Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: 80 రోజుల్లో భూప్రదక్షిణం

ఎమ్బీయస్: 80 రోజుల్లో భూప్రదక్షిణం

ఇది చదివే ముందు ‘‘ఎరౌండ్ ద వ(ర)ల్డ్ ఇన్ 80 డేస్’’ వ్యాసం చదవాలి.

పాస్పార్తూ సంగతేమైందంటే, ఆ బార్‌లో మూడు గంటలపాటు పడి నిద్రపోయాక కాస్త మెలకువ వచ్చింది. తన యజమాని చెప్పిన డ్యూటీ మనసులో మెదలుతూండగా కర్ణాటిక్, కర్ణాటిక్ అని పలవరిస్తూ రేవుకి వచ్చి ఓడ ఎక్కేసి, ఓ మూల కుప్పలా కూలిపోయాడు. మర్నాడు మధ్యాహ్నానికి మెలకువ వచ్చింది. ఫిక్స్ నిజస్వరూపం, బార్‌లో తనను తాగించిన వైనం గుర్తుకు వచ్చాయి. ఎలాగోలా ఓడలో వచ్చి పడ్డాం అదే చాలు అనుకున్నాడు. వెళ్లి ఫాగ్, ఆయూదాల కోసం వెతికాడు. కనపడలేదు. సిబ్బందిని వాకబు చేశాడు. వాళ్లు ఎక్కలేదని తెలిసింది. ఎందుకు? అని ఆలోచించగా అప్పుడు తట్టింది, కర్ణాటిక్ టైమింగు మారినట్లు ఫాగ్‌కు తను చెప్పనేలేదన్న సంగతి! తను చేసిన తప్పు వలన ఫాగ్ పందెం ఓడిపోయాడని, ఫిక్స్ యీపాటికే అరెస్టు చేయించి వుంటాడని అనుకుని వణికిపోయాడు, తనను తాను ఎంతో తిట్టుకున్నాడు. చేసేదేం లేక, 13వ తేదీ ఓడ యోకహామా రేవు చేరగానే దిగి ఊళ్లో తిరిగాడు. ఎక్కడా తిండి దొరకలేదు. మర్నాడు ఉదయం లేచేసరికి కరకరా ఆకలి వేసింది.

తన యూరోపియన్ డ్రెస్సు అమ్మేసి, జపనీస్ దుస్తులు కొంటే కాస్త డబ్బు చేతికి వచ్చింది. రేవు కెళ్లి, అమెరికా వెళ్లే ఓడలో దేనిలోనైనా వంటవాడిగా పని దొరుకుతుందేమో వాకబు చేద్దామనుకున్నాడు. రేవులో ఓ అట్ట మీద ఇంగ్లీషులో రాసిన ప్రకటన చూశాడు. జపనీస్ సాముగరిడీల బృందం వాళ్లు అవేళ జపాన్‌లో ఆఖరి ప్రదర్శన యిచ్చేసి అమెరికా వెళ్లిపోతున్నారని ఆ ప్రకటన సారాంశం. పాస్పార్తూకి గతంలో సర్కస్‌లో పనిచేసిన అనుభవం ఉంది. అది చెప్పుకుని ఉద్యోగం సంపాదించాడు. ఆ రోజు షోలో ఆఖరి ఐటమ్‌గా చేసే ‘మానవ గోపురం’లో బృందసభ్యులందరూ ఒకరి మీద ఒకరు నిలబడి పిరమిడ్ నిర్మిస్తారు. అడుగున నుంచుని జబ్బపుష్టి ప్రదర్శించే పాత్ర ధరించేవాడు హఠాత్తుగా వెళ్లిపోవడంతో దాన్ని పాస్పార్తూ కిచ్చారు. ఊళ్లోకి వచ్చిన ఫాగ్, సాయంకాలం దాకా గడువు ఉండడంతో, ఆయూదాతో సహా ఊళ్లోకి వెళ్లి ఫ్రెంచి కాన్సల్ కార్యాలయంలో పాస్పార్తూ గురించి వాకబు చేసి, రేవుకి వెళుతూ మధ్యలో యాదాలాపంగా ఆ ప్రదర్శన చూడడానికి వెళ్లాడు.

