Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: ఆత్మజ్ఞాని పవన్

ఎమ్బీయస్‍: ఆత్మజ్ఞాని పవన్

తనను తాను తెలుసుకోమంటారు వేదాంతులు. అది తాత్త్వికపరమైన క్లిష్టమైన ప్రక్రియ కాబట్టి అంత దూరం పోకపోయినా స్వాట్ ఎనాలిసిస్ చేసుకోమంటారు ఆధునికులు. తన బలం, బలహీనత, రాబోయే ప్రమాదాలు, అవకాశాలు గుర్తించి, వాటికి తగ్గట్టు వ్యూహం రచించుకోమంటారు వారు. ఆ పని చేసినందుకు పవన్ అభినందనీయులు. చేయడమే కాకుండా బహిరంగ సభలో ధైర్యంగా దాన్ని వెల్లడించినందుకు మరీ అభినందనీయులు. అదే ప్రసంగంలో ఎటువంటి పరిస్థితుల్లో తను పొత్తు పెట్టుకుంటానో కూడా చెప్పారు. దానికి ఆయన కట్టుబడి వ్యవహరించాలని ఆశిద్దాం మనం. అప్పుడే జ్ఞానాన్ని ఆచరణలో పెట్టిన వారవుతారు పవన్.

పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో దిగడం ప్రమాదకరం అన్నారాయన. ఏ స్థాయి ప్రమాదకరమో చెప్పడానికి కవితాత్మకంగా అలా వెళితే వీరమరణం తథ్యం, అది అవసరమా? అని తన ఓటర్లను అడిగారు. వీరమరణం అనేది పెద్ద మాట. తాను మరణించినా, శత్రువులు పదిమందిని తనతో పాటు స్వర్గానికి తీసుకెళ్లినవాణ్ని వీరమరణం పొందాడంటాం. అభిమన్యుడి మృతి లాటిదన్నమాట. పవన్ రాజకీయవైఫల్యం వీరమరణం కేటగిరీలోకి రాదు. ఎందుకంటే ఆయన ఆవగింజంతైనా శత్రుసంహారం చేయలేక పోయాడు. జగన్‌ను ఛస్తే అధికారంలోకి రానీవ్వను అని ప్రతిజ్ఞ చేసినా, జగన్‌కు 175లో 151 సీట్లు వచ్చిపడ్డాయి. ఏ 80 దగ్గరో ఆగిపోయి ఉంటే, మేం అధికారంలోకి రాలేకపోయినా, జగన్‌కు పదవి దక్కకుండా చేశాను, నాది వీరమరణం అని పవన్ చెప్పుకునే వీలుండేది. అలా జరగలేదు. నా ఉద్దేశంలో ఆత్మాహుతి అనే పదం వాడి ఉంటే సరిపోయేది.

ఇక దశాబ్దకాలంగా ఒంటరిగా పోరాడి.. అనే మాటే పొరపాటు. పవన్ ఎప్పుడూ ఒంటరిగా వెళ్లలేదు. 2014లో బిజెపి, టిడిపిలతో కలిసి జగన్‌ను ఓడించారు. 2019లో కూడా సిపిఐ, సిపిఎం, బియస్పీలతో కలిసి వెళ్లి జగన్ చేతిలో ఓడారు. ఇప్పుడు కూడా బిజెపితో పొత్తులో ఉన్నారు. జనసేన-బిజెపి కలిసి పోటీలోకి దిగుతాయని బిజెపి నాయకులు పదేపదే ప్రకటిస్తున్నారు కూడా. పవన్ మోదీని కలిసి ముచ్చటించడం కూడా ఒక భాగస్వామిగానే! టిడిపితో అధికారికంగా పొత్తు లేకపోయినా, స్థానిక ఎన్నికలలో వైసిపిని ఒంటరిగా ఎదిరించలేమని భావించిన నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో జనసేన, టిడిపి కార్యకర్తల మధ్య అవగాహన కనబడింది. బయట కూడా జనసేన, టిడిపి ఒకరి నొకరు విమర్శించుకోవు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా ప్రశ్నించి, నిందించిన పవన్ ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు బాబును ఏమీ అనరు. టిడిపి అనుకూల మీడియా పవన్‌పై యీగ వాలనీయదు. ఆయన అంతటివాడు, యింతటివాడు అనే బిల్డప్ యిస్తుంది.

