ఫిబ్రవరి 24 ముళ్లపూడి వెంకటరమణ గారి వర్ధంతి. ఆ సందర్భంగా ఆయన అనువదించిన ఓ పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను. ఫ్రెంచ్ రచయిత, సైన్స్ ఫిక్షన్‌లో అగ్రగణ్యుడు జూల్స్ వెర్న్ (1828-1905)లో 1872లో ఫ్రెంచ్‌లో ఓ సీరియల్ రాసి పుస్తకంగా వెలువరిస్తే దాని ఇంగ్లీషు అనువాదం 1873లో ‘ఎరౌండ్ ద వ(ర)ల్డ్’ పేరుతో వెలువడి, పాఠకులను మెప్పించింది. ఆంధ్రపత్రిక వీక్లీలో పని చేసే రోజుల్లో రమణగారు ఎస్.పార్థసారథి అనే కలం పేరుతో దీన్ని ‘’80 రోజుల్లో భూప్రదక్షిణం’’గా అనువదిస్తే, వీక్లీలోనే సీరియల్‌గా వేశారు. తర్వాత పుస్తకంగా వచ్చి విపరీతంగా ప్రజాదరణ పొందింది. నేను సంపాదకత్వం వహించిన ‘‘ముళ్లపూడి సాహితీసర్వస్వం’’ (విశాలాంధ్ర ప్రచురణ)లో 8వ, ఆఖరి సంపుటం 2006 నాటి ‘అనువాద రమణీయం’. దానిలో యీ పుస్తకాన్ని, కెనెడీ అమెరికన్ నేవీలో వుండగా చేసిన సాహసాన్ని వర్ణించిన ‘‘పిటి 109’’ అనువాదాన్ని చేర్చాను.
ఈ పుస్తకం ఇంగ్లీషు టైటిల్ వినగానే చాలామంది జాకీ చాన్ సినిమాయేగా? అని అడుగుతారు. 2004 నాటి ఆ సినిమా కథను చాలా మార్చేశారు. ఫ్లాపయింది. 1956లో వచ్చిన డేవిడ్ నివెన్ హీరోగా వచ్చిన సినిమా మూలానికి దగ్గరగా వుంటుంది. ఎలిజబెత్ టేలర్‌కు కొంతకాలం భర్తగా ఉన్న మైక్ టాడ్ యీ సినిమాను చాలా ఖర్చు పెట్టి భారీగా తీశాడు. మైకేల్ యాండర్సన్ దర్శకత్వం వహించిన యీ సినిమా బాగుంటుంది. ఉత్తమ చిత్రంతో సహా ఐదు ఆస్కార్ ఎవార్డులు గెలుచుకుంది. ఈ రోజుల్లో భూమిని చుట్టి రావడానికి 80 రోజులు అక్కరలేదు. కానీ విమానాలు, సరైన రవాణా సౌకర్యాలు లేని 1872లో 80 రోజుల్లో భూప్రదక్షిణం చేయడం అబ్బురమే! దాదాపు అసాధ్యమే, కాదు సాధ్యమే అని పందెం కాసి ప్రయాణానికి సమకట్టిన ఒక ఇంగ్లీషు పెద్దమనిషి ఫిలియాస్ ఫాగ్ యీ నవలకు హీరో.
