దటీజ్ ఆది.. తనేదో పెద్ద హీరో అనుకుంటున్నాడే!

2019 ఎన్నికల తర్వాత.. అస్సలు ఏమాత్రం సోదిలో లేకుండా పోయిన చాలా మంది తెలుగుదేశం నాయకుల్లో కడపజిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా ఒకరు! తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవిని…

2019 ఎన్నికల తర్వాత.. అస్సలు ఏమాత్రం సోదిలో లేకుండా పోయిన చాలా మంది తెలుగుదేశం నాయకుల్లో కడపజిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా ఒకరు! తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవిని అనుభవించాడే గానీ.. ఆ తర్వాత తనకే రాజకీయంగా ఠికానా లేకపోగా.. రాష్ట్రంలో అంతకంటె ఠికానా లేని భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. 

లోకల్ గా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆయనను రాజకీయంగా పట్టించుకునే వారు ఉన్నారో లేదో తెలియదు గానీ.. మాజీ మంత్రి అయినప్పటికీ.. రాష్ట్రస్థాయి రాజకీయాల్లో మాత్రం ఆయన పేరు సోదిలో కూడా వినిపించడం లేదు. అలాంటి ఆదినారాయణ రెడ్డి.. ఇప్పుడు హఠాత్తుగా తనను తాను పెద్ద హీరోగా ప్రొజెక్టు చేసుకోవాలని అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. 

తన మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టినట్టుగా, తన హత్యకు పథక రచన జరుగుతున్నట్టుగా.. చెప్పుకుంటూ, ఆ రకంగా తానో హీరో అని ఎస్టాబ్లిష్ చేసుకునే ఆరాటం ఆయన మాటల్లో కనిపిస్తోంది. 

వివరాల్లోకి వెళితే.. 

జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఆదినారాయణరెడ్డి 2014లో వైసీపీ టికెట్ మీదనే గెలిచారు. అయితే గెలిచిన తర్వాత.. తెలుగుదేశం లోకి ఫిరాయించారు. ఇలాంటి విలువల్లేని ఫిరాయింపు నాయకుల్ని నెత్తిన పెట్టుకుని, వారందరికీ మంత్రి పదవులు కట్టబెట్టే క్రమంలో చంద్రబాబునాయుడు ఆదినారాయణ రెడ్డిని కూడా మంత్రిని చేశారు. 

గెలిపించిన పార్టీనే వంచించి పదవికోసం టీడీపీలోకి వచ్చిన ఆదినారాయణ రెడ్డి.. టీడీపీ ప్రాభవం తగ్గిపోయిన తర్వాత.. ఆ పార్టీలో మాత్రం ఎందుకు ఉంటారు? చంద్రబాబు నీడను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి భయపడి.. బీజేపీలో ఉంటే.. తన మీద ఎలాంటి కేసులు పెట్టకుండా వదిలేస్తారనే ఆశతో.. కమలతీర్థం పుచ్చుకున్నట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది. 

బీజేపీ రాష్ట్ర కమిటీలో ఆయనకు పదవి కూడా ఉంది. కానీ ప్రాధాన్యం మాత్రం లేదు. ఏదో అలా రోజులు వెళ్లదీస్తున్న ఆదినారాయణ రెడ్డి.. అమరావతి రైతులను పరామర్శించడానికి వెళ్లారు. మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కు విశాఖలో చాలా భూములు ఉన్నాయని వాటిని విలువ పెంచి అమ్ముకోడానికే రాజధానిని అక్కడ పెట్టాలని అనుకుంటున్నారని ఒక కామెడీ ఆరోపణ చేశారు. 

అంతకంటె కామెడీ ఏంటంటే.. ‘నన్ను చంపుతారని నా భార్య బయపడుతోంది’ అంటూ.. అక్కడికేదో తాను పెద్ద హీరో అన్నట్టుగా బిల్డప్ ఇచ్చుకోడానికి ప్రయత్నించారు. పైగా.. ‘పరిటాల రవిలాగా నన్ను చంపుతారని’ అంటూ రవితో పోల్చుకోవడం ద్వారా తన రేంజి పెంచుకోడానికి ఆదినారాయణరెడ్డి ఆరాటపడడం ఇంకా పెద్ద కామెడీ. 

తడవకో పార్టీ మార్చి తన మనుగడకోసం పార్టీలతో ఎడాపెడా ఆడుకుంటున్న,  జనంలో క్రెడిబిలిటీ లేని ఈ నాయకుడు.. పైకి చెప్పుకుంటున్న ఇలాంటి బడాయి మాటలను చూసి జనం మాత్రం తెగ నవ్వుకుంటున్నారు.