మానవగోపురంలో అట్టడుగున వెల్లకిలా పడుక్కుని వున్న పాస్పార్తూ బాల్కనీలోని ఫాగ్‌ని చూడగానే గబుక్కున లేచి అతని దగ్గరకు పరిగెట్టాడు. దాంతో అతనిపై ఆధారపడి నిలబడిన ఆర్టిస్టులందరూ కుప్పగా కింద పడ్డారు. పాస్పార్తూ తన దగ్గరకు రాగానే ఫాగ్ లేచి, రేవుకి పద అన్నాడు. సర్కస్ యజమాని వచ్చి గోల పెడితే ఫాగ్ ఓ నోట్ల కట్ట అతనిపై విసిరాడు. స్టీమరులోకి చేరాక పాస్పార్తూ తన కథంతా చెప్పాడు కానీ ఫిక్స్ నిజరూపం గురించి చెప్పడానికి యిది అనువు కాదనుకుని తప్పంతా తనపై వేసుకుని, క్షమాపణ కోరాడు. యోకహామా నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో చేరేందుకు 21 రోజుల ప్రయాణం కాబట్టి డిసెంబరు 2కల్లా అడంగు చేరాలి. నవంబరు 23న ఆ స్టీమరు 180వ దీర్ఘాంశం దాటడంతో ఫాగ్ భూగోళప్రదక్షిణంలో సగం దూరం పూర్తయింది.

ఇంతకీ ఫిక్స్ ఎక్కడున్నాడు? యోకహామాలో దిగగానే ఫిక్స్ ఇంగ్లీషు కాన్సల్‌కు వెళ్లి కనుక్కుంటే అరెస్టు వారంటు వచ్చేసిందంటూ చేతికిచ్చారు. అది 40 రోజుల క్రితమే జారీ అయింది. కానీ హాంగ్‌కాంగ్‌తో ఇంగ్లీషు సామ్రాజ్యం దాటిపోయింది కాబట్టి, జపాన్‌లో, అమెరికాలో అది పనికి రాదు. ఫాగ్ తరహా చూడబోతే ఎవరూ పట్టుకోలేరన్న ధైర్యంతో ఇంగ్లండులోకి అడుగుపెట్టేట్టే ఉన్నాడు. అప్పుడు వాడుకోవచ్చు, యీలోపుగా యితను దాటిపోకుండా చూసుకోవాలి అనుకుని యీ స్టీమరే ఎక్కి, చాటుగా ఉన్నాడు. నవంబరు 23న అనుకోకుండా అతను పాస్పార్తూ కంటపడ్డాడు, అతని చేత చితక్కొట్టబడ్డాడు. ఆ తర్వాత పాస్పార్తూకి చెప్పాడు – ‘బొంబాయిలో పూజారులను రెచ్చగొట్టి కేసు పెట్టించినది, హాంగ్‌కాంగ్‌లో నిన్ను తాగించినది అదంతా అరెస్టు వారంటు వచ్చేవరకు ఫాగ్‌ను ఇంగ్లీషు సామ్రాజ్యంలో నిలిపి వుంచడానికే! కానీ ఇప్పణ్నుంచి ఫాగ్ ప్రయాణానికి అడ్డంకులు కల్పించకుండా పూర్తిగా సహకరిస్తాను. ఎందుకంటే అతను ఎలాగోలా ఇంగ్లండు చేరడమే నాకు కావలసినది.’ అని. సరే, ప్రస్తుతానికి యిబ్బందులు కల్పించడు కదాని పాస్పార్తూ శాంతించాడు.

