Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: ఆల్వార్‌ సంఘటన బాధితులు స్మగ్లర్లు కారు...

ఏప్రిల్‌ 1వ తారీకున రాజస్థాన్‌లోని ఆల్వార్‌ జిల్లాలో గోరక్షకులమని చెప్పుకునే కొందరు జయపూరు సంతలో ఆవులను కొనుక్కున్న వెళుతున్న కొందరిపై దాడి చేసిన ఘటనలో 55 ఏళ్ల పెహలూ ఖాన్‌ అనే వ్యక్తి చనిపోయాడని, అతని కుమారులతో బాటు మరో యిద్దరు గాయపడ్డారని విదితమే. ఆ సంఘటనలో పోలీసులు దాడి చేసినవారితో పాటు బాధితులపై కూడా కేసులు పెట్టారు. దీనిపై రాజస్థాన్‌ అసెంబ్లీలో విపక్షాలు వివరణ కోరగా, హోం మంత్రి గులాబ్‌ చంద్‌ కటారియా సమాధానమిస్తూ ఆ ఖాన్‌ల కుటుంబం ఆవులను స్మగ్లర్లని, వారిపై కేసులున్నాయని ప్రకటించాడు. దానిపై లోతుగా పరిశోధించిన ''హిందూస్తాన్‌ టైమ్స్‌'' అవి స్మగ్లింగ్‌కు సంబంధించిన కేసులు కావని యీ వారం తేల్చింది. ఆ వివరాలలోకి వెళ్లబోయే ముందు సంఘటన గురించిన సమాచారం -

హర్యాణాలోని మేవాట్‌ జిల్లాలోని నూహ్‌ తాలూకాలోని జైసింగ్‌పూర్‌లో హతుడు పెహలూ ఖాన్‌ కుటుంబం నివసిస్తుంది. వాళ్లు ముస్లిములలో మేవో వర్గానికి చెందినవారు. వాళ్లలో చాలామంది రైతు కూలీలుగానో, కౌలు రైతులగానో జీవిస్తూ వుంటారు. కొందరు పాల వ్యాపారం చేస్తూ వుంటారు. ఖాన్‌ వాళ్లది కూడా పాల వ్యాపారమే. గేదెల కంటె ఆవులైతే బాగా పాలిస్తాయని జయపూర్‌లో జరిగే పశువుల సంతకు ఖాన్‌ అతని యిద్దరు కొడుకులతో, తన గ్రామానికే చెందిన మరో యిద్దరితో కలిసి ఏప్రిల్‌ 1న వచ్చాడు. రెండు పాలిచ్చే ఆవులను దూడలతో సహా రూ. 45 వేలకు కొన్నాడు. వాళ్లతో పాటు వచ్చిన వారిలో ఒకతను మరో ఆవుని కొన్నాడు. పశువులను వేరే రాష్ట్రం తీసుకెళ్లాలి కాబట్టి, జయపూర్‌ మునిసిపల్‌ కార్పోరేషన్‌ వాళ్లు ఇంటర్‌-స్టేట్‌ ట్రాన్స్‌పోర్టుకై అధికంగా చార్జీలు వసూలు చేశారు. పెహలూ కొడుకులు ఆరిఫ్‌, ఇర్షాద్‌, ఓ గ్రామస్తుడు ఆవులతో సహా ఒక వ్యాన్‌లో ఎక్కగా పెహలూ, అజ్మత్‌ అనే మరో గ్రామస్తుడు యింకో వాహనంలో ముందు వెళుతున్నారు. ఆల్వార్‌లో దిల్లీ-జయపూర్‌ నేషనల్‌ హైవే మీద మోటార్‌ సైకిళ్లపై వచ్చిన కొందరు యువకులు సాయంత్రం 7 గం||లకు పెహలూ వాహనాన్ని ఆపారు. పెహలూ, చూడగానే ముస్లిం అని తెలిసేట్లు గడ్డంతో వుంటాడు. పెహలూను, అజ్మత్‌ను వాహనంలోంచి బయటకు లాగి బెల్టులతో, హాకీ స్టిక్కులతో, కర్రలతో చావకొట్టారు. వేడుక చూడడానికి వచ్చినవారు కూడా  హింసాకాండలో చేతులు కలిపారు. క్రమంగా వారి సంఖ్య వందల్లోకి చేరింది. డ్రైవర్‌ను పట్టుకుని పేరు అడిగారు. అతను హిందువని తెలియడంతో నాలుగు లెంపకాయలు కొట్టి పొమ్మన్నారు. రెండో వాహనం గురించి కాచుకున్నారు. అది రాగానే వాళ్లనూ బయటకు లాగి చితక్కొట్టారు. 

