సూటిగానే అడిగారు. ఎలాంటి సంకోచాలు లేకుండానే నిలదీశారు. నిజానికి ఈ ప్రశ్నకు జవాబు అధినాయకత్వం చెప్పాలి. కానీ విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు తమ్ముడు కొడుకు అయిన నాగార్జున చెప్పారు. చాలా మంది తమ్ముళ్ల కంటే ధీటుగా ఆయన చెప్పారు.
టీడీపీకి నాయకత్వ సంక్షోభం ఉందని అంటున్నారు, మాకు చంద్రబాబున్నారు, ఆయన తరువాత లోకేష్ బాబున్నారు. అదే మీ వైసీపీకి ఎవరున్నారు అని డైరెక్ట్ గానే అడిగారు. జగన్ కి పొరపాటున బెయిల్ రద్దు అయితే వైసీపీకి సరైన నాయకుడు ఎవరున్నారు అని నాగార్జున ఫ్యాన్ పార్టీలో కొత్త భయాలను కలిగించారనుకోవాలి.
ఈ మధ్యనే విజయనగరం జిల్లా టూర్ లో నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీకి లీడర్ షిప్ లేదని ఘాటైన కామెంట్స్ చేసి వెళ్లారు. దానికి ఇపుడు నాగార్జున బదులిచ్చారు అన్న మాట. ముందు మీ పార్టీ సంగతి చూసుకోండి వైసీపీ నేతలూ అంటూ రిటార్ట్ ఇచ్చారనుకోవాలి.
మాకు అయితే లోకేష్ బాబు ఉన్నారు, మీకే జగన్ తరువాత ఎవరూ లేరు, ఆయన బెయిల్ రద్దు అయితే మీ సంగతి ఏంటో చూసుకున్నారా అంటున్నారు. సరే నాగార్జునలో ఇంతటి ధీమా ఉంది కానీ ఇదే మాట ఏ పెద్ద తమ్ముడూ సీనియర్ నేత నిబ్బరంగా చెప్పలేకపోతున్నారే.
పదే పదే వైసీపీ నేతలు టీడీపీ పని అయిపోయింది అన్నప్పుడల్లా సైకిల్ పార్టీ సైలెంట్ గానే ఉంటోంది మరి. మొత్తానికి నాగార్జున లాజిక్ పాయింట్ తీశారు కాబట్టి ఇపుడు టీడీపీలో టాప్ టూ బాటం అంతా ఈ పాయింట్ నే ఎత్తుకుంటారేమో చూడాలి మరి.