డిసెంబరు 2న ఫాగ్ శాన్‌ఫ్రాన్సిస్కో చేరేసరికి అతనికి గడువులో ఒక్క రోజైనా తరగలేదు, మిగలాలేదు. న్యూయార్కుకి వెళ్లే గ్రాండ్ ట్రంక్ రైలు సాయంత్రం ఆరు గంటలకని తెలిసింది. ఫాగ్, ఆయూదా ఊరు చూడబోయారు. దారిలో ఫిక్స్ ఎదురుపడి, ఒకే స్టీమరులో వచ్చినా ఎదురుపడనందుకు బోల్డు ఆశ్చర్యం నటించి, తానూ రైల్లో వస్తున్నానన్నాడు. ఈలోగా న్యాయాధిపతి పదవి కోసం జరిగే ఎన్నిక సందర్భంగా రెండు ముఠాలు తలపడ్డాయి. కర్నల్ స్టాంప్ ప్రాక్టర్ అనే ఒక అమెరికన్ ఫాగ్ ముక్కును బలంగా గుద్దబోయాడు కానీ మధ్యలో ఫిక్స్ అడ్డుపడి తను దెబ్బలు తిన్నాడు. ఫాగ్, కర్నల్ సవాళ్లు విసురుకున్నారు కానీ ఆ కోలాహలంలో మళ్లీ ఎదురుపడలేదు. చివరకు ఫాగ్ బృందం రైలెక్కింది. కొద్ది దూరం వెళ్లాక ఒక దున్నల గుంపు రైలు పట్టాలకు అడ్డంగా వచ్చి మూడు గంటల సేపు ఆలస్యం చేసింది. తర్వాత ప్రయాణం సాఫీగానే సాగింది కానీ న్యూయార్కు యింకో నాలుగు రోజుల్లో చేరతామనగా, ఒక ఉపద్రవం వచ్చింది.

రెండు కొండల మధ్య వేసిన సస్పెన్షన్ బ్రిజ్‌, తీగలు తెగిపోయి కూలిపోవడానికి సిద్ధంగా వుంది. రైలు వెళ్లడం ప్రమాదకరం. అందుకని అవతలివైపుకి ఓ రైలు పంపమని వర్తమానం పంపారు. అది వచ్చేందుకు ఆరు గంటలు పడుతుంది. ప్రయాణీకులు యీ రైలు దిగి, మంచులో 15 మైళ్లు నడుచుకుంటూ పోయి ఆ రైలు ఎక్కాలి. ఎలాగా అనుకుంటూండగా ఆ రైలు యింజనియరు ‘కావాలంటే ఫుల్ స్పీడులో రైలుని వంతెన మీదుగా పోనిచ్చేస్తే వంతెనను ఒక్క గంతులో దాటేయవచ్చు’ అన్నాడు. ఈ అమెరికన్ దుస్సాహసానికి పాస్పార్తూ అడ్డుపడపోయాడు కానీ అమెరికన్లందరూ సై అన్నారు. రైలు ఒక మైలు వెనక్కి వెళ్లి వంద మైళ్ల స్పీడుతో రైలు యీ చివర నుంచి, ఆ చివరకు గెంతేసింది. దాని వెనక్కాల వంతెన ఫెళఫెళమంటూ విరిగి పడిపోయింది.