ఇవన్నీ జనసైనికులకు తెలుసు. ఈ పరిస్థితిని ఆమోదించినట్లే కనబడుతోంది. మరి అలాటప్పుడు ఒంటరిగా వెళితే చావును వరించినట్లే, పార్టీ బతకాలంటే పొత్తు పెట్టుకుని తీరాల్సిందే అని పవన్ ఎందుకు అనాల్సి వచ్చింది? బిజెపితో ఉన్న పొత్తుని పొత్తుగా ఆయన అనుకోవటం లేదని అర్థమౌతోంది. టిడిపితో కుదుర్చుకునే పొత్తే పొత్తు అని ఆయన అభిప్రాయంగా తెలుస్తోంది. టిడిపి పేరు చెప్పకపోయినా, దానితో పొత్తు కుదుర్చుకోక తప్పని పరిస్థితి వచ్చింది అని జనసైనికులను కన్విన్స్ చేసే ప్రయత్నం కనబడింది. అసలు ప్రయత్నం ఎందుకు చేయవలసి వచ్చింది? వారిలో దాని పట్ల విముఖత ఉందని ఆయనకు తోచిందా? తను చేయబోయే పనిని సమర్థించుకోవడానికై జనసైనికులపై నెపం వేశారాయన. మీరు మీటింగులకు వస్తారు తప్ప ఓట్లేయరు అని ఎత్తి చూపారు.

దీన్ని నెపం అనడం కంటె వాస్తవాలను అంగీకరించారని, అది కూడా ఆత్మజ్ఞానంలో భాగమనీ చెప్పాలి. జనసేన విషయంలో పవన్ చెప్పినదే జరుగుతోంది. మీటింగులకు జనం విరగబడతారు. సిఎం పవన్, సిఎం పవన్ అని నినాదాలిస్తారు. అది చూసి పవన్ పొంగిపోయి, రెచ్చిపోయి ఏవేవో మాట్లాడతారు. రెండు మూడు రోజుల పాటు వైసిపి నుంచి కౌంటర్లు, టిడిపి నుంచి సమర్థనలు వినబడతాయి. పొత్తు భాగస్వామి ఐన బిజెపి మాత్రం ఏమీ పట్టించుకోదు. నాలుగైదు రోజుల్లో మొత్తం చల్లారిపోతుంది. సభకు వచ్చినవారి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఛానలైజ్ చేసేందుకు పార్టీకి యంత్రాంగం లేదు. వ్యవస్థ లేదు. అది ఏర్పరిచేందుకు పవన్‌కు తీరిక లేదు. ఆ బాధ్యత యింకోళ్లకు అప్పగించే శ్రద్ధ లేదు. దాంతో జనసైనికులకు ఏం చేయాలో పాలుపోక, సోషల్ మీడియాలో హడావుడి చేస్తూ కాలం గడుపుతూంటారు. అదీ కొందరే! తక్కినవారు నిస్తేజంగా ఉంటారు.

సభకు వచ్చినవారు ఓట్లేయరని అనుకోవడానికి లేదు. కానీ యితరుల చేత ఓట్లు వేయించే స్థితిలో లేరని అర్థం చేసుకోవాలి. పవన్ తన ప్రసంగంలో ఒక మాట అన్నారు – ‘పొత్తు విషయమై మీ తల్లిదండ్రులతో మాట్లాడి చెప్పండి..’ అని. అంటే సభలో యువకులే బహుళంగా కనబడుతున్నా రన్నమాట. ఓటర్లంటే అన్ని వయసుల వారూ, అన్ని వర్గాల వారూ ఉంటారు. వాలంటీర్లలో యువకుల పాత్ర ఎక్కువగా ఉండవచ్చు కానీ అన్ని వర్గాల వారినీ వారు ఒప్పించి జనసేనకు ఓట్లేయించ గలగాలి. ఆ దిశగా వారికి తర్ఫీదు యిప్పించాలి. దశాబ్దమైనా జనసేన యీ పని చేయలేదు. పవన్ బహిరంగ సభలతో సరిపెడుతున్నారు. జనసేన నికార్సయిన రాజకీయ పార్టీ అని, దానికో సిద్ధాంతం, అంకితభావం ఉన్నాయని, రంగంలోకి వచ్చి వనరుల విషయంలో పెద్ద పార్టీలతో తలపడగలదని, తనకు ఓటేసినవారి ప్రయోజనాలకై నిలబడగలదని ఓటర్లలో నమ్మకం కలిగించినప్పుడే పవన్ పట్ల అభిమానం ఓట్లగా తర్జుమా అవుతుంది.

