Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: బిజెపి ఎడిఎంకెవి విడాకులేనా?

ఎమ్బీయస్‍: బిజెపి ఎడిఎంకెవి విడాకులేనా?

పేరుకి ఎన్‌డిఏ కూటమి అన్నా, దానిలో బిజెపి తప్ప మరో పార్టీ ప్రముఖంగా కనిపించటం లేదు. మొన్న దిల్లీలో ఏర్పాటు చేసిన కూటమి సమావేశంలో లెక్కకు చాలా పార్టీలున్నా, వాటిలో చాలా వాటికి అసెంబ్లీలలో, పార్లమెంటులో ప్రాతినిథ్యమే లేదు. జెడిఎస్‌ను కూటమిలో చేర్చుకోవడంతో బిజెపి దక్షిణాదిన ఒకడుగు ముందుకు వేసినట్లయింది. జనసేన విషయానికి వస్తే అది ఎన్‌డిఏలో భాగస్వామి అని అనుకోవడమే తప్ప యిన్నాళ్లూ చేతల్లో సంయుక్త కార్యాచరణ కనబడలేదు. మొన్న అమిత్ షా పవన్‌ను పిలిచి మాట్లాడాక, ఓహో రెండో అడుగు కూడా వేస్తున్నారన్నమాట అనిపించింది. ఇలాటి పరిస్థితుల్లో ఎన్‌డిఏలో ఎప్పణ్నుంచో ఉన్న ఎడిఎంకెతో యీ నెలలోనే తెగతెంపుల దాకా తెచ్చుకోవడం చిత్రంగానే అనిపిస్తుంది.

విడాకులు తీసుకున్న భార్యాభర్తల తరహాలోనే పొత్తు తెంపుకున్న పార్టీలు కూడా పరస్పర దూషణలకు పాల్పడతాయి. కానీ బిజెపి, ఎడిఎంకె విషయంలో మాత్రం అలాటివి లేకపోవడం గమనార్హం. పార్లమెంటు ఎన్నికలలో కలిసి పోటీ చేస్తే నష్టపోతామని, పైకి శత్రువులుగా నటిస్తూ విడివిడిగా పోటీ చేసి, సీట్లు బాగా తెచ్చుకుని, ఎన్నికల అనంతరం మద్దతిస్తే సరిపోతుంది అనుకున్నాయా అన్న అనుమానం కలుగుతోంది నాకు. తెలంగాణలో తెరాస స్థానంలో కాంగ్రెసును రానీయకుండా చేయడానికి బిజెపి యిలాటి వ్యూహరచనే చేస్తోందన్న అంచనాలున్నాయి. తెరాసతో లోపాయికారీ స్నేహం, వైరం వంటి దశలన్నీ దాటి ప్రస్తుతం ఉమ్మడి శత్రువు కాంగ్రెసును నిలవరించడానికి పరోక్షంగా సాయపడుతోందనే అనుమానాలున్నాయి. ఎడిఎంకెతో యిప్పటిదాకా వైరం దశ లేదు. ప్రస్తుతం నడిచే దశ, మేము ఒకటి కాదు, వేర్వేరే అని ఓటర్లను మభ్యపెట్టే దశ అనుకోవచ్చు.  

జయలలిత బతికుండగా ఎన్‌డిఏలో ఎడిఎంకెది ప్రధాన పాత్ర. 2014 పార్లమెంటు ఎన్నికలలో 37 సీట్లు గెలిచి, పార్లమెంటులో మూడో పెద్ద పార్టీగా అవతరించి, ఎన్‌డిఏ ఏర్పాటులో కీలకపాత్ర వహించింది. జయలలిత మరణానంతరం జరిగిన 2019 పార్లమెంటు ఎన్నికలలో ఎడిఎంకె ఒక్క సీటు మాత్రమే గెలిచింది. అదృష్టవశాత్తూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జయలలిత మరణానికి 9 నెలల ముందుగానే జరిగాయి కాబట్టి, ఆమె పార్టీ గెలిచి, మరో ఐదేళ్లపాటు 2021 వరకు అధికారంలో ఉంది. 2021 ఎన్నికలలో డిఎంకె కూటమి చేతిలో పరాజయం పొందింది. పార్టీ పళనిసామి వర్గం, పన్నీరుశెల్వం వర్గంగా రెండుగా చీలి, చివరకు పళనిసామియే అధిపతిగా తేలాడు. అతనికి బిజెపి మద్దతు యిస్తూనే ఉంది. ప్రతిగా అతను బిజెపి పాస్ చేసిన అన్ని బిల్లులకు మద్దతిస్తూ వచ్చాడు. 370 రద్దు బిల్లు, సాగు బిల్లులు.. వగైరా ఏ బిల్లులకైనా సరే మద్దతిచ్చాడు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అన్నామలై, అతని అనుచరులు ఎంత ఘాటుగా విమర్శిస్తూ వచ్చినా పట్టించుకోలేదు. కానీ దీనివలన తమకు రాజకీయ ప్రయోజనం కలగటం లేదని యిటీవల వారికి మరింత స్పష్టమైంది.