వీళ్లంతా ఎక్కిన ఆ రైల్లోనే కర్నల్ ఎక్కిన సంగతి ఫాగ్‌కు తప్ప తక్కిన బృందసభ్యులకు తెలుసు. కర్నల్‌కు ఎదురుపడకుండా చూడాలని ఫాగ్‌ను పేకాట కాలక్షేపంలో ముంచారు. కానీ వంతెన ఘటన జరిగిన మర్నాడు కర్నల్ అనుకోకుండా ఫాగ్ కంపార్టుమెంటులోకి వచ్చి అతన్ని చూశాడు. పిస్తోళ్లతో ద్వంద్వయుద్ధానికి ఆహ్వానించాడు. ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తెలిసినా, ఫాగ్ తగ్గలేదు. రైలు నడుస్తూండగానే యిద్దరూ ఒకరి వీపు మరొకరికి ఆన్చుకుని, తుపాకులతో నిలబడ్డారు. మధ్యవర్తులు సిగ్నల్ యివ్వబోతూండగా అంతలో సియో ఇండియన్ల దండు ఒకటి రైలును ముట్టడించింది. దాంతో వీళ్లిద్దరూ తమ యుద్ధం మానేసి, దండుతో పోరాటం సాగించారు. ఆయూదా కూడా తుపాకీ చేతపట్టి, యుద్ధం చేసింది. రెండు మైళ్ల దూరంలోని కియర్నీ స్టేషన్‌లో రైలాపితే అక్కడున్న సైనికశిబిరం ప్రయాణీకులను రక్షించగలదు. కానీ రైలు కండక్టరుకి గుండు దెబ్బ తగలడంతో పడిపోయాడు. రైలు ఆపడం అసాధ్యం.

అప్పుడు పాస్పార్తూ తుపాకీ గుళ్ల మధ్యనుండి, రైలు పెట్టెల అడుగున ముందుకు సాగుతూ ఇంజను తర్వాతి బోగీ దాకా వెళ్లి, దానికీ ఇంజనుకీ మధ్య ఉన్న లంకెలు వదులు చేశాడు. ఇంజను ముందుకు వేగంగా వెళ్లిపోయింది. బోగీలు వేగం తగ్గిపోయి కియర్నీకి వంద గజాల దూరాన రైలు ఆగింది. తుపాకుల గొడవ విని సైనికులు పరుగున వచ్చారు. వాళ్లను చూస్తూనే సియో ఇండియన్లు పారిపోయారు. ఈ భీకరయుద్ధంలో ఫాగ్‌కు, ఆయూదాకు దెబ్బలు తగల్లేదు. ఫిక్స్‌కు చేతి మీద గాయమైంది. కర్నల్‌కు గజ్జల్లో గుండు దెబ్బ తిని కూలిపోతే అతన్ని స్టేషన్‌కు మోసుకుని పోయారు. పాస్పార్తూ కనబడలేదు. అతనితో పాటు మరో యిద్దర్ని సియో ఇండియన్లు బందీలుగా తీసుకుపోయారని తేలింది. ప్రాణాలకు తెగించి తమందరిని కాపాడిన పాస్పార్తూను అతని కర్మానికి వదిలి వెళ్లిపోవడం ఫాగ్ స్వభావానికి విరుద్ధం. తన పందెం సంగతి పక్కన పెట్టి, వెళ్లి సియో ఇండియన్లతో పోరాడ్డానికి బయలుదేరాడు. అతనితో పాటు వచ్చేందుకు సైనికుల్లోంచి 30 మంది వాలంటీర్లు సిద్ధపడ్డారు. తన దగ్గరున్న డబ్బుని ఆయూదాకు అప్పగించి, నాకేదైనా అయితే యిది నీదే అని చెప్పేసి, ఆమెకు ఫిక్స్‌ను రక్షణగా వుంచి యుద్ధానికి వెళ్లాడు.