ఇది జరగాలంటే మొట్టమొదటగా జరగాల్సింది, పవన్ హోల్‌టైమ్ పొలిటీషియన్‌గా మారడం! పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులుంటే వారికి సమయం కేటాయించడం, లేకపోతే వారిని తయారు చేసుకోవడం, వారి సలహాలు, సూచనలు వినడం, వారికి పనులు బెత్తాయించడం, పర్యవేక్షించడం, జాతీయ అంతర్జాతీయ విషయాలపై, ఆర్థికపరమైన అంశాలపై తన అభిప్రాయాలు చెపుతూ, వ్యాఖ్యలు చేస్తూ తనకు రాజకీయ అవగాహన, పరిపాలనాసరళిపై ఒక దృక్పథం ఉన్నాయని ఓటర్లలో విశ్వాసం కలిగించడం.. యిలాటివి జరగాలి. వీటికి బదులుగా అప్పుడప్పుడు సభలు పెట్టి, ఏవేవో కార్యక్రమాలు చేసి, కటువైన వ్యాఖ్యలు చేసి.. పేపర్లకు మేత సృష్టించి, తక్కిన రోజుల్లో తన పని చూసుకుంటూ ఉంటే ఆయనను నమ్ముకున్నవారికి నమ్మకం ఎలా కుదురుతుంది?

జెడి లక్ష్మీనారాయణగారు జనసేనలో చేరినప్పుడు పవన్‌ను యుగపురుషుడి రేంజ్‌లో కీర్తించారు. తర్వాత పార్టీలోంచి బయటకు వచ్చేశారు. అదేమని అడిగితే ఆయన సినిమాలు వదిలేస్తానంటే నమ్మాను. కానీ ఆయన వదలలేదు. రెండు పడవల్లో కాళ్లు పెట్టి ప్రయాణం చేస్తానంటున్నారు. ఆయన సీరియస్‌గా లేరని అర్థమై బయటకు వచ్చేశాను అన్నారు. ఎన్టీయార్ కానీ, చిరంజీవి కానీ సినిమాలు వదిలేసి వచ్చామన్నాకే వాళ్లకు ఓట్లు పడ్డాయి. చిరంజీవి ముఖ్యమంత్రి కాలేకపోవచ్చు. కానీ ప్రజారాజ్యం పార్టీ సాధించిన ఓట్లు, సీట్లు తక్కువేమీ కాదు. నిలదొక్కుకుని ఉంటే, తెలుగు రాజకీయాలను ప్రభావితం చేసి ఉండేది. కానీ చిరంజీవికి నిరుత్సాహం కమ్ముకుని వచ్చింది, సీరియస్‌నెస్ పోయింది.

పవన్ కూడా కనీసం ఏడాదిన్నర పాటు, ఎన్నికల వరకైనా సినిమాలను పక్కన బెట్టి నియోజకవర్గాల్లో తిరుగుతూ, తన సహచరులకు దిశానిర్దేశం చేస్తే తప్ప ఆయన్ను ఓటర్లు సీరియస్‌గా పట్టించుకోరు, ఆయన పార్టీకి రావలసినన్ని ఓట్లు రావు. అది చెయ్యకపోవడం చేతనే ఆయన మాటలు పడుతున్నాడు. 175 నియోజకవర్గాల పేర్లు చెప్పగలవా? అని ఒకాయన అడిగాడు. కాల్షీట్ యిచ్చి షూటింగులకు వెళ్లినట్లు, అప్పుడప్పుడు రాజకీయ కార్యక్రమాలకు హాజరవ్వడంతోనే యిలాటి ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఇవన్నీ తెలిసి కూడా పవన్ తన ధోరణి మార్చుకోక పోవడానికి కారణమేమిటో తెలియదు. సినీ కాల్షీట్లు నిర్మాతకు అమ్ముకున్నట్లు, రాజకీయ కాల్షీట్లు చంద్రబాబుకి అమ్ముకున్నారనే భావంతో ఆయనను ప్యాకేజి స్టార్ అంటున్నారు. ఏ ఆధారమూ చూపకుండా యిలాటి ఆరోపణలు చేయడం ఆయనకు కోపం తెప్పిస్తోంది. చెప్పు తీస్తానంటున్నారు. నిజమే కదా, నిరాధారమైన ఆరోపణలు పదేపదే చేస్తూ ఉంటే ఎవరికైనా కోపం వస్తుంది.