అది మామూలు ప్రయాణం కాదు, అనేక అవాంతరాలు వచ్చి పడిన ప్రయాణం. తలతిక్క పనివాడు కొన్ని చిక్కులు తెచ్చి ఆలస్యం చేస్తే, యితను దొంగేమోనన్న అనుమానంతో అవరోధాలు కల్పించిన డిటెక్టివ్ కారణంగా యింకొంత ఆలస్యమైతే, సతీసహగమనానికి గురవుతున్న ఒక స్త్రీని కాపాడాలనే ఫాగ్ ఔదార్యం ప్రయాణాన్ని మరింత జాప్యం చేసింది. ఇది అనేక మలుపులున్న సాహస నవలే అయినా అంతర్లీనంగా ఉన్న చమత్కారం ఆకట్టుకుంటుంది. అనేక దేశాలు తిరిగే యీ కథను సాధ్యమైనంత క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. కథానాయకుడు 40 ఏళ్ల ఫిలియాస్ ఫాగ్ ఓ పాటి ధనికుడు. తెలివైనవాడు. మితభాషి. పనులన్నీ వేళకు కచ్చితంగా చేసే వ్యక్తి. లండన్‌లో రిఫార్మ్ క్లబ్‌లో సభ్యుడిగా బయటకు రావడం తప్ప పెద్దగా అందరితో కలవడు. పత్రికలు చదవడం, పేకాడడం, ఆటలో వచ్చిన డబ్బును గుప్తదానాలకు వినియోగించడం.. యిలా అతని జీవితం సాగిపోతోంది. పెళ్లి కాలేదు. బంధువులూ లేరు. ఇంట్లో ఒక్క నౌకరు మాత్రం ఉంటాడు. రోజులో చాలాసేపు క్లబ్బులో గడిపి, భోజనానికి, నిద్రకు యింటికి వస్తాడు.
1872 అక్టోబరు 2వ తేదీన నవల ప్రారంభమైంది. గడ్డం చేసుకునేందుకు తెచ్చిన నీళ్ల వేడి 2 డిగ్రీలు తక్కువగా వుండడంతో అవి తెచ్చిన నౌకరును ముందు రోజే ఉద్యోగంలోంచి తీసేశాడు ఫాగ్. తనకు బదులుగా జీన్ పాస్పార్తూ అనే 30 ఏళ్ల ఫ్రెంచివాణ్ని తెచ్చాడు ఆ నౌకరు. పాస్పార్తూ రకరకాల దేశాల్లో రకరకాల ఉద్యోగాలు చేస్తూ వచ్చి, ఏదో ఒక ఊళ్లో స్థిరంగా వుందామనే ఆలోచనలో ఉన్నాడు. ఫాగ్ ఇంటిపట్టునే వుండే మనిషని తెలిసి, యీ ఉద్యోగానికి ఒప్పుకున్నాడు. ఆ రోజు సాయంత్రం క్లబ్బులో మూడు రోజుల క్రితం బాంక్ ఆఫ్ ఇంగ్లండులో జరిగిన 55 వేల పౌండ్ల చోరీ గురించి చర్చ ప్రారంభమైంది. అది సాధారణమైన దొంగ చేసి వుండడనీ, పైకి చాలా పెద్దమనిషిలా కనిపించే వ్యక్తే చేసి వుంటాడనీ పేపర్లు రాశాయి. ఈ రోజుల్లో రవాణా సౌకర్యాలు పెరిగి, ప్రపంచం చిన్నదయి పోయింది కాబట్టి, ఆ డబ్బు తీసుకుని ప్రపంచంలో ఎక్కడికైనా సరే ఆ దొంగ అతి త్వరగా పారిపోగలడని ఎవరో అన్నారు.
