రకటన రాగానే 'కేవలం 2016 నాటి ఆసుపత్రి రికార్డులు చూడడంతో కమిషన్‌ సరిపెట్టకూడదు.

శశికళ 2012లో జయలలిత వద్దకు మళ్లీ చేరిన దగ్గర్నుంచి మెడికల్‌ రికార్డులు చెక్‌ చేయించాలి' అనే కొత్త డిమాండు ముందుకు తెచ్చాడు. ఈ కమిషన్‌ను సాధ్యమైనంత కాలం సాగదీసి, 2012 నుంచి శశికళ జయలలితకు స్లోపాయిజనింగ్‌ చేసి వుంటుందనే అనుమానం రేకెత్తించగలరు కానీ అంతిమంగా ఆమెను దోషిగా నిలబెట్టలేరని నా అభిప్రాయం. ఇక రెండవ డిమాండైన పోయెస్‌ గార్డెన్‌లో జయలలిత యింటిని మ్యూజియంగా ప్రకటించడం. జయలలిత గొప్ప లీడరు కాబట్టి ప్రభుత్వ ఖర్చుతో ఆమె పేర మ్యూజియం కడుతున్నామంటే అదో దారి.

పోయిపోయి ఆవిడ ఆస్తి స్వాధీనపరచుకోవడం ఒక వింత. ప్రభుత్వం పరిహారం చెల్లించడం ధర్మం. కానీ ఎవరికి చెల్లిస్తుంది? జయలలిత తన విల్లులో ఆ యింటిని ఎవరికి రాసింది? అసలా విల్లు ఎక్కడ? విల్లు రాయని వ్యక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది? విల్లు లేని పక్షంలో రక్తబంధువుల మధ్య వాటాలు వేయవలసి వుంటుంది. దీపా జయకుమార్‌ 'మమ్మల్ని సంప్రదించకుండా అలా ఎలా ప్రకటిస్తారు?' అని యిప్పటికే అడిగింది. 

పోయెస్‌ గార్డెన్‌ అన్నది జయలలితకు గుర్తుగా మారింది. ఆ యింట్లో ఎవరున్నా జయలలితకు ప్రతినిథిగా ప్రజలు గుర్తించవచ్చు. ఆమె మరణానంతరం శశికళ ఆ యిల్లు ఆక్రమించింది. ఆమెను అక్కణ్నుంచి తరిమివేస్తే తప్ప సాధారణ ప్రజల్లో, ముఖ్యంగా నాయకుల్లో ఆమె పలుకుబడి తగ్గదు. ఆమె స్థాయిని తగ్గించే ప్రయత్నంలో యిప్పుడు పన్నీరు, పళని ఏకమయ్యారు కాబట్టి యీ డిమాండు ఒప్పుకోవడమూ యీజీయే. ఇక మిగిలినది శశికళ, ఆమె కుటుంబసభ్యులను పార్టీలోంచి బహిష్కరించడం. ఇది అనుకున్నంత సులభం కాదు. ఒక పక్క అమ్మ ఆశయాల సిద్ధికై పార్టీలో వర్గాలను విలీనం చేస్తున్నామంటూ జయలలిత అక్కున చేర్చుకున్న శశికళను, ఆమెతో బాటు కేసులు ఎదుర్కుని, జైలుకి వెళ్లి, ఎంత బెదిరించినా, భ్రమలు కొల్పినా అప్రూవర్‌గా మారని శశికళను, ఆమె వర్గపు ఎమ్మెల్యేలను దూరం పెట్టడమనేది పొసగని విషయం. 

ఇంకొక ముఖ్యవిషయం ఏమిటంటే - దీనికి సూత్రధారి బిజెపి అన్న విషయం సామాన్య ప్రజలకు కూడా తెలుసు. బిజెపి కర్ణాటకలో ఆమోదాన్ని సంపాదించుకుంది కానీ తమిళనాడులో యింకా గట్టిగా కాలూనుకోలేదు. తమిళ ప్రజల దృష్టిలో అది యింకా ఉత్తర భారత పార్టీయే. హిందీవాద, హిందూవాద పార్టీయే. కేరళంత కాకపోయినా తమిళనాడులో కూడా మైనారిటీలు ఆర్థికంగా, సాంఘికంగా బలంగా వున్నారు. స్వయంకృతాల వలన ఎడిఎంకె పతనమైతే తమిళులకు డిఎంకె రూపంలో ప్రత్యామ్నాయం అందుబాటులో వుంది. మధ్యలో యీ ఉత్తరాది పార్టీ ఎందుని వారి భావన. వారి అడుగులకు మడుగులు ఒత్తుతూ, వారు చెప్పినట్లు ఆడుతున్న పళని వర్గంపై వారికి ఆదరణ ఉండకపోవచ్చు.