అతను వెళ్లిన కాస్సేపటికి ముందుకు వెళ్లిపోయిన ఇంజను వెనక్కి వచ్చి, రైలును తీసుకుపోతానంది. రైలు అప్పటికే మూడు గంటలు ఆలస్యంగా నడుస్తోంది కాబట్టి, యుద్ధానికి వెళ్లినవాళ్ల కోసం ఆగడానికి వీల్లేదన్నాడు రైలు కండక్టరు. ఆయూదా రైలెక్కకుండా ఫాగ్ కోసం స్టేషన్‌లో వెయిట్ చేసింది. ఆమెతో పాటు ఫిక్స్ కూడా. చివరకు 18 గంటల తర్వాత ఫాగ్ బృందం ముగ్గురు బందీలను విడిపించి తెచ్చింది. తనతో వచ్చిన వాలంటీర్లకు ఫాగ్ 5 వేల డాలర్లు బహుమతిగా యిచ్చాడు. అంతా బాగానే వుంది కానీ, 20 గంటలు ఆలస్యమైంది కాబట్టి ఫాగ్‌ 11వ తేదీ రాత్రి 9 గంటలకు న్యూయార్కు నుంచి లివర్‌పూల్‌కు వెళ్లవలసిన స్టీమరు అందుకోలేడు. అప్పుడు ఫిక్స్ స్లెడ్జి మీద వెళ్లవచ్చని సలహా యిచ్చాడు.

దానికి రెండు దూలాల మీద చట్రం, దాని మీద ఐదారుగురు కూర్చునే వసతి ఉంది. ముందు ఎత్తయిన స్తంభం, దానికి తెరచాప, బండికి వెనక్కాల చుక్కానీ ఏర్పాటై ఉన్నాయి. శీతాకాలంలో మంచు కురిసి గడ్డకట్టి, రైలు పట్టాలు కప్పడిపోయినప్పుడు వీటి ద్వారానే యీ స్టేషను నుంచి ఆ స్టేషనుకు ప్రయాణిస్తూ వుంటారు. హిమతలం మీద తెరచాపల నిండా గాలిపోసుకు పరుగెత్తే యీ బళ్లు ఎక్స్‌ప్రెస్ రైలంత వేగంగా పోతాయి. 200 మైళ్లున్న ఒమాహా దాకా తీసుకెళ్లడానికి బేరం కుదిరింది. చల్లటిగాలి మొహానికి కొడుతూన్నా, తోడేళ్లు బండి వెనక్కాల పరుగు పెట్టినా ప్రయాణీకులు ధైర్యంగా కూర్చున్నారు. ఐదు గంటల ప్రయాణం తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటకు ఒమాహా రైలు స్టేషన్ చేరారు. న్యూయార్కు వైపు వెళ్లే రైలు సిద్ధంగా వుంది. 10వ తేదీ సాయంకాలం 4 గంటలకు షికాగో చేరారు. అక్కణ్నుంచి మరో రైలెక్కి 16 గంటల తర్వాత ఓహైయో, 11 రాత్రి 9.35కి జెర్సీ చేరారు. ఆ రేవు నుంచి లివర్‌పూల్ వెళ్లే స్టీమరు 35 ని.ల క్రితమే వెళ్లిపోయింది. తర్వాతి నౌక ఏమైనా ఉందా అంటే ఫ్రెంచి నౌక 14న బయలుదేరుతుంది, అది కూడా లివర్‌పూల్‌కు డైరక్టుగా వెళ్లదు అని చెప్పారు.

అంతా ఉసూరుమన్నారు కానీ ఫాగ్ ఊళ్లో హోటల్‌కి వెళ్లి విశ్రాంతి తీసుకుందాం పదండి అన్నాడు. మర్నాడు ఉదయమే రేవుకి వెళ్లి చూస్తే అన్నీ తెరచాపల పడవలే. ఒక స్టీమరు కనబడింది కానీ అది సరుకులు తీసుకెళ్లేది. మనుష్యులను ఎక్కించుకోకూడదు కానీ ఫాగ్ తలకు రెండు వేల డాలర్లు యిస్తానంటే ఓడ యజమాని కూడా ఐన కెప్టెన్ స్పీడీ సరేనన్నాడు. కానీ లివర్‌పూల్‌కు కాదు, బోర్డోకు మాత్రమే వెళతానని మొండికేశాడు. అరగంటలో ప్రయాణమయ్యారు. స్టీమరు ఎక్కిన 36 గంటల్లో ఫాగ్ డబ్బు ఎర చూపించి, సిబ్బందిని వశపరుచుకుని, స్పీడీని బందీ చేయించి, తనే కెప్టెన్‌గా వ్యవహరిస్తూ ఓడను తనకు కావలసిన దిశలో నడిపించ సాగాడు. 18వ తేదీన వాతావరణం కల్లోలితమై పోయినా, ఫాగ్ తొట్రుపడకుండా నడిపించాడు. గండం గడిచింది కానీ ఆ సాయంత్రానికి ఇంజనియరు వచ్చి బొగ్గు అయిపోతోంది. లివర్‌పూల్ యింకా 750 మైళ్లుంది. బోర్డో చేరడానికి వేసుకున్న యింధనం మీరు దారి మళ్లించడంతో మధ్యలోనే అయిపోయింది అన్నాడు.

ఫాగ్ కెప్టెన్‌ స్పీడీని పిలిపించి మాట్లాడాడు. నాకు కలప కావాలి. మీ ఓడ పై భాగంలో ఉన్న కలపను తగలబెట్టాల్సి వస్తుంది, నేను ఓడ మొత్తంగా కొనేస్తా అన్నాడు. స్పీడీ పళ్లు నూరుకుంటూ ’50 వేల డాలర్ల విలువైన ఓడను కొనే మొనగాడివా?’ అన్నాడు. ’60 వేలిస్తా’ అని ఫాగ్ అనడంతో నోరు వెళ్లబెట్టి సరేనన్నాడు. ఇక అప్పణ్నుంచి ఓడలో కలపలా కనబడినదల్లా కొట్టి పొయ్యిలో పడేశారు. 20వ తారీకు కల్లా ఓడకు అస్తిపంజరం రూపు వచ్చింది. మర్నాడు రాత్రి పది గంటల ప్రాంతంలో ఐర్లండ్‌లోని క్వీన్స్‌టవున్ దాపులకు వచ్చేసరికి బొగ్గు అయిపోవచ్చింది. తగలెయ్యడానికి ఓడలో ఏమీ మిగల్లేదు. రాత్రి ఒంటిగంటకు క్వీన్స్‌టవున్‌ రేవులో ఫాగ్ దిగిపోయాడు. మరో అరగంటలో రైల్వే స్టేషన్‌కు వెళ్లి డబ్లిన్ రైలెక్కాడు. అక్కడ మళ్లీ రేవుకి వెళ్లి లివర్‌పూల్‌కు వెళ్లే స్టీమరు ఎక్కాడు. అవి అతి వేగంగా పోతాయి. ఇలా డిసెంబరు 21 మధ్యాహ్నం 11.40కు లివర్‌పూల్ చేరాడు. లండన్ సరిగ్గా ఆరు గంటల దూరంలో ఉంది. చేతిలో 9 గంటలున్నాయి. సరిగ్గా యీ సమయంలో ఫిక్స్ అతన్ని అరెస్టు చేయించాడు. లివర్‌పూల్ కస్టమ్స్ హౌస్‌లోనే అతన్ని ఓ గదిలో ఉంచారు.