ఔను ఇండియాలో గ్రేట్ ఇండియన్ పెనిన్సులార్ రైల్వేలో గొధాల్-అలహాబాద్ సెక్షన్ పూర్తయింది కాబట్టి, 80 రోజుల్లో భూమిని చుట్టి రావచ్చని మార్నింగ్ క్రానికల్ పేపరు వేసింది చూడండి అని మరొకరు అన్నారు. ఆ లెక్క యిలా ఉంది. లండన్ నుంచి మాంట్ సెనిన్, బ్రిండిసీల మీదుగా సూయజ్‌కు రైలు మీదా, ఓడ మీదా 7 రోజులు, సూయజ్ నుంచి బొంబాయికి ఓడ మీద 13 రోజులు, బొంబాయి నుంచి కలకత్తాకు రైలు మీద 3 రోజులు, కలకత్తా నుంచి హాంగ్‌కాంగ్‌కు ఓడమీద 13 రోజులు, హాంకాంగ్ నుంచి యోకోహామా (జపాన్)కు ఓడమీద 6 రోజులు, యోకహామా నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు ఓడమీద 22 రోజులు, శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి న్యూయార్కుకు రైలు మీద 7 రోజులు, న్యూయార్కు నుంచి లండన్‌కు ఓడమీద, రైలు మీద 9 రోజులు మొత్తం 80 రోజులు. (గూగుల్ మ్యాప్‌లో రూటు వేసుకుని చూసుకునే వీలుందని వివరంగా రాశాను)
‘లెక్క వేయడానికేం? గాలివానలు, ఓడమునకలు, రైలు ప్రమాదాలు, ఏ రెడ్ ఇండియన్‌లో పట్టాలు పీకేయడాలు, రైలు దోపిడీలు వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోవాలిగా’ అన్నారొకరు. అలా పరిగణనలోకి తీసుకున్నా, 80 రోజుల్లో ఆ ప్రయాణం సాధ్యమే అన్నాడు ఫాగ్. క్లబ్బు సభ్యులు పంతానికి పోయారు. చివరకు ఇటు ఫాగ్, అటు ఐదుగురు కలిసి 20వేల పౌండ్ల పందెం అనుకున్నారు. ‘ఇవాళ అక్టోబరు 2. సాయంత్రం 7 గంటలైంది. డోవర్ రైలు 8.45కి బయలుదేరుతుంది. ప్రపంచమంతా చుట్టి డిసెంబరు 21 శనివారం రాత్రి ఎనిమిది నలభై ఐదుకి యీ గదిలో వుంటాను. అలా రాలేని పక్షంలో ఈ 20 వేల పౌండ్ల చెక్కు మీది. నేను దేశాలు తిరిగినట్లు సాక్ష్యంగా ప్రతీ రేవులోనూ వీసా ముద్రలు వేయించుకుని వస్తాను.’ అన్నాడు ఫాగ్. 20 వేలంటే అతని ఆస్తిలో సగం అన్నమాట. తక్కినది దారి ఖర్చులకు పెట్టుకున్నాడు.
అతను 7.20 వరకు పేకాట ఆడి, 7.50కి యిల్లు చేరి, ‘ఇంకో పది నిమిషాల్లో మనం ప్రపంచయాత్రకు బయలుదేరుతున్నాం.’ అన్నాడు పాస్పార్తుతో. ఏదో యింటిపట్టున పడి వుండవచ్చనుకుంటే ఉద్యోగంలో చేరిన రోజే ప్రపంచప్రయాణం అనడంతో అతనికి దిమ్మ తిరిగింది. అయినా ఎనిమిది గంటలకల్లా బ్యాగ్ రెడీ చేశాడు. ఫాగ్ దానిలో 20 వేల పౌండ్ల నోట్ల కట్ట పడేసి, జాగ్రత్తగా చూసుకో అన్నాడు. ఇద్దరూ రైలెక్కారు. క్లబ్బు మిత్రుల ద్వారా మర్నాటి కల్లా ఫాగ్ యాత్ర గురించి పేపర్లలో వచ్చేసింది. అందరూ నివ్వెరపోయారు. ఫాగ్ మూర్ఖత్వం గురించి చర్చలు జరిగాయి. ఒకే ఒక్క పేపరు అతన్ని కాస్త సమర్థించింది. తక్కినవన్నీ యిది అసాధ్యమనే తేల్చాయి. సాధ్యాసాధ్యాల మీద అనేకమంది పందాలు కట్టారు.
బాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో చోరీ చేసిన మనిషి ఆనవాళ్లు అంటూ ఇంగ్లండు పోలీసు ఒక పత్రం తయారుచేసి తన డిటెక్టివ్‌లను దేశదేశాలకు పంపింది. సూయజ్‌కు వచ్చిన అలాటి డిటెక్టివ్ ఫిక్స్ లండన్ నుంచి వచ్చే ప్రయాణీకులను గమనించగా ఫాగ్‌లో ఆ పోలికలు కలిశాయి. అతని నౌకరు పాస్పార్తూతో మాటలు కలిపి, ఫాగ్ బోల్డంత డబ్బు బ్యాగ్‌లో పెట్టుకుని హఠాత్తుగా ప్రయాణం పెట్టుకున్న సంగతి కూపీ లాగాడు. ఫాగే బ్యాంకు దొంగ అనే నిర్ధారణకు వచ్చాడు. బొంబాయిలో దిగగానే ఫాగ్‌ను అరెస్టు చేయడానికి వారంటు కావాలని లండన్‌కు టెలిగ్రాం యిచ్చాడు. ఫాగ్ ఎక్కిన ‘‘మంగోలియా’’ ఓడలో తనూ ఎక్కాడు. ప్రయాణంలో పాస్పార్తూను మంచి చేసుకున్నాడు. గమ్యానికి త్వరగా తీసుకెళితే బహుమతి యిస్తానని ఫాగ్ కెప్టెన్‌కు ఆశపెట్టడంతో అక్టోబరు 22న చేరవలసిన ఓడ రెండు రోజులు ముందుగా అక్టోబరు 20 సాయంత్రం 4 గంటలకు బొంబాయి చేరింది. 8 గంటల కల్లా కలకత్తా రైలు ఎక్కాలి, కొన్ని సరుకులు తెమ్మనమని పాస్పార్తూని బజారుకి పంపించాడు. అతను పచార్లు కొడుతూ ఒక హిందూ దేవాలయంలోకి చొరబడ్డాడు. చెప్పులు తీయకుండా లోపలకి రావడంతో అక్కడి భక్తులు అతన్ని పట్టుకుని తన్నారు. తప్పించుకుని పరిగెట్టుకుంటూ రైలు బయలు దేరడానికి 5 ని.లకు ముందు స్టేషన్‌కు వచ్చిపడ్డాడు.
ఫిక్స్ బొంబాయి పోలీసు కమిషనర్ ఆఫీసుకి వెళితే లండన్ నుంచి వారంటు ఏదీ రాలేదన్నారు. బట్వాడా కూడా ఓడ ద్వారానే రావాలి కదా! తనూ ఫాగ్‌తో బాటు రైలెక్కుదామా అనుకుని, అంతకంటె వారంటు వచ్చాక చేతిలో పెట్టుకుని ఫాగ్‌ను పట్టుకోవడం బెటరనుకున్నాడు. ఫాగ్ బోగీలో బెనారస్‌లో తన సైనిక కేంద్రానికి వెళుతున్న బ్రిగేడియర్ జనరల్ సర్ ఫ్రాన్సిస్ క్రోమార్టీ కూడా ఉన్నాడు. అతనికి మంగోలియా ఓడలోనే ఫాగ్‌తో స్నేహం కుదిరింది. ఫాగ్ భూప్రదక్షిణం ప్లాను విని, యిదంతా పనికిమాలిన పని అనుకున్నాడు. కానీ రైలు మధ్యలో ఆగిపోయినా అతను తొణక్కపోవడం చూసి మెచ్చుకున్నాడు. ఆగిపోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే రోథాల్ చేరడానికి యింకో పావుగంట పడుతుందనగా రైలు ఆగిపోయింది. అక్కణ్నుంచి అలహాబాదు దాకా ఏభై మైళ్లకు పైగా పట్టాలు వేయాలి కాబట్టి ఖోల్సీలో దిగిపోయి, ప్రయాణికులు ఎవరికి తోచిన విధంగా వాళ్లు ప్రయాణించి, అలహాబాదు చేరుకుంటే అక్కణ్నుంచి యిదే టిక్కెట్టుపై యింకో రైలెక్కవచ్చు. ఈ దారి పూర్తయినట్లు పేపర్లో వేసేశారు కానీ నిజానికి పని బకాయి వుంది.