ఇక్కడ యింకో అంశం కూడా వుంది. తమిళ ప్రభుత్వాలు కేంద్ర నిధులను తీసుకుని సంక్షేమ పథకాలపై విపరీతంగా ఖర్చు పెడతాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఫిలాసఫీ దానికి విరుద్ధం. ఇతర రాష్ట్రాల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ తమిళనాడుకి మాత్రం మినహాయింపులు యివ్వగలరా, యిచ్చినా ఎన్నాళ్లివ్వగలరు? రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా పనులు ముందుకు సాగటం లేదు. సొంత ఆదాయంతో పథకాలు నడపడం కష్టం. కేంద్రం నిధులను బిగబడితే పళని ప్రభుత్వం పరిస్థితి ఏమవుతుంది? ఇదొక ప్రశ్న. ఆరేడు నెలల తర్వాత ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు వస్తే..?

ఈ సందేహాలతోనే కాబోలు యింకా చాలామంది ఎమ్మెల్యేలు శశికళ వర్గాన్ని వదిలిపెట్టడం లేదు. ఎన్నికలు వస్తే తమ  తరఫున ఖర్చు భరించ గలిగిన సత్తా పళనికి, పన్నీరుకి లేదు. శశికళకు మాత్రమే వుంది. అటు డిఎంకె తెగబడి ఖర్చు పెట్టగలదు. బిజెపి తమకై ఖర్చు పెడుతుందో, లేక సొంత పార్టీ అభ్యర్థులను నిలబెట్టి వాళ్లకే నిధులిస్తుందేమో తెలియదు. ఇలాటి ఊగిసలాటతోనే  ప్రస్తుతానికి 20 మంది దినకరన్‌ మీటింగుకి హాజరయ్యారు. 235 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఎడిఎంకెకు 134 మంది ఎమ్మెల్యేలున్నారు. దానిలో 10 మంది పన్నీరు వర్గం.

అంటే పళనికి ఆరు ఓట్ల మెజారిటీ మాత్రమే వుంది. దానికి పన్నీరు వర్గం నుంచి 10 మంది చేరినా దినకరన్‌ వర్గీయులు 20 మంది తగ్గితే ఓటింగు సమయంలో ప్రభుత్వం గట్టెక్కడం కష్టం. ఇతర పార్టీల వారిని ఆకర్షించాలి. అందువలన దినకరన్‌ని కూడా కలుపుకోవాలి. దానికోసం శశికళను పార్టీ పదవిలో కొనసాగించడానికి బిజెపి సమ్మతించాలి. సమ్మతిస్తుందా? సమ్మతిస్తుందనే ఆశతోనే కాబోలు దినకరన్‌ మధురై మీటింగులో బిజెపిని ఒక్క మాట అనలేదు. శశికళను త్యాగాల రాణి అన్నాడు. కావాలంటే జయలలిత మరణానంతరం తనే ముఖ్యమంత్రి కాగలిగి కూడా యితరులను కూర్చోబెట్టిందన్నాడు.

అయినా వారికి విశ్వాసం లేదన్నాడు. దానికి ప్రతిగా పళని తన సొంత వూరిలో మీటింగులో దినకరన్‌ పేరు చెప్పకుండా అతన్ని విమర్శించాడు. పార్టీ పదవిలో దినకరన్‌ నియామకం చెల్లదని ఆగస్టు 14న ప్రకటించాడు. ఇలా తమలో తాము తిట్టుకుంటున్నారు కానీ బిజెపిని ఏమీ అనటం లేదు. పళనికి పదవీభయం వుంది, దినకరన్‌కు కేసుల భయం వుంది. ఈ గందరగోళ పరిస్థితిని అవకాశంగా తీసుకుని డిఎంకె యీ ప్రభుత్వాన్ని పడగొట్టి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు వచ్చేట్లు చూస్తుంది. కానీ బిజెపి యిది చూస్తూ కూర్చోదు. ఏదో ఒకటి చేస్తుంది, కనీసం చేయాలని చూస్తుంది. కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com