రెండు గంటల తర్వాత ఫిక్స్ పరుగులు పెడుతూ వచ్చాడు. ‘అసలు దొంగ మూడు రోజుల క్రితమే దొరికాడు. పోలికల మూలంగా పొరబాటు పడ్డాను. మన్నించండి. మీరు వెళ్లవచ్చు.’ అన్నాడు. దేనికీ చలించని ఫాగ్ యిప్పుడు మాత్రం చలించాడు. ఫిక్స్‌ని చాచి ఓ లెంపకాయ కొట్టి, రైల్వే స్టేషన్‌కు పరుగు పెట్టాడు. 35 ని.ల క్రితమే లండన్ ‌కెళ్లే రైలు వెళ్లిపోయింది. తనకు ప్రత్యేకమైన రైలు కావాలన్నాడు ఫాగ్. ఇరవై నిమిషాల్లో రెడీ అయింది. రైలు ఎంత వేగంగా వెళ్లినా ఫాగ్ లండన్ చేరేసరికి 8.50 అయింది. 5 ని.ల తేడాతో పందెం ఓడిపోయాడు ఫాగ్. రైలు దిగగానే యింటికి వచ్చి, తన గదికి వెళ్లి ఉదాసీనంగా కూర్చున్నాడు. దాదాపు 20 వేల పౌండ్లు ఖర్చు పెట్టి చేసిన ఘనసాహసం ఒక మూర్ఖపు డిటెక్టివ్ చేసిన పని వలన నాశనమైంది. పందెంలో మరో 20వేల పౌండ్లు పోతాయి. డబ్బు పోయినందుకు కాదు, పరువు పోయిందని బాధపడ్డాడు ఫాగ్.

మొహం చెల్లక మర్నాడు మధ్యాహ్నం క్లబ్బుకి వెళ్లలేదు. పందెం చెక్కు ముందే యిచ్చేశాడుగా. సాయంత్రం ఏడున్నరకు ఫాగ్ ఆయూదాను పిలిపించి, ‘నా ఆస్తిలో కొంతభాగం మీకిచ్చి, యిబ్బంది లేకుండా చూద్దామనుకున్నాను. ఇప్పుడు అంతా పోయింది. తక్కిన కాస్త సొమ్ము మీ పేర ఉంచడానికి అనుమతి కోరుతున్నాను.’ అన్నాడు. ఆమె ‘మీరు అంగీకరిస్తే నేను మీకు భార్యనవుతాను.’ అంది. ఫాగ్ ఆశ్చర్యానందాలతో ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను.’ అని చెప్పాడు. పాస్పార్తూని పిలిచి ‘రేపు సోమవారం చర్చిలో పెళ్లి చేసుకుంటాం. ఫాదిరీకి చెప్పిరా’ అన్నాడు. పాస్పార్తూ అక్కడకు వెళ్లేసరికి మర్నాడు సోమవారం కాదని, ఆదివారమేననీ తెలిసింది. వెంటనే పరుగుపరుగున యింటికి వచ్చి ఫాగ్‌తో ‘మీరు లెక్క తప్పారు. ఇవాళ శనివారం.’ అని చెప్పాడు. జరిగిందేమిటంటే ఫాగ్ తూర్పుదిశగా, సూర్యుడికి అభిముఖంగా వెళ్లడం చేత ఒక్కో డిగ్రీ మారినప్పుడల్లా రోజు నాలుగు నిమిషాలు కురచబారింది. అలా ఒక రోజు కలిసి వచ్చింది. అదే కనక పడమటివైపు వెళ్లి భూమి చుట్టి వస్తే ఒక రోజు నష్టపోయేవాడు. ఫాగ్ యీ లెక్క చూసుకోలేదు.

అందువలన 79 రోజుల 5 ని.లలో తన ప్రదక్షిణం ముగిసినా తను పందెం ఓడిపోయాననుకున్నాడు. పాస్పార్తూ వచ్చి చెప్పగానే వెంఠనే బగ్గీలోకి ఉరికి, సరిగ్గా 8.45 కల్లా క్లబ్బులో ఉన్నాడు. ఈ లోపున ఇంగ్లండులో జరిగిందేమిటంటే బ్యాంకు దొంగ దొరకగానే, ఫాగ్ ఆరాధకులు పెరిగిపోయారు. అతనికి అనుకూలంగా పందాలు వేసేవాళ్లు పెరిగారు. క్లబ్బు సభ్యులకు అతని ఆనుపానులు తెలియలేదు. డిసెంబరు 21న క్లబ్బులో సమావేశమై, న్యూయార్కు నుంచి లివర్‌పూల్‌కి ఓడలో వచ్చిన ప్రయాణీకుల జాబితాలో ఫాగ్ పేరు లేదు కాబట్టి, అతను పందెం ఓడిపోయాడని తీర్మానించుకున్నారు. కానీ సరిగ్గా 8.44.57కు ఫాగ్ క్లబ్బులో ప్రత్యక్షమై ‘వచ్చాను’ అన్నాడు! పందెం డబ్బు 20 వేల పౌండ్లు వస్తే, ప్రయాణభత్యాలకు దాదాపు 19 వేలు ఖర్చయ్యాయి. తక్కిన వెయ్యి పౌండ్లు పాస్పార్తూకు, ఫిక్స్‌కు పంచి యిచ్చేశాడు. ఆయూదాను పెళ్లాడాడు.