దీనికి పరిష్కారం, ఆయన హోల్‌టైమర్‌గా మారడం, ఆంధ్రలోనే మకాం పెట్టి, ఓ ఏడాది పాటైనా జనంలో తిరగడం. తన వారాహి యాత్ర ద్వారా ఆయన ఆ పని చేద్దామనుకుంటున్నాడు. సినిమాలకు తాత్కాలికంగానైనా గుడ్‌బై చెప్పి ఆ పని చేస్తారో, విరామాల్లో చేస్తారో ప్రస్తుతానికి తెలియదు. ఆయన అనుదినం రాజకీయ కార్యకలాపాల్లో మునిగి తేలిన రోజున, జనసైనికుల్లో, ఆయన అభిమానుల్లో విశ్వాసం కుదురుకుంటుంది. దానికి బదులుగా టిడిపితో పొత్తు గురించి యీయన మాట్లాడడం వారిలో కలవరాన్ని కలిగిస్తోంది. టిడిపితో పొత్తు అవసరమే అని వారికీ తెలుసు. కానీ ఏ షరతులతో పొత్తు కుదురుతుంది అనేదే వారికి భయం కలిగిస్తోంది. బాబు గతంలో తన భాగస్వామి బిజెపితో ఎలా వ్యవహరించారో తెలుసు.

ఇప్పుడు కూడా జనసేనకు ప్రేమలేఖ రాశామంటున్నారు కానీ దానిలో ఏ హామీలు యిచ్చారో చెప్పటం లేదు. నిన్ను నెత్తిన పెట్టుకుంటా, లేకపోతే కాస్త కిందకు దింపి గుండెలో పెట్టుకుంటా, లేకపోతే మరీ కాస్త కిందకు దింపి పొట్టలో పడేసుకుని జీర్ణం చేసేసుకుంటా.. అని ఏదో ఒకటి అనాలి కదా! అది పైకి చెప్పటం లేదు. ఎంతసేపూ చేతులు కలిపి వైసిపిని దింపుదాం అంటారు, ఆ తర్వాత...? తర్వాత గద్దె కెక్కేదెవరు? మీరా? నేనా? మీరు కొంతకాలం, నేను కొంతకాలమా? అది తేల్చుకోకుండా టిడిపితో పొత్తు విషయంలో పవన్ ముందుకు వెళ్లడం జనసైనికులకు రుచించటం లేదు. బాబు ఎంతకైనా సమర్థులు. జనసేనకు ఏ 30 సీట్లో యిస్తానని ఒప్పుకుని, సహారా ఎడారిని భూదానంగా యిచ్చినట్లు, వైసిపికి కంచుకోటగా ఉన్న రాయలసీమలో ‘బలిజలు ఎక్కువగా ఉన్న రాయలసీమను మీకు ధారాదత్తం చేస్తున్నా’ అంటూ ఏ 20 సీట్లో అక్కడే యివ్వవచ్చు. పోటీ బలంగా ఉండే గోదావరి జిల్లాల్లో కొన్ని యివ్వవచ్చు. తన అనుయాయులనే జనసేన అభ్యర్థులుగా ఫిరాయించవచ్చు. తన కోవర్టులను పార్టీలో చేర్పించవచ్చు. బాబు గతచరిత్ర తెలిసిన వారందరికీ యిలాటి అనుమానాలు రావడం సహజం.