ఈ విషయం తక్కిన ప్రయాణీకులందరికీ తెలుసు కాబట్టి రైలు ఆగగానే ఎడ్లబళ్లు, పల్లకీలు, గుర్రాలు, రథాలు.. యిలా ఎవరి కందినవి వాళ్లు మాట్లాడుకుని ప్రయాణమయ్యారు. వీళ్లకు ఏమీ దొరకలేదు. చివరకు పాస్పార్తూ ఒక ఏనుగుని మాట్లాడుకుని వచ్చాడు. ఫాగ్, పాస్పార్తూతో బాటు క్రోమార్టీ కూడా ఎక్కాడు. అడవులకు అడ్డపడి వెళితే ఇరవై మైళ్లు కలిసి వస్తుందని మావటీడు చెప్పాడు. బుందేల్‌ఖండ్ ద్వారా ప్రయాణించి, ఇంకో ఆరు మైళ్లలో అలహాబాద్ చేరుకుంటా రనుకుంటూండగా వాళ్లకు దూరంగా ఓ ఊరేగింపు కనబడింది. వీళ్లు పొదల మాటున దాగి చూడబోతే, అది ఒక ముసలి రాజుగారి శవయాత్ర. అతనితో బాటు అతని పడుచు పార్శీ భార్యను కూడా తీసుకెళ్లి, మర్నాడు తెల్లవారుఝామున సతీసహగమనం పేర దహనం చేయబోతున్నారు.
ఆమె పేరు ఆయూదా. బొంబాయికి చెందిన పార్శీ అమ్మాయి, పెద్ద వర్తకుడి కూతురు. అందగత్తె. ఇంగ్లీషు చదువు చదువుకుని యింగ్లీషు పిల్లలాగే పెరిగింది. తల్లితండ్రులు హఠాత్తుగా పోవడంతో బంధువులు కూడబలుక్కుని యీ బుందేల్‌ఖండ్ రాజుకి మూణ్నెళ్ల క్రితమే పెళ్లి చేశారు. అతను చావగానే సహగమనం అంటారని ఆమె పారిపోయింది. ఈమెను చంపేస్తే రాజు వారసత్వం తమకు దక్కుతుందనే పేరాశతో రాజు దాయాదులు ఆమెను పట్టుకుని నల్లమందు పట్టించేసి మత్తెక్కేట్లా చేసి యీ దహనకాండ నిర్వర్తించబోతున్నారు. క్రోమార్టీ, మావటీడు కలిసి యీ కథంతా ఫాగ్‌కు చెప్పగానే, ఫాగ్ యీమెను రక్షిద్దామన్నాడు. మావటీడు కూడా పార్శీ కాబట్టి, పార్శీ యువతిని రక్షించడానికి సిద్ధపడ్డాడు. కానీ అంతమంది రాజభటులను ఎదిరించడం కష్టం. పాస్పార్తూకి ఓ ఐడియా వచ్చింది. వెళ్లి రాజుగారి శవం కింద దాక్కున్నాడు. తెల్లవారుఝామున సరిగ్గా చితి పెట్టేవేళ లేచి కూర్చుని శవం మీద పడుక్కోబెట్టిన ఆయూదాను చేతులతో ఎత్తుకుని తీసుకుని నడవసాగాడు. ఈ సజీవప్రేతాన్ని చూసి, బెంబేలెత్తిపోయిన బంధువులూ, భటులూ సాష్టాంగపడిపోయారు.
పాస్పార్తూ ఫాగ్ దగ్గరకు వచ్చేశాడు. అందరూ కలిసి ఏనుగెక్కి పారిపోసాగారు. జరిగిన మోసాన్ని గుర్తించిన రాజపరివారం వెంటపడింది కానీ మావటీడు దట్టమైన అడవిలోకి ఏనుగుని నడిపించడంతో తప్పించుకున్నారు. పది గంటలకు అలహాబాద్ చేరుకుంది గజవాహనం. ఇక్కడి నుంచి కలకత్తాకు రైలెక్కారు. రెండు వేల పౌండ్లు పెట్టి కొన్న ఏనుగును ఫాగ్ మావటీడుకి బహుమతిగా యిచ్చేశాడు. ఫాగ్ టీము చేసిన సేవలతో ఆయూదాకు మెలకువ వచ్చింది. జరిగినదంతా చెప్పారు. ఆమె కృతజ్ఞత ప్రకటించింది. ‘కానీ ఈ అమ్మాయి యీ దేశంలో ఉన్నంతకాలం ఆమె ప్రాణానికి ప్రమాదమే. రాజకుటుంబీకులు వదిలిపెట్టరు.’ అన్నాడు క్రోమార్టీ. ‘నీకు అభ్యంతరం లేకపోతే హాంగ్‌కాంగ్ వరకు తీసుకెళతాను.’ అన్నాడు ఫాగ్. ఆమె సరేనంది. బెనారస్ రాగానే క్రోమార్టీ దిగిపోయాడు.
వీళ్లు అక్టోబరు 25న కలకత్తాకు ఉదయం ఏడు గంటలకు చేరారు. హాంకాంగ్ ఓడ 12 గంటలకు బయలు దేరుతుంది. ఇప్పటివరకు ప్రయాణంలో మిగులు, తగులు లేదు. బొంబాయిలో రెండు రోజులు ఆదా అయినా మధ్యలో సాహసాలతో ఆ ఎడ్వాంటేజి పోయింది. కలకత్తా స్టేషన్ నుంచి బయటకు రాగానే ఫాగ్, పాస్పార్తూలను పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. బొంబాయిలో పాస్పార్తూ జోళ్లతో గుళ్లో ప్రవేశించడం గమనించిన ఫిక్స్ ఆ గుడి పూజారుల చేత కేసు పెట్టించి, దానిలో ఫాగ్ పేరు కూడా చేర్చి వారంటు తయారు చేశాడు. వారంటు చేత పట్టుకుని వేరే రైలులో కలకత్తా వచ్చి రెండు రోజులుగా వేచి ఉన్నాడు. కేసు విని, న్యాయమూర్తి 8 రోజుల ఖైదు, జరిమానా విధించాడు. ‘జామీను ఇస్తాను’ అన్నాడు ఫాగ్. న్యాయమూర్తి అయితే ‘జామీనుగా రెండు వేల పౌండ్లు కట్టండి’ అన్నాడు. ఫాగ్ ఆ డబ్బు కట్టేసి, ఆయుదాతో సహా సరాసరి ఓడరేవుకి వెళ్లిపోయి ఓడెక్కేశాడు.
ఫిక్స్ గందరగోళ పడిపోయాడు. లండన్ నుంచి వారంటు వస్తే హాంగ్‌కాంగ్ పంపమని కలకత్తా పోలీసులకు చెప్పేసి, తనూ ఓడెక్కేసి, ఓ మూల ఉంటూ అణగి ఉన్నాడు. ఆయూదాను చూడగానే ఫాగ్ మీద కిడ్నాప్ కేసు బనాయించవచ్చన్న ఆశ కలిగింది. నిజానిజాలు తెలుసుకోవాలంటే పాస్పార్తూని కదిలేయాలి. అందుకని అతని ఎదుట ప్రత్యక్షమై, కబుర్లు మొదలెట్టాడు. ఇతని నిజస్వరూపం తెలియని పాస్పార్తూ తన సాహసకృత్యమంతా చెప్పేశాడు. ఆయుదాను హాంగ్‌కాంగ్‌లో ఆమె బంధువుకు అప్పగించేసి, తమ దారిన తాము పోతామని చెప్పడంతో ఫిక్స్ ఆశలు వమ్మయిపోయాయి. పాస్పార్తూని కలవడం మానేశాడు. పాస్పార్తూ ఫిక్స్ గురించి ఆలోచించి, ఆలోచించి, పందెం కాసిన రిఫార్మ్ క్లబ్ సభ్యులు ఫాగ్ యాత్రలు చేస్తున్నాడో లేదో కనిపెట్టమని నియోగించిన డిటెక్టివ్ అయి వుంటాడని తీర్మానించుకున్నాడు. పెద్దమనిషైన తన యజమానిని అనుమానించిన క్లబ్బువాళ్లపై కోపం వచ్చి, ఫిక్స్‌ను ఏడిపిద్దామని నిశ్చయించుకున్నాడు.