''మేం పోలీసు స్టేషన్ల మీదుగా వచ్చాం. జయపూర్‌ మునిసిపల్‌ కార్పోరేషన్‌ వారి రసీదులు చూపిస్తే వాళ్లు వదిలేశారు. కావాలంటే  మీరూ చూడండి'' అని రసీదులు చూపించాడు ఇర్షాద్‌. 'గోరక్షకులు' ''మేం వీటిని పట్టించుకోం'' అంటూ చింపి పారేశారు. వాళ్ల బట్టలు చింపేశారు. మొబైల్స్‌ లాక్కున్నారు. డబ్బు గుంజుకున్నారు. ఆవుల్నీ, దూడల్నీ తీసుకుపోయారు. వాళ్లు కొట్టిన దెబ్బలకు వీళ్లంతా నేలమీద పడిపోయారు. ''అందర్నీ కుప్పపోసి తగలబెట్టేయండి' అని గుంపులో ఎవరో అరిచారు. ఇంతలో ఎవరో కానీ పోలీసులను పిలవడంతో వీళ్లు అప్పటికి బతికిపోయారు కానీ ఆ దెబ్బలతో రెండు రోజుల తర్వాత 55 ఏళ్ల పెహలూ ఖాన్‌ చనిపోయాడు. ఈ దృశ్యాలన్నీ ఎవరో కానీ వీడియో తీసి వైరల్‌ చేశారు. పోలీసులు వ్యాన్‌ దిగి వచ్చేటప్పుడు తమలో తాము నవ్వుకోవడం కూడా దానిలో కనబడిందట. పోలీసులు వచ్చి చేసిందేమిటంటే దాడి చేసిన వారితో బాటు, బాధితులపై కూడా కేసులు పెట్టేశారు. అంతేకాదు, వీళ్లు బుక్‌ చేసిన వాహనాలను సీజ్‌ చేసి తమ వద్ద పెట్టుకున్నారు. రమేశ్‌ చంద్‌ సిన్సివర్‌ అనే ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీసరు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం ఆరుగుర్ని నిందితులుగా పేర్కొన్నారు. 200 మంది పేరు తెలియని యితరులు కూడా హింసలో పాలుపంచుకున్నారని రాశారు. చిత్రమేమిటంటే పెహలూ యిచ్చిన మరణవాంగ్మూలంలో చెప్పిన ఆరుగురిపై కాని, బతికి వున్న బాధితులు పేర్లు చెప్పినవారిపై కాని కేసులు పెట్టలేదు. ఇక పెహలూ, అతని కొడుకులు, వాళ్లతో పాటు వచ్చిన గ్రామస్తులు మేవో వర్గానికి చెందిన యితర పాలవ్యాపారులు యిలా మొత్తం 16 మంది మీద కేసులు పెట్టారు. వాళ్లపై పెట్టిన కేసు రాజస్థాన్‌ బొవైన్‌ యానిమల్స్‌ (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ స్లాటర్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ టెంపరరీ మైగ్రేషన్‌ ఆర్‌ ఎక్స్‌పోర్ట్‌) అనే 1995 చట్టం కింద పెట్టారు. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి చట్టవిరుద్ధంగా ఆవుల్ని తరలించేవారిపై కేసులు పెట్టే చట్టం అది. దాని ప్రకారం అలా తరలించే వాహనాలను స్వాధీనం చేసుకుని, ఆ వ్యక్తులను అరెస్టు చేయవచ్చు. అయితే యీ సందర్భంలో వాళ్లు చట్టవిరుద్ధంగా తరలించటం లేదు. జయపూర్‌ మునిసిపల్‌ కార్పోరేషన్‌ వారికి సర్‌చార్జి కట్టి మరీ తీసుకెళుతున్నారు. ''అది సరిపోదు, డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేటు నుంచి అనుమతి తీసుకుని వుండాల్సింది'' అంటున్నారు రాజస్థాన్‌ పోలీసులు. 