‘నేనలా జరగనివ్వను. తొలి విడత ముఖ్యమంత్రిగా నేను ఉంటానని ఆయన చేతనే ప్రకటింప చేస్తాను’ అని పవన్ ప్రకటించిన రోజున జనసైనికులు ఉత్సాహంగా పని చేస్తారు. పవన్ అభిమాన ఓటర్లు ఉత్తేజితులై ఓట్లు వేస్తారు. పవన్ తన ప్రసంగంలో ఆ హామీ యివ్వలేదు కానీ ‘మనకు గౌరవం తగ్గకుండా పొత్తు కుదిరితే కలిసి వెళ్తామని లేదంటే ఒంటరిగా పోటీ చేస్తాం. రాబోయేది జనసేన ప్రభుత్వం లేదా మిశ్రమ ప్రభుత్వం.’ అన్నారు. అదే ఊపులో ఒంటరిగా వెళితే వీరమరణం తప్పదని కూడా అన్నారు. ఇక్కడే ‘మీపై నమ్మకం కుదిరితేనే ఒంటరిగా వెళతాను. కానీ మీపై నమ్మకం లేదు.’ అని కూడా చెప్పేశారు. ఏ సేనాపతీ తన సైనికులతో యింత బ్లంట్‌గా మాట్లాడి ఉండరు. మనసులో మాటను యింత నిష్కర్షగా చెప్పినందుకు మెచ్చుకోవాలో లేదో తెలియకుండా ఉంది. నాకు మీ మీద నమ్మకం లేదు కానీ, మీరు నన్ను నమ్మండి, మన ప్రభుత్వం వస్తుంది అనడం ఎలా ఉందంటే, ‘నీ పెళ్లి నా మొహంలా ఉంది, నా పెళ్లికి వచ్చి కాగడా పట్టు’ అన్నట్టుంది. అవతలివాడికి గౌరవం యిస్తేనే, వాడు నీకు యిస్తాడు.

ఇక, ‘నన్ను గెలిపిస్తానని గ్యారంటీ యిస్తారా?’ అని అడగడం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏ రాజకీయ నాయకుడూ చేసి ఉండడు. గ్యారంటీ యివ్వడానికి అభిమానుల సత్తా ఏమిటి? ఆంధ్రదేశంలోని మెజారిటీ ఓటర్లు వాళ్లు చెప్పినట్లు వింటారా? మొగుడు ఒక పార్టీకి, పెళ్లం మరో పార్టీకి, పిల్లలు మూడో పార్టీకి ఓట్లేసే రోజులివి. తమ ఓట్ల వరకు గ్యారంటీ యివ్వగలరు కానీ పక్కవాడి ఓటుకి గ్యారంటీ ఎలా యివ్వగలరు? ఇచ్చినా అది ఎలా చెల్లుతుంది? వస్తువులు కొన్నపుడు యిచ్చే గ్యారంటీలనే వారంటీలుగా మార్చేశారు. దానికీ, దీనికీ తేడా ఏమిటో కొనేవాడికి అర్థం కాదు. ఏ హామీలిచ్చాడో చదువుదామన్నా కనబడకుండా చిన్న అక్షరాల్లో యిస్తారు. నిజంగా రిపేరుకి వచ్చేసరికి, సర్వీస్ సెంటరు వాడు దీనికి వారంటీ వర్తించదండి అంటాడు. వస్తువుల మాటే కాదు, ‘నాతిచరామి’ అని మంత్రబద్ధంగా యిచ్చిన హామీలే గాలికి పోతున్న కాలమిది.

ఇప్పటికే పార్టీ అభిమానులు నాయకుల చేత నానా చివాట్లూ తింటున్నారు. ‘ఒక్క ఛాన్సు అని జగన్ వచ్చి ఓట్లడిగితే, అతనికి వేసేశారు, నన్ను ఓడించి చాలా తప్పు చేశారు. అనుభవిస్తున్నారు.’ అని చంద్రబాబు పదేపదే ఓటర్లను ముక్కచివాట్లు పెడుతున్నారు. పవన్ కూడా‘మీకోసం పార్టీ పెడితే నన్ను రెండు చోట్ల ఓడించేశారు, మీటింగులకు వచ్చి అరుపులు కేకలు పెడతారు’ అని విసుక్కుంటున్నారు. బాబు, పవన్‌ల ప్రతాపమంతా ఎవరి మీద? తమ ప్రసంగం వినడానికి వచ్చిన పార్టీ అభిమానుల మీద! వీళ్లకి ఓట్లేయని జనం వీళ్ల సభలకే రారు. వీళ్లు వాళ్ల దగ్గరకి వెళ్లనే లేరు. మీటింగుకి వచ్చి తిట్టించుకుని, బిక్కచచ్చిన జనాలు ఏ నాయకుడికైనా గ్యారంటీ యిచ్చే స్థితిలో ఉంటారా? ఇచ్చినా మీ మీద నమ్మకం లేదనేవాడు ఆ గ్యారంటీని లెక్క చేస్తాడా?