ఓడ సింగపూరులో ఆగేటప్పటికి ఫాగ్‌కు అరపూట కలిసి వచ్చింది. ఈ ప్రయాణంలో ఆయూదా ఫాగ్‌ను బాగా అభిమానించింది. సింగపూరులో లంగరు వేసినప్పుడు ఫాగ్‌తో కలిసి కాస్సేపు షికారు చేసి వచ్చింది. సింగపూరు తర్వాత గాలివాన వచ్చి ఓడ హాంగ్‌కాంగ్‌కు 20 గంటలు ఆలస్యంగా చేరే ప్రమాదం ఏర్పడింది. అలా ఆలస్యమైతే జపాన్ లోని యోకహామాకు వెళ్లే నౌక తప్పిపోతుంది. పందెం ఓడిపోయినట్లే. కానీ ఫాగ్ చెక్కు చెదరలేదు. ఫిక్స్ ఆనందానికి హద్దు లేదు. ఎందుకంటే హాంగ్‌కాంగ్ ఇంగ్లీషు పాలనలో వుంది. వారంటు చెల్లుతుంది. ఫాగ్ జపాన్‌కి దాటిపోతే చెల్లదు. చివరకు హాంగ్‌కాంగ్‌కు 24 గంటలు లేటుగా చేరింది. కానీ యోకహామాకు వెళ్లాల్సిన నౌక ‘‘కర్ణాటిక్’’ బాయిలర్ చెడిపోవడంతో మర్నాడు ఉదయందాకా బయలుదేరదని తెలిసింది. ఇది కనక తప్పిపోయి వుంటే, యింకో వారం దాకా ఓడ లేకపోయేది.
16 గంటల విరామం దొరకడంతో ఫాగ్ వెళ్లి ఆయూదా బంధువు గురించి వాకబు చేస్తే ఆయన యూరోప్‌కు తరలి వెళ్లిపోయాడని తెలిసింది. తనతో లండన్‌కు రావడానికి ఫాగ్ ఆయుదాను ఒప్పించాడు. పాస్పార్తూని పిలిచి ఓడలో మూడు టిక్కెట్లు బుక్ చేయమని పంపించాడు. పాస్పార్తూ ఓడ కంపెనీ ఆఫీసుకి వెళ్లేసరికి అక్కడ ఫిక్స్ తగిలాడు. వారంటు రాలేదని అతను కంగారు పడుతున్నాడు. కర్ణాటిక్ మరమ్మత్తులు అనుకున్న దానికంటె త్వరగా పూర్తయిపోయాయని, అందుకని అవాళ రాత్రి 8 గంటలకే బయలుదేరుతుందని ఆఫీసువాళ్లు చెప్పారు. పాస్పార్తూ వెంటనే యీ సంగతి యజమానికి చెప్పి, బయలుదేర దీయాలనుకున్నాడు. కానీ ఫిక్స్ బార్‌కు వెళ్లి కాస్త తాగి వెళదామని పాస్పార్తూని ఒప్పించాడు. తెగ తాగించాక ఫిక్స్ పాస్పార్తూతో తను ఇంగ్లండ్ ప్రభుత్వపు డిటెక్టివ్‌నని చెప్పేశాడు.
