Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ : బెంగాల్‌ కులసమీకరణాలు బిజెపికి లాభిస్తాయా?

ఎమ్బీయస్ : బెంగాల్‌ కులసమీకరణాలు బిజెపికి లాభిస్తాయా?

బెంగాల్ ఫలితాలు రేపు వెలువడబోతూండగా యిప్పుడింకా యీ వ్యాసాలు చదవాలా అనుకోవచ్చు మీలో కొందరు. ఫలితాలనేవి ఒట్టి అంకెలు మాత్రమే. అదేదో సినిమాలో బాబూమోహన్‌లా నాకు ‘ఎందుకు? ఎలా?’లలోనే ఆసక్తి. ఓ పరీక్ష బాగా రాయకపోయినా, ఓ ఇంటర్వ్యూ బాగా చేయకపోయినా, అంతెందుకు మనకు నచ్చిన ఓ సినిమా బాగా ఆడకపోయినా ఎందుకలా జరిగింది అని ఆలోచించడం సహజం. రేపు టీవీ చర్చలు జరిగేటప్పుడు యీ ఫలితాలు ఎందుకిలా వచ్చాయని టీవీలో హేమాహేమీలు చర్చిస్తున్నపుడు అర్థం చేసుకోవాలంటే నేపథ్యం తెలిసివుండడం అవసరం.

లేకపోతే మతువా ఓటు, డార్జిలింగ్‌లో గూర్ఖా పాలిటిక్స్, మాల్డాలో మైనారిటీల స్వింగ్ ఎంత, ఆదివాసీలు బిజెపితోనే వున్నారా లేదా, దక్షిణ బెంగాల్‌లో తృణమూల్ కోట బద్దలైందా – అని వాళ్లు వాదించుకుంటూ వుంటే, మనకేమీ బోధ పడక నోరు వెళ్లబెట్టుకుని చూడాల్సి వస్తుంది. కొంతైనా తెలుసుకుంటే ఆ చర్చలు, తర్వాత పేపర్లలో వచ్చే విశ్లేషణలు బోధపడతాయని అనుకునేవాళ్ల కోసమే యీ వ్యాసాలు. అదంతా పెద్ద బోరు, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయో తెలుస్తే చాలు అనుకునేవాళ్లు వీటిని చదవనక్కరలేదు.

ఎగ్జిట్ పోల్ సర్వేలు చూస్తే బిజెపి బెంగాల్‌లో అధికారానికి దగ్గర్లో వుంది. గెలవవచ్చు, లేదా దాదాపు గెలవవచ్చు. ఐదేళ్లలో 3 సీట్ల నుంచి రమారమి 130 సీట్లకు, 10శాతం ఓట్ల నుంచి దాదాపు 40శాతం ఓట్లకు రావడమంటే చిన్న విషయం కాదు. ప్రభుత్వ వ్యతిరేకత ఎంత వున్నా, దాన్ని సొమ్ము చేసుకోవడానికి అనేక వ్యూహాలు రచించాలి. బెంగాల్ సమాజంలోకి బిజెపి ఎలా చొచ్చుకుంటూ పోతోందో గత కొన్ని వ్యాసాల్లో వివరించాను. దీనిలో కులసమీకరణాలు, వర్గ సమీకరణాలు ఎలా వర్కవుట్ చేసిందో రాస్తున్నాను.

బెంగాల్ సమాజంలో కులప్రాధాన్యం బాగా తక్కువ. దళితులపై దాడులు, వివక్షత కూడా తక్కువే. కాంగ్రెస్, లెఫ్ట్ పరిపాలనలలో కులం గురించి పెద్దగా మాట్లాడకపోవడం చేత ఎన్నికలలో కులప్రసక్తి వుండదనే అనుకుంటూ వచ్చారు పరిశీలకులు. కానీ అంతర్గతంగా కులమనేది కూడా ఫ్యాక్టర్ గానే వుందని బిజెపి కనిపెట్టి, ఆ దిశగా పథకాలు రచించి, సఫలమైంది.