ఎడిఎంకె అధినేతగా పళనిసామి ఆల్మోస్ట్ కన్‌ఫమ్ అయిపోతున్న సమయంలో 2023 ఫిబ్రవరిలో ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపయెన్నికలో ఎడిఎంకెకు కలిగిన ఘోరపరాజయం అతనికి శరాఘాతమైంది. 2021 ఎన్నికలలో ఆ నియోజకవర్గంలో డిఎంకె కూటమి అభ్యర్థి ఎడిఎంకె కూటమి తరఫున నిలబడిన టిఎంసి అభ్యర్థిపై 10 వేల ఓట్ల తేడాతో గెలిచాడు. ఈ ఉపయెన్నికలో డిఎంకె కూటమి తరఫున నిలబడిన కాంగ్రెసు అభ్యర్థి ఎడిఎంకె అభ్యర్థిపై 66 వేల తేడాతో గెలిచాడు. బిజెపిని తమిళనాడు ప్రజలు యింకా సొంతం చేసుకోలేదు. ఇంకా ఉత్తరాది పార్టీగానే చూస్తున్నారు. అన్నామలైకి నోటికి హద్దు లేకుండా మాట్లాడతాడనే పేరుంది. దానికి తోడు ఎడిఎంకెను కించపరచడమొకటి!

తమ నాయకుడు అన్నామలైను డిఎంకె ప్రభుత్వం యిబ్బంది పెడుతోందంటూ 2023 మార్చిలో బిజెపి ఒక ఊరేగింపు చేసింది. దానిలో ఒక నాయకుడు ‘రాష్ట్రంలో అసలైన ప్రతిపక్షం మాదే’ అని ప్రకటించాడు! 2021 ఎన్నికలలో డిఎంకెకు 38% ఓట్లు (పోటీ చేసిన స్థానాల వరకు చూసుకుంటే 47) రాగా, ఎడిఎంకెకు 33% ఓట్లు (పోటీ చేసిన స్థానాల వరకు చూసుకుంటే 41) రాగా, బిజెపికి 3% ఓట్లు (పోటీ చేసిన స్థానాల వరకు చూసుకుంటే 34) వచ్చాయి. 2022లో జరిగిన స్థానిక ఎన్నికలలో చెన్నయ్‌లో డిఎంకెకు 45%, ఎడిఎంకెకు 21%, బిజెపికి 8% ఓట్లు రాగా, చెన్నయ్ కాకుండా యితర నగరాల్లో డిఎంకెకు 43%, ఎడిఎంకెకు 26%, బిజెపికి 7% ఓట్లు వచ్చాయి. ఇదీ బిజెపి బలం!

2023 ఏప్రిల్‌లో సిఎస్‌డిఎస్-లోకనీతి జరిపిన సర్వేలో Is the BJP bad or good for TN’s social fabric? (‘తమిళ సమాజానికి బిజెపి మంచిదా? చెడ్డదా?’ - ఇలాటి ప్రశ్నలు కూడా వేస్తారని యిప్పుడే తెలిసింది) అనే ప్రశ్నకు 40% మంది చెడ్డదని, 18% మంచిదని, 29% తేడా ఏమీ లేదని చెప్పగా, 13% మంది జవాబివ్వలేదు. చెడ్డదని చెప్పినవారిలో డిఎంకె ఓటర్లు 45% కాగా, ఎడిఎంకె ఓటర్లు 32% ఉన్నారు. అంటే ఎడిఎంకె సానుభూతిపరుల్లో కూడా బిజెపి పట్ల ఆదరణ లేదన్నమాట. వాళ్లు తమ ఓట్లు బిజెపి అభ్యర్థులకు బదిలీ చేయరన్నమాట! ప్రాంతాల వారీగా కూడా లెక్కలు యిచ్చారు. చెడ్డది-మంచిది అన్నవారు అప్పర్ నార్త్‌లో 42%-16%, నార్త్ సెంట్రల్‌లో 41-19, కావేరీ డెల్టాలో 50-17, వెస్ట్‌లో 23-26, సౌత్‌లో 44-12, డౌన్ సౌత్‌లో 45-11.