‘నీ యజమాని దొంగ. అరెస్టు వారంటు వచ్చేందుకు రెండు రోజులు పడుతుంది. అప్పటిదాకా ఫాగ్‌ను హాంకాంగ్‌లో ఉంచేట్లా చేస్తే నాకు వచ్చే 2 వేల పౌండ్ల బహుమతిలో నీకు 500 యిస్తాను’ అని ఆశపెట్టాడు. చస్తే అలా చెయ్యను అంటూనే పాస్పార్తూ మత్తులో మునిగిపోబోయాడు. ఫిక్స్ అతనికి మరి కొంత తాగించి స్పృహ తప్పేట్లు చేసి, బయటకు వెళ్లిపోయాడు. ఇదేమీ తెలియని ఫాగ్, ఆయూదా ఆ సాయంత్రం కాస్త షాపింగు చేసి, రాత్రి హోటల్లో పడుక్కుని మర్నాడు ఉదయం రేవుకి చేరారు. అక్కడ సిద్ధంగా ఉండవలసిన నౌకా, నౌకరూ యిద్దరూ లేరు. నౌక ముందు రాత్రే వెళ్లిపోయిందని తెలిసి, ఫాగ్ వేరే స్టీమరు కోసం ప్రయత్నించాడు. జాన్ అనే ఒకతన్ని పట్టుకుని నవంబరు 14వ తారీకు కల్లా యోకహామాకు చేరిస్తే రోజుకి వంద పౌండ్ల కిరాయి యిస్తాను అన్నాడు. ఈ చిన్న ఓడలో 1600 మైళ్ల దూరం వెళ్లడమంటే ప్రాణాలతో చెలగాటమే అన్నాడు స్టీమరువాడు.
కానీ ఒక ఉపాయం చెప్పాడు. శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లే స్టీమరు యోకహామా మీదుగా వెళ్లినా, అది బయల్దేరే చోటు షాంగ్‌హై, 11వ తేదీ ఉదయం 7 గంటలకు! అది ఇక్కణ్నుంచి 800 మైళ్లు. గంటకి 8 నాట్‌ల వేగంతో వెళితే 4 రోజుల్లో చేరవచ్చు అన్నాడు. ఫిక్స్‌ను కూడా తనతో రమ్మనమని ఆహ్వానించాడు ఫాగ్. లోపల తిట్టుకుంటూనే సరేనన్నాడతను. ఫాగ్ ఊళ్లోకి వెళ్లి పాస్పార్తూ గురించి అధికారులకు సమాచారం యిచ్చి ఓడ ఎక్కాడు. అతను దారి తప్పిపోయి, తిరిగి, రేవుకి చేరి, తామెక్కి వుంటామనుకుని కర్ణాటిక్ ఓడ ఎక్కేసివుంటాడని ఫాగ్, ఆయుదా అనుకున్నారు. జాన్, అతని సిబ్బందీ ఉత్సాహంతో పనిచేయడంతో ప్రయాణం జోరుగా సాగింది కానీ దారిమధ్యలో తుపాను వచ్చింది. పోనుపోను అది ఉధృతం కావడంతో మధ్యలో ఎక్కడైనా లంగరు వేద్దామన్నాడు జాన్. షాంఘై దాకా అపవద్దన్నాడు, తొణకని బెణకని ఫాగ్.
24 గంటలపాటు తుపాను పడవను ఊపేసింది. సిబ్బంది ధైర్యంతో, పట్టుదలతో పని చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లే స్టీమరు బయలుదేరే 7 గంటల సమయానికి యీ పడవ రేవుకి మూడు మైళ్ల దూరంలో ఉంది. ఫాగ్ సూచన మేరకు పడవ ప్రమాదంలో వున్నట్లు సూచిస్తూ పతాకం ఎగరవేశారు, ఫిరంగి పేల్చారు. అది చూసి స్టీమరు దగ్గరకు వచ్చింది. ఫాగ్ బృందాన్ని ఎక్కించుకుంది. సమయానికి చేరిస్తే జాన్‌కు 200 పౌండ్ల బహుమతి యిస్తానని చెప్పిన ఫాగ్ 500 పౌండ్లు ముట్టచెప్పాడు. స్టీమరు యోకహామా చేరగానే, ఫాగ్ కర్ణాటిక్ స్టీమరు దగ్గరకు వెళ్లి పాస్పార్తూ ఎక్కాడా అని వాకబు చేశాడు. ఎక్కాడని, నిన్ననే దిగి ఊళ్లోకి వెళ్లిపోయాడని వాళ్లు చెప్పారు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2022)