ఇదీ కథ. జూల్స్ వెర్న్ నవలలన్నీ చాలా బాగుంటాయి. చిన్నప్పుడే కాదు, పెద్దయ్యాక కూడా చదవ బుద్ధవుతాయి. దీన్ని నేను పదేపదే తెలుగులో చదవడానికి కారణం, రమణగారి అనువాదం. పేర్లు తప్పిస్తే అచ్చ తెలుగు నవల్లా ఉంటుంది. అనువాద రమణీయానికి నేను రాసిన ముందుమాటకు ‘తర్జు’మాంత్రికుడు రమణ...’ అని పేరు పెట్టాను. రమణ చమక్కులకు కొన్ని ఉదాహరణలు యిచ్చాను కూడా – ‘ఆవంత కూడా వంత లేకుండా...’, ‘పాస్పార్తూ వాలకం అందరికి అసలుసిసలు బైతు వాలకంలా కనబడింది.’, ‘గోడకి కన్నం వేయడానికి కరాలే తప్ప పరికరాలు లేవు’, ‘ఏనుగు హౌదాలో కూచున్నపుడు కడుపులో చల్ల కదలకుండా ఉండడం సాధ్యం కాదు.’ ‘ఏరు దాటాక తెప్ప తగలెయ్యడం లోకంలోని రివాజు, ఫాగ్ తెప్ప తగలేసి మరీ సముద్రం దాటాడు.’, ‘ఫాగ్ నిశ్చింతాక్రాంతుడు’, ఓడ కెప్టెన్ ఫాగ్‌ని మెచ్చుకుంటూ ‘మీలో మా యాంకీ హంశ (అంశ అనకుండా హంశ అనడంలో అసలైన తెలుగుతనం వుంది) కొంత ఉంది సుమండీ’ ఇవేకాదు, నీ అసాజ్జెంకూల, గట్టిగా తగులుకోవడం, జడ్డి మనిషి లాటి పదప్రయోగాలు కూడా ఉన్నాయి. రమణగారి రచనలలోంచి ఏరిన ‘జీడి‘పలుకు’లతో ఓ శీర్షిక నడుపుదామని వుంది. అప్పుడు ఇంకా కొన్ని చెపుతాను.

రమణగారి రచన పుస్తకంగా వెలువడినప్పుడు ముఖచిత్రం తప్ప లోపల వేరే బొమ్మ ఉండేది కాదు. అనువాద రమణీయంలో నేను దీన్ని చేర్చినపుడు బాపుగారి చేత కొన్ని బొమ్మలు గీయించుకున్నాను. 1956 సినిమాలోని కొన్ని స్టిల్స్‌ను వాడుకున్నాను, మ్యాప్‌లు చేర్చాను. ఈ ఎడిషన్ కూడా ప్రజాదరణ పొంది పునర్ముద్రణలకు వచ్చింది. వీలైతే చదవండి. పుస్తకం మొదలుపెడితే ఆపబుద్ధి కాదు. 1956 సినిమాలో కథలో లేని అదనపు ఆకర్షణలు చేర్చారు. కానీ బాగుంటుంది, చూడండి. (సమాప్తం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?