బెంగాల్‌ జనాభాలో 24శాతం ఎస్సీలు, 6శాతం ఎస్టీలు వున్నారు. వీరిని బిజెపి తనవైపు మళ్లించుకుంది. ముఖ్యంగా గిరిజనుల విషయంలో ఆరెస్సెస్ దశాబ్దాలుగా చేస్తున్న కృషి బిజెపికి కలిసి వచ్చింది. దేశమంతా గిరిజన ప్రాంతాల్లో విద్యా, వైద్య సౌకర్యాలు తగినంతగా లేకపోవడం చేత క్రైస్తవ మిషనరీలు వారికి ఆ విషయాలలో సహాయం అందించడంతో, ప్రత్యుపకారంగా వాళ్లు క్రైస్తవంలోకి మారుతూ వచ్చారు. స్వామీజీలు, మఠాలూ నగరాలలో, పట్టణాలలో ప్రవచనాలు చేయడమే తప్ప పల్లెలకు, కొండలకు వెళ్లకపోవడం వలన మతమార్పిడులు జోరుగా సాగాయి.

దీన్ని గమనించిన ఆరెస్సెస్ కార్యకర్తలు రకరకాల పథకాలతో వన్యప్రాంతాలకు, గిరిప్రాంతాలకు వెళ్లి విద్య, వైద్యం అందించి సేవా కార్యక్రమాలతో వారి అభిమానాన్ని చూరగొన్నారు. ప్రకృతి ఆరాధకులు, స్థానిక దేవతల భక్తులు ఐన వారికి హిందూమతపు ఆచారాలను అలవాటు చేశారు, హనుమంతుడు వగైరా దేవతలను పాప్యులరైజ్ చేశారు. దశాబ్దాల వాళ్ల కృషి ఫలించి, గత కొన్నేళ్లగా దేశంలోని అనేక రాష్ట్రాలలోని గిరిజనులు బిజెపికి ఓటేయసాగారు. బెంగాల్ కూడా దానికి మినహాయింపు కాదు. అందుకే 2011లో లెఫ్ట్ నుంచి తృణమూల్‌కు మారిన గిరిజనులు 2019 పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి బిజెపివైపు మళ్లారు. ఆ ఎన్నికలలో ఉత్తర బెంగాల్‌లో వున్న ఎస్టీలలో 80శాతం మంది బిజెపికి ఓటేయడంతో ఆ ప్రాంతాల్లో బిజెపికి చాలా సీట్లు వచ్చాయి. ఇప్పుడూ అదే జరగవచ్చని అంచనా.

ఇక ఎస్సీలకు వస్తే బిజెపి యితర రాష్ట్రాలలో అవలంబించిన ఉపకులవర్గీకరణ విధానాన్నే యిక్కడా అవలంబించింది. ఉదాహరణకి యుపిలో యాదవేతర బిసిలను బిజెపి విడగొట్టి, తనకు అనుకూలంగా చేసుకోగలిగింది. 2015లో అమిత్ షా పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత నుంచి ఆ స్ట్రాటజీ యిక్కడ అమలు చేయడంతో బెంగాల్‌లో ఎస్సీలలో 60శాతం మంది 2019లో బిజెపికి ఓటేశారని అంచనా. దాన్ని యింకా పెంచుకోవడానికి వారిలో అధిక సంఖ్యలో వున్న నామశూద్ర వర్గానికి చెందిన మతువా కులస్తులపై (వారి జనాభా కోటికి పైనే వుంటుందని అంటున్నారు) బిజెపి దృష్టి పెట్టింది. వారు 30 స్థానాల్లో ఫలితాలను ప్రభావితం చేయగలరు. వీళ్లు ఒరిజినల్‌గా బంగ్లాదేశ్ నుంచి వచ్చి స్థిరపడినవారు. చదువు మీద దృష్టి పెట్టి, విద్యావంతులు, ఉద్యోగస్తులు ఐనవారు. వెనకబడ్డామని, అణచివేయబడ్డామని వారేమీ చెప్పుకోరు.

తృణమూల్‌పై వారికి ప్రత్యేకమైన ప్రేమ, ద్వేషం యిప్పటిదాకా బయటపడలేదు. కానీ సిఏఏ అమలు చేస్తామన్న బిజెపి వాగ్దానానికి మెచ్చి, 2019లో వాళ్లలో చాలామంది బిజెపికి వేశారని అంచనా. ఈసారి బిజెపి వారిని బాగా దువ్వింది. వాళ్ల కులగురువు జన్మస్థలం బంగ్లాదేశ్‌లోని ఒరాకండీలో వుంది. బంగ్లాదేశ్ స్వర్ణోత్సవానికై పిలుపు వస్తే వర్చువల్‌గా సందేశం యివ్వకుండా, కరోనా రోజులైనా సరే మోదీ పని కట్టుకుని బంగ్లాదేశ్ వెళ్లి,  దాన్ని ప్రత్యేకంగా దర్శించి వచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఆ కులానికి చెందిన దళపతులకు నెలకు రూ. 3 వేల స్టయిపెండు యిస్తామని బిజెపి మానిఫెస్టోలో హామీ యిచ్చింది. ఏ కారణం చేతనైతేనేమి, వాళ్లు బిజెపివైపు మొగ్గు చూపుతున్నారని ప్రశాంత కిశోర్ ఆంతరంగిక సంభాషణల్లో ఒప్పుకున్న సంగతి బయటకు వచ్చింది. మరి మతువాయేతర ఎస్సీలు ఎటు ఓటు వేస్తారో చూడాలి.