ఇక్కడ యింకో విషయం కూడా గమనించాలి. వెస్ట్ తమిళనాడు (కొంగునాడు) ఎడిఎంకెకు గట్టి పట్టున్న ప్రాంతం. అక్కడ బిజెపి పట్ల వ్యతిరేకత అతి తక్కువగా ఉంది. అన్నామలై అక్కడివాడే. ఇది ఎడిఎంకెను కలవర పరిచే, తమ ఓటర్లు బిజెపి వైపు మళ్లుతున్నారని భయం కలిగించే వాస్తవం. దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే 2021 అసెంబ్లీ ఎన్నికలలో ఎడిఎంకె కూటమికి అర్బన్‌లో 37%, సెమి-అర్బన్‌లో40% ఓట్లు వచ్చాయి. కానీ ఎడిఎంకె, బిజెపి విడివిడిగా పోటీ చేసిన 2022 స్థానిక ఎన్నికలలో ఎడిఎంకె ఓటు షేర్ చెన్నయ్‌లో 21%కు, యితర నగరాలలో 26%కు పడిపోయింది. బిజెపి చెన్నయ్‌లో 8%, యితర నగరాలలో 7%. అంటే అర్బన్ ఏరియాల్లో బిజెపి తమ ఓటును చీలుస్తోందని ఎడిఎంకెకు అర్థమైంది. పోనీ అలాఅని అది గెలుస్తుందా అంటే, తమిళులలో కొన్ని వర్గాలు తప్ప తక్కినవారు బిజెపిని పెద్దగా ఆదరించటం లేదనీ అర్థమైంది.

ఈ ధోరణి గమనించి కాబోలు, మార్చి నెలలో ఓ 12-15 మంది బిజెపి సోషల్ మీడియా కార్యకర్తలు ఎడిఎంకెలోకి మారారు. వారిలో ఐటీ సెల్ చీఫ్ కూడా ఉన్నాడు. అతను అన్నామలైను మతిభ్రష్టుడిగా వర్ణించాడు. కానీ అన్నామలై చెదరలేదు. ‘నేను కరుణానిధి, జయలలిత స్థాయి వాణ్ని’ అని చెప్పుకున్నాడు. అతని అనుచరుడు ‘కొంగునాడులో తామే ఛాంపియన్లమని విర్రవీగిన ఎడిఎంకెకు ఈరోడ్‌లో శృంగభంగమైంది. తమిళనాడులో భవిష్యత్తు బిజెపిదే’ అంటూ ప్రకటించాడు. ఇవన్నీ ఎడిఎంకెకు కారం రాచుకున్నట్లున్నాయి. అన్నామలై, పళనిస్వామి యిద్దరూ గౌండర్ కులానికి చెందినవారే. ఒకే ప్రాంతం వారే. ఇద్దరికీ పడదు. అన్నామలై బిజెపిలో యితర నాయకులను ఎదగనీయటం లేదన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఇలాటి గొడవలున్నా ఎలాగోలా కూటమిని కాపాడుకుంటూ వచ్చారు కానీ గత నెలలో విడిపోవడానికి నిశ్చయించుకున్నారు.

సెప్టెంబరు రెండో వారంలో బిజెపి అధ్యక్షుడు అన్నామలై ‘1956లో మధురైలో ఓ సమావేశంలో అణ్నాదురై హిందూ మతాన్ని అవమానిస్తూ మాట్లాడితే హిందువులు అతన్ని హెచ్చరించారు. దాంతో కొంతకాలం అణ్నా అజ్ఞాతంలోకి వెళ్లి దాగున్నాడు. క్షమాపణ చెప్పిన తర్వాతే బయటకు వచ్చాడు.’ అని స్టేటుమెంటు యిచ్చాడు. నిజానికి యిది అబద్ధం. తమ పార్టీ అణ్నా పేరు మీదే వెలిసిందని, అలాటి మహానాయకుడిపై యిలాటి అబద్ధపు ఆరోపణ చేసి, క్షమాపణ చెప్పనందుకు గాను ‘నేను ఎన్‌డిఏ లోంచి రాజీనామా చేస్తున్నాను’ అంటూ ఎడిఎంకె ఆర్గనైజేషన్ సెక్రటరీ, మాజీ మంత్రి జయకుమార్ సెప్టెంబరు 18న ప్రకటించాడు. పళనిస్వామి అప్పుడేమీ మాట్లాడలేదు. సెప్టెంబరు 22న కొందరు ఎడిఎంకె సభ్యుల బృందం జెపి నడ్డాను కలిసి అన్నామలైపై ఫిర్యాదు చేశారు.