పార్లమెంటులో దీనిపై చర్చ జరిగినపుడు మైనారిటీ ఎఫయిర్స్‌ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ 'అది గోరక్షకుల పని కాదు' అన్నాడు. తర్వాత అలా అనలేదన్నాడు. హోం శాఖ సహాయమంత్రి కిరణ్‌ రిజ్జూ ''గోరక్షులు చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుంటే సహించం'' అంటూనే 'ఇది రెండు గ్రూపుల మధ్య కొట్లాట' అనేశాడు. ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ దేశమంతా గోవధ నిషేధించాలని అంటూనే, గోరక్షకుల అత్యాచారాలను ఖండించారు. రాజస్థాన్‌ హోం మంత్రి గులాబ్‌ చంద్‌ కటారియా ''అక్రమంగా గోవులను తరలించేవారిని ఎవరైనా పట్టుకుంటే మరీ ఆందోళన చేయనక్కరలేద'ని అన్నాడు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర చట్టాన్ని అతిక్రమించినవారెవరైనా సరే వదలం అన్నారు. దానితో పాటు ఏప్రిల్‌ 6 న గోరక్షణకై నిధుల కోసం అన్ని డాక్యుమెంట్లపై 10% అదనపు సర్‌చార్జిని విధించారు. ఈ సంఘటన జరగడానికి ఒక రోజు ముందు మార్చి 31న గుజరాత్‌ ప్రభుత్వం గోవధ చేసేవారిపై శిక్షను 10 సం||ల జైలు నుంచి యావజ్జీవ శిక్షకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. విశ్వహిందూ పరిషత్‌ దుర్గావాహిని, బజరంగ్‌ దళ్‌ వంటి సంస్థల సహాయంతో గోవాలో గోమాంస భక్షణను అరికడతామని ఏప్రిల్‌ 17 న ప్రకటించింది. ఇప్పుడీ ఆల్వార్‌ ఘటనలో కూడా దాడి చేసినవారు తాము విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్‌లకు చెందిన వారమని చెప్పుకున్నారట. వాళ్లను ఐడెంటిటీ కార్డులు చూపించమని అడిగినవారెవరూ లేరనుకోండి.  

దీనికి తోడు రాజస్థాన్‌ హోం మంత్రి అసెంబ్లీలో ''పెహలూ ఖాన్‌ కుటుంబమంతా ఆవులను స్మగ్లింగ్‌ చేసే కుటుంబం. అతని కొడుకు ఇర్షాద్‌పై రెండు కేసులున్నాయి.'' అన్నాడు. దానిపై హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక విచారణ జరిపి ఆ రెండు కేసుల్లోనూ అతను నిర్దోషిగా విడుదలయ్యాడని, కటారియా ఆ విషయం దాచాడని ప్రకటించింది. ఆ కేసుల్లో మొదటిది 2011లో నూహ్‌లోని తావ్‌డూ గ్రామంలో దాఖలు చేసినది. ఆవుల్ని తరలిస్తున్నందుకు పోలీసులు ఒకణ్ని పట్టుకున్నారు. అతను యీ ఆవుల సొంతదారు ఇర్షాద్‌ అంటూ అతని పేరు చెప్పాడు. దాంతో ఆవుల పట్ల అతను క్రూరంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులు కేసు పెట్టారు. దానిపై నాలుగేళ్లు విచారణ జరిగింది. అది అన్యాయంగా మోపిన కేసు అని కోర్టు అభిప్రాయపడి 2015లో కొట్టేసింది. రెండవ కేసు కూడా 2011లో రోహటక్‌లో నమోదు చేసినది. రోహటక్‌ సంతలో ఎద్దులు కొని సాటి గ్రామస్తులతో సహా వూరికి తిరిగి వస్తూ వుంటే కొందరు 'గోరక్షకులు' అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు వాళ్లు వచ్చి 'మీరు ఎద్దులను నడిపించి తీసుకుని వెళుతున్నారు. ఇది జంతుహింస కింద వస్తుంది' అంటూ ఇర్షాద్‌పై, మరో 51 మందిపై కేసులు పెట్టారు. తక్కినవాళ్లందరూ నేరం చేశామని ఒప్పుకుని జైల్లో కొన్నాళ్లుండి, రూ. 30 వేల రూ||ల బ్యాండ్‌ యిచ్చి బయటకు వచ్చేశారు. కానీ ఇర్షాద్‌ కేసు ఎదుర్కున్నాడు. చివరకి 2015లోనే కోర్టు ఆ కేసూ కొట్టేసింది. ఏ కేసులోనూ స్మగ్లింగ్‌ ఆరోపణ లేదు. అయినా రాష్ట్రం హోం మంత్రి అసెంబ్లీకి తప్పుడు సమాచారం యిచ్చి తప్పించుకోజూశాడు. ఇవన్నీ పక్కకు పెట్టినా బాధాకరమైన విషయం ఏమిటంటే సిపిఎం, ఆప్‌ తప్ప ఏ రాజకీయ పార్టీ నాయకుడు కానీ, ఏ అధికారి కానీ చనిపోయిన పెహలూ ఖాన్‌ చనిపోయాక అతని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లలేదు. గోరక్ష పేరుతో అసాంఘిక శక్తులు అరాచకం చేస్తే ఖండించడానికి వీళ్లెవరికీ నోరు పెగలటం లేదంటే అంతకంటె విషాదం వుందా?

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

mbsprasad@gmail.com