బిసిల్లో కూర్మీలు తమను ఎస్టీలుగా గుర్తించాలని కోరుతున్నారు. వారిని బిజెపి ఆకట్టుకుంటోంది. దాన్ని ఎదుర్కోవడానికి మమత మావోయిస్టు లింకుల కారణంగా 11 ఏళ్లగా జైల్లో వున్న కూర్మీ నాయకుడు ఛత్రధర్ మహతోను గత ఏడాది జైల్లోంచి విడుదల చేసి తృణమూల్‌లో చేరుకుంది. కానీ ఎన్నికలు రాగానే యీ మార్చి 28న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ అతన్ని పాత కేసుల మీద అరెస్టు చేసి, జైలుకి పంపించేసింది.

పలురకాలుగా చేస్తున్న బిజెపి దాడిని ఎదుర్కోవడానికి మమత వద్ద ఉన్న అస్త్రం ఏమిటి అంటే కులమతాలకు అతీతంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే! గతంలో ప్రస్తావించినవి కాకుండా తక్కిన పథకాలలో ప్రముఖమైనవి – 9 కోట్ల మందికి రూ.2కి బియ్యం (ఏటా రూ.5 వేల కోట్ల వ్యయం) యిచ్చే ఖాద్యసాథి పథకం,  లక్ష మంది నిరుద్యోగులకు తక్కువ వడ్డీపై రూ.1-2 లక్షల ఋణం యిచ్చే (ఏటా వ్యయం 500 కోట్లు) కర్మసాథి ప్రకల్ప, మాటీర్ సృష్టి పేరుతో 50 వేల ఎకరాల బంజరుభూమిని వాణిజ్యపరంగా మార్చుకునే మార్చుకునే పథకం (దీనివలన రెండున్నర లక్షల దారిద్ర్యరేఖకు దిగువన వున్న కుటుంబాలకు మేలు కలుగుతుంది), 37 వేల దుర్గా పూజా మండపాలకు ఏటా రూ.50 వేల ధనసహాయం (2019లో 25 వేలుంటే దాన్ని 2020 నాటికి రెట్టింపు చేశారు), 2.64 లక్షల ఆశా వర్కర్లకు రూ.2 వేల పూజా బోనస్, లోకప్రసార్ ప్రకల్ప కింద ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడంలో పాలు పంచుకునే 76 వేల మంది జానపద కళాకారులకు నెలకు రూ.వెయ్యి జీతం.. వగైరా.

వీటితో బాటు 25 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ వృద్ధులకు నెలకు వెయ్యి రూ.లు పెన్షన్ యిచ్చే (ఏటా వ్యయం రూ.3 వేల కోట్లు) జై జ్వహార్ తపోశీలీ బంధు పథకం కూడా పెట్టింది. ఇప్పుడు తమ మానిఫెస్టోలో మరో వెయ్యి పెంచుతానంటోంది. ఒబిసిలకు కూడా యిస్తానంటోంది. ప్రజల వద్దకు పాలన తరహాలో ‘ద్వారే సర్కార్’ పేర 17 లక్షల మంది ఒబిసిలకు, ఎస్సీలకు కులధృవీకరణ పత్రాలు యింటికే అందచేయించింది. 45 నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేయగల మహిశ్యా, తిలి, తాముల్, సాహా కులాలను ఒబిసిలుగా గుర్తిస్తానని హామీ యిచ్చింది.

15 అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేయగల డార్జిలింగ్‌ రాజకీయాల్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. డార్జిలింగ్, కలింపాంగ్, కురసాంగ్ ప్రాంతాలను పదేళ్లకు పైగా ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన గూర్ఖా జనముక్తి మోర్చా (జిజెఎమ్) నాయకుడు విమల్ గురుంగ్ 2014లో మమతతో విభేదించి బిజెపిని గెలిపించాడు. అతనిపై 2017లో కేసులు మోపబడితే అప్పణ్నుంచి కనబడకుండా పోయాడు. మమత ఆ పార్టీని రెండుగా చీల్చి, వినయ్ తమాంగ్ వర్గంతో పొత్తు పెట్టుకుంది. 2019 ఎన్నికలలో గురుంగ్ వర్గం గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్, బిజెపిలతో చేతులు కలిపి బిజెపిని గెలిపించింది. 2020 అక్టోబరులో గురుంగ్ హఠాత్తుగా ప్రత్యక్షమై మమతతో పొత్తు కుదుర్చుకున్నాడు. ప్రస్తుతం జిజెఎమ్ రెండు వర్గాలు మమతతోనే వున్నాయి. అయినా జిఎన్ఎల్ఎఫ్-బిజెపి కూటమికే విజయావకాశాలు ఎక్కువ వున్నాయంటున్నారు.

బెంగాల్ అనగానే అన్నివిధాలా అడుగున వుంటుందనుకోవడం పొరపాటు. దాని స్టేట్ జిడిపి అనేక రాష్ట్రాల కంటె మిన్నగా వుంది. 2021 ఫిబ్రవరిలో 15వ ఆర్థిక సంఘం పార్లమెంటుకు సమర్పించిన నివేదిక ప్రకారమంటూ 030321 ‘‘ఆంధ్రజ్యోతి’’లో కృష్ణారావుగారు రాసినది - అక్కడ అక్షరాస్యత 76.3శాతం. 95శాతం మందికి సురక్షితమైన త్రాగు నీరు లభిస్తోంది. 75శాతం మందికి శౌచాలయాలున్నాయి. గుజరాత్ కంటె మెరుగ్గా ఆరోగ్యంపై 5.4శాతం ఖర్చు పెడుతున్నారు. రాజ్యాంగం నిర్దేశించిన 29 విధుల్లో 28 విధులను అక్కడ పంచాయితీ రాజ్ సంస్థలకు పంపిణీ చేశారు. (ఈ ఘనతంతా తృణమూల్‌కే పోదు, అధికార వికేంద్రీకరణ వగైరా లెఫ్ట్ కాలంలో అమలయ్యాయి). దేశంలోనే జిఎస్టీ కింద అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగిన రాష్ట్రమది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో 9 వ స్థానంలో వుంది. కార్పోరేట్ సంస్థలు బెంగాల్ వైపు చూడకపోయినా, మధ్య, చిన్న తరగతి పరిశ్రమలు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ బెంగాల్ ఆర్థికవ్యవస్థను కాపాడుతున్నారు.

అయితే తృణమూల్‌కు ముఖ్యంగా వున్న మైనస్ పాయింటు – స్థానిక ప్రజాప్రతినిథుల జులుం, అవినీతి. మమత దాన్ని సాగనిచ్చినంత కాలం సాగనిచ్చింది. 2019 తర్వాతనే మేల్కొంది. ప్రశాంత కిశోర్‌ను పిలుచుకుని వచ్చిన తర్వాత అతని టీము సర్వేలు చేయిస్తే అతను 211 మందిలో 120 మంది సిటింగ్ ఎమ్మెల్యేలను మార్చేయమని సలహా యిచ్చాడట. అంత భారీగా మార్పు తెస్తే తిరుగుబాటు వస్తుందని భయపడి, చివరకు 80 మందికి టిక్కెట్టివ్వలేదు. కోవిడ్ భయం వుందంటూ 80 ఏళ్లు పైబడినవాళ్లకు యివ్వలేదు.

ఎన్నికల్లో గెలిచాక 1960లలో రద్దు చేసిన కౌన్సిల్‌ను పునరుద్ధరించి, అనుభవజ్ఞులను కాబినెట్‌లోకి ఆహ్వానిస్తానని అంటోంది. రాజకీయాలతో సంబంధం లేని 10 మంది ప్రముఖులకు టిక్కెట్లిచ్చింది. ఈ ట్రిక్కులన్నీ ఏ మేరకు వర్కవుట్ అయ్యాయో కొన్ని గంటల్లో తెలిసిపోతుంది – (ఫోటో – మమత, గురుంగ్, ఇన్‌సెట్‌లో ఒరాకండీ గుడిలో మోదీ)

- ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2021)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?