బిజెపితో పొత్తు తెంచుకుంటున్నట్లు జయకుమార్, షణ్ముగం సెప్టెంబరు 25న ప్రకటించారు. పళనిస్వామి ప్రమేయం లేకుండా ఆ ప్రకటన వెలువడిందని కొందరు అనుకున్నారు కానీ అక్టోబరు 2న అతనే ‘‘2 కోట్ల పార్టీ కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ యీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేం బిజెపితో సంబంధాలు తెంపుకుంటున్నాం.’’ అని స్టేటుమెంటు యిచ్చాడు. ఈ విషయమై మోదీతో మాట్లాడాడా లేదా అని ఎక్కడా చెప్పలేదు. అన్నామలై కూడా ఏమీ స్పందించకుండా బిజెపి అధిష్టానం యివన్నీ చూసుకుంటుంది అన్నాడు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామిని యిప్పటి నుంచీ ప్రకటించాలని ఎడిఎంకె కోరిందని, కానీ బిజెపి అధిష్టానం ఒప్పుకోలేదని, విడిపోవడానికి యిదే కారణమని కొందరు అంటున్నారు కానీ అది అంత నమ్మబుద్ధిగా లేదు.

కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కానీ, ఎడిఎంకెకు బిజెపితో పొత్తు లాభించటం లేదు. ముక్కోణపు పోటీలో డిఎంకె లాభపడుతుందనే భయంతో బిజెపిని అంటిపెట్టుకుని ఉన్నా, అది ఓట్లు రాల్చటం లేదు. ఎడిఎంకె, బిజెపిల మధ్య ఓట్ల బదిలీ జరగటం లేదని గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఎడిఎంకె సాంప్రదాయక ఓటర్లు కూడా పొత్తు పట్ల సంతోషంగా లేరు. డిఎంకెకు సాటి వచ్చే ద్రవిడ పార్టీగా తమను తాము చూపుకోవాలంటే ‘ఆర్య’ బిజెపికి దూరంగా జరగాల్సిందే అనుకుని, తన వ్యూహాన్ని మార్చుకుని ఉండవచ్చు. ప్రస్తుతానికి విడిపోయి, 2019 ఎన్నికల్లో అర్బన్ ప్రాంతాల్లో బలహీమైన అభ్యర్థులను నిలబెట్టి బిజెపి కొన్ని సీట్లు తెచ్చుకునేందుకు దోహద పడవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో డిఎంకెతో పోటీ పడి ఓట్లు తెచ్చుకోవాలంటే తాము కూడా బిజెపిని తిట్టాల్సిందే. అలా అయితేనే కొన్ని ఎంపీ సీట్లు గెల్చుకుని, ఎన్నికల తర్వాత బిజెపికి పార్లమెంటులో సాయపడగలదు.

ఈ వ్యూహానికి బిజెపి ఆమోదముద్ర వేసి ఉండవచ్చు. ఇప్పటి పొత్తు కంటె రేపు మద్దతుగా రాబోయే ఎంపీ సంఖ్య ముఖ్యం దానికి. ఈ వ్యూహం నేను ఊహిస్తున్నదే తప్ప ఏ మ్యాగజైనూ యీ ధోరణిలో రాయలేదు. విడిపోయాక బిజెపి, ఎడిఎంకె పరస్పర దూషణకు దిగకపోవడం చేతనే యిలాటి సందేహం కలుగుతోంది. ఎడిఎంకె తెగతెంపుల ప్రకటన రాగానే అన్నామలైకు అతి సన్నిహితుడైన బిజెపి నాయకుడు అమర్ ప్రసాద్ రెడ్డి ఎక్స్‌లో ‘‘కంగ్రాచ్యులేషన్స్, డోంట్ కమ్‌బాక్’’ అని ట్వీట్ చేశాడు. కానీ వెంటనే తన పోస్టును డిలీట్ చేసి, క్షమాపణ చెప్పాడు. కాబట్టి ‘ద్వారము తెరిచియే యున్నది’ అనుకోవచ్చని నా భావన. (ఫోటో అన్నామలై, పళనిస్వామి)

– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?