ఇలా వాళ్లని ఆడిపోసుకుని ఫైనల్‌గా పవన్ ‘మీరు గ్యారంటీ యివ్వలేదు, యిచ్చినా నాకు నమ్మకం కుదరలేదు, అందుకే పొత్తుకి వెళుతున్నా’ అనవచ్చు. పొత్తు అనేది బిజెపితో కాదని మనం గ్రహించాలి. ఎందుకంటే వాళ్లతో అల్‌రెడీ ఉంది. కొత్తగా చర్చించినది టిడిపితో పొత్తు గురించి! టిడిపితో పొత్తు పెట్టుకోవడం తథ్యమని తేలాక దానిపై బిజెపి ఎలా రియాక్టవుతుందో చూడాలి. జనసేన-టిడిపి పొత్తు ఏ టర్మ్‌స్‌పై కుదురుతోంది అనేదే ఆసక్తి కలిగించే అంశం. ఇక్కడ కీవర్డ్ ‘గౌరవం తగ్గకుండా..’. దానికి పవన్ యిచ్చే నిర్వచనం ఏమిటి అన్నదానిపై ఆయన రాజకీయాభిమానులు ఓట్లేసే అంశం ఆధారపడి ఉంటుంది. పవన్, బాబు యిప్పటికే రెండు సార్లు కలిశారు. ఆ సందర్భంగా పొత్తు గురించి యిన్‌ఫార్మల్‌గా నైనా చర్చలు జరిగి ఉంటాయి, కనీస అవగాహన ఏర్పడి ఉంటుంది అని అనుకోవడం సహజం.

కానీ పవన్ సీట్ల కేటాయింపు గురించి మాట్లాడ లేదంటున్నారు. అలాటప్పుడు కూటమికి తరఫున ఎవరు ముఖ్యమంత్రి, ఎంతకాలం అనే విషయం మాట్లాడారా అని అడగడం అనవసరం. మరేం మాట్లాడారుట? అంబటి రాంబాబు గురించి 23 ని.లు, సమయానికి పేరు గుర్తుకు రాని మంత్రి గురించి 48 ని.లు మాట్లాడుకున్నారట. వాళ్లంత ముఖ్యులా? మూలవిరాట్టు జగన్ గురించి, అతన్ని ఓడించే వ్యూహం గురించి మాట్లాడుకోకుండా యీ ఉత్సవ విగ్రహాలపై అంత సమయం వృథా చేయడం దేనికి? శాంతిభద్రతల విషయం 38 ని.లు మాట్లాడారట. అది సజీవ సమస్య. జీఓ 1ను స్థానిక పోలీసధికారులు పక్షపాతంతో అమలు చేయడం మొదలుపెడితే అప్పుడెలాగూ ఆ సమస్య వస్తూనే ఉంటుంది. సజావుగా అమలు చేస్తే ప్రజలు సంతోషించి శాంతంగా ఉంటారు. మీటింగు జరిగిన ప్రతీసారీ ఏదో ఒక రకంగా మాట్లాడుకోవచ్చు. దానికి హడావుడి లేదు.

పవన్, బాబు కలిసి మాట్లాడుకుంటున్నారంటే ఆంధ్ర రాజకీయాలను మలుపు తిప్పే చర్చలు జరుగుతాయని అందరూ ఎదురు చూస్తూ ఉంటే విలువైన సమయం వీళ్ల మీద ఖర్చు పెట్టడమా? ఎంత బాధ్యతారాహిత్యం? ఇప్పటికైనా పవన్ తన అభిమానుల ముచ్చట తీర్చమనే డిమాండును బాబు ముందు పెట్టి దానికి ఆయనను ఒప్పించే ప్రయత్నం మొదలుపెట్టాలి. అది ఎంత శీఘ్రంగా జరిగితే అంత త్వరగా రాష్ట్ర రాజకీయాల్లో స్పష్టత వస్తుంది, పవన్ అభిమానులూ సంతోషిస్తారు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2023)  

[email protected]

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా